[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]
షష్టః సర్గః
కచ్చిచ్ఛీ రాజహంసస్య రాజహంసయుగం దదౌ।
అన్యే హంసా యదుత్పన్నా రాజహంస రంజయన్॥
(శ్రీవర రాజతరంగిణి, షష్ట సర్గ, 20)
ఎవరో రాజుకు రాజహంసల ద్వయాన్ని బహుకరించారు. ఆ రాజహంసల నుంచి ఉత్పన్నమైన అనేక రాజహంసలు రాజును ప్రసన్నచిత్తుడిని చేశాయి.
‘పీర్ హసన్’ ప్రకారం ‘లాసా’కు చెందిన ‘వలీ’ అనే ఆయన మానససరోవరం నుంచి రెండు హంసలను పట్టుకుని వచ్చి రాజుకు బహుకరించాడు. ఈ రెండు హంసలు సుల్తాన్ ముందు పాలను, నీటిని వేరు చేసి చూపించాయట. తమ ముక్కులతో పాలను పీల్చి, కేవలం నీటిని మాత్రం మిగిల్చాయి.
‘తవ్వకల్ అక్బరీ’ ప్రకారం తిబ్బత్తుకు చెందిన రాజు మానససరోవరం నుంచి హిందుస్తానీ మాట్లాడే రెండు హంసలను తెచ్చి రాజుకు బహుకరించాడు. ఈ రెండు హంసలు పాలను, నీటిని వేరు చేసి చూపించి రాజును ఆనందపరిచాయి.
సరః స్వన్తర్భ్రమన్తస్తే నిర్దరాః పంక్తిపావనాః।
తరంగతరలోత్ఫుల్ల శ్వేతోత్పలతులాం దధుః॥
(శ్రీవర రాజతరంగిణి, షష్ట సర్గ, 21)
ఈ రెండు హంసలు సరస్సులో నిర్భయంగా సంచరిస్తూ, నీటిలో తరళ, ప్రఫుల్ల, శ్వేత కమలాల వలె కనిపించాయి.
ఖురాసానామహీపస్య యస్యైవాజ్ఞా హయప్రభోః।
మూర్థ్నా మందారమాలేవ ధ్రియతే దిగధీశ్వరైః॥
(శ్రీవర రాజతరంగిణి, షష్ట సర్గ, 22)
యస్యాయుధోర్జితంకరాః కింకరాః సుభయంకరాః।
యమస్య చార్పితంకరా వ్యచరన్ ధరణీతలే॥
(శ్రీవర రాజతరంగిణి, షష్ట సర్గ, 23)
ఉత్తరాశాధిపో మేర్జామోసైదః స మహీభుజే।
ఉచ్చాశ్వవేసరీయుక్తం వ్యసృజత్ సోపథిం చరమ్॥
(శ్రీవర రాజతరంగిణి, షష్ట సర్గ, 24)
అనేక అశ్వాల అధిపతి అయిన సురసాన్ మహీపతి ఆజ్ఞను పలు దిశల అధీశ్వరులు మందారమాలలా శిరసావహిస్తారు. భయంకరమైన ఆయుధాలు ధరించి, ఆయన భృత్యులు యమకింకరుల్లా భూమిపై నడుస్తారు. అలాంటి ఉత్తర దిశ అధిపతి అయిన మీర్జా అభోసైద్ రాజుకు అనేక అశ్వాలను బహుమతిగా పంపాడు.
‘తవ్వకత్ అక్బరీ’ ప్రకారం ఖురాసాన్ బాద్షాహ్ అబూసయీద్, కశ్మీరు రాజుకు అనేక అశ్వాలను బహుకరించాడు. అందుకే శ్రీవరుడు అతడిని ‘అశ్వపతి’ అన్నాడు. మీర్జా అభోసైద్, మీర్జా అబూ సయ్యద్, బాబర్ ప్రపితామహుడు. ‘తారీఖ్-ఎ-రసీదీ’ ప్రకారం తనకు అశ్వాలను బహుకరించిన బాద్షాహకు బహుమతిగా కశ్మీరు సుల్తాను, కాగితాలు, షాళ్ళు , గాజుతో తయారు చేసిన పలు పాత్రలను పంపించాడు.
కతేఫసోఫ సగ్లాత్‌ఖ్యాత్ వస్త్రాద్యుపాయనైః।
మహమ్మదసురత్రాణో గూర్జరీశో ప్యతూతుపత్॥
(శ్రీవర రాజతరంగిణి, షష్ట సర్గ, 25)
గూర్జరాధీశుడు ‘మహమ్మద్’ కతేఫ, సోఫ, సగ్లాత్ వంటి వస్త్రాలను రాజుకు బహుకరించాడు.
గిలానమెస్రమక్కాదిదేశాధిశా హితేచ్ఛయా।
దుర్లభోపాయనై స్తైస్తైర్న కే భూపమరంజయన్॥
(శ్రీవర రాజతరంగిణి, షష్ట సర్గ, 26)
గిలాన్, మిశ్ర్, మక్కా వంటి దేశాల రాజులు పలు బహుమతులను పంపటం ద్వారా కశ్మీర రాజును సంతృప్తి పరచారు. జైనులాబిదీన్ లాంటి రాజును సంతోషపెట్టాలని అనుకోని వారెవరు?
‘గిలాన్’ అన్నది అజర్‍బైజాన్, అఫ్ఘనిస్తాన్‌ల సంయుక్త నామం. ‘గిలాన్’ అన్నది ఒక నగరం పేరు కూడా.
‘మిశ్ర’ అన్నది ఈజిప్టు. ఆ సమయంలో ఈజిప్టు సుల్తాన్ ‘బూర్జీ మామలూన్’.
‘మక్కా’తో జైనులాబిదీన్‌కు సత్సంబంధాలున్నాయి. అందుకని మక్కా నుంచి కూడా అనేక బహుమతులు పొందాడు.
‘నవాదరూత్ అఖ్‌బార్’ ప్రకారం తైమూర్ పుత్రుడు, ‘షాహ్‌రూఖ్’ జైనులాబిదీన్‌కు ఏనుగులను బహుకరించాడు. విలువైన రత్నాలను పంపించాడు. ఆ బహుమతులను చూసి జైనులాబిదీన్ సంతోషించాడు. ప్రతిగా బహుమతులు పంపుతూ, ‘ఏనుగులు, రత్నాల బదులు విద్వాంసులను, పుస్తకాలను పంపితే ఇంకా సంతోషించేవాడిని’ అన్న సందేశాన్ని పంపాడు.
ఈ విషయం శ్రీవరుడు రాయలేదు. కానీ ఈ విషయం విజ్ఞానార్జన, విజ్ఞాన విస్తరణ పట్ల జైనులాబిదీన్ ఆసక్తిని ప్రస్ఫుటం చేస్తుంది.
ఎన్ని బహుమతులు అందినా, ఇంకా విలువైన బహుమతుల కోసం అర్రులు సాచే సుల్తానులు తెలుసు. కానీ, అవి కాక, పుస్తకాలు, విద్వాంసులను బహుమతులుగా ఆశించే సుల్తాన్ జైనులాబిదీన్ లాంటి వాటిని ఎక్కడా చూడలేదు. జైనులాబిదీన్ ముందు అక్బర్ తేలిపోతాడు. అక్బర్, ఇస్లాం, భారతీయ ధర్మాలకు ప్రత్యామ్నాయంగా ‘దీన్-ఎ-ఇలాహీ’ని నిలపటం ద్వారా సమన్వయం సాధించాలని ప్రయత్నించాడు. కానీ జైనులాబిదీన్ ఇస్లాం నియమాలను పాటిస్తూ, ఇస్లామీయులను సంతృప్తిపరుస్తూ, భారతీయ ధర్మానుయాయులను సైతం సమానంగా ఆదరించాడు. ఎక్కడ విజ్ఞానం ఉన్నా, పాండిత్యం ఉన్నా, తేనెటీగలా వారి నుంచి విజ్ఞానార్జన చేశాడు. ఇలాంటి మరో సుల్తాన్‌ను చరిత్ర ఎరుగదు.
అనల్పాః శిల్పినః కల్పవృక్ష కల్పమముం న కే।
భుంగాం ఇవాయయుర్జూరాచ్ఛిల్పకల్పతకల్పనాః॥
(శ్రీవర రాజతరంగిణి, షష్ట సర్గ, 27)
కల్పవృక్షం లాంటి రాజు దగ్గరకు తేనెటీగల్లా దూరదూర దేశాల నుంచి సుందర శిల్ప రచన చేసేవారు వచ్చి చేరారు. అలా రాని శిల్పులెవరు?
ఈ శ్లోకంలో శ్రీవరుడు పదాలతో ఆడుకున్న విధానం గొప్పగా ఉంటుంది.
కశ్మీరికా అధాభ్యాస్య తురీవేమాది చాతురీమ్।
కౌశీయకం వయన్త్యర్య బహుమూల్యం మనోహరమ్॥
(శ్రీవర రాజతరంగిణి, షష్ట సర్గ, 28)
ఈనాడు కశ్మీరీయులు ‘తురీ-వేమ’ ఉపయోగంలో నిష్ణాతులయి అత్యంత కౌశలంతో మనోహరమైన వస్త్రాలను నేస్తున్నారు.
ఇక్కడ కాస్త వివరణ అవసరం.
కశ్మీరు ఇస్లామీయుల వశం కావటంతో సామాజికంగా అల్లకల్లోలమయింది.
ఇస్లామీయులు దేశంలో అడుగుపెట్టక ముందు భారతదేశంలో సమన్వయ పూర్వకమైన పరస్పరాధారిత సువ్యవస్థితమైన సామాజిక వ్యవస్థ ప్రతిష్ఠితమై ఉంది. ఎవరికి వారు నిర్దిష్టమైన వృత్తులను ఆచరిస్తూ, సామాజికంగా పరస్పర గౌరవాభిమానాలతో జీవించేవారు. ఆనాటి వ్యవస్థలో ప్రతి ఒక్క వ్యక్తి ఆత్మవిశ్వాసంతో, ఆత్మగౌరవంతో జీవించేవాడు. అభద్రతా భావం లెదు. న్యూనతా భావం లేదు. అందరూ సమానమైన సహకార వ్యవస్థ అది.
కానీ, ఇస్లాం రాకతో ఈ వ్యవస్థ కదిలిపోయింది. వృత్తుల రూపురేఖలు మారిపోయాయి. ఇస్లాం ప్రకారం, ఇస్లామీయులు కొన్ని వృత్తులు చేపట్టకూడదు. దాంతో కొత్తగా ఇస్లాం స్వీకరించిన వారికి ‘జీవిక’ ప్రశ్నార్థకమయింది. ఇదెలాగంటే, వ్యవసాయ పనుల మీద ఆధారపడి జీవించేవాడి జీవికను యంత్రబద్ధ వ్యవసాయం ప్రమాదం లోకి నెడుతుంది. వారు జీవిక కోసం ఉన్న ఊరు వదిలి పట్నం వలస వెళ్తారు. పట్నంలో ఏం పని చేస్తారు? ఇది పల్లె నుంచి పట్నం వలస వెళ్ళే వీలున్న వారికి సంబంధించిన ఉదాహరణ. కానీ కశ్మీరం ఒకే దేశం. కశ్మీరం వదిలి ఎటూ వెళ్ళలేరు. కశ్మీరులోనే నివసించాలి. కానీ కశ్మీరంలో వారికి వృత్తి లేదు. కొత్త వృత్తిని సృష్టించనిదే జీవిక గడవదు. కానీ కొత్త వృత్తిని ఎలా సృష్టిస్తారు? కొన్ని తరాలుగా వారు తమ తమ నిర్దేశిత వృత్తులలో ప్రావీణ్యం సంపాదించారు. అది తప్ప వేరే వృత్తి నేర్చుకోవాలంటే సమయం పడుతుంది. దీన్ని ‘mental set’ అంటారు. అది తప్పించి వేరే ఆలోచన వారికి రాదు. వృత్తి అంటే అదే తప్ప, మరొకటి కాదు. దీన్ని ‘functional fixedness’ అంటారు. ఈరకమైన మానసిక ప్రతిబంధకాల వల్ల కశ్మీరులో మతం మారినవారు ఏపనీ చేయలేక పోయారు. దేశంలో అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. జైనులాబిదీన్ కన్నా ముందరి సుల్తానులు ఈ పరిస్థితిని చక్కబెట్టే బదులు, మతమార్పిళ్ళు, హింస, దోపిడీలవైపు మత సంకుచితాలవైపే దృష్టిని పెట్టారు.
ఈ రకమైన పరిస్థితిలో, వెనుకకు వెళ్ళలేక, ముందుకు నడవలేక అగమ్య గోచరమైన స్థితి సమాజంలో నెలకొంది. దాంతో జీవిక కోసం దోపిడీలు, దొంగతనాలు, హింసలు, ఆధిక్య ప్రదర్శనలు సర్వసాధారణం అయ్యాయి. జైనులాబిదీన్ ఈ పరిస్థితిని అర్థం చేసుకుని, పాలనా వ్యవస్థను సుస్థిరం చేసి, దేశంలో ప్రజలకు భద్రతను, శాంతి సౌఖ్యాలను ఇచ్చేందుకు, దేశం వదిలిపోయిన పండితులను తిరిగి కశ్మీరం రప్పించాడు. కీలకమైన బాధ్యతలను అప్పగించాడు. పాలన వారికి అలవాటు. స్థానికుల మనస్తత్వాలు వారికి తెలుసు. వారి సహాయంతో పాలనలోని అవినీతిని, అక్రమాలను, అన్యాయాలను తొలగించి, కశ్మీరు పాలనా వ్యవస్థను స్థిరపరిచాడు.
ప్రజల ‘జీవిక’ను ఏర్పాటు చేయటం అత్యంత ప్రాధాన్యం వహించే అంశం. అందుకని, ఆయన ఇస్లామీ దేశాల నుంచి పలు నిపుణులైన వృత్తి పనుల వారిని కశ్మీరు రప్పించాడు. వారి ద్వారా ప్రజలకు నూతన వృత్తులను ఏర్పాటు చేశాడు. బట్టల తయారీ, కార్పెట్ల తయారీ, శాలువల తయారీ వంటి నైపుణ్యాలను అందించాడు. దాంతో ప్రజలకు వృత్తి దొరికింది. ఆదాయ మార్గం లభించింది. జీవిక కొనసాగింది.
ఈనాటికీ కశ్మీరు ప్రజలు ఆనాడు జైనులాబిదీన్ ఏర్పాటు చేసిన వృత్తులను అనుసరిస్తూ జీవికను సాగిస్తున్నారు. వీటి తయారీకి కశ్మీరు పెట్టింది పేరయింది.
ఒకవైపు పలు నిర్మాణాలు చేపట్టాడు. దాంతో నిర్మాణ రంగలో ఉత్సాహం ఉన్నవారికి పనులు లభించాయి. దల్ సరస్సులో తేలే ద్వీపాలపై వ్యవసాయం ఆరంభించాడు. ఆ రకంగా పలువురికి జీవిక కల్పించాడు. స్థానిక కళలకు, నిర్మాణ పద్ధతులకు ఊపునిస్తూ జైనలంక, జైన కదల్, జైన్ దాబ్ వంటి నిర్మాణాలు ప్రత్యేకంగా చేపట్టాడు.
సమర్ఖండ్, బుఖురా, పర్షియా నుంచి పలువురు కళాకారులను కశ్మీరుకు ఆహ్వానించాడు. వారికి అన్ని సౌకర్యాలు కల్పించాడు. వారి ద్వారా “Stone-polishing, stone-cutting, glass-blowing, window- cutting, wood-carving, paper-making, gold and silver leaf- making, book-binding, papier-mache, and silk, shawl and carpet-weaving” [A History of Muslim Rule In Kashmir (1320-1819) By R. K. Parmu, Page 158] వంటి వృత్తులను కశ్మీరులో ప్రవేశపెట్టాడు. ఈ వృత్తులలో కశ్మీరీయులు ఎంతగా ప్రావీణ్యం సాధించారంటే, ప్రపంచవ్యాప్తంగా కశ్మీరు వీటి తయారీకి ప్రసిద్ధి పొందింది.
‘గోడలు కూలగొట్టడమే కాదు, గోడలు నిర్మించటం, ఆ గోడలు కూలగొట్టటం వల్ల నిరాశ్రయులైన వారికి ఆశ్రయం కల్పించటం రాజు కర్తవ్యం’ అన్న సూత్రాన్ని తు.చ. తప్పకుండా అమలుపరిచినవాడు జైనులాబిదీన్. ఈనాటికీ కశ్మీరులో అధికులు జైనులాబిదీన్ ఏర్పాటు చేసిన వృత్తుల వల్లనే జీవికను పొందుతున్నారన్న నిజం, జైనులాబిదీన్ గొప్పతనానికి తిరుగులేని నిదర్శనం.
జైనులాబిదీన్ మరణం సంభవించిన 75 ఏళ్ళ తర్వాత కశ్మీరులో పర్యటించిన మీర్జా దుగ్లత్ హైదర్ కశ్మీరును చూసి ఆశ్చర్యపోయాడు. “ప్రపంచంలో ఎక్కడా లభించనివి కశ్మీరులో లభిస్తున్నాయి. సమర్ఖండ్, ఖుఖురా కళాకారుల నైపుణ్యాన్ని మించిన నైపుణ్యం కశ్మీరీ కళాకారులది. ఇదంతా జైనులాబిదీన్ వరదానం” అని వ్యాఖ్యానించాడు. కశ్మీరీ శాలువలు, ఉన్ని దుస్తుల నాణ్యత గురించి తారీఖ్-ఇ-రషీదీ చెబుతుంది. కశ్మీరులో గన్‍పౌడర్ తయారీ కూడా క్రీ.శ. 1465లో జైనులాబిదీన్ ప్రవేశపెట్టాడు.
తురీ అంటే దారాలను శుభ్రపరిచే నేత కార్మికురాలు వాడే బ్రష్.
‘వేమ’ అంటే మగ్గం.
‘తురీ-వేమ’ వాడకం అంటే దారాలను శుభ్రపరిచే బ్రష్ వాడకం, మగ్గం పని.
కశ్మీరీయులు ఇతర దేశాల నుంచి వచ్చిన కళాకారుల నుంచి నేర్చుకుని నిష్ణాతులయ్యారన్న మాట.
నిజానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాలకులకు జైనులాబిదీన్ ఆదర్శం కావాలి. ప్రపంచం నిత్య చంచలశీలి. మారుతూనే ఉంటుంది. ఈ మార్పులను గమనించి, మారుతున్న జీవన శైలికి అనుగుణంగా మారేందుకు ప్రజలను సంసిద్ధంగా ఉంచాలి. స్వయంశక్తిపై కాక, ఉద్యోగాలపై ఆధారపడేవారు, ఆ ఉద్యోగం పోతే బ్రతకలేరు. కాబట్టి ప్రతి వ్యక్తీ అవసరమైతే, స్వయం శక్తిపై ఆధారపడి జీవించగల శక్తి కలవాడిగా ఎదిగే వీలు కల్పించాలి ప్రభుత్వాలు. ఒకరిపై ఆధారపడి బ్రతికేవాడి కన్నా, పదిమందికి జీవికను తానే కల్పించగలనన్న ఆత్మవిశ్వాసం కలవారిగా ప్రజలు ఎదిగేటట్టు చేయగలగాలి ప్రభుత్వాలు. ఆనాడు జైనులాబిదీన్ చేసింది అదే. వృత్తులు కోల్పోయి జీవిక ప్రమాదంలో పడ్డవారికి నైపుణ్యం అందించాడు. ఫలితంగా ఈనాటికీ స్వతంత్రంగా బ్రతకగలిగే సమాజాన్ని నెలకొల్పాడు జైనులాబిదీన్. ఈనాటికీ నాలుగు వేళ్ళు నోట్లోకి వెళ్ళే సమయంలో కశ్మీరీయులు జైనులాబిదీన్‍ను స్మరిస్తారు. అలాంటి జైనులాబిదీన్ వారసత్వంగా కల కశ్మీరు మళ్ళీ ఇన్నాళ్ళకు నూతన మార్గంలో ప్రయాణించే వీలు కల్పిస్తోంది భారత ప్రభుత్వం. ఈ ప్రయత్నాల ఫలితం భవిష్యత్తు నిర్ణయిస్తుంది. అయితే, ఆ కాలంలో లేనంత తీవ్రంగా సంకుచిత భావనలు ఈనాడు సమాజంలో నెలకొనటం ఒక విషాదం.
(ఇంకా ఉంది)