[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]
పంచమ సర్గః
దృష్ట్వా సరోన్తరే శ్వేతా హిమాన్యో భ్రమణాకులాః।
తీర్థస్నానాప్త కైలాస్ శృంగభంగిభ్రమం వ్యధుః॥
(శ్రీవర రాజతరంగిణి, పంచమ సర్గ, 103)
సరోవరంలో అటు ఇటు కదులుతూ కనిపిస్తున్న మంచు ముక్కలను చూసి ప్రజలు, తీర్థస్నానం కోసం కైలాస శృంగం ఆ సరోవరానికి వచ్చిందన్న భ్రమను అనుభవించారు.
గమ్మత్తయిన వర్ణన.
ఆ సరస్సులో శ్రీవరుడు, సుల్తాన్ నౌకా విహారం చేస్తున్నారు. జయదేవుడి గీతగోవిందం గీతాలు గానం చేస్తున్నారు. వారి గానానికి దేవతలు పుష్పవర్షం కురిసినట్టు మంచు కురిసింది. ఆ కురిసిన మంచు గెడ్డలు నీటి పై తేలియాడతుంటే, తీర్థస్నానం చేసి పవిత్రమయ్యేందుకు కైలాస శిఖరం వచ్చి సరస్సులో మునిగిన భ్రమ కలుగుతోంది.
Icebergs గురించి మనకు తెలుసు. పైకి కనిపించే మంచు శిఖరం క్రింద దాగున్న పెద్ద పర్వతానికి సూచన. ఇక్కడ కూడా మంచు కురవటం వల్ల మంచు ముద్దలు శిఖరాల్లా పైకి తేలుతున్నాయి. అందుకని కైలాస శృంగం స్నానం కోసం వచ్చినట్టుందంటున్నాడు శ్రీవరుడు.
కల్హణ రాజతరంగిణి, జోనరాజ రాజతరంగిణి, శ్రీవరుడి రాజతరంగిణులను పోలిస్తే కల్హణ రాజతరంగిణి చక్కటి వర్ణనలతో పాటు నానారుచిరార్థ సూక్తి నిధిత్వం కనిపిస్తుంది. జోనరాజ రాజతరంగిణి వీలయినంత వరకూ చరిత్ర రచనలా సాగుతుంది. అక్కడక్కడా కవిత్వ ధోరణి కనిపించినా ప్రధానంగా ఒక నిర్మోహత్వం, అక్కడక్కడా అవేదనలు కనిపిస్తాయి. కానీ శ్రీవరుడి రాజతరంగిణి ప్రసన్న కథ కలితార్థయుక్తితో పాటు బహు సుందరమూ, సృజనాత్మకమూ అయిన ఆహ్లదకరమైన వర్ణనలతో ఒక ‘కావ్యం’లా కవిత్వ ప్రభల జిలుగు వెలుగులతో సాగుతుంది. శ్రీవరుడి రాజతరంగిణిలో ‘ఫిరంగి’ వర్ణనల నుంచి అనేక వర్ణన సందర్భాలు కనిపిస్తాయి. ఇప్పడు నౌకా విహారం వర్ణన మనోహరంగా అనిపిస్తుంది.
కశ్మీరంలో రాజు శివాంశజుడు. కశ్మీరం పార్వతి. కాబట్టి అడుగుడుగునా కనబడే గులకరాళ్ళు సైతం శివలింగాల్లా కనిపిస్తాయి. అంతటి పవిత్ర భూమి కశ్మీరం. కాబట్టి సరస్సు నీటిలో తేలుతున్న మంచు ముక్కలను ఆ నీటిలో తీర్థస్నానం చేసేందుకు వచ్చిన కైలాస పర్వాత శిఖరం అనుకోవటంలో ఎలాంటి అనౌచిత్యమూ, అసందర్భమూ లేదు.
సత్యం విష్ణ్వవతారః స యేన భక్త్యాం ప్రదక్షిణమ్।
త్రీ న్ వారానకరోమ్నానమ్ జ్ఞాతుం స్వక్రమవిక్రమమ్॥
(శ్రీవర రాజతరంగిణి, పంచమ సర్గ, 104)
నిజానికి విష్ణువు తన విష్ణు పాదాల ఘనతను పరీక్షించుకుందుకు రాజు రూపంలో విష్ణు పాదాల చుట్టు భక్తితో పరిక్రమ చేసినట్టుంది.
జోనరాజు, శ్రీవరుడు ఇద్దరూ జైనులాబిదీన్‌ను విష్ణు అవతారంగా భావించారు. తమ రాజతరంగిణిల్లో ఆ విషయం ప్రకటించారు.
భారతీయ ధర్మంలో రాజు విష్ణు సమానుడు. భారతీయ తత్వంలో సృష్టిలో పాలన విష్ణువు బాధ్యత. కాబట్టి దేశాన్ని పాలించే రాజు విష్ణు సమానం అవటం స్వాభావికం. అయితే, ఇస్లామీయుడైన జైనులాబిదీన్‌ను విష్ణువు అవతారంగా భావించటాన్ని కొదంరు పాశ్చాత్య వ్యాఖ్యాతలు విమర్శించారు. భారతీయులకు అతిశయోక్తులు అలవాటేనన్నట్టు వ్యాఖ్యానించారు.
ఒకసారి జోనరాజు, శ్రీవరుడు జీవించిన నాటి పరిస్థితులను గమనిస్తే, జైనులాబిదీన్ సాధించినది మామూలు మానవ మాత్రులు, అతని కన్నా ముందు కానీ, అతని తరువాత కానీ సాధించలేనిది.
ఇస్లామీయులు అధిక సంఖ్యలో ఉండి రాజ్యాధికారం ఇస్లామీయుల చేతి ఉన్న సమయంలో కూడా ఇస్లామేతరులకు ఆశ్రయం కల్పించటం, వారికి ఉన్నత పదవులు ఇవ్వటం, వారిని గౌరవించటం, ఇస్లాం ఛాందసవాదుల ఆగ్రహావేశద్వేషకావేశాల నుంచి రక్షణ నిచ్చి స్వేచ్ఛగా జీవించే వీలు కల్పించటం.. బహుశా ప్రపంచ చరిత్రలో ఒక్క జైనులాబిదీన్‌కు మాత్రమే సాధ్యమయింది. అందుకే అసాధ్యమైన కార్యాన్ని సుసాధ్యం చేసిన జైనులాబిదీన్‌ను కృతజ్ఞతతో ఆ కాలంలోని వారు విష్ణువు అవతారంగా భావించటంలో ఆశ్చర్యం లేదు. అనౌచిత్యం లేదు. ఇది అర్థం కాని వారు భారతీయ కవులు అతిశయోక్తులతో, అసంభవమైన పొగడ్తలతో కావ్యాలను రచిస్తారని వ్యాఖ్యానిస్తారు. సర్వం కోల్పోయిన వాడిని, ద్వేషించే మూకల నడుమ సకల ఐశ్వర్యాలూ, గౌరవమర్యాదలు ఇప్పించి భద్రత కల్పించిన వాడు దైవ అవతారంలా కాకుండా ఇంక ఎలా కనబడతాడు ?
యో భూదాగమ సిద్ధార్థో నౌబంధన గిరిస్తరా।
ప్రత్యక్షార్థః కృతో రాజ్ఞా బద్ధవా నౌకాం యదాగతః॥
(శ్రీవర రాజతరంగిణి, పంచమ సర్గ, 105)
నౌకాబంధనం చేసిన తరువాత రాజు నవబంధన గిరి సాక్షాత్కారం చేసుకున్నాడు. ‘నవబంధనగిరి’ అన్నది మూడు శిఖరాల సంయుక్త గిరి. బనిహల్‍కు పశ్చిమ దిశలో ఉంటుందీ పర్వతం. ఈ మూడు శిఖరాలను బ్రహ్మ, విష్ణు, శివుడిగా భావిస్తారు. ‘నీలమతపురాణం’ ప్రకారం ఈ శిఖరాన్ని ఆధారం చేసుకుని శివుడు, సతీ సరోవరం నీటిని వెడల నడిపాడు. సరోవరం నీరు రహితమవటంతో బలహీనుడయిన జలోద్భవ రాక్షసుడిని విష్ణువు సంహరించాడు. అందుకని 15523 అడుగుల ఎత్తున్న ఈ పర్వత ప్రాంతాన్ని నవబంధన తీర్థంగా పవిత్రంగా భావిస్తారు. ‘నీలమతపురాణం’ ప్రకారం సతీసరోవరం నుండి నీరు బయటకు ప్రవహించి కశ్మీరును ముంచెత్తినప్పుడు విష్ణువు మత్స్య రూపం ధరించి ప్రజలను కాపాడిన నౌకను ఈ నౌబంధన శిఖరానికి కట్టేస్తాడు. ఆ నౌక దుర్గ స్వరూపం. అందుకే అత్యంత పవిత్ర తీర్థ ప్రదేశం ఇది. ఆ పవిత్ర తీర్ధంలో విష్ణువు అవతారం అయిన జైనులాబిదీన్, విష్ణువు ఎలా ప్రజలను రక్షించే నౌకను బంధించాడో, అలా తన నౌకను కట్టి, నౌబంధన పర్వత దర్శనం చేసుకున్నాడు.
స కుమార సరో యావత్ సుకుమారం స్మరన్ పథి।
సుకుమారోంబుపానేన సుఖం పుణ్యమివా సదత్॥
(శ్రీవర రాజతరంగిణి, పంచమ సర్గ, 106)
కుమారులతో కలసి రాజు మార్గంలో సుకుమార స్మరణ చేస్తూ, జలసేవన చేస్తూ కుమారసర్ వరకూ ప్రయాణించాడు. పుణ్య సమానమయిన సుఖాన్ని అనుభవించాడు.
కుమారసర్ అనేది పవిత్రమైన సరస్సు. రాజు అక్కడి వరకూ ప్రయాణించాడు. జలపానం చేశాడు. దారిలో రాజు స్మరిస్తూ వెళ్లిన సరస్సు ‘సుకుమార్’ ఒక పవిత్ర తీర్ధ స్థలం. ‘సుకుమార్’ అన్నది తక్షకుడి కులానికి చెందిన ఒక నాగు. జనమేజయుడి సర్పయాగంలో భస్మం అయిపోయిందీ నాగు. ఇది పవిత్రమైన సరస్సు. భారతదేశం, వేర్వేరు రాజ్యాల కలయిక అయినా ధార్మికంగా ఒకటే దేశం. జనమేజయుడు చేసిన సర్పయాగంలో తక్షకుడి వంశానికి చెందిన నాగులన్నీ భస్మమయ్యాయి. కశ్మీరు నాగుల దేశం. ఇక్కడ సరస్సులు అనేకం. ప్రతి సరస్సు ఒక నాగు నివాసం. ఎక్కడి జనమేజయుడు? ఆయన సర్పయాగంలో కశ్మీరుకు చెందిన నాగు భస్మమయింది. భారతదేశ ప్రజలకు చరిత్ర స్పృహ లేదని వ్యాఖ్యానించేవారు తమ కళ్లను క్రమ్మిన పొరలను తొలగించి చూస్తే, ఎలా ఈ దేశంలో ఒక ప్రాంతానికి మరో ప్రాంతంతో ధార్మికంగా సంబంధం ఉందో, సమస్త భారతాన్ని ధర్మం ఏకసూత్రంతో ఎలా కలిపి ఒకటిగా నిలిపిందో బోధపడుతుంది. యురోపియన్ చరిత్రలోని అనాగరిక జాతుల వలసలు, పోరాటాలు, ఆధిపత్య భావనలు, అణచివేతల దృష్టితో భారతదేశ చరిత్రను అలాగే రచించాలనుకుంటే అసలు విషయం బోధపడదు. పైగా వారున్న కొమ్మకు వారే పరుల మాటల ప్రలోభంలో పడి నిప్పు పెట్టి ఆనందిస్తున్నట్టవుతుంది. ఈ ఆనందం తాత్కాలికం ఎందుకంటే వారున్న కొమ్మకే నిప్పు పెట్టి ఎక్కవ కాలం ఆనందించలేరెవరూ.
శృణ్వన స్థానాభిధాః పుణ్యాః స్పృశస్తీర్థజలం శుభమ్।
పిబన్ సతుహినం తోయం పశ్యన్ వనతరుశ్రియమ్॥
(శ్రీవర రాజతరంగిణి, పంచమ సర్గ, 107)
రాజు పుణ్య తీర్థాల నామాలు వింటూ, మందిరాలలోని, పవిత్ర జలాలను స్పర్శిస్తూ పవిత్ర క్షేత్రాల నామస్మరణ చేస్తూ, అడవుల అందాలు దర్శిస్తూ, వృక్షాల అందాన్ని అనుభవిస్తూ –
జిఘ్రన్నోషధా పుష్పాణి పంచేంద్రియ సుఖప్రదమ్।
తీర్థయాత్రాం విధాయేత్థం నగరం ప్రాప భూపతిః॥
(శ్రీవర రాజతరంగిణి, పంచమ సర్గ, 108)
ఓషధులు, పుష్పాల సుగంధాలు పీలుస్తూ, పంచేంద్రియాలకు సుఖప్రదమైన తీర్ధయాత్ర పూర్తి చేసుకుని రాజు నగరం చేరుకున్నాడు.
~
ఇతి జైనరాజతరంగిణ్యాం క్రమసరోయాత్రా వర్ణనం నామ పంచమః సర్గః
దీనితో జైనరాజతరంగిణి కావ్యంలో క్రమసరోవరయాత్ర వర్ణనం అనే పంచమ సర్గ సమాప్తం.
(ఇంకా ఉంది)