[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]
సప్తమః సర్గః
న్యస్తో రాజేందునా సింధుదేశే యో గుణసుందరః।
స్వత్రాణేన సురత్రాణపదే ప్రాణాధికప్రియః॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 49)
శ్రీక్యామదేన సింధ్వీశం భాగినేయం సుతోపమమ్।
ఎబరాహిమనామ్నా తం హతం యద్ధే శృణోనృపః॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 50)
పరమాశ్వసనోపాయా సుఖే దుఃఖే చ యోభవత్।
తదా తన్మరణం రాజా భుజచ్ఛేదమివా విదత్॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 51)
తన ప్రజలను రక్షించే రాజు తన సోదరి కుమారుడిని, సింధు దేశానికి సుల్తాన్‌గా నియమించాడు. అతడు రాజుకు ప్రాణప్రదుడు. అతడిని తన స్వంత సంతానంగా ప్రేమించాడు రాజు. అంత ప్రియతముడైన సోదరి కుమారుడు, సింధు రాజు, యుద్థంలో ఇబ్రహిమ్ చేతిలో మరణించాడన్న వార్త రాజు విన్నాడు. అతడు రాజుకు సుఖదుఃఖాలలో తోడుగా ఉన్నాడు. అతడి మరణంతో తన భుజాన్ని ఎవరో కత్తిరించినట్టు బాధ పడ్డాడు రాజు.
దర్యావఖానాదిమృతౌ యాభూన్మంత్రసభా నవా।
లీలామిత్రైః సమం సర్వా సా యయౌ స్మరణీయతామ్॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 52)
దర్యావఖాన్, ఇంకా ఇతరులు మరణించటం వల్ల కొత్త మంత్రివర్గం ఏర్పడింది. కానీ పాత మంత్రివర్గం గురించి అందరూ మాట్లాడుతుండటంతో కొత్త మంత్రివర్గం లోని వారు పేరుకే మంత్రులుగా మిగిలారు.
లసన్మదో విభుః ప్రాప్తకార్యోత్పాదిత సౌహృదః।
తత్కాలం ప్రమయం యాతో దాతా మేరఖుషాహ్లాదః॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 53)
గర్వితుడు, ప్రముఖుడు అయినవాడు, తన కార్యాల వల్ల రాజు స్నేహాన్ని పొందినవాడు, రాజుకు ఆప్తుడు అయిన మీర్ మహమ్మద్ మరణించాడు.
దుర్వార్తామన్వహం శృణ్వన్నార్తాం జానన్నిజాం ప్రజామ్।
స్వసుతాన్యోన్యవైరేణ చిన్తాతప్తో నృపోభవత్॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 54)
ప్రతి రోజూ రాజుకు ఏదో ఒక దుర్వార్త అందుతూనే ఉండేది. దానికి తోడు, తన సంతానం నడుమ చెలరేగుతున్న వైరం వల్ల ప్రజలు పీడితులవుతుండటం రాజును చింతాక్రాంతుడిని చేస్తోంది.
అతీతాన్ బాంధవాన్ భృత్యాన్ సఖీన్ ప్రాణ సమాన్ స్మరన్।
స్వాత్మానమివిదద్ రాజా యూధభ్రష్టమివ ద్విపమ్॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 55)
ప్రాణ సదృశ్యులైన బంధువులను, మిత్రులను, భృత్యులను గుర్తుతెచ్చుకుంటూ రాజు తనని తాను గతి తప్పిన గజంలా భావించకుని బాధపడేవాడు.
మనుషులకు మరణం అంటే భయం. మనిషి పుట్టినప్పుడే మరణం నిశ్ఛయం. కానీ జీవితాంతం మనిషి తన ప్రమేయం లేకుండానే మరణ భయం ప్రభావంలో పడతాడు. ఆ భయాన్ని మరచి భద్రతా భావ భ్రమను సృష్టిచుకుని ఆ మాయలో సర్వం మరచి తాను ఎల్లప్పటికీ బ్రతుతాడన్న నమ్మకాన్ని కలిగించుకుంటాడు. కానీ ఎంత మరచినా మరపుకు రానిది మరణ భయం. ముఖ్యంగా, ఒక వయసు దాటిన తరువాత, శరీరం నెమ్మదిగా పతనమవుతుంటే మృత్యువు నీడ మరింత స్పష్టంగా కనిపిస్తుంటే, మరణం అనివార్యమన్న సత్యాన్ని మనసు ఒప్పుకోక తప్పదు. ఏ క్షణంలో మృత్యువు మీద పడుతుందో తెలియదు. అనుక్షణం మృత్యువు నీడలో ఉంటూ, భవిష్యత్తు అన్నది లేని సమయంలో, గతం తప్ప మరేమీ మిగలని తరుణంలో మనిషికి తన స్నేహితులు, బంధువులు అందరూ గుర్తుకు వస్తారు. ఒకరొకరిగా తనని వదలి వెళ్లిపోయిన వారు స్మరణకు వస్తారు. అందరూ వదలి వెళ్లగా ఒంటరిగా మిగిలిపోవటం, కొత్త వారు, అపరిచయస్థుల నడుమ, తనంటే తెలియనివారు, తన గురించి స్పృహ లేని వారి నడుమ బ్రతకాల్సి రావటం ఎంతో దుర్భరంగా ఉంటుంది. ఆ సమయంలో గతాన్ని తలచుకుంటూ, మృత్యువు కోసం ఎదురు చూడటం తప్ప మరో గత్యంతరం ఉండదు.
ఇలాంటి పరిస్థితిలో తన సంతానం నడుమ అధికారం కోసం వైరం మనిషిని మరింత కృంగదీస్తుంది. తాను ప్రాణప్రదంగా పెంచిన సంతానంలో ఎవరు బ్రతుకుతారో, ఎవరు ప్రాణాలు కోల్పోతారో తెలియదు. ఏ క్షణంలో ఏ వార్త వినాల్సి వస్తుందో నన్న భయం ఉంటుంది. దానికి తోడుగా సంతానం నడుమ అధికారం కోసం జరుగుతున్న పోరాటంలో ప్రజలు పావులవటం, వారు కష్టాలు పడటం, ప్రజలకు సుఖశాంతులందివ్వటమే తన ధర్మంగా బ్రతికిన రాజుకు మరింత బాధను కలిగిస్తుంది. రాజు తన ఆప్తుల మరణ వార్త ఎవరో ఒకరిది వినాల్సిన రావటం, సంతానం నడుమ పోరు, ప్రజలు కష్టపడటం, పొంచి ఉన్న మృత్యువు వల్ల జైనులాబిదీన్ చివరి దశ అత్యంత బాధామయంగా, దుర్భరంగా సాగుతున్నది. ఎలా జీవించామన్నది కాదు, ఎలా మరణించామన్నది అత్యంత ప్రధానం అన్న వ్యాఖ్యలో నిజం బోధపడుతుంది.
అత్రాంతరే రాజా సునోర్హాజ్యఖానస్య రక్తజమ్।
అస్వాస్థ్య ముదరభూన్నిత్యం మద్యపానాతిసేవనాత్॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 56)
ఇంతలో, అధికంగా మద్యం సేవించటం వల్ల రాజ కుమారుడు హాజ్యఖాన్ రక్త సంబంధిత వ్యాధితో బాధపడుతున్నడని తెలిసింది.
శ్రీవరుడు రక్త సంబంధిత వ్యాధి అన్నాడు. ‘తవ్వకత్ అక్బరీ’ ప్రకారం నిరంతర మద్య సేవనం వల్ల హాజ్యఖాన్‌కు సంగ్రహిణీ వ్యాధి వచ్చింది. ఆయుర్వేదం ప్రకారం సంగ్రహిణీ వ్యాధి అంటే Irritable Bowel Syndrome. దీని వల్ల పాలన కూడా సరిగ్గా సాగక అస్తవ్యస్తం అయింది. ప్రజలు కష్టాలను భరించారు.
శౌర్యాదార్య నిధేః సూనోరతిప్రియతమా వయా।
రాజ్య సౌఖ్యాలతా రాజ హృదుర్యానో ఫలాచితా।
తదాభూన్నీరసప్రాయో తదస్వాస్థ్య దవాగ్నినా॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 57)
శౌర్యం, ఔదార్యాలకి నిధి వంటి ప్రియతమ పుత్రుడి ఆనారోగ్యం రాజును క్రుంగదీసింది. ఎలాగయితే అగ్నిని తాకిన చెట్టు మాడిపోతుందో, అలా రాజు హృదయంలో సుఖ సంతోషాల భావన అంతరించింది.
అథానీయాన్తికం దృష్ట్యా సవికారం భృశం కృశం।
స్నేహాదిత్య బ్రవీద్ రాజా పుత్రం మంత్రి సభాంతరే॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 58)
పుత్రుడిని తన ముందుకు తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు రాజు. సభలో ఎదురుగా వచ్చి నిలుచున్న పుత్రుడిని చూశాడు. అనారోగ్యోంతో కృశించిపోయి ఉన్న కొడుకును చూసి బాధతో, మంత్రులందరి సమక్షంలో ఇలా అన్నాడు.
అహో పుత్ర ఫలం లబ్ధం దోషాసన్వేవ పానజమ్।
యేనేదృశీ దశాప్రాప్తా చంద్రేణేవ క్షయావహా॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 59)
ఓ పుత్రుడా! చెడు పట్ల ఆకర్షితుడవై చెడు అలవాట్ల బారిన పడి ఆ దుష్ఫలితాన్ని అనుభవిస్తున్నావు. చంద్రుడి వంటి ముఖం కళ తప్పి క్షీణించింది.
స్వార్థాపేక్షే హితః కోపి భృత్యస్తే నాస్తి రక్షకః।
పానవ్యపన సంసక్తం యస్త్వాముపదిశత్యలమ్॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 60)
నిన్ను ఈ దుర్వ్యసనం నుంచి తప్పించి మంచి చెప్పే భృత్యులెవరూ లేరా?
కియన్తో వత న భోగాశ్చమత్కార కరాస్తవ।
కిమేకేన భవాన్ గ్రస్తో విషయేణ పతంగవత॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 61)
నీకు అందుబాటులో లేని భోగాలేమున్నాయి? ఇన్ని ఆకర్షణీయమైన భోగాలు అందుబాటులో ఉండగా, కేవలం ఒక విషయ వ్యసనానికి ఎలా గురయ్యవు అన్నీ వదలి?
అస్మిన్ జన్మని సామగ్రీ యేయం ప్రాప్తాన్యదుర్లభా।
ప్రాప్తా నైవేదృశీం భూయో యది దుర్వ్యసనో భవాన్॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 62)
పురుగులా ఒకే విషయ వ్యసనాన్ని పట్టుకుని వ్రేలాడుతున్నావెందుకు? ఈ జన్మలో నీకు దుర్లభమైన సౌఖ్యం ఏమిటి? నువ్విలా మద్యాన్ని పట్టుకుని వ్రేలాడుతుంటే, ఇతర సౌఖ్యాలు నీకు దక్కవు. జన్మ వ్యర్ధమైపోతుంది.
కిం చిరంతన వృత్తాన్తైర్యువృష్ణయాదీనం సమీరితైః।
మద్యేనాతును భూపాలా దృష్టనష్టా విచార్యతామ్॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 63)
మద్యం మత్తులో జీవితాన్ని వ్యర్ధం చేసుకునే నీకు ప్రాచీన రాజుల గాథలు చెప్పి లాభం లేదు. గాలికి పత్తి ఎగిరినట్టు శత్రువులను ఓడంచిన వీరులైన వారు కూడా మద్యం మత్తులో పడి నాశనమైపోయారు.
తథాహి సబలరాతిగణతూల సమీరణః।
మల్లేకజస్రథో యోభూన్మద్రజ్యాప్తి నిధానభూః।
తేనాపి దృష్టం దుష్ట ప్రాగం నాత్యాక్షీత్ తత్ స్యవంచకః॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 64)
తస్యపుత్రోభవచ్ఛాహి మసోదః ప్రమయే పితుః।
స్వర్వం హరితవాన్ క్షీవః కుర్వన్నున్మత్తచేష్టితమ్॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 65)
సప్తప్రకృతిధాత్వాఢ్యం తన్మల్లేకపురం మహత్।
కుపుత్ర సనాద్ యాతం దేహవత్ స్మరణీయతామ్॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 66)
మల్లిక జసరధ్‌కు మధ్యపాన వ్యసనం వల్ల కలిగే నష్టం గురించి తెలుసు. అందుకని రాజ్యాధికారాన్ని చేపట్టిన తరువాత ఆయన మద్యపానానికి దూరంగా ఉన్నాడు. కానీ అతని కొడుకు శాహి మసోదా తండ్రి ప్రదర్శించిన విచక్షణను ప్రదర్శిచలేదు. తాగుడు మత్తులో మునిగిపోయాడు. సమయం దొరికినప్పుడల్లా తాగటం ఆరంభించాడు. తండ్రి మరణించిన తరువాత అడ్డూ అదుపు లేకుండా తాగి సర్వం కోల్పోయాడు.
కొడుకుకు తాగుడు వ్యసనం వల్ల కలిగే నష్టాలను వివరిస్తున్నాడు జైనులాబిదీన్. గతంలో తాగుడు వల్ల సర్వం కోల్పోయిన వారి దృష్టాంతాలను చూపి మరీ వివరిస్తునాడు. ఇక్కడ రాజుగా కన్నా తండ్రిగా కనబడతాడు జైనులాబిదీన్. ఇది అందరికీ అనుభవమే.
పెద్దలకు తెలుసు పిల్లలు అనుసరిస్తున్న మార్గం అనర్థదాయకమని. వారి అనుభవం వారికి నేర్పిన పాఠం అది. కానీ పిల్లలది ఆవేశం. అతి విశ్వాసం, తల్లిదండ్రులు ఎంతగా మంచి చెప్పినా, నచ్చ చెప్పినా, ఎన్నెన్ని ఉదాహరణలు చూపినా, వారు చేయాలనుకున్నది వారు చేస్తారు. అనుభవిస్తారు. తల్లి తండ్రుల ఆరాటం అది. పిల్లల పోరాటం ఇది. ఎంత గొప్ప సుల్తాన్ అయినా, జగజ్జేత అయినా ఈ జీవిత చక్రం నుంచి తప్పంచుకోలేడు. జస్రద్ అనేవాడు ‘ఖోఖర్’ల సర్దారు. జైనులాబిదీన్‌కు సన్నిహితుడు. జైనులాబిదీన్ కశ్మీరు సింహసనాన్ని సాధించటంలో కీలక పాత్ర పోషించాడు. తరువాత ఢిల్లీ పైకి దండయాత్రకు వెళ్లాడు. ఇబ్రహీం లోడి చేతిలో ఓడిపోయాడు. కశ్మీరు తిరిగి వచ్చాడు. జైనులాబిదీన్ సహాయంతో పంజాబును గెలుచుకున్నాడు.
షాహి మసూద్ జస్రధ్ కుమారుడు. అతడు తాగుబోతు. పంజాబ్‌ను కోల్పోవటమే కాదు, తాగుడులో పడి సర్వం కోల్పోయాడు. జస్రధ్ తనకు సన్నిహితుడు కాబట్టి జైనులాబిదీన్‌కు వారి కథలన్నీ తెలుసు. ఇప్పుడు తన కొడుకు కూడా మత్తపాన చిత్తుడవటం జైనులాబిదీన్‌కు బాధ కలుగుతోంది. అంతే కాదు, ఎలాగైతే, జస్రధ సామ్రాజాన్ని అతని సంతానం వ్యర్ధం చేసుకున్నారో, అలాగ తాను సుస్థిరపరిచి, విస్తరింప చేసిన సామ్రాజ్యాన్ని త్రాగుడు మత్తులో తన సంతానం పోగొట్టుకుంటారేమోన్న భావన కూడా జైనులాబిదీన్‌కు అత్యంత బాధను కలిగిస్తున్నది. తాను నిర్మించి అభివృద్ధి పరచిన సామ్రాజ్యం తన తరువాత తరం వారు వ్యర్ధం చేస్తారన్న భావన మరింత బాధాకరం. తీవ్రమైన మానసిక వేదనకు కారణం అవుతుందీ భావన.
(ఇంకా ఉంది)