[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]
పంచమ సర్గః
నౌబంధనగిరేర్యాత్రోమాకర్యాదిపురణతః।
తీర్థయాత్రోత్సుక రాజ్ఞాః కదాచిదభవన్మనః॥
(శ్రీవర రాజతరంగిణి, పంచమ సర్గ, 88)
ఆదిపురాణంలోని నవబంధన యాత్ర వర్ణన విన్న రాజుకు తీర్ధయాత్రల పట్ల ఉత్సుకత జనించింది.
కొందరు పురాణాలు వింటారు. ఆధ్యాత్మిక గాథలు వింటారు. ప్రొద్దున్న లేచినప్పటి నుంచి ఆధ్యాత్మిక సిద్ధాంతాలు వల్లె వేస్తూంటారు. కానీ వారి మనస్సులలో ఆధ్యాత్మికత ఇసుమంత కూడా ఉండదు. అదే కొందరు సంసారంలో తలమునకలుగా ఉంటారు. హఠాత్తుగా ఒక గాథ వినగానే వారిలో ఆధ్యాత్మికత భావనలు రెక్కలు విప్పుకుంటాయి. ఇతరులు రోజంతా వల్లె వేసే భావనలను వీరు ఆచరించి చూపుతారు.
జైనులాబిదీన్ ఆదిపురాణంలో నవబంధన యాత్ర వర్ణన విన్నాడు. అప్పుడే తీర్థయాత్రలు చేయాలన్న సంకల్పం కలిగింది. వెంటనే అమలుపరిచాడు. ‘ఆదిపురాణం’ అన్నది కాశ్మీరుకే ప్రత్యేకమైన మహాపురాణం. నీలమత పురాణంలో వర్ణించిన తీర్థయాత్రలన్నీ ఒక చోట కూర్చి, ఆ తరువాత ఆరంభమైన ఇతర యాత్రలన్నీటినీ సేకరించి పొందుపరచిన పురాణం ‘ఆదిపురాణం’ అన్నది కొందరి అభిప్రాణం. కల్హణుడి మరణం తరువాత రచించిన పురాణంగా భావిస్తారు. ఎందుకంటే, దీనిలో కల్హణుడు చేసిన కొన్ని వర్ణనలు కూడా కనిపిస్తాయి. క్రీ.శ. 1203 నుండి క్రీ.శ. 1225 నడుమ ఈ పురాణాన్ని రచించినట్టు భావిస్తారు. శ్రీవరుడి కాలం నాటికి ఈ పుస్తకం సజీవంగా ఉంది అనటానికి నిదర్శనం శ్రీవరుడు రచించిన ఈ శ్లోకమే. సికిందర్ బుత్‌షికన్ కాలంలో అదృశ్యమైన ఈ పురాణం, జైనులాబిదీన్ వల్ల మళ్ళీ కశ్మీరులో సజీవంగా నిలబడింది. కానీ తరువాత కశ్మీరుపై ఇస్లామీయుల పట్టు బిగిసే నాటికి అదృశ్యం అయిపోయింది.
కొందరు పరిశోధకులు ఈ పురాణం అతి ప్రాచీనమైనదిగా భావిస్తారు. ఆదిపురాణాన్ని బ్రహ్మపురాణంగా భావిస్తారు. జైనమత గ్రంథాల ప్రకారం జినసేనుడు క్రీ.శ. 801 నుండి 843 ప్రాంతంలో ‘ఆదిపురాణం’ రచన కావించాడు. ఇంకా మల్లిసేనుడు (1128), సకల కీర్తి (1433 -1476), చంద్రకీర్తి (1597) వంటి వారు కూడా ఆదిపురాణ రచన చేశారంటారు.
నవబంధన యాత్ర గురించి నీలమత పురాణంలో ఉంది. కొందరు ‘నవబంధన యాత్ర’నే ఈనాటి అమర్‌నాథ్ యాత్ర అంటారు. ‘నౌబంధన మహాత్యం’ అనే ప్రత్యేక పుస్తకం 1870 ప్రాంతంలో ప్రచారంలో ఉండేదని తెలుస్తోంది.
ఇవన్నీ తెలుసుకుంటుంటే మనం ఎంత కోల్పోయామో అనేదానికి సంబంధించిన ఒక అవగాహన కలుగుతుంది. కానీ ఇంకెంత కోల్పోయామో ఊహకు కూడా అందదు. ఎన్నో గ్రంథాలు, ఎన్నో సత్యాలు చిహ్నమన్నది లేకుండా కాలగర్భం లోలోతుల్లో కలసి పోయాయి. దీన్ని బట్టి చూస్తే, భారతీయ చరిత్రకు సంబంధించి ఎలాంటి నిర్ధారణ అయినా ఎంత అసంపూర్ణమో, ఎంత అసంపూర్ణ సత్యమో ఊహించవచ్చు.
ఏకోన చత్వారింశోబ్దే పితృపక్షాన్త్యవాసరే।
యాత్రాదిదృక్షయా భూపో జగామ విజయేశ్వరమ్॥
(శ్రీవర రాజతరంగిణి, పంచమ సర్గ, 89)
39వ సంవత్సరం, పితృ పక్షం చివరి రోజు యాత్రను దర్శించాలనే ఉత్సాహంతో రాజు విజయేశ్వర క్షేత్రం ప్రయాణమయ్యాడు.
శ్రీవరుడిచ్చిన కాల సూచనలను అనుసరించి 1569వ సంవత్సరంలో నౌబంధన యాత్ర దర్శిచేందుకు జైనులాబిదీన్ విజయేశ్వర క్షేత్రానికి ప్రయాణమయ్యాడని ఊహించవచ్చు. జైనులాబిదీన్ పాలనా కాలం చివరి సంవత్సరం ఇది.
ఒక సుల్తాన్ పర మతం వారి పవిత్ర ధార్మిక యాత్ర దర్శనానికి వెళ్లటం అపురూపమైన ఘట్టం. తరువాత కాలంలో ఢిల్లీ సుల్తానులు ఇతర ధర్మాల పండుగలలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 1857 ప్రధమ స్వతంత్ర పోరాటం జరిగి దేశంలో అనూహ్యమైన మార్పులు సంభవించే వరకూ హిందూ, ముస్లింలు ఒకరి పండుగలలో మరొకరు పాల్గొనేవారు. సుల్తానులు సైతం ఎంతో ఉత్సాహంగా పాల్గొనేవారు. మధ్యలో ఔరంగజేబ్ వంటి సుల్తాన్ అడ్డు పడ్డా, ప్రవాహం దిశను మార్పుకుంది తప్ప ప్రవహించటం మానలేదు. ఔరంగజేబు హోలీ పండుగ జరపుకోచ్చాడు. దీపావళి పండుగ రోజు బహుమతులు స్వీకరించాడు.
నానా వర్ణాం శుకచ్ఛన్నైః ప్రేక్షకైః పరిపూరితమ్।
పుష్పాకీర్ణ మిలోద్యానమద్రాక్షీద్ రంగమండపమ్॥
(శ్రీవర రాజతరంగిణి, పంచమ సర్గ, 90)
విజయక్షేత్రం చేరిన జైనులాబిదీన్‌కు అక్కడ మైదానం నిండుగా ప్రేక్షకులతో కనిపించింది. పలు విభిన్నమైన రంగులతో మైదానం విభిన్నమైన పుష్పాలతో నిండిన అందమైన తోటలా కనించింది.
చక్కటి వర్ణన. ప్రజలతో క్రిక్కిరిసిన మైదానాన్ని పూలతో నిండిన తోటగా వర్ణించటం బాగుంది.
యత్ర చాందరపాలాద్యా రాజానో వీక్ష్య సద్బలాః।
తద్దర్షే దర్శనాయాతా హర్షమన్వభవన్నితి॥
(శ్రీవర రాజతరంగిణి, పంచమ సర్గ, 91)
ఆ సంవత్సరం సంబరాలను చూసేందుకు చాందరపాలుడు సైన్యం సమేతంగా వచ్చాడు. రంగమండపం చూసి ఎంతో సంతోషించాడు.
‘చంద్రపాలుడు’ అనే బదులు ‘చాందరపాలుడు’ అని అన్నాడని భావిస్తారు. చంద్రపాలుడు జైనులాబిదీన్‌కు సామంత రాజు.
గగనం తారకాపూర్ణం దీపాఢ్యం రంగమండపమ్।
యాత్రాన్నోన్యం తులాం చక్రే రాత్రౌ కవిబుధార్చితమ్॥
(శ్రీవర రాజతరంగిణి, పంచమ సర్గ, 92)
అక్కడ అకాశం శుక్రుడు, బుధుడితో సహా పలు ఇతర నక్షత్రాలతో అందంగా అలంకృతమై ఉంది. ఆకాశానికి ఏమీ తీసిపోని రీతిలో భూమి పైని రంగమండపం కూడా కవులతో పండితులతో, దీపాలంకరములతో అలంకృతమై ఉంది. ఆకాశం, భూమితో పోటీ పడుతున్నట్టుంది ఆ దృశ్యం.
అత్యంత చమత్కార భరితమైన శ్లోకం ఇది.
శుక్రుడు పురాణాల ప్రకారం భృగుమహర్షి కుమారుడు. అయితే కొన్ని శాస్త్రాలలో శుక్రాచార్యుడిని ‘కవి’ అవటం కనిపిస్తుంది. ‘కవి’ అని ‘ద్రష్ట’ అన్న ఉద్దేశంతో వ్యాఖ్యానించవచ్చు.. లేదా, శుక్రాచార్యుడి వంశం ‘కవి’ అనే మహాపురుషుడికి చెందినది కాబట్టి శుక్రాచార్యుడిని ‘కావ్య’ అని కూడా అంటాడు. ‘కావ్య’ అంటే కవి కుమారుడు.
దీని ఆధారంగా కొందరు శుక్రాచార్యుడు ‘కవి’ అనే అతడి కుమారుడని అంటారు.
భగవద్గీతలో కూడా ‘కవులలో’ ‘ఉశన’ వంటి వాడినంటాడు భగవంతుడు. శుక్రుడి తల్లి పేరు ‘ఉశ్య’. కాబట్టి కవులలో శుక్రాచార్యుడి వంటి వాడన్నమాట. కాబట్టి శ్రీవరుడు ఆకాశంలో శుక్రుడిని గ్రహంగా తీసుకుని, భూమిపై కవులతో పోల్చాడు. పైన శుక్రగహం ఉంటే, క్రింద కవులున్నారన్నాడు. ‘కవి’ అంటే శుక్రుడు కాబట్టి, ఆకాశంలో కాదు క్రింద కూడా పోటీగా శుక్రుడున్నట్టయింది.
‘బుధుడి’ పర్యయపదాలలో పండితుడు, విద్వాన్ కూడా ఉన్నాయి. విజ్ఞులు అన్న అర్ధంలోనూ ‘బుధ’ పదం వాడుతారు. ‘బుధుడు’ తెలివిని పాండిత్యాన్ని సూచిస్తాడు. ఆకాశంలో బుధుడికి క్రింద బుధ వర్గాలు పోటీ అన్న మాట. ఈ రకంగా ఆకాశంతో భూమి పోటీ పడుతుందన్నట్టు వర్ణించాడు శ్రీవరుడు.
అమావాస్యదినే ప్రాప్రైర్నానా నాగరికాముఖైః।
శుశుభే శుభదం యత్ర శతచంద్రం భువస్తలమ్॥
(శ్రీవర రాజతరంగిణి, పంచమ సర్గ, 93)
అక్కడ పెద్ద సంఖ్యలో చేరిన ప్రజల ముఖాలు చంద్రబింబాన్ని తలపించటంతో అమావాస్య రోజు భూమి శతచంద్రుల సమాన వెలుతురుతో శోభితమయింది.
దీపవృక్షో నృవాహ్యోపి యత్ర రంగాంతరే స్ఫురన్।
దధ్రే తారవామధ్యోద్యత్కృత్తికరక్ష్య చయోపమామ్॥
(శ్రీవర రాజతరంగిణి, పంచమ సర్గ, 94)
అక్కడ రంగమండపం నడుమ దీప వృక్షాన్ని ఎత్తి పట్టుకున్నారు. అది ఆకాశంలో నక్షత్రాల నడుమ వెలిగే కృత్తిక నక్షత్రంలా అనిపిస్తుంది.
ప్రాచేతసుడికి ఇచ్చిన 27 మంది కన్యలలో కృత్తిక ఒకామె. చంద్రుడి భార్య. కార్తికేయుడిని పెంచింది. అగ్ని శిఖలు ఉండే ఆరు నక్షత్రాలలో కృత్తిక ఒక నక్షత్రం. భాగవతం ప్రకారం అగ్ని అనే వసువు భార్య కృత్తిక. ఈ నక్షత్రం ప్రథమ అంశలో సూర్యుడు ఉన్నప్పుడు చంద్రుడు విశాఖ చతుర్థ అంశలో ఉంటాడు. సూర్యుడు మఖ నక్షత్ర తృతీయ పాదంలో ఉన్నప్పుడు కృత్తిక నక్షత్రం శిరస్సుపై ఉంటాడు. కృత్తిక అధిపతి దేవత అగ్ని. అందుకే దీప వృక్షాన్ని ఎత్తి పట్టుకుంటే, అది రంగమండపంలో కృత్తికలా ఉందని అన్నాడు శ్రీవరుడు.
విజయేశాదథోత్థాయ భూపః పుత్రద్వయాన్వితః।
పద్భయాముల్లంఘ్య దుర్మార్గం ప్రపేదే వాసరౌర్లిభః॥
(శ్రీవర రాజతరంగిణి, పంచమ సర్గ, 95)
ఇద్దరు పుత్రులు వెంటరాగా రాజు విజయేశ్వరం నుంచి పాదచారి అయి అన్ని కఠిన మార్గాలను దాటుకుని మూడు రోజులలో చేరుకున్నాడు.
కొందరు ‘దుర్మార్గం’ అన్నది ఒక ప్రాంతం పేరుగా భావిస్తారు. అయితే తరువాత శ్లోకం అర్ధం పరగణనలోకి తీసుకుంటే ‘దుర్మార్గం’ ప్రాంతం పేరు కాదు, కఠినమైన మార్గం అనుకోవాల్సి వస్తుంది.
దృష్ట్యా క్రమసరోవిష్ణు పాదముద్రాకృతాం పభుః।
పాదప్రణామ జానన్దమవిన్దద్ భక్తి సుందరః॥
(శ్రీవర రాజతరంగిణి, పంచమ సర్గ, 96)
సుందర స్వామి క్రమసరలో విష్ణు పాద ముద్రకు ప్రదక్షణం చేసి, పాదాలకు ప్రణామం చేసే ఆనందాన్ని పొందాడు రాజు.
అత్యధ్భుతమైన దృశ్యాన్ని కళ్ళ ముందు నిలుపుతుందీ శ్లోకం.
‘క్రమసర’ అన్నది నౌబంధన పర్వతానికి వాయువ్య దిశన ఉన్న రెండు మైళ్ల విస్తీర్ణంలో ఉన్న సరస్సు. ప్రస్తుతం ఈ సరస్సును ‘కౌన్సర్ నాగ’ సరస్సు అంటారు. ఈ సరస్సు 14000 అడుగులు ఎత్తున ఉంది. అనంత నాగ్ జిల్లాలో ఉన్న ఈ సరస్సు రూపం అచ్చు ‘పాదం’ లా ఉంటుంది. విష్ణువు ఇక్కడ ప్రధమంగా అడుగు వేయటంతో ఈ సరస్సు ఏర్పడిందని నమ్ముతారు. నౌబంధన ఉత్సవాలలో ముందుగా విష్ణు పాద సరస్సును దర్శించి, ప్రదక్షిణలు చేసి, అర్చించి, ఇంకా పైకి నడుస్తారు.
ఇటీవల ‘పుల్వామా’ జిల్లా వద్ద ఝీలమ్ నదిలో చతుర్ముఖ విష్ణు విగ్రహం లభించింది. ఈ విగ్రహాన్ని వైకుంఠ చతుర్మూర్తి అంటున్నారు. విగ్రహానికి వెనుక సింహ, వారాహ ముఖాలున్నాయి. నాలుగవ ముఖం రుద్రంగా ఉంది కానీ అదేమిటో గ్రహించే వీలు లేకుండా ఉంది. ఈ విగ్రహన్ని శ్రీనగర్ లోని SPS పురావస్తు ప్రదర్శనశాలలో ఉంచారు. విగ్రహం రూపొందించిన విధానాన్ని బట్టి, అవంతిపురా లోని విగ్రహాల లాంటిదే ఇది అని బావిస్తున్నారు. కానీ ఇప్పటికీ, కశ్మీరులోని ఏకైక విష్ణు సంబంధిత పవిత్ర క్షేత్రం ‘కౌన్సర్ నాగ’ విష్ణు పాద సర్ససు మాత్రమే.
జైనులాబిదీన్ తన ఇద్దరు కుమారులతో కాలినడకన ఈ సరస్సు చేరుకున్నాడు. విష్ణు పాద సరస్సును దర్శించాడు. ప్రదక్షిణ చేశాడు. ప్రణామాలు అర్పించాడు. ఒక ఇస్లామేతరుల పవిత్ర స్థలంలో ప్రణామాలు ఆచరించిన ఏకైక సుల్తాన్ జైనులాబిదీన్. అనూహ్యమైన విషయం ఇది. ఇస్లామీయులు ఇతర పవిత్ర స్థలాలలో ప్రణామాలు ఆచరించరు. అర్పించరు. సుల్తానులు మందిరాలకు దానాలు ఇచ్చినట్టు ఉంది కానీ మందిరాలలో అడుగు పెట్టినట్టు, పూజలు అర్పించనట్టు లేదు. గతంలో జైనులాబిదీన్ మందిరంలో ప్రార్థించి, భగవద్దర్శనం అర్థిస్తూ మందిరంలో నిద్రించాడు. అయితే, దర్శనం కాలేదని మందిరం ధ్వంసం చేశాడు. కానీ, ఇప్పుడు విష్ణు పాదాలను దర్శించి అర్చించాడు. అద్భుతమైన విషయం. వెంట ఇద్దరు కుమారులున్నారు. తండ్రి పరమత సహన ప్రదర్శన కళ్లారా చూశారు. కానీ తండ్రి నుంచి వారేమీ నేర్చుకోలేదు. ఈ విషయం భవిష్యత్తు నిరూపిస్తుంది.
(ఇంకా ఉంది)