Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

శ్రీవర తృతీయ రాజతరంగిణి-83

[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

సప్తమః సర్గః

అగ్రజేభ్యంతరం ప్రాప్తే ద్వారస్థే లక్షితే పితుః।
హ్యాజీఖానోనుజయుతో యుక్త్యా సామ ప్రయుక్తవాన్॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 83)

అగ్రజుడు రాజ్యంలో తండ్రి గృహంలోకి ప్రవేశించగానే హ్యజీఖాన్ కనిపించాడు. అతనితో సామనీతి ప్రయోగించాడు.

సామదానభేదదండోపాయాలలో ‘సామనీతి’ ఉపయోగించి సోదరుడిని ప్రసన్నం చేసుకోవాలని ప్రయత్నించాడన్న మాట హాజీఖాన్.

‘పీర్ హసన్’ ప్రకారం కొంత కాలం సోదరుల నడుమ యుద్ధ విరమణ సంధి జరిగింది.

దివ్యం మౌసులదేవేన తే కృత్వాపి పరస్పరమ్।
నాత్యజన్ హృదయాద్ వైరం కాష్టర్యమౌర్ణా ఇవాంశుకాః॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 84)

వారిద్దరూ తమ దేవుడు (మాసల దేవుడు అంటే ముస్లింల దేవుడు) ఆనగా శాంతి శపథం చేసినా, వారి మనస్సుల్లోంచి ద్వేషం మాత్రం పోలేదు, ఎలాగయితే ఉన్ని వస్త్రం తన రంగును త్యాగం చేయదో అలా వారి హృదయాలలోంచి ద్వేష భావనలు మాత్రం పోలేదు.

అహో గుహయామేకస్యాం ప్రాప్తా సింహచతుష్టయీ।
ఐతదన్యోన్య వైరోత్థో నాశోయం సముపస్థితః॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 85)

అశ్చర్యం! ఒకే గుహలో ఒకే పరివారానికి చెందిన నాలుగు సింహాలు కలిశాయి. రాజు ముందు శాంతి శపథం చేశాయి. ఎంత శాంతి వచనాలు పలికినా, ఇది సర్వనాశనానికే దారి తీస్తుంది.

రాజ్ఞో దేశస్య ఖానానాం పరివారస్య మండలే।
సర్వాంస్తాన్ మిలితాన్ దృష్ట్వా ప్రోవాచ సకలో జనః॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 86)

అందరూ రాజు ముందర శాంతిగా కలవటం చూసిన దేశం ప్రజలు, దేశంలోని పెద్దలు, గొప్పవారు, రాజు స్వీయకుటుంబం అందరూ ఇదంతా నాశనానికే అని అనుకున్నారు.

అత్రాంతరే ద్వయోర్ద్విష్టం కనిష్ఠం శ్రేష్ఠమాత్మజమ్।
విచార్యానీయ బహ్రామ్‍ఖానం స విజనేబ్రవీత్॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 87)

ఇలాంటి పరిస్థుతులలో రాజు, తన కనిష్ఠ పుత్రుడు బహ్రామ్‌ఖాన్‌ను అందరిలోకీ శ్రేష్ఠుడుగా భావించాడు. ఇతడి ఇద్దరు సోదరులూ మాత్సర్యగ్రస్థులు. అందుకని అతడిని తన దగ్గరకు పిలిపించుకున్నాడు. ఇలా అన్నాడు.

బహ్రామ్ జ్యేష్ఠో భ్రాతాయం ద్విష్టో దుశ్చేష్టితైః కృతః।
స్మృతపూర్వపకారోజ్యం హితో జాతు న తే మ్వేన్॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 88)

అన్యం యం సేవసే భక్త్యా దురాశాగ్రస్తమానసః।
స కథం స్వం సుతం త్యక్త్వా కార్యే త్వాం సమపేక్షతే॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 89)

తస్మాత్ త్వం పేశునాచారం మా కృథా భావి దుఃఖదమ్।
మదేక శరణో భూత్వా కాలం నయ తతో చిరాత్॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 90)

ప్రాప్తన్తి సంపదః సర్వా న్యాయమార్గస్థితస్య తే।
అన్యథా తైలతప్తాయః కటాహ ప్రవరణీ నిభః॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 91)

తద్వైరానలమధ్యస్థో ముగ్ధ దగ్ధో భవిష్యసి।
శృత్వేతి స పితుర్వాక్యం ముగ్ధధీర బ్రవీదిదమ్॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 92)

ఓ బహ్రామ్‌ఖాన్! నీ దుశ్చర్య వల్ల నీ పెద్దన్న నీకు శత్రువు అయ్యాడు. నీ దుశ్చర్యను, నీ వల్ల కలిగిన నష్టాన్ని అతను ఎన్నడూ మరచిపోడు. అతను ఎన్నటికీ నీ పట్ల స్నేహభావం ప్రదర్శించడు. అందువల్ల అతడికి ఏవేవో ఆశలతో సేవ చేస్తున్నావు. నీ సేవ నిష్పలం. తన కొడుకు మేలు మరచి, నీకు మంచి చేస్తాడని ఎలా అనుకుంటావు? కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి దుశ్చర్యలు చేయకు. అవి నీకు కష్టం కలిగిస్తాయి.  నువ్వు వెంటనే అతడి సేవను మానెయ్యి. నన్ను మాత్రమే నమ్ము. నేను చెప్పినట్టు విను. నేను నీకు మేలు చేయగలను. నా వల్ల ఐశ్వర్యం సిద్ధిస్తుంది. లేకపోతే, మూర్ఖుడిలా, వారి శత్రుత్వపుటాగ్నిలో, ఇనుము పైన తైలంగా దగ్ధమై పోతావు.

దేవ మే పితృవత్ స్నేహం హ్యాజీఖాన్ కరోత్సలమ్।
సేవ్యః స ఏవ మే భాతి తం త్యజే నైవ జాతుచిత్॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 93)

రక్షిష్యతి సమాం కాలే కోన్యోస్మాధధునా బలీ।
శృత్వేతి భూపః సోవాచ కృద్ధస్తం కృశనిశ్చయమ్॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 94)

తండ్రి మాటలు విన్న తరువాత, మూర్ఖుడిలా సమాధానం ఇచ్చాడు. “హ్యాజిఖాన్ నన్ను తండ్రిలా ప్రేమిస్తాడు. నాకు అవసరమైనప్పుడు నన్ను రక్షిస్తాడు. రాజా! ప్రస్తుతం మన దేశంలో హ్యాజీఖాన్‌ను మించిన శక్తివంతుడెవరు? నేను అతడిని సేవిస్తాను.”

హా ధిక్ త్వాం మాం పరిత్యజ్య పితాన్యోంగీకృతస్త్యయా।
దృష్టిర్యా విహితా మూఢ ప్రోల్లంఘ్య వచనం మమ॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 95)

తస్యా నాశోచిరెణైవ భవిష్యతి న సంశయః।
ఇత్యుక్త్య్వా ప్రతిముచ్యాముం స్వాన్తరేవమ చిన్తయత్॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 96)

ఛీ! ధిక్కారం! నన్ను కాదని మరొకరిని తండ్రిగా స్వీకరించేందుకు సిగ్గు పడాలి. ఓ మూర్ఖుఢా! నా మాటలను ఉల్లంఘించి, నువ్వు తీసుకున్న నిర్ణయం వల్ల నువ్వు శ్రీఘంగా నాశనం అవుతావు. ఇందులో సందేహం లేదు. ఈ మాటలు అని అక్కడ్నించి వెళ్లిపోయాడు రాజు. ఏకాంతంలో ఆలోచించాడు.

అహో ప్రదీస్తాన్మత్తోమీ జాతా విసదృశాః సుతాః।
త్రయోమీ దహనాగారాదివ హా భస్మముష్టియః॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 97)

అయ్యో! ధుఃఖించాల్సిన విషయం. నేనెంత తేజస్వినంటే, నా ముగ్గురు పుత్రులు దహనాగారం నుంచి ఉత్పన్నమైన భస్మం వంటి వారు జన్మించారు.

అయోగ్యా దీప్తి రహిత కాష్ఠా కృష్టావనిష్ఠితా।
కదాచిద్ విజనే రాజా సుతానిష్ట విశంకితః॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 98)

అయోగ్యులు. తేజస్సు రహితులు, బూడిద భూమిపై పడి ఉన్నట్టు పడి ఉండే జడులు వీళ్లు – అని రాజు ఏకాంతంలో అప్రియమైన విషయం గురించి ఆలోచిస్తూన్నాడు.

అధునా కరణీయం కిం మయేతి వ్యక్తమబ్రవీత్।
తత్సమక్షం బుధా యేపి తత్ప్రసంగాద్ బభాషిణే॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 99)

‘ఇప్పుడు నేనేం చేయాలి?’ అని పైకే అన్నాడు. అయితే చుట్టూ ఉన్న విద్వాంసులు  రాజు మాటలు విని ఇలా అన్నారు.

రాజాన్నుత్సాద్యత్ దేశో ఆజ్యలుబ్ధైః సుతైస్తవ।
ఏకస్వైవ నిజం రాజ్యం కిం నార్పయసి యో హితః॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 100)

ఓ రాజా! పుత్రులు రాజ్యధికార ఆశతో పోరాడుతూ దేశాన్ని సర్వనాశనం పట్టిస్తున్నారు. నీ రాజ్యాన్ని ఎవరో ఒకరికి ఎందుకు కట్టబెట్టవు?

సుల్తాను సంతానం రాజ్యం కోసం పోరాడటం వల్ల దేశంలో అశాంతి విస్తరిస్తోంది. అభివృద్ధి కుంటుపడుతోంది. ప్రజలు కష్టాలు పాలవుతున్నారు. కాబట్టి రాజు చుట్టూ ఉన్న పండితులందరూ రాజుని ఎవరో ఒకరికి రాజ్యాన్ని కట్టబెడితే గొడవలు తగ్గుతాయి కదా అని సూచించారు. ఆ పని ఎందుకు చేయటం లేదని అడిగారు. ఇది శ్రీవరుడు రాసినది.

శ్రీవరుడు రాసిన దాని ప్రకారం సభలో ఉన్న విద్వాంసులు – రాజు ఎవరో ఒకరికి రాజ్యం ఇస్తే పుత్రుల నడుమ పోరు సమసిపోతుందని, రాజ్యం అల్లకల్లోలం అవటం ఆగిపోతుందన్న ప్రస్తావనను రాజుముందుంచారు.

పర్షియా రచయితలు శ్రీవరుడికి భిన్నంగా రాశారు.

‘పీర్ హసన్’ ప్రకారం రాజాస్థానంలో ఉన్న ఇస్లామీయులు సుల్తాన్‌ను తన వారసుడెవరో ప్రకటించమని ఒత్తిడి చేశారు. సుల్తాన్ వారి మాటలని కొట్టి పారేశాడు.

‘తవ్వాకత్ అక్బరీ’ ప్రకారం రాజు వృద్ధుడయిన కారణాన, రాజ్య వ్యవహారాలు పట్టించుకోలేకపోవటంతో రాజ్యం లోని అమీర్లందరూ ఒకటయి రాజ్యం ఎవరో ఒక రాజకుమారుడికి కట్టబెడితే రాజ్య పాలన బాగుపడుతుందని చెప్తారు.

ఫరిష్తా ప్రకారం, అమీర్లు సుల్తాన్ పై ఒత్తిడి తెచ్చారు, అధికారం వదిలి రాజ్యాన్ని ఎవరో ఒకరికి అప్పచెప్పమని.

కేంబ్రిడ్జి యూనివర్సిటీ ప్రకారం సుల్తాన్ రాజ్యాన్ని ‘abdicate’ చేయమని ‘nobles’ ఒత్తిడి చేశారు. ‘Abdicate’ చాలా పెద్ద పదం. రాజ్యం త్యాగం చేసి సింహాసనాన్ని వదలి పోవటాన్ని ‘abdicate’ అంటారు. శ్రీవరుడు వాడిన పదం ‘రాజ్యార్పణం’. ‘రాజ్యార్పణం’ – abdication ఒకటి కాదు.

ఒకే అంశం గురించి ఇన్ని విభిన్నమైన రీతుల్లో  భావం వ్యక్తమవటం గమనిస్తే రచయిత దృష్టి రచనను, అది చరిత్ర రచన కావచ్చు, ఇతర ఏ రచన కావచ్చు,  దాన్ని ప్రభావితం చేయటం గమనించవచ్చు.

శ్రీవరుడికి జైనులాబిదీన్ అంటే పరమ భక్తి. కాబట్టి జైనులాబిదీన్‌ను ఎవరో ఒత్తిడి చేయటం, దాన్ని శ్రీవరుడు ప్రస్తావించటం సంభవం కాదు. అదీగాక, శ్రీవరుడు విద్వాంసులు అన్నాడు. సాధారణంగా భారతీయులు రాజును గౌరవిస్తారు. మంత్రులు కానీ,  విద్వాంసులు కానీ రాజుకు సలహాలు, సూచనలు ఇస్తారు. అదీ వినయ పూర్వకంగా తప్ప, ఒత్తిడి చేస్తూ కాదు. శ్రీవరుడు అదే రాశాడు.

పర్షియన్ రచయితలకు జైనులాబిదీన్ పట్ల సదభిప్రాయం లేదు. ఎందుకంటే అతడు కాఫిర్‍లకు ప్రాధాన్యం ఇచ్చాడు. వారిని ఇస్లామీయులతో సమానంగా చూశాడు. కాబట్టి అమీర్లు రాజుపై ఒత్తిడి చేయటం వారికి, ఇస్లామీయులు కాఫిర్లను సమర్ధించే వాడి లోపాన్ని ఎత్తి చూపించి మంచి ‘మార్గం’ సూచించినట్టవుతుంది. ఇందువల్ల జైనులాబిదీన్‌కు అవమానమైనా, ఇస్లామ్ పెద్దలు రాజ్య క్షేమం కోసం రాజుపై ఒత్తిడి తెచ్చినట్టవుతుంది. బ్రిటీష్ వారి చరిత్ర రచన విషయం, వారి దృష్టి గురించి చర్చించటం అరంభిస్తే దారి మళ్లటం ఖాయం. కానీ దీన్ని బట్టి తెలిసేదేమిటంటే రచించే వారి వ్యక్తిత్వం వారి రచనలో కనిపిస్తుంది. వారు ఒక విషయాన్ని చూసి అర్థం చేసుకునే దృష్టిలో కనిపిస్తుంది.కాబట్టి ఏ ఒక్కరి రచనను  ప్రామాణికంగా తీసుకుని చరిత్రను నిర్ణయించటం కుదరదు. పలు దృక్కోణాలను పరిశీలించి, ఒకే విషయాన్ని పలు విభిన్న కోణాలలో విశ్లేషించి విచక్షణను ఉపయోగించి నిర్ధారించాల్సివుంటుంది. అంతే తప్ప, ఏ ఒక్క రచనను ఆధారంచేసుకుని ‘ఇదే చరిత్ర’ అని నిర్ధారించకూడదు.

(ఇంకా ఉంది)

Exit mobile version