[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]
షష్టః సర్గః
తతః క్రమసరస్తుల్యం రాజా పద్మపురాన్తరే।
తత్కౌతుకాపనోదాయ చక్రే జైనసరో నవమ్॥
(శ్రీవర రాజతరంగిణి, షష్ట సర్గ, 1)
క్రమసర సరస్సు రాజుకు ఎంతగా నచ్చిందంటే, పద్మపురలో క్రమసర లాంటి నూతన సరస్సును నిర్మించాడు. దాన్ని ‘జైన సరస్సు’ అన్నాడు.
‘క్రమసర’ను ప్రస్తుతం ‘కౌసర్‌నాగ్’ అంటున్నారు. పద్మపుర ప్రస్తుతం పాంపోర్.
‘జైనసర’ మాత్రం ఎక్కడ ఉందో తెలియలేదు. పాంపర్ పరిసర ప్రాంతాలలో ఎంతగా అన్వేషించినా ‘జైనసర’ ఆనవాళ్ళు లభించలేదు.
ఫుల్లత్ కుంకమపుష్పైఘశ్యామీభూతస్థాలచ్ఛలాత్।
శారదీవాగతా ప్రీత్యా యమునా యత్సరోవరమ్॥
(శ్రీవర రాజతరంగిణి, షష్ట సర్గ, 2)
శరత్కాలంలో విరబూసిన కుంకుమ పుష్పాలతో నిండిన ఆ ప్రాంతం, యమునానది నల్లటి నీటితో నిండి, ఆ ప్రాంతానికి యమున ప్రేమగా వచ్చిందన్న భావనను కలిగించింది.
కులోద్ధరణ నాగాఖ్యమండితే యత్తటే నవమ్।
రాజద్రాజగృహం రాజా రాజరాజోపమో వ్యధాత్॥
(శ్రీవర రాజతరంగిణి, షష్ట సర్గ, 3)
కుబేరుడితో సమానమైన ఐశ్వర్యం కల రాజు కులోద్ధరణ అనే నాగు ఉండే ఆ సరస్సు ఒడ్డున ఒక భవ్యమైన రాజగృహం నిర్మించాడు.
‘కులోద్ధరణ నాగు’ అని ఆ భవనానికి పేరు పెట్టాడని జె. సి. దత్ ఈ శ్లోకాన్ని అనువదించారు. కానీ భవంతికి ‘కులోద్ధరణ నాగు’ అని పేరు పెట్టటం ఔచితీరహితంగా అనిపించింది.
కశ్మీరులో సరస్సులన్నీ ఏదో ఒక నాగుకు నివాసంగా ఉండి, ఆ నాగు పేరుతో ప్రసిద్ధి పొందాయి. ఆ సంప్రదాయాన్ని అనుసరిస్తూ, జైనసరస్సులో కూడా ఓ నాగు ఉండేదని దాన్ని’కులోద్ధరణ నాగు’గా భావించేవారు అనటం ఔచితీమంతంగా అనిపిస్తుంది.
ఉచ్చైః పదస్థమమలం రుచిరజ్జితాశం
సంపూర్ణ మందల మఖండ కలాకలాపమ్।
రాజానమీశామర లోక్య హతో పతాపం
కాంక్షన్తికేన నితశామపి దూర సంస్థాః॥
(శ్రీవర రాజతరంగిణి, షష్ట సర్గ, 4)
ఆకాశంలోని చంద్రుడిలా ఉచ్చస్థానంలో ఉన్నవాడైన రాజు చంద్రుడిలా జ్ఞానవంతుడూ, ఉత్తముడు. ఎలాంటి లోపం లేని జ్ఞానవంతుడైన అతని రాజ్యంలో లోటన్నది లేదు. ప్రజల దుఃఖాన్ని నశింపచేయగల శక్తివంతుడు రాజు. అలాంటి రాజుకు సేవ చేయాలని, ఆ రాజు దగ్గర పని చేయాలని, ఎంతటి దూరంలో ఉన్న వారయినా తపించటంలో ఆశ్చర్యం ఉందా?
దిగంతరియా భూపాహాః శృత్యైవద్ గుణగౌరవమ్।
నానోపాయన వర్షై దై ర్వవర్షర్నీతరామముమ్॥
(శ్రీవర రాజతరంగిణి, షష్ట సర్గ, 5)
దూరదూర ప్రాంతాల రాజులు కూడా కశ్మీర రాజు గొప్పతనం విని ఆయన పై అనుగ్రహ వృష్టి కురిపించారు. అంటే ఆయనతో స్నేహానికి అర్రులు సాచారన్నమాట.
వేగేన జితవాయుం స్వం తాడికాఖ్యం తురంగమమ్।
ఉపదాం వ్యసృజత్ సఖ్యాదుంచం పద్మానదప్రభుః॥
(శ్రీవర రాజతరంగిణి, షష్ట సర్గ, 6)
‘పంచనద’ రాజు, కశ్మీర రాజుతో స్నేహాన్ని పురస్కరించుకుని వాయు వేగంతో ప్రయాణించే ‘తాజిక్’ అనే అశ్వాన్ని బహుకరించాడు.
‘పంచనద’ దేశం అంటే అయిదు నదులనున్న దేశం ‘పంజాబ్’. పూర్వ కాలంలో, ప్రస్తుతం ‘పంజాబ్’ గా పరిగణకు గురవుతున్న భూభాగాన్ని (అఖండ భారత్ లోని పంజాబ్) ‘పంచనద’ రాజ్యం అనేవారు. మహాభారతంలో నకులుడు పశ్చిమ దిగ్విజయ యాత్ర సమయంలో పంచనద రాజ్యాన్ని గెలిచాడు.
జైనులాబిదీన్ కాలంలో పంజాబ్‌ను అయిదు భాగాలుగా విభజించి అయుదుగురు సుబేదార్లు పాలిస్తుండేవారు. లాహోర్‌ను దౌలత్ ఖాన్ లాదీ, ముల్తాన్‌ను రాయ సకరా లధా, హుమ్న్ ఖాన్ లధా; దిపాల్పుర్ను తాలార్ ఖాన్, ‘మునమ్’ను బహలోల్ లోదీ, సిర్హింద్ను బషలోల్ లోదీ పాలిస్తుండేవారు. వారిలో ఏ రాజును శ్రీవరుడు ‘పంచనద దేశ రాజు’ అన్నాడో స్పష్టంగా తెలియదు.
కానీ వీరిలో ఎవరో జైనులాబిదీన్కు ‘తాజిక్’ అనే గుర్రాన్ని బహుమతిగా ఇచ్చారు.
‘తాజిక్’ అన్నది అరబ్బీ శబ్దం. ఆ కాలంలో అరబ్బు అశ్వాలను బహు శ్రేష్టమైనవిగా భావించేవారు.
ఆరంభంలో అరబ్బు ముసల్మానులను ‘తాజిక్’లనే అనేవారు. మధ్య ఆసియా పై తుర్కులు అధికారం సాధించినపుడు ఇరాన్ వారు వీరిని కూడా ‘తాజిక్’ అనటం ప్రారంభించారు.
కొన్నాళ్లకు ఇరానీ ముసల్మానులను కూడా తాజిక్ లనటం ప్రారంభించారు. తుర్కుల గుర్రాలకన్నా అరబ్బుల అశ్వాలను శ్రేష్టమైనవిగా భావిస్తారు. ‘తాజిక్’ అన్న పేరు చూసి ‘తజికిస్తాన్’కు చెందిందిగా భావించకూడడు.
కింకరో అశ్వముఖః ఖ్యాతః కంఠాన్నృత్యం న వేత్త్య సౌ।
ఇతీవ నాట్యం యో దర్పాద్ వరారూఢో కరోత్ పథి॥
(శ్రీవర రాజతరంగిణి, షష్ట సర్గ, 7)
అశ్వముఖుడైన కిన్నరుడు అత్యద్భుతమైన గానానికి ప్రసిద్ధి పొందాడు. కానీ అతడు నృత్యం చేయలేడు. ఇది గ్రహించినట్టు, రాజు అశ్వం, రాజు తనను అధిరోహించనపుడు మార్గంలో నృత్యం చేసేది.
ప్రవాల హస్తః సద్రశ్మిః సుఖలీనః సులక్షణః।
యథాసావహమిత్థం యో నాసహిస్టాస్య తాడనమ్॥
(శ్రీవర రాజతరంగిణి, షష్ట సర్గ, 8)
రాజుకు ఉన్న ఉత్తమ లక్షణాలు తనకూ ఉన్నాయి అనుకుంటుంది కాబట్టి, ఎలాంటి ప్రేరణ అవసరం లేకుండా అశ్వం సంతోషంతో వేగంగా పరుగిడేది.
ఈ శ్లోకం గమ్మత్తయినది.
అశ్వం ఆత్మభిమానం కలది. పలు విషయాల్లో రాజంత స్థాయి తనది అనుకుంది అశ్వం. కాబట్టి ఎలాంటి దూషణను కానీ విమర్శను కానీ భరించలేదు. అసలు ఆ అవసరం రాకుండా రాజు హృదయం గ్రహించి సంతోషంగా పరుగులిడేది అశ్వం.
ఇక్కడ రాజుకు అశ్వానికి పోలికలను శ్రీవరుడు చెప్పిన విధానం గమ్మత్తనిపిస్తుంది.
ప్రవాళ హస్త, సద్రశ్మ, సుఖలీన, సులక్షణ.
అశ్వం జూలు రాజు హస్తంలాగే ప్రవాళం లాంటిది. ప్రవాళ అంటే అయిదు గ్రహాలు, అయిదు పంచ భూతాలకు ప్రతీక. ఆ అయిదు గ్రహాలు మంగళ, బుధ, బృహస్పతి, శుక్ర, శని. పంచ గ్రహాల ప్రతీకగా పంచరత్నాలుంటాయి. రాజు చేయి ఎలాంటిదో అశ్వం జూలు అలాంటిదట. ప్రవాళం అంటే నవరత్నాలలో ఒకటయిన పగడం. కానీ అశ్వం జూలు అలాంటిదట. కానీ రాజు చేయి పగడం లాంటిది. గుర్రం జూలు పగడం లాంటిది అంటే అన్వయం కుదరదు.
అయితే ‘ప్రవాళం హస్తం’ అనేసరికి అర్థం మారుతుంది. ‘హస్తం’ బుధుడి సమానం. అశ్వం జూలు రాజు చేతిలో పగడంలో ఉంది అన్న అర్థం వస్తుంది. హస్తానికి అయిదు వేళ్లంటాయి. రాజు చేతిలో ప్రవాళం అంటే పంచరత్నాలు, పంచ గ్రహాలు ఉన్నట్టు. అంటే, ఆ అశ్వం జూలును రాజు పట్టుకుంటే అతని చేతిలో పంచ గ్రహాలు, పంచరత్నాలు ఉన్నటన్నమాట.
సద్రశ్మి అంటే గురుగ్రహం. గురుగ్రహాన్ని పసుపు రంగుతో సూచిస్తారు. విష్ణువు పీతాంబరుడు.. పీతవర్ణం శుభసూచకం.
‘సుఖలీన’ శుక్రగ్రహాన్ని సుచిస్తుంది. శుక్ర గ్రహాన్ని ‘గులాబీ’ రంగు ప్రతీకతో సుచిస్తారు. శుక్రుడు ప్రేమ, అందం, విలాసం, సామరస్యాన్ని సూచిస్తాడు.
‘సులక్షణ’ అందరికన్నా అందమయిన శని గ్రహాన్ని సూచిస్తుంది.
ఎలాగయితే రాజు అన్ని గ్రహాలు, నక్షత్రాల లక్షణాల కలవాడో, అలాగే తానూ అన్ని లక్షణాలను కలదన్నది గుర్రం అనుకుంటోంది. అందుకనే రాజు నుంచి చిన్న హెచ్చరికను, సూచనను కూడా భరించలేదన్న మాట.
పాదైశ్చతుర్భిః శుభ్రో యో ముఖమద్ధేన చావహత్।
కల్యాణ పంచక ఖ్యాతిం కల్యాణాభరణోజ్జ్వలః॥
(శ్రీవర రాజతరంగిణి, షష్ట సర్గ, 9)
ఆ అశ్వం నాలుగు కాళ్లు, దాని నోరు బంగారంతో అలంకృతమయ్యాయి. అందుకే అది పంచకల్యాణి అన్న పేరుతో ప్రసిద్ధమయింది.
పంచకల్యాణి అశ్వాన్ని సుఖప్రదము, శుభప్రదముగా భవిస్తారు. ఇది శ్రేష్ఠమైన అశ్వం. సాధారణంగా అయిదు లక్షణాలు కల అశ్వాన్ని ‘పంచకల్యాణి’ అంటారు.
అశ్వం నాలుగు కాళ్లు తెల్లగా ఉండాలి. ముఖం మీద తెల్లటి మచ్చ ఉండాలి. తోక తెల్లటి వెంట్రుకలతో ఉండాలి. దాని వీపు తెల్లగా ఉండాలి. దాన జూలు తెల్లగా ఉండాలి. అలాంటి అశ్వాన్ని పంచకల్యాణి అంటారు. అంతటి ఉత్తమమైనది, శ్రేష్ఠమైనది అన్నమాట రాజుకి బహుమతిగా లభించిన అశ్వం.
మాండవ్య గౌడభూమీశః ఖలభ్యో యో మహీపతిః।
అతూతుషద్ దరన్దామనామహస్త్రై రూపాహితైః॥
(శ్రీవర రాజతరంగిణి, షష్ట సర్గ, 10)
‘మాండవ్య’, గౌడ భూమిల రాజు ఖలుభ్య, రాజు కోసం దరందామ అనే వస్త్రాన్ని బహుమతిగా పంపాడు. అది రాజును సంతృప్తిపరచింది.
మాండవ్య రాజ్యం అంటే మాల్వా. గౌడభూమి అంటే బెంగాల్. ఆ కాలంలో ఈ ప్రాంతాలు తురక రాజుల ఆధీనంలో ఉండేవి. మాలవ రాజు సుల్తాన్ మహమద్. బెంగాల్ సుల్తాన్ రుక్నుద్దీన్. ఈ ‘ఖలభ్య’ ఎవరో పాలనో తెలియదు. అలాగే ‘దరుందామ’ అనే వస్త్రం ఏమిటో ఎలాంటిదో కూడా తెలియదు. మరెవరూ ఈ రకమైన వస్త్రం ప్రస్తావన తేలేదు. బహుశా ఆ కాలానికి చెందిన ప్రత్యకమైన వస్త్రమేమో ఇది అనుకుంటున్నారు.
ఇతో హ్యస్మై నృపో భక్యం కావ్యం కృత్యా స్వభాషయా।
ప్రాణినోద్ ద్రవ్యసంయుక్తం సవ్యసాచ్యాగ్రజోపమః॥
(శ్రీవర రాజతరంగిణి, షష్ట సర్గ, 11)
ఇక్కడ రాజు కూడా తన భాషలో చక్కటి, సుందరమైన కావ్యాన్ని రచించి బహుమతిగా పంపాడు.
ఈ శ్లోకాన్ని బట్టి జైనులబిదీన్ కవి కూడా అని తెలుస్తుంది. జైనులాబిదీన్ కావ్యాలు రచించిన ప్రస్తావనలు కానీ, ప్రస్తుతం ఆయన రచనలేవీ లభ్యం కావటం లేదు.
సోప్పనద్ధైః పదార్దేర్న తథా తుష్టో మహీపతిః।
సాలంకారైర్యథా భూపకావ్యస్యాతి మనోహరేః॥
(శ్రీవర రాజతరంగిణి, షష్ట సర్గ, 12)
ఈ కావ్యం బహుమతిగా అందుకున్న రాజు కావ్యంతో పాటు పంపిన అతి విలువైన బహుమతుల కన్నా కావ్యం వల్లనే అత్యంత సంతుష్టుడయాడు. కావ్యాన్ని అత్యంత మనోహరంగా భావించాడు.
వస్త్రం నారీమరాజరాఖ్యాం కుంభారానో విసర్జయన్।
అహరదేధృది తద్దేశానారీకుంజరకౌతుకమ్॥
(శ్రీవర రాజతరంగిణి, షష్ట సర్గ, 13)
‘నారీ కుంజరం’ అనే వస్త్రాన్ని కానుకగా పంపి రాణాకుంభ ఆ దేశంలోని ఉత్తమ స్త్రీల హృదయంలోని కుతూహలం దూరం చేశాడు.
రాణాకుంభ, మేవాద్కు చెందిన రాజపుత్ర రాజు. సిసోడియా వంశానికి చెందినవాడు. ఈయన తన జీవితంలో 56 యుద్ధాలలో పాల్గొన్నాడు. ఒక్క యుద్ధంలో కూడా పరాజయం అన్నది ఎరగడు. యాభై ఏళ్ళు రాజ్యం చేసిన రాణాకుంభ మేవార్ సరిహద్దులను దృషద్వతి వరకూ విస్తరింప చేశాడు. చిత్తోర్ విజయస్థంభం ఈయన నిర్మించిందే. ఈయన మాల్వా రాజు మహామూద్ను పలుమార్లు ఓడించాడు. దాదాపుగా ఆరు నెలలు మహామూద్ మేవాద్లో బందీగా ఉన్నాడు . రాణాకుంభ సంగీతంపై ‘సంగీతరాజ్’ అనే గ్రంథం రాశాడు. గీతగోవిందం పై ఈయన రాసిన వ్యాఖ్య ‘రసిక ప్రియ’ అత్యంత ప్రఖ్యాతి పొందింది. ఈయన జైనులాబిదీన్కు పంపిన ‘నారీ కుంజర’ వస్త్రం ఏమిటో కూడా తెలియటం లేదు. కొందరు అది ‘కుంజర్’ కాదు ‘చందర్’ అని అంటారు. ‘చందర్’ అనేది వివాహ సమయంలో రాజస్తాన్ స్త్రీలు ధరించే ఎర్రటి వస్త్రం.
(ఇంకా ఉంది)