Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

శ్రీవర తృతీయ రాజతరంగిణి-70

[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

పంచమ సర్గః

ధాతువాదరసగ్రంథకల్పశాస్త్రో దితాన్ గుణాన్।
యవనా అపి జానన్తి స్వభాషాక్షరవాచనాత్॥
(శ్రీవర రాజతరంగిణి, పంచమ సర్గ, 84)

యవనులు సైతం వారి భాషలో అధ్యయనం చేస్తే ధాతువాదం, రసగ్రంథం, కల్పశాస్త్రాలను, అక్షరాలు తెలుసు గనుక చదివి అర్థం చేసుకోగలరు.

చాలా ప్రాధాన్యం కల శ్లోకం ఇది.

రెండు భిన్న సంస్కృతులు, అలోచనలు, జీవన విధానాల నడుమ అవగాహన, సమన్వయం సాధించి సౌభ్రాతృత్వ భావనలను నెలకొల్పాలని అనుకొనేవారు ప్రధానంగా చేయవలసిన పని – ఒక భాషలోని సాహిత్యాన్ని మరో భాషలోకి తర్జుమా చేయటం. ఇందువల్ల ఒకరి పద్ధతులు ఒకరికి తెలుస్తాయి. ఒకరి భావనలు, ఆలోచన విధానాలు, నమ్మకాలు మరొకరికి తెలుస్తాయి.

దేవదాసు, బెంగాలీ అనిపించడు. శ్రీకాంత్ పరాయివాడు అనిపించడు. ప్రధాన కారణం, నవల రచయితల ప్రతిభతో పాటు ఆయా రచనల అనువాదాలు లభ్యమవటం, తెలుగువారు ఆయా పాత్రలతో తాదాత్మ్యం చెందటం. అదే మన తెలుగువారు ఇతరులకు అంతగా చేరువకారు. కారణం, మన సాహిత్యం ఒక ఉద్యమంలా ఇతర భాషలలోకి తర్జుమా కాకపోవటం అన్నది నిర్వివాదాంశం.

రష్యా, చైనాలు రెండూ వామపక్ష భావజాలం కల దేశాలయినా, మనకు చైనా  కన్నా రష్యా సన్నిహితంగా అనిపిస్తుంది. తల్‌స్తోయ్, దస్తయేవ్‌స్కీ, పుష్కిన్, గోర్కీ, గోగోల్, లెర్మన్తోవ్, నబకోవ్ వంటి పేర్లు గుర్తుకు వచ్చినంత సులభంగా చైనా సాహితీవేత్తల పేర్లు గుర్తుకు రావు. కారణం, రష్యా సాహిత్యం తెలుగులో అందినంత విస్తృతంగా, సులభంగా చైనా సాహిత్యం లభించదు. అందుకని మనకు రష్యా ఎంతో సన్నిహితంగా అనిపిస్తుంది.

అలాగే, ఆంగ్ల భాషా రచయితల గురించి తెలిసినంతగా, వారి రచనలు తెలిసినంతగా ఆఫ్రికా రచయితల గురించి తెలియదు. యూరోపియన్ రచయితల గురించి తెలిసినంతగా కజకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, సౌదీ, అరేబీయా వంటి దేశాల రచయితల గురించి తెలియదు. కాబట్టి ఒక దేశాన్ని సంస్కృతిని, ఆచార వ్యవహారాలను, మనస్తత్వాలను అర్థం చేసుకోవాలంటే ఆ దేశ సాహిత్యం గురించి తెలుసుకోవటం తప్పనిసరి. ఎప్పుడయితే భారతదేశ ప్రజలతో సహజీవనం తప్పదని గ్రహించారో అప్పుడే విదేశాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడుతున్న ఇస్లామీయులు, ఇక్కడి సాహిత్యాన్ని అధ్యయనం చేయటం ప్రారంభించారు. ఇక్కడి సాహిత్యాన్ని అనువదించటం ద్వారా, అక్కడి సాహిత్యాన్ని ఇక్కడి భాషలోకి అనువదించటం ద్వారా అర్థం చేసుకోవాలని ప్రయత్నించారు.

ఇలాంటి ప్రయత్నాలను జైనులాబిదీన్ పెద్ద ఎత్తున ప్రారంభించాడు. భారతదేశంలోని ఇతర ప్రాంతాల నుండి తెప్పించిన గ్రంథాలను పారసీ, అరబ్బీ భాషల్లో తర్జుమా చేయించాడు. ‘ఐన్-ఎ- అక్బరీ’ ప్రకారం, జైనులాబీదీన్ సంస్కృత గ్రంథాలను అరబ్బీ, పారసీ భాషలలోకి మాత్రమే కాదు కశ్మీరీ భాషలోకీ అనువదింప చేశాడు. అలాగే పారసీ, అరబ్బీ గ్రంథాలను సంస్కృతంలోకి మాత్రమే కాదు కశ్మీరీ భాషలోకీ అనువదింప చేశాడు.

‘తవక్కాత్ అక్బరీ ’ ప్రకారం సుల్తాన్‌కు పారసీ, హిందీ, తిబ్బత్ భాషలలో పరిజ్ఞానం ఉంది. అతని ఆదేశానుసారం అనేక పారసీ, అరబ్బీ గ్రంథాలు హిందీ లోకి అనువదితమయ్యాయి. శ్రీవరుడు స్వయంగా యూసఫ్ – జులైఖా కావ్యాన్ని ‘కథా కౌతుకమ్’ పేరిట సంస్కృతం లోకి అనువదించాడు. ముల్లా అహ్మద్ – కల్హణ రాజతరంగిణి, మహా భారతాలను పారసీ భాషలోకి అనువదించాడు. సుల్తాన్ ‘పారసీ’ భాషను రాజ్య భాష చేశాడు. అందువల్ల రాచకార్యాలన్నీ పారసీ భాషలోనే జరిగేవి.

ఈ నేపథ్యంలో చూస్తే, వారికి వారి భాష అక్షరాలు తెలుసు కాబట్టి, యవనులు భారతీయ గ్రంథాలను వారి భాషలోకి తర్జుమా చేస్తే అర్థం చేసుకోగలుగుతారని అన్నాడు శ్రీవరుడు.

ఒక మాటను అర్థం చేసుకోవటంలో ధ్వని ప్రదాన పాత్ర పోషిస్తుంది.

ఇక్కడ శ్రీవరుడి ధ్వనిలో ‘యవనులు అర్థం చేసుకోగలుగుతార’నటంలో ఓ రకమైన చులకన భావన ధ్వనిస్తుంది.

‘చులకన’ ఎందుకంటే, భారతీయ విజ్ఞానం పైకి మాములుగా అనిపించినా, పైపైన మాత్రమే చూస్తే అర్థం కాదు. దాన్ని లోతుగా అధ్యయనం చేస్తేనే అసలు విషయం బోధపడుతుంది. పైన కనబడేది మట్టి, రాళ్ళు మాత్రమే. త్రవ్వుతూ లోలోతులకు వెళ్తేనే కదా, అమూల్యమైన ఖనిజాలు, వజ్రాలు, లభించేది! కానీ, విదేశీయులకు గహనమైన భారతీయ విజ్ఞానం అంత సులభంగా బోధపడదు. అది అర్థం చేసుకునే తెలివితేటలు, ఆలోచనల లోతు వారికి ఉండదు. వారి ‘దృష్టి’ నాలుగు భూతాలకే పరిమితం! పాంచభౌతికమైన ప్రపంచం వారికి బోధపడదు. ఇది భారతీయులకు మాత్రమే ప్రత్యేకం. అందుకని వారి భాషలో అక్షరాలలో చదువుకుంటే వారికి తెలుస్తుంది అన్నాడు శ్రీవరుడు; ‘ఆ తెలిసేది పైపైన మాత్రమే’ అన్న భావన ధ్వనించేట్టు. ఈ భావన తరువాత శ్లోకాలలో మరింతగా స్పష్టం చేస్తాడు. అత్యంత ప్రాధాన్యం కల శ్లోకాలవి.

ఇక శ్రీవరుడు ప్రస్తావించిన శాస్త్రాలు కూడా ప్రాధాన్యం వహిస్తాయి. ఖనిజ విజ్ఞానంను ‘ధాతువాదం’ అంటారు. దీన్ని ‘ధాతువిజ్ఞానం’ అని కూడా అంటారు. ‘ఖనిజ విజ్ఞానం’ అంటే ‘knowledge of minerals’. ఇవి భూమిలో దొరికే ఖనిజాలు  కాదు, మానవ శరీరం అరోగ్యకరంగా ఉండటానికి ఆవశ్యకమైన సప్తధాతువులు .

ఆయుర్వేదం ప్రకారం మనిషి శరీరం సక్రమంగా, ఆరోగ్యంగా ఎదిగేందుకు, మెదడు, సక్రమంగా, చురుకుగా పని చేసేందుకు ఈ సప్తధాతువులు అవసరం. అవి

వీటితో పాటు వైద్యులు మరిన్ని ధాతువులను గుర్తించారు. చక్షు, ఘ్రాణ, శ్రోత్ర, జిహ్వ, కాయ, రూప, శబ్ద, గధ, రస, స్థావర్య. చక్షువిజ్ఞానం, ఘ్రాణ జ్ఞానం, జిహ్వ విజ్ఞానం, కాయ విజ్ఞానం, మనో విజ్ఞానం, ధర్మ విజ్ఞానం, మనోధర్మ విజ్ఞానధాతు.. ఇదంతా ధాతు విజ్ఞాన శాస్త్రం క్రిందకు వస్తుంది.

ఇస్లామీయులు గ్రీకు ప్రభావంతో ‘యునాని’ వైద్య పద్దతిని అభివృద్ధి చేసుకున్నారు. అది ‘హిప్పోక్రాట్స్’ రూపొందించిన పద్దతి ఆధారంగా రూపొందించినది. అది ద్రవాల ఆధిక్యం ఆధారంగా రోగ నిర్ధారణ చేసే పద్ధతి. కాబట్టి, వారికి ఇన్ని ధాతువుల ఆధారంగా రోగ నిర్ధారణ చేయటం, చికిత్స చేయటం అంత త్వరగా అర్థం కావటం కష్టం. ఏదైనా అలవాటయిన దానికి భిన్నమైన దాన్ని నేర్చుకోవటం అంత సులభం కాదు.

ఇక రసగ్రంథం రస విజ్ఞానం శాస్త్ర అంటే chemistry. ‘కల్పశాస్త్రం’ ఇతరులకు, ముఖ్యంగా సృష్టి అనంతత్వం, చక్రనేమి క్రమేణ సిద్ధాంతాలతో పరిచయం లేనివారికి, ఆద్యాంతాలు లేని దాన్ని ఊహించటం బుద్ధికి అంత సులభం కాదు. సృష్టి ఉత్పత్తి,  స్థితి, సమాప్తం, ప్రళయం, మళ్ళీ సృష్టి ఆవిర్భావం వంటి సిద్ధాంతాలు, వాటికి సంబంధించిన  లక్షల కోట్లలో లెక్కలు -వ్రేళ్ళపై లెక్కించదగ్గ కాలజ్ఞానం మాత్రమే కలవారికి, అంత సులభం కాదు, బోధపడటం. ఇందులో యజ్ఞ విజ్ఞానం ఉంటుంది. ధార్మిక సంస్కారాలు, నియమాల విజ్ఞానం, శౌచము, గృహస్థ సూత్రాలు వంటివి ఈ విజ్ఞానంలో భాగాలు. శిక్ష, కల్పం, వ్యాకరణం, నిరుక్తం, ఛందస్సుతో సహా జ్యోతిషం వంటి వేదాంగాలు ఈ విజ్ఞానంలో భాగాలే.

ఇదంతా ఎంతగా ఇతర భాషా పదాలతో ఉన్నా చదవగలరు కానీ అర్థం చేసుకోవటం, అవగాహన చేసుకోవటం, బుధ్దికి అందటం అంత సులభం కాదు. ఇది భారతదేశ తత్త్వ విజ్ఞానం, శాస్త్ర విజ్ఞానంతో పరిచయం ఏర్పడిన ఏ విదేశీయుడికైనా  వర్తిస్తుంది. మిగతా వారికి అభూతకల్పనల్లా, కట్టుకథల్లా అర్థం లేనిదిగా అనిపిస్తుంది, వారి వారి సంస్కారాన్ని బట్టి. బైబిల్ ప్రకారం భూమి 6000 సంవత్సరాల క్రితం ఏర్పడింది. ఈ భూమి వయస్సు 6000 అని నమ్మినవారికి ఆద్యంతం లేని చక్రనేమి క్రమేణ అయిన సృష్టి స్వరూపం సులభంగా బోధపడదు. ‘జానన్తి స్వభాషాక్షరవాచనాత్’ అని శ్రీవరుడు ‘వాళ్ళ బాషలో చదివితే యవనులకు కూడా తెలుస్తుంది’ అనటం వెనుక ఇంత ఆలోచన ఉంది.

దశావతార పృథ్వీశగ్రంథరాజతరంగిణీః।
సంస్కృతాః పారసీవాచా వాచనార్యాంస్త్యవారయత్॥
(శ్రీవర రాజతరంగిణి, పంచమ సర్గ, 85)

 సంస్కృత భాషలోని దశరాజుల గ్రంథం రాజతరంగిణిలను పారసీ భాషలోకి రాజు అనువదింపచేశాడు.

‘దశావతార పృథ్వీశ గ్రంథం రాజతరంగిణి’ అన్న దానికి పది రాజుల గ్రంథం అనీ, రాజులకు చెందిన రాజతరంగిణి గ్రంథం అన్న వాక్యం ఉంది. అయితే ‘దశరాజు’ అన్నది ‘శాహమీర్’ నుంచి జైనులాబిదీన్ వరకూ ఉన్న దశ రాజులకు సంబంధించిన గ్రంథంగా బావిస్తున్నారు కొందరు. శాహమీర్, జమ్‌షేద్, అల్లాఉద్దీన్, శిహబుద్దీన్, కతుబుద్దీన్ , సికిందర్ బుత్‌షికన్, అల్లీషాహా, జైనులాబిదీన్.. ఇదీ దశరాజుల జాజితా.

మ్లేచ్ఛైర్బృహత్కథాసారం హటకేశ్వర సంహితాః।
పురాణాది చ తద్యుక్తా వాచ్యత్ నిజభాషాయా॥
(శ్రీవర రాజతరంగిణి, పంచమ సర్గ, 86)

ఈ రకంగా మ్లేచ్ఛులు, బృహత్కథసారం, హాటకేశ్వర సంహిత, పురాణాలు, ఇతర పుస్తకాలను వారి భాషలో తెలుసుకున్నారు.

శ్రీవరుడి పద ప్రయోగాలను జాగ్రత్తగా గమనిస్తే ‘యవనులు’ అని ఒక చోట, ‘మ్లేచ్ఛులు’ అని మరొక చోట అంటున్నాడు ‘మ్లేచ్ఛులు ఈ గ్రంథాలు వారి భాషలో తెలసుకున్నారు’ అనటంలో శ్రీవరుడి హృదయం తెలుస్తుంది.

కశ్చిబ్భృత్వా శుచిరుచి చిరం ధర్మశాస్త్రం పవిత్రం
ధత్తే చిత్త పట ఇవ సితో రంజనం తత్‍క్రియామ్ యః।
ఆకర్ల్యాన్యే ప్రతి దిన మదః పద్మినీపత్ర తుల్యాః
కుల్యధారా అపి ధృత గుణా గృహ్ణతే అన్తర్ల కించిత్॥
(శ్రీవర రాజతరంగిణి, పంచమ సర్గ, 87)

శుచి – రుచి పూర్వకంగా, కొందరు చిరకాలం పవిత్ర ధర్మ శాస్త్రాలను విని హృదయంలో ప్రతిష్ఠించుకుని వాటిని అనుసరిస్తారు. శ్వేత వస్త్రం పై రంగు సులభంగా తెలిసేట్టు వీరు విషయాన్ని గ్రహిస్తారు. ఇలాగే, కొందరు నీటిలో ఉన్నా నీరు తాకని పద్మపత్రంలా ఎంత విన్నా ఏమీ నేర్చుకోరు.

ఇది నిరసన అనిపిస్తుంది. ఎంత విన్నా గ్రహించే మనసు, చిత్తశుద్ధి, ఆసక్తి లేకపోతే ఏమీ లాభం లేదు. పద్మపత్రానికి నీరు అంటనట్టే వాళ్ళేమీ గ్రహించలేరు.

ఇక్కడే శ్రీవరుడి హృదయం అవగతమవుతుంది.

భారతీయ ధర్మం లోని శాస్త్రాలలోని ఒక్కో పదాన్ని గూర్చి, చర్చలు ఎంత సాగినా అసలు అర్థం విషయంలో ఏకాభిప్రాయం కుదరదు. ఒకే పదాన్ని పలువురు తమ తమ దృష్టిలో అర్థం చేసుకుని తమ వాదన సమర్థనకు వాడుకోవటం మనకు తెలుసు. కర్మ సిద్ధాంతాన్ని నమ్మేవారికీ భగవద్గీత ప్రామాణిక గ్రంథం. భక్తిని నమ్మేవారికీ భగవద్గీత ప్రామాణిక గ్రంథం. జ్ఞానమార్గాన్ని నమ్మేవారికీ భగవద్గీత ప్రామాణిక గ్రంథం. హింసను నమ్మేవారికి భగవద్గీత ప్రామాణిక గ్రంథం. అహింసను నమ్మేవారికీ భగవద్గీత ప్రామాణికం. సన్యాసులకు ఎవరికి వారి వారి సంస్కారాన్ని, జీవలక్షణాన్ని బట్టి ఒక్కో  రకంగా కనిపిస్తూ ప్రేరణనిస్తుంటే ఈ ధర్మంతో,  సంస్కృతితో, ఈ ఆలోచనా విధానంతో ఏ మాత్రం సంబంధం లేని వారికి, ఈ భాషలోని లోతులు తెలియని వారికి,  భిన్న భిన్న ఉపయోగాలు, ప్రయోగాల గురించి ఏ మాత్రం అవగాహన లేని వాడికి ఎలా సంపూర్ణంగా అర్థమవుతుంది? అదీ వేరే భాషలోకి తర్జుమా చేస్తే ఎంత మాత్రం అసలు విషయం బోధపడుతుంది? ఇప్పటికీ పదాలు వాడేస్తున్నారు కానీ ఆత్మ, ధర్మం, ఋతం, దైవం, రసం తో సహా బోలెడన్ని పదాలకు ఇతర భాషల్లో సమానార్థకాలు లేవు. వారి పదాలు ఈ సంస్కృత పదాల లోతును, భావనను, ఆలోచనను ఎంత మాత్రమైనా అందుకోలేవు. అలాంటి పదాలతో ఇలాంటి ఆలోచనలను చదివినవాడికి అవి ఎంత మాత్రం బోధపడుతాయి? వాడి అవగాహన ఏపాటి? వాడు చెప్పిన దాన్ని మనం ప్రామాణికంగా భావించటం ఎంత వరకు సబబు? శ్రీవరుడి శ్లోకాలు చదివి విశ్లేషిస్తే,. ఆనాడు విదేశీయులు వారి భాషల్లో మన శాస్త్ర గ్రంథాలు చదివి అర్థం చేసుకోవటం ప్రత్యక్షంగా అనుభవించిన  పండితుల భావనలను అర్థం చేసుకునే వీలు కలుగుతుంది. భారతీయ ‘శౌచం’ భావన, ‘శౌచం’ భావననే కొత్తదయిన సంస్కృతులకు ఏ రకంగా బోధపడుతుందో ఊహించటం పెద్ద కష్టం కాదు.

భారతీయ శాస్త్రాలు ఇతర భాషలలోకి అనువదించటం, ఆయా అనువాదాల ద్వారా వారు మన శాస్త్రాలను అర్థం చేసుకోవటం ఎంత హాస్యాస్పదమో,  అనర్థదాయకమో శ్రీవరుడు గ్రహించాడు. ఆ గ్రహింపును తన శ్లోకాలలో అంతర్లీనంగా ప్రదర్శించాడు. పైకి గట్టిగా అనలేడు. ఎందుకంటే వారు పాలకులు. ఇది ఎలాంటిదంటే పై అధికారికి  ఏమీ తెలియకున్నా, ‘నీకేం తెలవదని’ అనలేని క్రింది ఉద్యోగి లాంటి పరిస్థితి శ్రీవరుడిది. ఇతర భాషల సాహిత్యానికీ, భారతీయ  సంస్కృతి సాహిత్యానికీ తేడా శ్రీవరుడికి తెలుసు. ఏ భాషలోనుంచి  కూడా సంపూర్ణంగా నూటికి నూరు శాతం భావంతో మరో భాషలోకి అనువదించటం కుదరదు. కానీ ఇతర భాషల్లోని భావాన్ని అనువదించినంత సులభంగా సంస్కృత భాషలోని భావాన్ని అనువదించటం కుదరదు.

(ఇంకా ఉంది)

Exit mobile version