[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]
సప్తమః సర్గః
మద్యం యల్లోహితం వర్ణం విభర్తి చషకాన్తరే।
జానే పానప్రవృత్తానాం హ్రుద్రక్తేనైవ జాయతే॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 67)
మధుపాత్రలోని మద్యం రక్త వర్ణంలో ఉంది. దానికి రక్త వర్ణం మధ్యం తాగే వారి హృదయ రక్తం వల్ల అబ్బింది.
మద్యపానం చేసేవారు తమ రక్తాన్ని తాగుతారని, అందువల్ల వారు అనారోగ్యం పాలయి మరణానికి చేరువవుతారని చెప్పదలచుకున్నాడు జైనులాబిదీన్. ఆ రకంగా అయినా తన కొడుక్కు కాస్త తెలివి తేవాలన్నది అతని ప్రయత్నం. కానీ స్వీయ పతన మార్గంలో ప్రయాణించే వారికి మంచి మాటలు చెవికెక్కవు.
న మద్యే నామునా తుల్యః శత్రురస్తి హి దేహినామ్।
సేవితో హితకృచ్ఛత్రుర్మద్యం హన్త్యతిసేవితమ్॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 68)
మద్యాన్ని ఆరంభంలో మంచిది అన్న ఉద్దేశ్యంలో సేవిస్తారు. కానీ మద్యాన్ని మించిన శత్రువు మరొకటి లేదు. అతిగా సేవిస్తే అది చంపుతుంది. ఇక వేరే శత్రువు అవసరం లేదు.
మైరేయ మదమత్తా యాం కుర్వన్త్యనుచితాం క్రియామ్।
ఉన్మత్తోపి నతాం కుర్యాద్ యత్ స తస్మాత్ పలాయతే॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 69)
మదమత్తులయిన వారు అనుచిత కార్యాలు చేస్తారు. పిచ్చివారు, ఉన్మత్తులు కూడా చేసేందుకు భయపడి పారిపోయే పనులను మదమత్తులు చేస్తారు.
మద్యరూపేణ వేతాలః ప్రవిశ్య హృదయ క్షణాత్।
న కేషాం హరతే ప్రాణాన్ సహాసరూదితక్రియమ్॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 70)
మద్య రూపంలో రాక్షసుడు మనిషి హృదయంలో ప్రవేశిస్తాడు. మనిషిని నవ్విస్తాడు. ఏడిపిస్తాడు. ప్రాణాలు హరిస్తాడు.
చరిత్ర రచనలో సమాజహితం కూడా ఒక భాగం. శ్రీవరుడు మంచిని ఎంత గొప్పగా వర్ణించాడో, విషాదాన్ని ఎంత బాధతో వర్ణించాడో, సమాజానికి హాని చేసేదానికి దూరంగా ఉండమని అంతే బాగా వివరిస్తున్నాడు. మద్యపానం వల్ల కలిగే అవస్థల గురించి ఇటీవల కాలంలో మద్యపాన వ్యతిరేకులకన్నా విపులంగా వివరిస్తున్నాడు.
విశేణ వామునా పుత్ర పీతే నాప్తేదృశీ దశా।
పాపి స్వం త్యజ సావద్యం మద్య మద్య ప్రభృవ్యతః॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 71)
పుత్రా! మద్యపానం వల్ల నువ్వు ఈ రోజు ఇలాంటి దుస్థితిని అనుభవించాల్సి వస్తోంది. ఈ రోజు నుంచే మద్యపానం వదలి వేసి నిన్ను నువ్వు రక్షించుకో.
న చేత త్యజసి మూఢస్త్యం వ్యసనార్పిత మానసః।
అచిరాద్ వంచితో లక్ష్యా ప్రక్షీనాయూర్ధవిష్యసి॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 72)
నువ్వు మూర్ఖుడిలా మద్యపానానురక్తుడవయ్యావు. దాని ఉచ్చులో చిక్కుకున్నావు. నువ్వు ఆలస్యం చేయకుండా వెంటనే మద్యపాన అలవాటును వదలి వేయకతపోతే నీ అదృష్టం నిన్ను వదలిపోతుంది. నీ జీవితం అర్ధాంతరంగా ముగుస్తుంది.
జైనులాబిదీన్ లోని తండ్రిని అతి సున్నితంగా ప్రదర్శిస్తున్నాడు శ్రీవరుడు. ఒక రాజుగా, తన తరువాత సింహాసనాన్ని అధిష్టించబోయే వాడికి హితవు చెప్తున్నట్టు లేదు. ఒక తండ్రిగా దురలవాట్లు పాలయి జీవితాన్ని వ్యర్థం చేసుకుంటూ అయాచితంగా అందుతున్న అదృష్టాన్ని చేజార్చుకుంటున్న తనయుడికి హితవు చెప్తున్నట్టుంది. జీవితాన్ని నాశనం చేసుకోకూడదని ఆవేదనతో తండ్రి కొడుకును బ్రతిమాలాడుతున్నట్టుంది. వ్యక్తి ఎంత గొప్పవాడయినా అతని బలహీనత సంతానం. సంతానం చెడు దారిలో వెళ్తే, నాశనం వైపు పరుగులిడటం నిస్సహాయంగా చూస్తుండిపోవటాన్ని మించిన శిక్ష మరొకటి లేదు.
శృత్వతి రాజపుత్రః స స్వపితుః స మతాగివః।
రాజన్నద్యప్రభృతి న పిబామీత్యుత్తరం వ్యధాత్॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 73)
తండ్రి మాటలు విన్న రాజుపుత్రుడు ‘ఇకపై రాజాజ్ఞ లేకుండా మద్యాన్ని తాకన’ని సమాధానం ఇచ్చాడు.
సమాధానంలో పట్టుదల లేదు. మద్యపానం వల్ల కలిగే అనర్థాలు గ్రహించి మద్యం ముట్టనని అనటం లేదు. తండ్రి ఆవేదనను అర్థం చేసుకుని మద్యానికి దూరంగా ఉంటానని అనటం లేదు. మీ ఆజ్ఞ లేకుండా తాగగని అంటున్నాడు.
వ్యక్తి ఎప్పుడూ తన తప్పు అంగీకరించడు. తప్పు తనదని గ్రహించినా పొరపాటును ఒప్పుకుని, సరిద్దుకునేవారు అరుదు. తప్పనిసరి పరిస్థితులలో నిజాన్ని ఒప్పుకున్నా అవకాశం దొరకగానే మళ్లీ అదే పని చేసేవారే అధికం.
దీప్త్యుజ్ఝీతం క్షీణదశాం మన్దమస్నేహ భాజనమ్।
సుతం దీపమివైక్ష్యా భూద్ భూపో మోహతమోహతః॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 74)
క్షీణ దశలో ఉన్న దీపంలా, క్షీణిస్తున్న వెలుగుతో, సన్నని వొత్తి, నూనెలేని దీపంలా, బలహీనంగా ఉన్న కొడుకు కనిపించాడు జైనలాబిదీన్‌కు. రాజును నిరాశ, అంధకారాలు ఆవరించాయి.
ఇంతకన్నా ఘోరమైన శిక్ష లేదు. ప్రాణప్రదంగా పెంచి పెద్ద చేసిన సంతానం తన కళ్ల ముందే దురలవాటుకు బానిస అయి కృంగి కృశించి మరణానికి చేరువగా ఉండటాన్ని చూడటాన్ని మించిన రంపపు కోత మరొకటి లేదు. వద్దని చెప్పినా వినడు. బెదిరించి లాభం లేదు. ప్రేమగా బ్రతిమలాడి లాభం లేదు. ఎన్ని రాజ్యాలను గెలిచినా వాడయినా, ఎన్నెన్ని ఘనకార్యాలు సాధించిన వాడయినా, ఎంత మందికి ఎంత సేవ చేసి ఎన్నెన్నో దీవెనలు అందుకున్నా వాడయినా సంతానం సరైన దారిలో ప్రయాణించలేకపోతే, అతడిని మించిన దౌర్భాగ్యుడు, దురుదృష్టవంతుడు మరొకడుండడు. జీవితంలో ఎన్నెన్ని అద్భుతమైన అనందాలు అనుభవించిన వాడయినా ఉచ్ఛ స్థాయిలో సంతానాన్ని చూడలేని వాడిని మించిన దౌర్భాగ్యం, విషాదం మరొకటి లేదు.
ఉపదేశగిరోప్రియాః శృతౌ
గతభాగ్యేషు భవన్తి జన్తుషు।
విపదభ్యుదయే పునః స్కతా
న మయాశ్రావి కిమిత్సమన్తుదాః॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 75)
కఠినమైనా మంచి మాటలను విని పాటించేవారు గత జన్మలో ఏదో మంచి పని చేసి ఉంటారు. విననివారు, భవిష్యత్తులో కష్టాలు ఎదురయినప్పుడు ‘అప్పుడే ఎందుకని మంచి మాటలను నేను వినలేదు’ అని బాధపడతారు.
అథ స్వావసథం గత్వా సోపిబద్ యన్త్రితోపి సన్।
విషవద్ వ్యసనాన్ధానామపదేశో నిరర్ధకః॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 76)
తండ్రి చెప్పిన మంచి మాటలన్నీ విని చక్కగా ఇంటికి వెళ్లి మద్యపానం ఆరంభించాడు హ్యాజీఖాన్. విష సదృశ వ్యసన మత్తులో అంధుడయిన వాడికి ఎవరెన్ని ఉపదేశాలు ఇచ్చినా లాభం లేదు. దీపంలో పడి మాడి మసై పోయేందుకు సిద్ధమైన శలభాన్ని ఎవరు మాత్రం ఆపగలరు ?
తావతా స్నేహమాశంక్య రాజపుత్ర విమన్త్రిణః।
ఆదమ ఖాన మానిమ్యర్గూఢ విభైర్త్దిగన్తరాత్॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 77)
రాజుకు హ్యజీఖాన్ అత్యంత ప్రియతముడని, అతడిని మార్చే వీలు లేదు కాబట్టి, రహస్యంగా కొందరు మంత్రులు అతని సోదరుడు ఆదమ్ ఖాన్‌కు లేఖ వ్రాసి వేరే దేశంలో ఉన్న అతడిని కాశ్మీరుకు ఆహ్వానించారు.
సుల్తాన్ బాధను చూసి భరించలేక, హ్యజీఖాన్ మారే ప్రసక్తి లేదని గ్రహించి మంత్రులు రహస్యంగా అదమ్ ఖాన్‌కు కబురు పంపేరని ఫరిష్తా అమీర్‌ల చర్యను సమర్థించాడు.
అనుజాగమనత్రాసాద్ యథా యాతోగ్రజాః పురా।
తథాగ్రజాగమత్రాసానుజో యాతి దేశతః॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 78)
అదమ్ ఖాన్ కశ్మీరు వస్తున్నాడన్న వార్త హ్యజీఖాన్‌కు భయం కలిగించింది. ఎలాగయితే తమ్ముడి రాక వార్త విని గతంలో ఆదమ్ ఖాన్ రాజ్యం వదలి పారిపోయాడో, ఇప్పుడు అన్న రాకడ వార్త విని తమ్ముడు పారిపోయాడు.
ఏవత్కాలః నిశ్చింత ప్రాగ్వత్ స్యాం నిజమండలే।
ఇతి దుద్ధ్యా ప్రవేశేస్స్య కృతోపేక్షో నృపోభవత్॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 79)
ఆదమ్ ఖాన్ రాజ్యంలో ప్రవేశిస్తున్నాడన్న వార్త విన్న రాజు ఎలాంటి స్పందనను ప్రదర్శిచలేదు. రాజ్యం కోసం సోదరుల నడుమ జరుగుతున్న కలహంతో తనకు సంబంధం లేదనట్టు తన భవనంలో నిశ్చింతగా ఉండిపోయాడు.
హాజ్యఖానాత్మజః శృత్వా తం పితృర్యం సమాగతమ్।
గ్రయుత్సుః ప్రాప ప్రర్ణోత్సం త్యత్తవా రాజపురీం తతః॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 80)
తన పెద్దనాన్న (ఆదమ్ ఖాన్) యుద్ధానికి వస్తున్న వార్త తెలిసి, హజ్యీఖాన్ పుత్రడు యుద్ధానికి సిధ్ధమై, రాజపురి వదలి పర్ణోత్స చేరుకున్నాడు.
అంటే, జైనులాబీదీన్ సంతానం నడుమ రాజ్యం కోసం పోరును తరువాత తరం వారు కూడా అందిపుచ్చుకున్నారన్నమాట.
ఆంద్రోటకోటమాశ్రిత్య భ్రాతృపుత్ర పితృవ్యయోః।
కశ్మీరాగమనద్దేశాదభవద్ యుద్ధాముద్ధతమ్॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 81)
అంద్రోట కోట కోసం బాబాయి – అబ్బాయిల నడుమ ఘోరమైన యుద్ధం జరిగింది.
‘ఆంద్రోట కోట’ కశ్మీరులో ఎక్కుడందో సరిగ్గా గుర్తించలేదు. కల్హణుడు అన్న ‘అభ్యంతర కోట’నే శ్రీవరుడి కాలానికి ఆంద్రోట కోట అయిందని కొందరి అభిప్రాయం. కానీ సరిగ్గా ‘ఇదే’ అని నిర్ణయించలేక పోతున్నారు.
దృష్టం హసనఖానస్య క్షమిత్వం బలశాలినః।
వినా పైతాహమహీమాజ్ఞాం నాగాద్ దేశోత్ముకోపి సన్॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 82)
బలశాలి అయిన హసన్ ఖాన్ ఓర్మిని కశ్మీర ప్రజలు ఈ సందర్భంగా చూశారు. యుద్ధానికి వెళ్లగిలిగి ఉండి కూడా తాత ఆజ్ఞ లేకుండా అడుగు ముందుకు వేయలేదు అతడు.
ఆ హజ్యీఖాన్ పుత్రుడు హసన్ ఖాన్. శక్తిమంతుడు. తెలివైనవాడు. శాహమీర్ వంశంలో పదవ సుల్తాన్. భవిష్యత్తులో రాజ్యాధికారం చేపట్టిన తరువాత ఇతడు తన పేరును ‘హసన్ శాహా’ గా మార్చుకున్నాడు.
(ఇంకా ఉంది)