[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]
షష్టః సర్గః
రాజా డ్డుగరసోహాఖ్యో గోపాలపురవల్లభః।
గీతతాలకలావాద్యనాట్యలక్షణలక్షితమ్॥
(శ్రీవర రాజతరంగిణి, షష్ట సర్గ, 14)
సంగీత చూడామణ్యాఖ్యాం సంగీత శిరోమణిమ్।
రాజ్ఞే గీతవినోదార్థం గీతగ్రంథం వ్యసర్జయత్॥
(శ్రీవర రాజతరంగిణి, షష్ట సర్గ, 15)
గోపాలపురం రాజు డుగరసోహుడు గీతం, తాళం, కళా, వాద్యం, లాస్య లక్షణాలను వివరించే సంగీత శిరోమణి, సంగీత చూడామణి వంటి సంగీత శాస్త్ర గ్రంథాలను రాజు వినోదార్థం రాజుకు బహుకరించాడు.
శ్రీవరుడి రాజతరంగిణి చరిత్రకు సంబంధించిన అనేక విశేషాలను అందిస్తుంది. ఎందుకని చరిత్ర రచయితలు శ్రీవరుడి రాజతరంగిణిని చిన్నచూపు చూస్తున్నారో అన్నది బోధపడుతూన్నా, చరిత్రను అర్థం చేసుకోవటంలో ఎంతగానో దోహదపడే ఒక గ్రంథాన్ని అంతగా ఆదరించకపోవడం బాధాకరమైన విషయం. భారతీయులపై జరిగిన అకృత్యాలకు విస్తృత ప్రచారం ఇవ్వకూడదన్న ఆలోచన వల్ల కాబోలు జోనరాజు కానీ శ్రీవరుడి రాజతరంగిణి కానీ అంతగా ప్రచారానికి నోచుకోలేదు.
‘గోపాలపురం రాజు డుగరసోహుడు’ జైనులాబిదీన్‌కు సంగీతం పట్ల ఉన్న మక్కువను గమనించి సంగీత సంబంధిత శాస్త్ర గ్రంథాలను అతడికి బహుకరించాడు. దీనిలో ‘చరిత్ర ఏముంది?’ అనిపించవచ్చు. కానీ ‘గోపాలపురం’, ‘డుగరసోహుడు’ అన్న పదాలను విశ్లేషిస్తూ పోతే చరిత్ర కళ్ల ముందు కనిపిస్తుంది.
‘గోపాలపురం’ అన్నది కశ్మీరులోని ఓ ప్రాంతంగా భావించారు కొందరు. కానీ గోపాలపురం అంటే ప్రస్తుత ‘గ్వాలియర్’.
కశ్మీరుకు చెందిన రాణి సుగంధాదేవి తన భర్త పేరు మీద ‘గోపాలపురం’ కాశ్మీరులో నిర్మించింది. అది ప్రస్తుతం ‘హురీపూర్’ గా చలామణీ అవుతోంది. వితస్తకు దక్షిణతీరంలో వుందీ గోపాలపురం. కల్హణుడు తన రాజతరంగిణిలో ఈ గోపాలపురాన్ని వర్ణించాడు. కానీ ఈ గోపాలపురం శ్రీవరుడు వర్ణించిన గోపాలపురం అయ్యే అవకాశాలు లేవు.
గోపాలపురం రాజు డుగరసింహుడని రాశాడు శ్రీవరుడు. డుగరసింహుడన్న రాజు కశ్మీరుకు చెందినవాడు కాదు.
కల్హణుడు రాజతరంగిణిలో మరో గోపాలపురాన్ని ప్రస్తావిస్తాడు. సుస్సలుడి మరణానంతరం అతడి దహన సంస్కారాలు ఈ గోపాలపురంలో జరుగుతాయి. అతడి వర్ణనలను అనుసరించి ఈ గోపాలపురాన్ని రాజౌరీ సమీపంలోని ఓ గ్రామంగా నిర్ధారించారు. ప్రాచీన కాలంలో గ్వాలియర్‌ను గోపాలపురం అనేవారు. గోపాద్రి, గోపగిరి వంటి పేర్లు కూడా గ్వాలియర్‌కు ఉన్నాయి.
ఇక్కడ మనకు ‘తవ్వాకత్-ఎ-అక్బరీ’ అపయోగపడుతుంది. ‘తవ్వాకత్-ఎ-అక్బరీ’లో రాజా డుగరసేన్ ప్రసక్తి వస్తుంది. సుల్తాన్ జైనలాబీదీన్‌కు సంగీతం పట్ల ఆసక్తి ఉన్నదని తెలుసుకున్న డుగరసేనుడు రెండు మూడు ఉత్తమ సంగీత గ్రంథాలను రాజుకు బహుకరించాడు. శ్రీవరుడు వర్ణించిన డుగరసింహుడు, ‘తవ్వాకత్-ఎ-అక్బరీ’ వర్ణించిన డుగరసేనుడు ఒకరే. ‘తవ్వాకత్-ఎ-అక్బరీ’లో రాజు కీర్తిమిహుడు ప్రస్తావన వచ్చిన సందర్భంలో ఇతడు డుగరసేనుడి పుత్రుడని చెప్పటం కనిపిస్తుంది. దానితో డుగరసేనుడు లేక సింహుడు గ్వాలియర్‌కు చెందిన రాజు అన్నది నిర్ధారణవుతుంది.
‘సంగీత శిరోమణి’ అన్నదాని వెనుక ఒక గాథ ఉంది. జౌనుపురి సుల్తాన్ ఓ హిందు రాజ్యంపై దాడి చేశాడు. అక్కడి హిందూ రాజు యుద్ధంలో ఓడిపోయాడు. బందీ అయ్యాడు. బందీ అయిన రాజును చివరి కోరిక కోరుకోమన్నాడు సుల్తాన్. తాను సంగీత ఆధారిత గ్రంథం రచిస్తున్నాడనీ, యుద్ధం వల్ల అది ఆర్ధాంతరంగా ఆగిపోయిందనీ కాబట్టి ఓ సంగీత మండలిని ఏర్పాటు చేసి, ముఖ్యమైన సంగీత పద్ధతుల మధ్య సమన్వయం సాధించి భేదభావాలను తొలగించి సంగీత గ్రంథం రచనను పూర్తి చేసే వీలు నివ్వాలని అభ్యర్థించాడు. అందుకు సుల్తాన్ ఆమోదించాడు కానీ ఒక షరతును విధించాడు.
రాజు తన అసంపూర్ణ గ్రంథాన్ని సంగీత మండలిని ఏర్పాటు చేసి పూర్తి చేయ్యచ్చు. కాని అది జరగాలంటే రాజు తన మతం మారి ‘ఇస్లాం’ను స్వీకరించాలి. ఇస్లాం స్వీకరిస్తే అతడిని ప్రాణాలతో వదలటమే కాదు సంగీత మండలిని ఏర్పాటు చేసుకోవచ్చు. గ్రంథాన్ని పూర్తి చేయవచ్చు. సంగీత గ్రంథ రచనను సంపూర్ణం చేసేందుకు రాజు ఇస్లాం ధర్మం స్వీకరించాడు!
ఆలోచిస్తే, ఈ సంఘటన ఒక అద్భుతమైన సంఘటన అనిపిస్తుంది. భారతీయుల మనస్తత్వంలోని ఒక వైచిత్రిని ఎత్తి చూపిస్తుంది.
రాజు యుద్ధంలో ఓడిపోయాడు. అందుకు విచారం లేదు. అతడి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి, బాధ లేదు. అతడి బాధల్లా వివిధ సంగీత పద్ధతులలో ఉన్న భేదాలను తొలగించి సమన్వయం సాధించి, దేశమంతా ఒకే రకంగా పాడుకోగల ప్రామాణిక సంగీత గ్రంథాన్ని రచించాల్సిన పని అసంపూర్ణంగా మిగిలిపోయిందన్నదే. అంతే.. అందు కోసం తన ధర్మాన్ని త్యజించి పరధర్మం స్వీకరించేందుకు కూడా సిద్ధపడ్డాడు. అతడు తన ప్రాణాలను కాపాడమని సుల్తాన్‌ను అభ్యర్ధించలేదు. సంగీత గ్రంథం పూర్తి చేసేందుకే తన ప్రాణాలు నిలవాలని కోరుకున్నాడు. అతిడికి తన ధర్మం పోయినా ఫరవాలేదు. సంగీత గ్రంథ రచన పూర్తి అవ్వాలి. ఎలాంటి మనుషులు వాళ్లు? ఎలాంటి తపన అది? ఇలా ఎంతమంది తమ ధర్మాన్ని త్యజించి మరీ శాస్త్ర గ్రంథాల రచన కావించారు? చరిత్రలో ఇలాంటి రాజుల గాథలు కోకొల్లలు. మనం వాటిని ప్రస్తావించకోం అంతే.
ఇక్కడ గమనించాల్సిన మరో అంశం ఏమిటంటే తమ మతాన్ని విస్తరించే విషయంలో సుల్తాన్‌లు స్పష్టంగానే ఉన్నారు. సిరాజ్–ఉద్–దౌలా సంస్థానంలో ఓ సంగీత విద్వాంసుడు, సిరాజ్-ఉద్-దౌలా యుద్ధంలో ఓడిపోవటంతో ప్రాణాలు అరచేత పట్టుకుని కలకత్తా వైపు పారిపోయాడు. గెలిచిన ఇంగ్లీష్ సేనలు అతణ్ని వెంబడించాయి. దాంతో అతడు దారిలోని ఓ రాజ్యంలో నవాబ్ ఆశ్రయం కోరాడు. ఆ పండితుడి ప్రాణాలు, కుటుంబం ప్రాణాలకు అభయం ఇచ్చాడు ఆ నవాబు. కానీ అందుకు మతం మారటం తప్పనిసరి అన్నాడు. అలా సంగీత విద్వాంసుడి కుటుంబం మొత్తం మతం మారిపోయింది. అలా మతం మారిన కుటుంబం తరువాతి తరాల వాడే అల్లాఉద్దీన్ ఖాన్. అన్నపూర్ణాదేవి, అలీ అక్బర్ ఖాన్ అతని సంతానం. పండిత రవిశంకర్ అతని శిష్యుడు. ఇప్పుడీ మత మార్పిళ్లను బలవంతపు మత మార్పిళ్లంటామా? స్వచ్ఛంద మత మార్పిళ్లంటామా? కారణం ఏదైనా మత మార్పిడి సంభవించింది. చరిత్ర గురించి ఏ మాత్రం అవగాహన, అధ్యయనం లేని వారు మాత్రం ‘అగ్రవర్ణాల దాష్టికం’ భరించలేక అంటరాని వారు మూకుమ్మడిగా ఎలాంటి భేదభావాలు లేని ఇస్లాంను స్వచ్ఛందంగా స్వీకరించారన్న ఆలోచనను ప్రచారం చేస్తారు.
మతం మారగానే ఆ సుల్తాన్, రాజుకు అతని రాజ్యం తిరిగి ఇచ్చాడు. రాజు పండిత సభను ఏర్పాటు చేశాడు. సంగీత శిరోమణి గ్రంథ రచన పూర్తి చేశాడు. ఈ సంగీత శిరోమణి గ్రంథం ఏ ఒక్క వ్యక్తి రచించినది కాదు. ఆ గ్రంథ రచయితగా ‘పండిత మండలి’ అన్న పేరుంటుంది. దురదృష్టం ఏమిటంటే, మతం మారి మరీ పూర్తి చేసిన ఆ గ్రంథం ఇప్పుడు అలభ్యం. వారణాసి లైబ్రరీలో కొన్ని అధ్యాయాలున్నాయని అంటారు. ఈ గ్రంథాన్ని గ్వాలియర్ రాజు జైనులాబిదీన్‌కు బహుకరించాడు.
‘తవ్వాకత్-ఎ-అక్బరీ’ ప్రకారం జైనులాబిదీన్ సంగీత విద్వాంసులను సత్కరించటం, వారికి దానాలు చేయటం చేసేవాడు. అందుకని దేశ విదేశాల నుంచి సంగీత విద్వాంసులు జైనులాబిదీన్ రాజ్యనికి వచ్చేవారు. విద్యను ప్రదర్శించి బహుమతులు పొందేవారు. సన్మానాలు అందుకునేవారు. ‘తవ్వాకత్-ఎ-అక్బరీ’ ప్రకారం ‘సంగీత శిరోమణి’ జైనులాబిదీన్ బిరుదు. కాబట్టి శ్రీవరుడు ప్రస్తావించిన సంగీత శిరోమణి మరేదో గ్రంథం పేరు అనుకోవచ్చు.
చాళుక్య రాజు జగదేకమల్లు బిరుదు కూడా సంగీత చూడామణి. ఇతని రాజధాని ‘కల్యాణ్’. ఈయన ‘సంగీత చూడామణి’ అనే బృహద్గ్రంథం రచించాడు. ఈ గ్రంథానివి కూడా కొన్ని అధ్యాయాలే లభిస్తున్నాయి. ఇలా చరిత్రలో తవ్వుకుంటూ పోతే, లభ్యమవుతున్న రచనలకన్నా అలభ్యం, అదృశ్యం అయిన రచనలే అధికంగా కనిపిస్తాయి. దీన్ని బట్టి చూస్తే, మన ఎంత చరిత్ర అంధకారంలోకి అదృశ్యం అయిందో అనిపిస్తుంది.
తస్మిన్ రాజ్ఞి దివం యాతే కీర్తిసింహో మహీపతిః।
తత్పుత్రః పితృవత్ ప్రీతిమరక్షత్ ప్రహితోపదః॥
(శ్రీవర రాజతరంగిణి, షష్ట సర్గ, 16)
ఆ రాజు మరణం తరువాత అతని కొడుకు రాజు కీర్తిసింహ, బహమతిని పంపి తండ్రి ఉన్నప్పుడు ఎలాంటి సంబంధం ఉండేదో అలాంటి ప్రేమ పూర్వక సంబంధాన్ని కొనసాగించాడు. ‘తవ్వాకత్-ఎ-అక్బరీ’ ప్రకారం బహుమతులు అందించిన తరువాత సుల్తాన్ తిరిగి గ్వాలియర్ వెళ్తూంటే అతనిపై ‘భదోరియా’ సమూహం దాడి చేసి దోచుకున్నారు. దీని ప్రకారం కూడా గోపాలపురం ‘గ్వాలియర్’ అని తెలుస్తుంది.
మండలీకాధిపో రాజా సురాష్ట్ర నగరాధిప।
ప్రాహిణోన్నృపతేః ప్రీత్యా లలామ కమనీయకమ్॥
(శ్రీవర రాజతరంగిణి, షష్ట సర్గ, 17)
చిత్రవర్ణమాల సత్రక్ష లక్ష్య శోభాన్ మహీపతేః।
పక్షిణో ముచుకున్దాఖ్యాన్ హిణోదక్షిసుందరాన్॥
(శ్రీవర రాజతరంగిణి, షష్ట సర్గ, 18)
మండలాధిపతి, సురాష్ట్ర నరాధిపతి రాజు కోసం ప్రేమతో ఒక అందమైన శ్రేష్ఠమైన అశ్వాన్ని, చిత్రవర్ణాలతో సుందరమైన, అందమైన నయనాలు కల ముచుకుంద పక్షిని రాజుకు బహుమతులుగా పంపాడు.
మండలీకాధిపతిని సుబేదార్ అంటారు. మండలిక శబ్దం ఢిల్లీ సుల్తానుల ప్రకారం ‘గుజరాత్ రాజు’ అన్నఅర్థం ఇస్తుంది.
‘సౌరాష్ట్ర’ అర్థం విషయంలో ఎలాంటి సందేహం లేదు. గుజరాత్ లోని ‘కచ్’ ప్రాంతానికి చెందిన అశ్వాలు సుప్రసిద్ధం. ‘తవ్వాకత్-ఎ-అక్బరీ’ ప్రకారం గుజరాత్ సుల్తాన్ ‘మహమద్ గురాతీ’ రాజుకు అశ్వాన్ని పంపాడు. కానీ ఆ కాలంలో గుజరాత్ సుల్తాన్ మహమద్ షాహ వైనారీ పుత్రుడు కరీమ్ షాహ అని ‘ఐన్-ఎ-అక్బరీ’ ద్వారా తెలుస్తుంది. ఏది ఏమైనా కశ్మీర్ సుల్తాన్‌కు అటు గ్వాలియర్ నుంచి ఇటు సౌరాష్ట్ర నుంచీ బహుమతులు అందాయి. దీన్ని బట్టి ఆ కాలంలో జైనులాబిదీన్ ఖ్యాతి దేశమంతా ఎలా వ్యాపించిందో తెలుసుకోవచ్చు.
జిఘాంసయా చరణ్ సోపి భూపతేః ప్రాకృతౌర్గుణైః।
బద్ధో హింసోపి ఢిల్లీశో వల్లూకో బల్లకోపమః॥
(శ్రీవర రాజతరంగిణి, షష్ట సర్గ, 19)
ఢిల్లీ రాజు వల్లూకుడు, స్వభావ సిద్ధంగా రక్తపిపాసి, విధ్వంసక ప్రీతి కలవాడు అయినా సరే, కశ్మీర్ రాజు దగ్గర పిరికి మేకలాంటి వాడు. అంటే అంతటి క్రూరుడు కూడా జైనులాబిదీన్‌కు దాసుడన్నమాట.
‘వల్లూకుడు’ ఎవరన్న ప్రశ్న వస్తుంది. ఆ కాలంలో ఢిల్లీ సుల్తానుల పాలనలో ఉంది. పైగా రక్త పిపాసి, విధ్వంసకారుడు అంటున్నాడు శ్రీవరుడు. ‘ఐన్-ఎ -అక్బరీ’ ప్రకారం ఢిల్లీ సుల్తాన్ ఇబ్రహీం లోడీకి జైనులాబిదీన్‌కు స్నేహం. ‘తవ్వాకత్-ఎ-అక్బరీ’ ప్రకారం ఢిల్లీ సుల్తాన్ ఇబ్రహీం లోడీ, కశ్మీరు సుల్తాన్ జైనులాబిదీన్‌కు అత్యుత్తమ బహుమతులను పంపాడు. దీన్ని బట్టి, బల్లూకుడు ఎవరో కాదు ‘ఇబ్రహీమ్ లోడీ’ అని తెలుస్తుంది.
ఇబ్రహీం లోడీని శ్రీవరుడు రక్త పిపాసి, విధ్వంసకారుడు అనటంలో ఆశ్చర్యం లేదు. ఇబ్రహీం లోడి అధికారంలోకి వస్తూనే సోదరుడు జలాల్ అడ్డు తొలగించుకోవలని ప్రయత్నించాడు. ఇద్దరి నడుమ అధికారం కోసం పోరు జోరుగా సాగింది. ఇబ్రహీం లోడీ సోదరుడిని వెంబడించాడు. చివరికి సోదరుడిని చంపించే వరకూ నిద్రపోలేదు. సోదరుడి విప్లవం సాకుగా తీసుకుని, ఆ కాలంలోని శక్తిమంతులందరినీ చంపించాడు. మారణహోమం సృష్టించాడు. గ్వాలియర్ పై దాడి చేశాడు. గ్వాలియర్ రాజు, ఇబ్రహీం లోడి సోదరుడికి ఆశ్రయం ఇచ్చాడు. గ్వాలియర్ రాజును ఓడించి ధ్వంసం చేశాక, మేవార్ వైపు దృష్టి మళ్లించాడు ఇబ్రహీం లోడి. కానీ మేవార్ ‘రాణాసంగ’ ముందు లోడి సేనలు నిలవలేక పోయాయి. ఆ తరువాత ఇబ్రహీం లోడి తనను వ్యతిరేకిస్తారన్న వారిని అణచి వేయటం, జైళ్లలో పెట్టటం, చంపటం చేశాడు. చివరికి తననెదిరించిన వారితో జరిగిన యుద్ధంలో 10,000 మందికి పైగా ఊచకోత కోశాడు. ఎదిరించిన ప్రతివాడినీ క్రూరంగా చంపించాడు. ఇబ్రహీం లోడి హింసను వ్యతిరేకించి పంజాబ్ ప్రతినిధి దౌలత్ ఖాన్ లోడి ‘బాబర్’తో చేతులు కలిపాడు. ఫలితంగా మొదటి పానిపట్టు యుద్ధం జరిగింది. బాబర్ విజేతగా నిలిచాడు. ఆ ఇబ్రహీం లోడినే శ్రీవరుడు ఢిల్లీ షాహ వల్లూకుడన్నాడు.
శ్రీవరుడి రాజతరంగిణి చదువుతుంటే కశ్మీరు ఏనాడూ భారత్‌తో సంబంధాలు లేకుండా లేదన్నది స్పష్టమవుతుంది. దేశలోని పలు ప్రాంతాల నుండి జైనులాబిదీన్‌కు బహుమతులు అందుతుండటం ఇది నిరూపిస్తుంది. ఎక్కడెక్కడి వారు, ఎవరెవరు ఏయే బహుమతులిస్తున్నారో చెప్పటమే కాదు, వారి సుగుణాలను వర్ణిస్తూ శ్రీవరుడు కశ్మీరు చరిత్రను సజీవంగా అందించటమే వల్ల ఆ కాలంలో వారు ఎంత జాగ్రత్తగా, సూక్ష్మంగా చరిత్ర గతిని గమనిస్తుండేవారో కూడా తెలుస్తుంది. మిగతా రాజులందరి గురించీ మామూలుగా రాసిన శ్రీవరుడు, ఇబ్రహీం లోడీ ప్రసక్తి రాగానే రక్త పిపాసి, విధ్వంసకారుడు అనటమే కాదు జైనులాబిదీన్ దగ్గర అంతటి హింసాత్ముడు కూడా కట్టేసిన మేకలా ఉండేవాడని చెప్పటం అనాటి రాజకీయాల్లో జైనులాబిదీన్ ప్రాధాన్యాన్ని స్పష్టం చేస్తుంది. చరిత్ర రచయితల దృష్టి అధికంగా ఢిల్లీలో జరిగే పరిణామాలపై కేంద్రీకృతమవటం వల్ల ఒక గొప్ప సుల్తాన్ జైనులాబిదీన్ మరుగునపడటం కూడా తెలుస్తుంది.
(ఇంకా ఉంది)