[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]
షష్టః సర్గః
ఔర్ణాః సోఫాదయో వస్త్రవిశేషా దూరదేశజాః।
కశ్మీరికాశ్చ భాన్త్యద్య సమర్థస్తే నృపోచితాః॥
(శ్రీవర రాజతరంగిణి, షష్ట సర్గ, 29)
ఇతర దేశాలలో తయారైన ఉన్ని వస్త్రాలకూ, కశ్మీరులో తయారైన ఉన్ని వస్త్రాలు నాణ్యతలో సమానమే అయినా, కశ్మీరులో తయారైన వస్త్రాలు ఎంతో విఖ్యాతిని పొందడమే కాదు, రాజులు ధరించేందుకు అర్హమైనవి కూడా.
అంటే, కశ్మీరులోనూ ఇతర ప్రాంతాలలోనూ తయారయ్యే వస్త్రాలు అందమైనవే అయినా, కశ్మీరులో తయారైన వస్త్రాలు రాజులు ధరించే అర్హత కల ఉత్తమమైనవి అని కశ్మీరు వస్త్ర తయారీ నిపుణులను పొగడుతున్నాడు శ్రీవరుడు.
‘సోఫా’ అని శ్రీవరుడు వాడిన శబ్దం అరబీ శబ్దం. అరబ్బీ భాషలో దీన్ని ‘సూఫ్’ అంటారు. మేకలు, గొర్రెల బొచ్చుతో తయారు చేసే వస్త్రాలను ‘సూఫ్’ అంటారు. కొందరు ‘షాల్స్’ను శ్రీవరుడు ‘సోఫా’ అన్నాడని భావించారు.
విచిత్ర వయనోత్పన్న నానా చిత్రలతాకృతీః।
దృష్ట్వా చిత్రకరా యేషు జాతాశ్చిత్రార్పితా ఇవ॥
(శ్రీవర రాజతరంగిణి, షష్ట సర్గ, 30)
కశ్మీరీ కళాకారులు వస్త్రాలపై చిత్రించిన చిత్రలతలూ ఇతర చిత్ర విచిత్రమైన ఆకృతులను చూసి చిత్రకళే ఆశ్చర్యపోయింది. నోట మాట రాకుండా అయింది చిత్రకళకి. కశ్మీరీ కళాకారుల కౌశలాన్ని శ్రీవరుడు ఆనందంగా వర్ణిస్తున్నాడు.
భారతీయ సాంఘిక వ్యవస్థలో నిర్దిష్టమైన కర్తవ్యాలున్నాయి. కానీ సాంఘిక వ్యవస్థ అల్లకల్లోలమయింది. ఆ పరిస్థితిని చక్కబెట్టేందుకు పలు రకాల నూతన వృత్తులు కశ్మీరులో ప్రవేశపెట్టారు. గతంలో తమ తమ వృత్తుల లోని నైపుణ్యాన్ని అంతా నూతన వృత్తులలో ప్రదర్శించారు ప్రజలు. ఇప్పుడు కొత్తగా నేర్చుకుంటున్న నైపుణ్యానికి తాము గతంలో గ్రహించిన నైపుణ్యాన్ని జోడించి నూతన పద్ధతిని సృజించారు. అందుకే వీరికి నేర్పిన వారు కూడా ఆశ్చర్యపోయే కళను వస్త్రాలపై చిత్రించారు.
అరబ్బులు, పర్షియన్లు మానవ ఆకారాలను చిత్రించటాన్ని వారి మతం నిషేధిస్తుంది. అందుకని వారు అధికంగా రేఖాకృతులు (geometric patterns), లతలు, కాలిగ్రఫీ వంటి వాటినే చిత్రించేవారు. ఇందుకు భిన్నంగా కశ్మీరీ కళాకారులు – పర్షియన్ అరబ్బీ చిత్రాలకు తోడుగా మానవ ఆకారాలు, ప్రకృతి దృశ్యాలను జోడించారు. స్థానిక జానపద గాథలను, స్థానిక వృక్షాలు, పూలు, జంతువులు, పక్షులను చిత్రించారు. అరబ్బు పర్షియన్‍ల చిత్రకళ ఇస్లామ్ చిత్రకళ కాగా, కశ్మీరీయులు ఇస్లామ్ చిత్రకళకు గాంధార, భారతీయ చిత్రకళ పద్ధతులను జోడించారు. అందుకే కశ్మీరీయుల కార్పెట్లు, చెక్కలపై గీసిన చిత్రాలు (పింజిరాకారి), కాగితపు గుజ్జుతో తయారు చేసే పలు అలంకారాలు ప్రపంచ ప్రసిద్ధి పొందాయి.
అనన్తతన్తుసంతానవర్ణ విచ్ఛిత్తిసుందరః।
బభౌ కౌశేయ కఖ్యాతో దేశో వేషశ్చ భూపతేః॥
(శ్రీవర రాజతరంగిణి, షష్ట సర్గ, 31)
రాజు సిల్కు దుస్తులు, రాజు రాజ్యం సమానంగా ప్రసిద్ధి పొందాయి. రాజ్యంలో ఉన్న పలు విభిన్నమైన జాతుల వల్ల రాజ్యం పేరు పొందితే, రాజు దుస్తుల్లోని పలు విభిన్నమైన రంగుల దారాల వల్ల రాజు దుస్తులు కూడా ప్రసిద్ధి పొందాయి.
ఇక్కడ శ్లోకంలో ‘కౌశేయ’ రాజ్యం అని వాడేడు శ్రీవరుడు.
కౌశేయ అటే సిల్కు వస్త్రాల రాజ్యం అన్న అర్థంలొ వాడేడు. కాళిదాసు కుమార సంభవం, ఋతు సంహారం వంటి కావ్యాలలో కౌశేయ పదం కశ్మీరును సూచిస్తూ వాడేడు. అభిజ్ఞాన శాకుంతలంలో కశ్మీరుకు సంబంధించిన సరస్సు ప్రస్తావన వస్తుంది. కాబట్టి పలువురు ఆంగ్ల పండితులు భావించినట్టు ఈ శ్లోకం కౌశేయాధిపతి అయిన వేరే ఎవరో రాజు గురించి కాదు, కశ్మీరాధిపతి అయిన జైనులాబిదీన్ గురించే అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.
నానావర్ణ విశేష చిత్ర కటకాలంకార రసారోచితో
విద్యామానవరాజితోతి సుఖదః కౌశేయాతాఖ్యాతిమాన్।
శ్రీమాన్ నిత్య మహోజ్జ్వలోతులగుణః సత్తన్త్ర సంపత్తిభృద్
రాజ్ఞా తేన విశేషితో నిజధియా వేశోపి దేశోపివా॥
(శ్రీవర రాజతరంగిణి, షష్ట సర్గ, 32)
పలు రంగుల జాతుల ప్రజలతో, పలు విభిన్నమైన అలంకారాలతో రాజధాని, ప్రజల పాండిత్యం, విద్యాకౌశలంతో, గౌరవం వల్ల రాజ్యం వింత అందంతో అలరారుతోంది. ప్రజల దుస్తులు పలు రంగులలో వర్తులాకార అలంకారాలతో శోభిల్లుతున్నాయి. రాజ్యం అద్భుతమైనది. శత్రుదుర్భేద్యమైనది. ఆ రాజ్యం సిల్కు దుస్తులకు పెట్టింది పేరు. పట్టు వస్త్రాలు ధగధగలాడుతున్నాయి. రాజ్యం పండుగల సంబరాలతో కళకళలాడుతోంది. ఎలాగయితే పట్టువస్త్రాలలో అనేక దారాలున్నాయో, అలాగ రాజ్యంలో పటిష్టమైన చట్టాలుండి ధనవంతమైన రాజ్యంగా నిలిచింది కశ్మీరు.
~
ఇతి జైనరాజతరంగిణ్యాం చిత్రపరిచయశిల్పవర్ణనం నామ షష్టః సర్గః॥
ఇంతటితో చిత్ర విచిత్రమైన రంగుల కళలు, శిల్ప వర్ణనలతో కూడుకున్న జైనరాజతరంగిణిలోని ఆరవ సర్గ సమాప్తం.
(ఇంకా ఉంది)