Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

శ్రీవర తృతీయ రాజతరంగిణి-84

[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

సప్తమః సర్గః

వ్యాకులత్వం విశాం యేన తవ న స్యాంచ భూపతే।
తత్రాపి మాణిక్యదేవః శ్రుత్వాంసు ప్రవలం శ్రియా॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 101)

వైరీ స్యాద్యేన దేశస్య సర్వనాశోచిరాద్ భవేత్।
ఇతి శ్రుత్వాబ్రవీత్ పుత్రస్వభావేక్షణదక్షధీః॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 102)

సభలోని పెద్దలు రాజుకు సలహా ఇస్తున్నారు.

మీకు ఎవరి మీద నమ్మకం ఉన్నదో, ఎవరు మీ పట్ల స్నేహ పూర్వకంగా ఉంటాడో వాడికి సింహాసనాన్ని కట్టబెట్టి ప్రజల ఆందోళనలను దూరం చేయవచ్చు.

శక్తిమంతుడయిన మార్కండేయుడు, కశ్మీరు కొత్త రాజును పరీక్షించేందుకు సైన్యంతో వచ్చి సర్వనాశనం చేయవచ్చు.

తన పుత్రుల స్వభావాలు తెలిసిన రాజు అన్నాడు.

జ్యేష్ఠః శ్రేష్ఠోఽస్తి కింత్వస్య కార్పణ్యం యేన సేవకాః।
న సన్తి తాదృశా యేషాం రాజ్య దార్ధ్యమే వాప్నుయాత్॥

మధ్యమోతీవ దాతాస్య  ప్రద్యుమ్నాచల సంనిభమ్।
ద్యుమ్నం చేత్ స్యాద్ వ్యయాన్నాస్య కర్షమా త్రోవశిష్యతే॥

కనిష్ఠో దుష్టధీః పాపనిష్ఠోఽస్మాదచిరాత్।
నష్టా స్యాత్ తత్ సుతం శ్రేష్ఠ జానే కమపి నోచితమ్॥

మయా తావత్ స్వయం రాజ్య కస్మా అపి న దీయతే।
గతే మయి బలం యస్స స ప్రాప్తోవితి మే మతమ్॥

బహవో న మరిష్యన్తి యది తన్మమ కో గుణాన్।
ఝాసిష్యతి యతః స్థిత్యా ద్వయోర్భేదో హి లభ్యతే॥

ధ్వాన్తం పతేద్యది న దిక్షు జనస్య దృష్టి
ర్నశ్యేన చేద్యది ముషన్తి న తస్కరాద్యాః।

సంకోచమేతి గుణవాన్ యది నామ నాసో
జానాతి కో దినమణిం పరలోకయాతమ్॥

స్వవీర్యేణార్జితం రాజ్యం యోజిత స్వాధియా మయా।
కుపుత్రైర్నాశితం సర్వం పరస్పర విరోధిభిః॥

సప్తాంగ ధాతుసంబద్ధం రాజ్యం దేహమివోజితమ్।
దోషైరివైతైః పుత్రర్మే త్రిభిః సందూషితం ను యత్॥

తత్స్వాస్థ్య మా సాదయితుం శక్తాః పథ్యచికిత్సయా।
మన్మన్త్రిణోఽగదంకారా న సన్త్యద్యతనే క్షణే॥

భుక్తా భోగాశ్చిరం శాస్త్రగీతకావ్యవినోదనైః।
వయః సఫలతాం నీతం కార్య కిమపి నాస్తి మే॥

దేశస్య యావత్యుత్పత్తిర్నవా తత్ త్రిగుణా మయా।
సంపాదితా ప్రజా స్నేహాత్ కుల్యాకర్షణయుక్తిభిః॥

సర్వదర్శన రక్షాయై పాత్రణ్యాలోచ్య సర్వతః।
ప్రతిపద్య శుభే కాలే భూర్నవా ధర్మసాత్కృతా॥

సచ్ఛిద్రమధునా రాజ్యం వదనే రదనోపమమ్।
తుదతి ప్రత్యహం తస్మాత్ తత్త్వాగేన సుఖం మమ॥

చౌరాణామివ దీపోఽహం యేషామక్షిగతోఽస్మ్యహమ్।
అచిరాన్మద్గుణస్థిత్యా తే స్యురనుశయాద్దితాః॥

స్థాస్యన్తి న చిరం తేపి మద్విష్టా యే సుతాదయః।
శలభాః ప్రళయం యాన్తి భుక్త్వా ధాన్యఫలం న కిమ్॥

యుక్త్యా నిర్యాణమేవాస్య జీవస్యేచ్ఛామి సాంప్రతమ్।
యేన సర్వే భవిష్యన్తి పుత్రాః పూర్ణమనోరథాః॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 103-119)

ఈ 17 శ్లోకాలు జైనులాబిదీన్ వ్యక్తిత్వాన్ని, మానసిక స్థితిని, వ్యక్తిగా, తండ్రిగా, రాజుగా, అత్యద్భుతమైన రీతిలో ప్రదర్శిస్తాయి. ఈ శ్లోకాలు రచించి శ్రీవరుడు జైనులాబిదీన్ ఋణం తీర్చుకోవటమే కాదు, భావితరాలు, నేర్చుకుంటే అనేకానేక గుణపాఠాలు పొందుపరచి తన కర్తవ్యాన్ని సమర్థవంతంగా నిర్వహించాడు. చరిత్ర రచన అంటే నిర్జీవమైన తేదీలు, నీరసమైన యుద్ధాలు, నిష్ఫలమైన కట్టడ నిర్మాణాలు మాత్రమే కాదని, భారతీయ చరిత్ర రచన సజీవమైన మానవ జీవిత చరిత్ర అనీ, చరిత్ర రచన తత్త్వాన్ని, లక్ష్యాన్ని, పద్ధతులను వివరిస్తూ, భావి తరాలకు మార్గ దర్శనం చేసాడు.

ఎవరో ఒకరికి రాజ్యం కట్టబెట్టి, సోదరుల పోరును అంతం చేయమని, ప్రజల కష్టాలను దూరం చేయమని సూచించిన పెద్దలకు జైనలాబిదీన్ ఇచ్చిన సమాధానం ఇది. ఒక్కొక్కరిగా తన కొడుకుల గుణగణాలు వివరిస్తూ  వారికెందుకు రాజ్యార్హత లేదో వివరిస్తాడు.

“పెద్ద కొడుకు శ్రేష్ఠుడు. కానీ పిసినారి. అందుకని అతడికి విధేయులైన వారు లేరు. రాజ్యాన్ని సురక్షితం చేసి శక్తిమంతం చేయగలవాడు లేడు. రెండవ వాడు గొప్ప దాత. వాడెంతగా దానాలు చేస్తాడంటే, పద్యుమ్నాచలమంత ఐశ్వర్యం ఉన్నా చివరికి ఒక్క పైస( ఆ కాలంలో కర్ష అనేవారు) కూడా మీగలదు. చిన్నవాడు దుష్టుడు. చెడు అలవాట్లున్నాయి. వాడి వల్ల సర్వం నాశనం అవుతుంది. అందుకని నా తరువాత నా ఏ ఒక్క కొడుక్కు కూడా రాజ్యర్హత లేదు. కాబట్టి నేను రాజ్యం ఎవరికీ కట్టబెట్టను. నేను జీవించి ఉన్నంతవరకూ వాళ్ళెవరూ రాజు కాలేరు. నేను మరణించిన తరువాత ఎవరు శక్తిమంతుడో వాడు రాజవుతాడు. రాజ్యం కోసం జరిగే గొడవలో ఎంతో హింస జరిగి ప్రాణనష్టం అధికంగా జరిగినప్పుడే నేనెంత శాంతి నిచ్చానో అందరికీ తెలుస్తుంది.”

చుట్టూ చీకటి నిండందే వెలుగు విలువ తెలియదు. ప్రజలు అంధులవనిదే,  దొంగలు దోచుకోనిదే, గుణవంతులు సంకుచితులు కానిదే, సూర్యుడు పరలోకం వెళ్లినట్టు ఎలా గ్రహిస్తారు?

“నేను నా బలంతో రాజ్యాన్ని హస్తగతం చేసుకున్నాను. నేను నా బుద్ధితో సుసంపన్నం చేసిన రాజ్యాన్ని నా పుత్రులు పరస్పర యుద్ధం వల్ల సర్వనాశనం చేశారు. సప్త ఖనిజాల (ధాతువులు)తో, సప్తాంగాలతో శక్తివంతమైన రాజ్యం మానవ దేహం లాంటిది. అలాంటి దేహాన్ని త్రిదోషాలు నాశనం చేసినట్టు నా ముగ్గురు కొడుకులు త్రిదోషాలతో (మూడు రోగాలు) నాశనం చేస్తున్నారు.”

ఇక్కడ శ్రీవరుడు గొప్ప చమత్కారం చేశాడు. రాజ్యాన్ని మానవ శరీరంతో పోల్చాడు.  ‘సప్త ధాతువులు’ అన్నాడు. సప్తధాతువులు నాలుగు రకాలు. దాన్లో మూడు జీవులు శరీరాలకు సంబంధించినవి. శుక్లం, శోణితం, మాంసం, ఎముకలు, చీము, చర్మం, మెదడు. ఇవి ఒక రకమైన సప్త ధాతువులు. ‘వస, రుధిరము, మాంసము, కుథస్తు, మజ్జ, అస్థి, స్నాయువు’ ఇవి ఇంకో రకమైన ధాతువులు. రసము, రక్తము, మాంసము, మేధస్సు, అస్తికలు, మజ్జ, శుక్లము ఇవి మూడో రకమైన సప్త ధాతువులు. ఈ మూడు రకాలు జీవుల శరీరాలకు సంబంధించినవి. బంగారు, వెండి రాగి, ఇనుము, తగరం, సత్తు, సీసము, ఇవి జీవేతర ధాతువులు, భూమికి సంబంధించినవి. జీవులలో సప్తధాతువుల నడుమ సమతుల్యం ఆరోగ్యానికి, బలానికి, శక్తికి నిదర్శనాలు. భూమిలోని ఈ ఏడు ధాతువులు రాజ్యానికి బలం. రాజ్యానికి శక్తి. రాజ్యానికి సంబంధించిన సప్తాంగాలున్నాయి. స్వామి (రాజు), అమాత్యుడు, జానపదులు, దుర్గం, కోశం (ధనం), దండం (సేన), మిత్రులు. ఈ సప్తాంగాలు, సప్తధాతువులు దేశానికి శక్తి.

త్రిదోషాలు  వాత పిత్త ఖఫము. వాత, పిత్త, ఖఫాదుల నడుమ సమతుల్యం ఉంటే దోషం లేదు. వాటి నడుమ సమతుల్యం దెబ్బతింటే శరీరం రోగగ్రస్థం అవుతుంది. అంటే సప్తధాతువులు, సప్తాంగాలు సమృద్ధిగా ఉన్నా, సమతౌల్యం లేకపోతే  త్రిదోషాలు ఆ శరీరాన్ని రోగగ్రస్థం చేస్తాయి. బలహీనం చేస్తాయి. శక్తిహీనం చేస్తాయి. జైనులాబిదీన్ రాజ్యాన్ని స్వయం సమృద్ధి చేశాడు. శక్తివంతం చేశాడు. శాంతి నెలకొల్పాడు. కానీ త్రిదోషాల వంటి తన సంతానం ఆ శక్తిని హరిస్తోంది. బలహీనపరచి రోగగ్రస్థం చేసి నాశనం వైపు నెడుతోంది.

రోగగ్రస్థమైన దేహానికి పథ్యంతో చికిత్స జరుగుతుంది. కానీ పథ్యంతో చికిత్స చేసే వైద్యుడి లాంటి మంత్రులు ఇప్పుడు లేరు. రోగంతో బాధ పడుతున్న దేహానికి చికిత్స చేసినట్టే, అశాంతి పాలవుతున్న రాజ్యానికి చికిత్స చేసే సరైన దారిలో నడిపించేంత సమర్థులయిన మంత్రులు లేరిప్పుడు. తెలివైనవాళ్లు, రాజ్య క్షేమం కోరేవాళ్లు, దూరదృష్టితో వ్యవహరించే మంత్రులంతా వెళ్ళిపోయారు. ఇప్పుడున్న వారికి వారి స్వార్థం, తాత్కాలిక లాభాలు తప్పి దేశక్షేమం, పరిపాలన, ప్రజాక్షేమం పట్ల దృష్టి లేదన్న నిజం జైనులాబిదీన్‍కు తెలుసు.

ఈ మాటల వల్ల శ్రీవరుడు పరోక్షంగా, సూచనప్రాయంగా కొన్ని చేదు నిజాలను జైనులాబిదీన్ మాటల ద్వారా ప్రదర్శించాడు.

జైనులాబిదీన్ ప్రదర్శించే పరమత సహనం ఇస్లామీ ఛాందసవాదులకు నచ్చలేదు. వారు, జైనులాబిదీన్ ద్వారా అందుతున్న సౌకర్యాలను అనుభవిస్తూనే అతడిని విమర్శిచారు. ద్వేషించారు. అతడి పద్ధతి మార్చాలని ప్రయత్నించారు, తమ నిరసనల ద్వారా. కానీ జైనులాబిదీన్ తన పంథాను మార్చుకోలేదు. ఇస్లామేతరులను కూడా తన రాజ్య పౌరులలాగా చూశాడు తప్ప, తక్కువ స్థాయి ‘కాఫిర్’లలా  చూడలేదు. ఇది నిరసనను, ద్వేషాన్ని కలిగించింది ఇస్లామీయులలో. దాంతో ఎలాగైనా జైనులాబిదీన్‌ను దెబ్బ తీయాలన్న ప్రయత్నాలను వారు ముమ్మరం చేశారు. వారికి జైనలాబిదీన్ సంతానం ద్వారా జైనులాబిదీన్‌ను బలహీనుడిని చేయటమే కాదు, రాజ్యపాలనపై పట్టును సాధించే వీలు చిక్కింది. ఇది ముగ్గురు సోదరులు జైనులాబిదీన్‌ని కాదని రాజ్యాధికారం కోసం పోరాడేట్టు చేసింది. తన ముగ్గురు సంతానానికి సలహాలిచ్చే వారంతా వారి వారి స్వార్థాన్ని అనుసరించి ఆలోచించేవారు తప్ప దేశ క్షేమం కోరేవారు కారన్న విషయం జైనులాబిదీన్‌కు తెలుసు. అతని మంత్రులు ఒకరొకరుగా మరణించారు. దాంతో జైనులాబిదీన్ కూడా దెబ్బతిన్నాడు. శ్రీవరుడు లాంటి వారు అతని పక్కన నిలిచారు. కానీ శ్రీవరుడికి రాజకీయ చతురత లేదు. శ్రీవరుడు పండితుడు. కవి. ఆధ్యాత్మిక తత్వవేత్త. దాంతో జైనులాబిదీన్ దృష్టి కూడా రాను రాను రాజ్యపాలన నుంచి ఆత్మ సంతృప్తి, ఆత్మజ్ఞానం వైపు మళ్లింది.

శాస్త్రాలు, గీతాలు, కావ్యాలు చదువుతూ, అనుభవిస్తూ చిరకాలం పాటు అనేక భోగాలు అనుభవించాను. ఆనందించాను. నా జీవితం సార్థకం చేసుకున్నాను. ఇప్పుడు నాకు ఇంకా ఏం కావాలి?

జైనులాబిదీన్ ఈ మాటలలో శ్రీవరుడు కనిపిస్తాడు. శ్రీవరుడి సాంగత్య ప్రబావం, ఫలితాలు కనిపిస్తాయి.

“రాజులను ఓడించాను, రాజ్యలు గెలిచాను” అనటం లేదు జైనులాబిదీన్. “శాస్త్రాలు చదివాను, గీతాలు గానం చేశాను. కావ్యాలను పఠించి అనుభవించి ఆనందించాను. ఇంతకన్నా జీవితాన్ని ఆనందమయంగా గడపటం ఏముంది?  రాజభోగాలు అశాశ్వతం. కానీ జ్ఞాన సముపార్జన శాశ్వతం. రాజభోగాలు కర్మ ఫలితం. కానీ వాటి ద్వారా మరిన్ని కర్మలు సంభవిస్తాయి. అది మరో జన్మకు దారి తీస్తుంది. కానీ సంగీత, సాహిత్య, ఆధ్యాత్మిక శాస్త్రాల పఠనం శాశ్వతం. ఈ జన్మలో సంపాదించిన జ్ఞాన విజ్ఞానాలు మరో జన్మకు పనికి వస్తాయి. మరో జన్మలో విజ్ఞానార్జన పూర్వ జన్మలో సాదించిన దాని దగ్గర నుంచి ఆరంభమవుతుంది. అది శాశ్వతం. పైగా విజ్ఞానార్జన కర్మ వృద్ధికి దారి తీయదు. కర్మక్షయానికి తద్వారా జీవన్ముక్తికి దారి తీస్తుంది.” జైనలాబిదీన్ మాటల వెనుక ఇంత లోతైన ఆలోచన ఉంది.

ఇక్కడ సుల్తాన్, శాస్త్రాలు అంటే కేవలం సంస్కృత శాస్త్రాలుగా భావించకూడాదు. సుల్తాన్ అరబ్బీ, ఫార్సీ, భాషలలో నిష్టాతుడు. ఆ భాషలలో గ్రంథాలు రచించాడు.  ‘శాస్త్రా’లంటే భారతీయ ముస్లింముల ఆధ్యాత్మిక శాస్త్ర గ్రంథాలుగా భావించాలి. సుల్తాన్ ఎంతగా పరమత సహనం ప్రదర్శించాడో, అంతగా ఇస్లాం ధార్మికుడు. ఒక మతం పాటించేవాడి మతం, ఇతర మతాలను నశింపచేస్తేనే నిలుస్తుందని నమ్మేంత బలహీనుడు, మూర్ఖుడు కాడు జైనులాబిదీన్. తన ధర్మాన్ని ప్రేమిస్తూ, పాటిస్తూ కూడా ఇతర ధర్మాలను గౌరవించే అసలు సిసలైన జ్ఞానానికి  అసలు సిసలైన నిర్వచనం జైనలాబిదీన్.

ప్రజలపై ప్రేమతో నేను వారి ఐశ్వర్యాన్ని పెంచాను. సకల సౌకర్యాలు అందేట్టు చేశాను. జీవికలు ఏర్పాటు చేశాను. కాలువల త్రవ్వకాలు, వ్యవసాయంతో సహా పలు ఇతర కార్యకలాపాల ద్వారా దేశ ఆదాయాన్ని త్రిగుణీకృతం చేశాను.

సకల దర్శనాల సంరక్షణ చేశాను. అందుకోసం నలు దిశల నుండి విద్యావంతులను రప్పించి వారిని సత్కరించి, భూములిచ్చి ధర్మాభివృద్ధి చేశాను.

‘సర్వ దర్శనాలు’ అన్న పదాన్ని కేవలం భారతీయ దర్శనాలుగా భావించకూడదు.  ‘సర్వ దర్శనాలు’ అంటే అన్ని ధర్మాలకు చెందిన ఆధ్యాత్మిక, ధార్మిక, తాత్విక, విద్వాంసుల ద్వారా అన్ని ధర్మాల అభివృద్ధికి తోడ్పడ్డాడు అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దేశం నలుమూలల నుంచి సంస్కృత పండితులే కాదు ఇతర దేశాల నుంచి కూడా పండితులు, మత ప్రచారకులు కశ్మీరు వచ్చారు. రాజు ఆదరణ పొందారు.

అయితే నోటిలో దంతాల నడుమ ఖాళీ స్థలాలున్నట్టే ఎంత చేసినా ఏదో ఓ లోపం ఉంటుంది. దాని వల్ల ఇప్పుడు తూట్లు పడి, రాజ్యం నష్టపోతోంది. బాధ కలిగిస్తోంది. దాని వల్ల ప్రతి రోజూ బాధ కలుగుతోంది. కాబట్టి అలాంటి దుఃఖాన్ని అంటే రాజ్యాన్ని త్యాగం చేయటం వల్ల సుఖం కలుగుతుంది. ‘ఎలాగయితే దొంగలకు వెలుతురు బాధాకరమో, అలాగే, నేను ఎంతో మందికి శత్రువయ్యాను. కాని త్వరలో నా తరువాత బాధలను అనుభవిస్తూ నా గుణాల గానం చేస్తారు. నా విలువను గ్రహిస్తారు. నా తరువాత నా సంతానం ఎల్లప్పటికీ జీవించి ఉండదు. కాబట్టి, నేను త్వరగా మరణిస్తే వారు కోరింది వారికి లభిస్తుంది. సంపత్తిని అనుభవించే వారు మాత్రం ఎల్ల కాలం జీవించరు? కాబట్టి నేను త్వరగా మరణించాలని కోరుకుంటున్నాను. తద్వారా నా పుత్రుల మనోరథం నెరవేరుతుంది.’

ఇదీ జైనలాబిదీన్ మానసిక  స్థితి.  జరుగుతున్న సంఘటన వల్ల విరక్తుడయ్యాడు. తన సంతానం గురించి సంపూర్ణంగా తెలుసుకున్నాడు. భవిష్యత్తులో దేశం అల్లకల్లోలమవటం, దుర్దశను అనుభవించాల్సి ఉండటం అంతా గ్రహించాడు. తాను పరిస్థితులను మార్చలేనని గ్రహించాడు. తన చేతుల్లో ఏమీ లేదని అర్థం చేసుకున్నాడు. మరణం తప్ప తనకు మరో భవిష్యత్తు లేదన్న  నిశ్చయానికి వచ్చాడు. ఒక రకమైన నిరాశ, నిస్పృహలను, వైరాగ్య భావనలను  తాత్వికతతో ఎదుర్కోవాలని ప్రయత్నిస్తున్నాడు. సర్వం విధికి వదిలేశాడు. చివరికి ప్రతి వ్యక్తీ ఒంటరివాడని అర్థమయింది. ఎవరి జీవితాన్ని వారు సంతృప్తికరంగా, ఉపయోగకరంగా గడపటం, భగవద్ధ్యానంలో అంతమవటాన్న మించి జీవితానికి మరో నిర్వచనం లేదని అర్థం చేసుకున్నాడు. తన సంతానం ప్రవర్తన గుణగుణాల పట్ల తీవ్ర అసంతృప్తి, ఉన్నా, తానేమీ చేయలేననీ గ్రహించాడు. అందుకని సర్వం భగవంతుడికి వదలి తాను తన శేష జీవితాన్ని తనకు  సంతృప్తికరంగా శాంతంగా గడపాలని నిశ్చయించుకున్నాడు. తన తరువాత ఏమైనా తానుండడుగా చూసి బాధ పడేందుకు.

కమ్యూనిటీ సైకాలజీ ప్రకారం, భారత దేశంలో ప్రజలకు మానసిక వైద్యుడి అవసరంలేదు. ఎందుకంటే, వారి ధర్మంలోనే మానసిక వైద్యులు థిరపీ ద్వారా చేసే చికిత్స అంతర్లీనంగా వుంది. ఎప్పుడయితే, ఈ ధర్మాన్ని విస్మరించి, ఈ జీవన విధానాన్ని తృణీకరించి తమదికానిదాన్ని అనుసరించటం ఆరంభించారో అప్పటినుంచీ ఈ దేశంలో కూడా మానసిక వైద్యుల అవసరం పెరుగుతోంది. ధర్మం ఆధారంగా, అతి కఠినమైన పరిస్థితులలో, ముగ్గురు కొడుకులు తన తరువాత సింహాసనం ఆక్రమించేందుకు పోరాడుతూంటే, నిర్లిప్తంగా వుంటూ, గ్రంథ పఠనలో, సంగీత రసాస్వాదనలో తన శేష జీవితాన్ని ప్రశాంతంగా, సంతృప్తి కరంగా గడపాలని జైనులాబిదీన్ చేస్తున్న ప్రయత్నాలు ఒకప్పుడు ఇక్కడి జీవన విధానంలో, తత్త్వంలో అంతర్లీనంగా వున్న మానసిక వైద్య విధానాల గొప్ప తనాన్ని ప్రదర్శిస్తుంది.  ఇటీవలి కాలంలో ప్రతి చిన్న ప్రతికూలతకూ బెదిరి సమతౌల్యం కోల్పోయి ఆత్మహత్యలకు, హత్యలకూ పాలపడే సమాజం ‘ స్వధర్మే నిధనం శ్రేయః, పరధర్మో భయావహః’ ను మరో కోణంలో చూపిస్తుంది.

(ఇంకా ఉంది)

Exit mobile version