Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

శ్రీవర తృతీయ రాజతరంగిణి-72

[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

పంచమ సర్గః

బ్రహ్మాచ్యుతేష గిరయః పతత్తోయరవచ్ఛలాత్।
అకుర్వన్ కుశలప్రశ్నమ్ హరాంశజ మహీభుజే॥
(శ్రీవర రాజతరంగిణి, పంచమ సర్గ, 97)

పర్వతాలపైనుండి దూకుతున్న జలధార శబ్దం బ్రహ్మ, అచ్యుత, శివులు – మహారాజును కుశల ప్రశ్నలు అడుగుతున్న భావన కలిగిస్తోంది.

కొందరు ఈ శ్లోకంలోని ‘బ్రహ్మ, అచ్యుత, శివుడు – అన్న పర్వతాల నుండి దూకే జలధారలు రాజును కుశల ప్రశ్నలు అడుగుతున్నట్లున్నాయి’ అన్నట్లుగా అనువదించారు.

చక్కని ఊహ.

రాజు హరాంశజుడు. అతడిని బ్రహ్మ, అచ్యుత, శివుడు కుశల ప్రస్నలు అడుగుతున్నట్లు ఉందట. అదీ పర్వతాలపై నుండి దూకే జలధారలు అన్న ఊహ చక్కగా అనిపిస్తుంది.

కస్తూరీమ్ సుమశ్యామం కోష్టాగారవనిం గిరేః।
దృష్ట్వా తుష్టో నృపశ్రేష్ఠో యోగీవేష్టాం హరేస్తనుమ్॥
(శ్రీవర రాజతరంగిణి, పంచమ సర్గ, 98)

కస్తూరీ కుసుమ శ్యామలమైన హరిని దర్శించి యోగులు ఎంత సంతృప్తిని పొందుతారో కస్తూరీ కుసుమ శ్యామలమైన పర్వత శ్రేణులను, ఆ భూమినీ దర్శించి రాజు అంతగా ఆనంద పరవశుడయ్యాడు.

అథ నౌకాం సమారూహ్య ధీవరైః పంచపైర్ర్వుతామ్।
ధృత్వా మాం సింహభట్టం చ చచార సరసోన్తరే॥
(శ్రీవర రాజతరంగిణి, పంచమ సర్గ, 99)

నలుగురయిదుగురు నావికులతో పాటూ,  సింహభట్టునూ, నన్నూ వెంట తీసుకుని రాజు ఆ సరస్సులో పడవ ప్రయాణం ఆరంభించాడు.

సరస్సులో నౌకా విహారం చేస్తూ రాజు శ్రీవరుడిని వెంట తీసుకువెళ్ళాడు. దీని అర్థం ఏమిటంటే జైనులాబిదీన్ చేస్తున్న ఈ తీర్థయాత్రలు, పండుగ సంబరాలు, స్థల దర్శనాలు, పవిత్ర సరస్సు, తీర్థ సందర్శనలన్నిటికీ అతని వెంట శ్రీవరుడు ఉన్నాడని. జైనులాబిదీన్ ప్రతి పనికీ శ్రీవరుడు ప్రత్యక్ష సాక్షి అన్నది ఈ శ్లోకం స్పష్టం చేస్తుంది. తీర్థయాత్రకే కాదు, జైనులాబిదీన్ యుద్ధాలు చేసేటప్పుడు, ఆయన సంతానం ఆయనపై తిరుగుబాటు చేసిన సందర్భాలలో రాజు అనుభవించిన మానసిక వ్యథ – అన్నిటికీ శ్రీవరుడు ప్రత్యక్ష సాక్షి. గమనిస్తే, రాజు జరిపిన తీర్థయాత్రలు, పవిత్ర స్థలాల దర్శనం వంటి వాటిల్లో అతని వెంట ఉన్నది శ్రీవరుడితో సహా అందరూ ఇస్లామేతరులే. ఇప్పుడు సరస్సులో నౌకావిహారం సందర్భంలో రాజుతో ఉన్నది శ్రీవరుడు, సింహభట్టులు. అంతవరకూ వెంటవున్న అతని సంతానం నౌకా విహారానికి వెంటరాలేదు.

నౌకావిహారంలో రాజు ఏం చేశాడో, తనను ఎందుకు వెంట తీసుకువెళ్ళాడో కూడా శ్రీవరుడు తర్వాతి శ్లోకంలో చెప్పాడు.

గీతాగోవిందగీతాని మత్తః శృతవతః ప్రభో।
గోవిందభక్తి సంసిక్తో రసః కోప్యుదభూత్ తదా॥
(శ్రీవర రాజతరంగిణి, పంచమ సర్గ, 100)

ఆ సమయంలో నా ద్వారా గీతగోవిందం లోని గీతాలు వింటున్న రాజు గోవింద భక్తి ప్రపత్తులతో అపూర్వ రసానుభూతిని పొందాడు.

కుంజాప్రతిశృతో మంజూర్గీతనాదస్తదావయోః।
అనుగీత ఇవాత్ర స్థైః కిన్నరై రాజాగౌరవత్॥
(శ్రీవర రాజతరంగిణి, పంచమ సర్గ, 101)

ఆ సమయంలో మేమిద్దరం కలిసి గానం చేస్తున్న మంజుల గీతనాద ప్రతిధ్వని, రాజు గౌరవార్థం కిన్నరులు వంతపాడుతున్న భావనను కలిగిస్తోంది.

క్షణం సరోన్తశ్చరతో హిమవృష్టి నిభాద్ విభోః।
భక్తి ప్రీతైరివోన్ముక్తం దేవైః కుసుమ వర్షణామ్॥
(శ్రీవర రాజతరంగిణి, పంచమ సర్గ, 102)

సరోవరంలో వివరిస్తుంటే, రాజు భక్తికి ప్రసన్నమైన దేవతలు హిమవృష్టి కురిపిస్తుంటే, పూలవర్షం కురుస్తున్న భావన కలిగింది.

అద్భుతమైన, ఆనందకరమైన భావనను కలిగిస్తాయి ఈ మూడు శ్లోకాలు.

‘విష్ణుపాద’ ప్రదక్షిణ చేసి ప్రణామాలు ఆచరించిన తరువాత సరస్సులో నౌకావిహారం  ఆరంభించారు.

ఆ నౌకా విహారం కూడా ఎలాగ.. నౌకా విహారం చేస్తుండగా శ్రీవరుడు గీతగోవిందం లోని గీతాల గానం ఆరంభించాడు. ఆ గీతాల వల్ల ఉత్పన్నం అయిన భక్తి రస ప్రవాహాం వల్ల తన్మయుడైన రాజు శ్రీవరుడితో గొంతు కలిపాడు. వారిద్దరి గానంతో సరోవరం ప్రతిధ్వనించింది. ఆ ప్రతిధ్వని ఎలాగుందంటే, వీరి గానానికి మురిసి కిన్నరులు వంత పాడుతున్నట్లుంది. వీరి అద్భుతమైన భక్తి పారవశ్య గానామృతానికి ప్రసన్నులైన దేవతలు పూలవృష్టి కురిపిస్తున్నట్లుగా మంచు కురిపించారు.

ఒక అరుదైన దృశ్యం కళ్ళ ముందు కదలాడుతుంది

ఒక సుల్తాన్, ఒక పండితుడితో నౌకా విహారం చేస్తున్నాడు. అది ఇస్లాం సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యాధీశుడి ఆంతరంగికుడు పండితుడు. ఆ పండితుడు సుల్తాన్‍తో ఎక్కడికి వచ్చాడు? ‘విష్ణుపాద’ దర్శనార్థం. ఆ తరువాత ఇద్దరూ నౌకా విహారం చేస్తుంటే వారు ఉబుసుపోక కబుర్లు చెప్పుకోవటం లేదు. రాజు వినోదార్థం పోసుకోలు కబుర్లు చెప్పటం లేదు. గీత గోవిందం గీతాలను గానం చేస్తున్నాడు.

ఏమిటీ గీతగోవిందం?

గీతగోవిందం 12వ శతాబ్దంలో ‘పూరి’ దగ్గర ఒక గ్రామంలో జన్మించిన జయదేవుడు సంస్కృతంలో రచించాడు. రాధాకృష్ణుల రాసకేళీ విలాసాలు, విరహవేదనల గీతాలవి. పైకి శృంగార గీతాలు. తరచి చూస్తే ఆధ్యాత్మిక గీతాలు. భక్తిరస ప్లావితాలు.  ప్రతి గీతానికి రాగాన్ని నిర్దుష్టంగా తెలిపాడు జయదేవుడు. ఆ గీతాలను , 15వ శతాబ్దంలో పూర్తిగా ఇస్లామ్ పరమైన కశ్మీరులో సుల్తాన్ ఎదుట శ్రీవరుడు పాడుతున్నాడు.

ఒక కావ్యం, సమాచార విస్తరణ, సాంకేతిక పరిజ్ఞానం అంతగా విస్తరించని కాలంలో, దేశం నలుమూలలా విస్తరించటం ఒక అద్భుతం! దాని గురించి చర్చలు జరగటం, వ్యాఖ్యానాలు రాయటం, గీతాలు పాడుతూ సన్యాసులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఆ గీతాలను చేరవేయటం.. అదీ.. దేశంలో అధిక శాతం పరమతాలను సహించని ఇస్లామీయుల పాలనలో ఉన్న సమయంలో కావటం.. ఇంకా అద్భుతం! జైనులాబిదీన్ గొప్పతనానికి, విశాల హృదయానికీ, శ్రీవరుడు వంటి పండితుల సాంగత్యం వల్ల విశాలమైన సుల్తాన్ దృక్పథానికీ ఇది అతి గొప్ప నిదర్శనం.

ఈ శ్లోకం వల్ల మరొక విషయం గ్రహించవచ్చు.

భారతీయ ధర్మం సాహిత్య ప్రధాన ధర్మం.

వేదాలు.. ఉపనిషత్తులు, పురాణాలు, కావ్యాలు ఇలా ఏయే కాలానికి తగ్గట్టు ఆయా కాలల్లో కావ్యాలు ఉద్భవించాయి. ధర్మాన్ని ఎప్పటికప్పుడు పునర్నిర్వచించి, నూతన దిశలో ప్రయాణింపచేశాయి. ఉపనదులు బాటలో వచ్చి కలుస్తుండటం వల్ల శక్తిమంతమై ప్రవహించే మహానదిలా భారతీయ ధర్మం నిత్యనూతన రూపం ధరించి, ‘జీవనది’లా ప్రవహించటానికి ప్రధాన కారణం ఎప్పటికప్పుడు పాత శరీరాన్ని పాము కుబుసం విడిచినట్టు విడిచి, నూతన శక్తితో నిత్య నూతనంగా నిలవటం. ఇలా అన్ని ప్రతిబంధకాలను దాటి నిత్య నూతన శక్తితో విరాజిల్లటంలో ప్రధాన పాత్ర పోషించినది సాహిత్య సృజన. ఆ సాహిత్య సృజనకు రాజకీయ శక్తి తోడయింది, మధ్యయుగంలో ‘శివాజీ’ రూపంలో. లేకపోతే, ‘కాశీ కర్బలా హోతీ, మధురా మదీనా హోతీ,  ఔర్ సున్నత్ సబ్‍కీ హోతీ’ (కవి భూషణ్, శివ భవనీ).

పీరా పయగంబరా దిగంబరా దిఖాయీ దేతీ
సిద్ధ్ కీ సిద్ధాయీ గయీ రహీ బాత్ రబ్ కీ!
కాశీ హూ కీ కలా జాతీ మధురా మసీద్ హోతీ
శివాజీ న హోతో తో సునతి హోతీ సబ్ కీ!

కుంభకర్ణ్ అసుర్ అవతారీ ఔరంగజేబ్,
కాశీ ప్రయాగ్ మే దుహాయీ ఫేరీ రబ్ కీ!
తోడ్ డాలీ దేవీ దేవ్ శహర్ ముహల్లోంకే
లాఖో ముసల్‍మా కియే మలా తోడీ సబ్ కీ!

భూషణ్ భణత్ భాగ్యో కాశీపతి విశ్వనాథ్
ఔర్ పోన్ గువకూ మే భయీ గీతా భవ కీ!
కాశీ కర్బలా హోతీ, మధురా మదీనా హోతీ
శివాజీ న హోతే తో సున్నతి హోతీ  సబ్ కీ!

భూషణ్ కవి రచన ఈనాటికీ సజీవంగా అందటంలో ఆయన శివాజీ అధికారంలో ఉన్న సమయంలో రచించటం ప్రధాన పాత్ర పోషిస్తుంది. శివాజీ రాజ్యాధికారాన్ని ఛత్రపతిగా స్వీకరించిన సమయంలో ఆయన ఈ కవితలు చదివాడు. ఇలాంటి 52 కవితల సంపుటి ‘శివ భవానీ’. ఇవన్నీ ‘శివరాజ్ భూషణ్’ అనే పెద్ద గ్రంథంలో పొందుపరిచారు.

ఇందుకు భిన్నంగా కశ్మీరులో ఒక సుల్తాన్ గురించి పండితుడు శ్రీవరుడు సంస్కృత కావ్యం రాయటం అపురూపమైన సంఘటన. సంస్కృతంలో సుల్తాన్‍ల జీవితచరిత్ర రచించిన వారున్నారు కానీ వారి రచనలలో శ్రీవరుడి రచనలలోని సంపూర్ణ ఆరాధన భావం కనబడదు. వారివి సంస్కృత కావ్యాలే అయినా, అంతగా ప్రతీతి పొందలేదు. ఎందుకంటే, ఆయా కావ్యాలలో సుల్తాన్‍ను మెప్పించటం ఉంది తప్ప భారతీయ ధర్మం పట్ల అవగాహన, పరిస్థితుల పట్ల ఆవేదన, భవిష్యత్తు పట్ల ఆలోచనలు కనబడవు. ఈ భద్రత కొంత కాలమే అన్న గ్రహింపూ కనబడదు.

భారతదేశంపై సుల్తానుల ఆధిపత్యం స్థిరపడుతున్న సమయంలో భారతదేశం నలుమూలల ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా పలువురు  భక్తులు జన్మించారు. చరిత్ర వ్యాఖ్యాతలు దీన్ని ‘భక్తి ఉద్యమం’గా అభివర్ణిస్తారు. కానీ అది ‘ధార్మిక పునరుజ్జీవన యుగం’.

భారతీయ ధర్మాన్ని సామాన్యులకు చేరువ చేసి విదేశీ ముష్కరుల నిరంతర దాడుల వల్ల బలహీనమవుతున్న దైవ విశ్వాసాన్ని తిరిగి నిలిపి, భగవంతుడిని ఒక అమూర్త భావనలా కాక, ‘ప్రత్యక్ష దర్శన శక్తి’లా ప్రజల ముందు నిలిపి, వారిలోని ధార్మిక భావాలకు, విశ్వాసానికి ఊపునిచ్చిన ‘ధార్మిక పునరుజ్జీవన ఉద్యమం’ అది. అందుకే ఒకరికి రాముడు ప్రత్యక్ష దైవం అయ్యాడు. ‘రామచరిత్ మానస్’ సృజితమయింది. ఈనాటికీ ప్రజలలో భక్తి భావనలను రగిలిస్తోంది. అంతకు ముందు జ్ఞానదేవుడు అభంగ్‍ల సృజనతో రుక్మిణీకృష్ణుడిని ప్రజల ముందు సజీవంగా నిలిపాడు. తుకారాం ‘పాండురంగ విఠలుడి’ని సజీవం చేశాడు. సూరదాసు రాధాకృష్ణుల దర్శనం కోసం తపించాడు, యమునా తీరంలో. అంతకుముందు జయదేవుడు ‘గీతగోవిందం’తో రాధాకృష్ణుల ప్రేమను ప్రణయభక్తిలా మలచి అందించాడు. వల్లభాచార్యుడు బాలకృష్ణుడిని ప్రజలకు దర్శింపజేశాడు. చైతన్య మహాప్రభు భజనలు కీర్తనలతో భక్తి యోగానికి ఊపిరులూదాడు. ఇలా చెప్తూ పోతే అల్లకల్లోల సముద్రంలోంచి కల్పవృక్షం, లక్ష్మీదేవి, అమృతం వంటివి ఉద్భవించినట్టు, ఆ అల్లకల్లోల కాలంలో అభంగ్‍లు, అష్టపదులు, గీతాలు, దోహాలు, పదాలు, కీర్తనలు, భజనలు.. ఇలా సాహిత్య సృజన పలు విభిన్నమైన పోకడలు పోయి దేశ ప్రజలను ఉత్తేజితులను చేసింది. ధర్మరక్షణా దీక్షాదక్షులను చేసింది. దాన్నంతా ‘భక్తి’ అనటం – అంతరిక్షాన్ని వదిలి ఆకాశమే ‘అంతా’ అనటం లాంటిది. ఆకాశం భ్రమ. అంతరిక్షం సత్యం.  అంతరిక్షం లోలోతుల్లో, లోకంబులు లోకేశులు తెగిన తుది అలోకంబగు పెంజీకటి కవ్వల ఏకాకృతిలో వెలిగే సత్యాన్ని దర్శించేందుకు తపించే ధర్మరక్షణ కోసం ప్రేరేపించే ‘ధార్మిక పునురుజ్జీవనా’న్ని ‘భక్తి ఉద్యమం’గా కుంచింపచేయటం భారతదేశ చరిత్ర రచనలో ఒక వైచిత్రి.

శ్రీవరుడు సుల్తాన్ ముందు గీతగోవిందం గానం చేయటం భారతీయ ధార్మికశక్తికి నిదర్శనం. ఆ ధార్మిక శక్తి వ్యక్తి వ్యక్తిత్వాన్ని ఉన్నత స్థిఆయికి ఎదిగింపచేయటానికి జైనులాబిదీన్ నిదర్శనం.

అందుకే శ్రీవరుడు గీతగోవిందం గానం చేస్తూ భారతీయ ధర్మ ఔన్నత్యానికి తన్మయుడవుతూంటే, సుల్తాన్ అతని గానంతో గొంతు కలిపి భక్తిరస పారవశ్య తన్మయుడయ్యాడు. అద్భుతమైన ఘట్టం ఇది.

భారతదేశ చరిత్రలోనే కాదు, సుల్తానుల చరిత్రలో కూడా ఇంత అత్యద్భుతమైన ఘట్టం మరొకటి లేదు (త్వరలో ఈ ఘట్టం కథ రూపంలో సంచికలో ప్రచురితమవబోతోంది).

ఒరిస్సాలో ఉద్భవించిన గీతగోవిందం – రాజ్యం,  మతం ఎల్లలు దాటుకుని దేశమంతా ప్రభావం చూపటం మరో అద్భుతమైన విషయం. అన్నమయ్య కీర్తనలు, క్షేత్రయ్య పదాలు, త్యాగరాజ కీర్తనలు వంటి వాటిని తవ్వుకుంటూ పోతే గీతగోవిందం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రేరణగా నిలుస్తుంది.  ఇలా అడుగడుగునా ‘సాహిత్యం’ ప్రేరణనిస్తూ, ధర్మాన్ని నిలిపింది. దేశాన్ని రక్షించింది. ఇతర దేశాల్లా, భారత దెశం ఇస్లాం ఆధిక్యంవల్ల అంధకారంలోకి దిగజారకుండా భక్తిదీపాలను వెలిగించి ధార్మిక వెలుగును పంచింది  ధార్మిక పునరుజ్జీవన ఉద్యమం.

అందుకే శ్రీవరుడూ, సుల్తానూ కలిసి భక్తి రస ప్రవాహంలో ఓలలాడుతూ తన్మయులై గానం చేస్తుంటే, కిన్నరులు స్పందించారు. దేవతలు ప్రసన్నులై పూలవర్షంలా హిమ వర్షం కురిపించారు.

ఇటువంటి అత్యద్భుతమైన సృజనకారులు జన్మించిన ఈ దేశం, ఈ ధర్మం ఎంత గొప్పవి? అలాంటి వారి వారసులం  మనం అని  తలచుకున్నప్పుడు మనసు ఉప్పొంగుతుంది. శరీరం పులకరిస్తుంది. కానీ ప్రస్తుత పరిస్థితులను చూస్తే మనసు బాధతో క్రుంగుతుంది. సిగ్గుతో శిరస్సు అవనతం అవుతుంది. అసహ్యంతో ఒళ్ళు జలదరిస్తుంది.

(ఇంకా ఉంది)

Exit mobile version