[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]
పంచమ సర్గః
కిమన్యద్ ద్విజవద్ దేశే సర్వే గ్రంథా మనోరమాః।
కథావశేషతో యాతాః పద్మానీవ హిమాగమే॥
(శ్రీవర రాజతరంగిణి, పంచమ సర్గ, 77)
ఇంకా చెప్పాల్సింది ఏం ఉంది, ఆ కాలంలో ఈ దేశంలో బ్రాహ్మణుల లాగే, వారి గ్రంథాలు కూడా మంచు కురిసే కాలంలో కమలాల లాగా అయిపోయాయి.
శ్రీవరుడి పోలికలు ఎంతో గాఢమైనవి. లోతైన ఆలోచనలను పొదుగుకున్నవి. సికందర్ బుత్‌షికన్ కాలంలో జరిగింది ఇంకా ఏం చెప్పాలి? అని అడుగుతూ చెప్పవలసిన దాన్ని ఒక్క ముక్కలో చెప్పేశాడు.
కమలాలు సూర్యుడి రాకతో వికసిస్తాయి. వికసించాలంటే వాటికి సూర్యరశ్మి కావాలి. కానీ ప్రస్తుత పరిస్థితులు కమలం వికసించేందుకు అనుకూలం కాదు. మంచు కురుస్తోంది. మంచు కురిస్తే కమలాలు నశిస్తాయి. అలాగే కశ్మీరు నుంచి బ్రాహ్మణులు ప్రాణాలు అరచేత పట్టుకుని పారిపోయారు. వారు వెంట వారి గ్రంథాలను వీలయినన్నిటిని తీసుకువెళ్ళారు. మిగిలినవన్నీ సికిందర్ పాలబడ్డాయి. గ్రంథాలను కాల్చారు. పూడ్చారు. మొత్తానికి కశ్మీరులో బ్రాహ్మణులు, వారి గ్రంథాలు మంచు కురిసే వేళలోని కమలాల్లా అయిపోయాయి.
‘కమలం’ భారతీయ ధర్మంలో పవిత్రతకు, దైవత్వానికి, అగ్రస్థాయి ఆధ్యాత్మిక అనుభూతికి ప్రతీక. సృష్టి, పునర్జన్మ, చైతన్య సాధన, దైవ సాధన వంటి విషయాలను సూచిస్తుంది. పంకంలో జన్మించి కూడా, పంకంతో ప్రమేయం లేకుండా దానికి అతీతంగా ఎదగడం, సంసార పంకాన్ని అధిగమించి ఆధ్యాత్మికానుభవాల అంబరంలో ఆత్మ విహరించడాన్ని ప్రతిబిస్తుంది కమలం. దేవతలు బ్రహ్మ, విష్ణు, లక్ష్మి లకు కమలంతో సంబంధం ఉంది. యోగులకు కలల్లో నీలి సముద్రం నడుమ కమలం కనబడటం ఉచ్చస్థాయి చేరుకున్నందుకు సూచనగా భావిస్తారు. సూర్యుడితో వికసించి సూర్యాస్తమయంతో ముడుచుకుపోయి మళ్ళీ సూర్యోదయంతో వికసించేట్టు సృష్టి స్థితి లయలకు, పునర్జన్మకు, జనన మరణ చక్రాలకి ప్రతీకగా భావిస్తారు.
ఇక కమలం ఎంతమంది సృజనాత్మక కళాకారులకు ఎన్నెన్ని విధాలగా ప్రేరణనిచ్చిందో చెప్పటం కష్టం. బ్రహ్మ పుట్టింది కమలం నుంచి. విష్ణువును పుండరీకాక్షుడు, కమలనాభుడని అంటారు. లక్ష్మీదేవి నిలిచేది కమలంలో. సరస్వతీదేవిని శ్వేతకమలంలో చిత్రిస్తారు. యోగాలోనూ, తంత్రలోనూ కమలానికి ఎంతో ప్రాధాన్యం ఉంది, వైశిష్ట్యం ఉంది. చక్రాల నుంచి శక్తి పైకి ఎగబ్రాకుతూ సహద్రదళ పద్మంలా వికసించటాన్ని అత్యద్భుతమన స్థితిగా భావిస్తుంది యోగ. భగవద్గీత కూడా చాపల్యాలలో ఇరుక్కోకుండా తన కర్మలను నిర్మోహంగా, నిర్భావంగా నిర్వహించేవాడిని తామరాకు మీద నీటి బొట్టులా అభివర్ణిస్తుంది.
బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః।
లిప్యతే న స పాపేన పద్మపత్రమివాంభసా॥
(భగవద్గీత, అధ్యాయం 5, శ్లోకం 10)
ఇంకా భారతీయ ధర్మంలో, బౌద్ధంలో, జైనంలో కమలానికి ఉన్న ప్రాముఖాన్ని వివరిస్తే, అదో గ్రంథం అవుతుంది. కాబట్టి భారతీయ ధర్మంలో ‘కమలం’ అత్యంత పవిత్రం అన్నది నిర్వివాదాంశమని భావిస్తూ శ్రీవరుడు ‘కమలం’తో గ్రంథాలను పోల్చటం వెనుక ఉన్న ఆలోచనను విశ్లేషించాల్సి ఉంటుంది.
సికందర్ బుత్‌షికన్ నుండి తప్పించుకునేందుకు కశ్మీరీ పండితులు కశ్మీరు వదిలిపోయారు. తమ తమ పవిత్ర గ్రంథాలను వెంట దీసుకుని పోయారు. మిగిలినవి బుత్‌షికన్ నాశనం చేశాడు. దాంతో ఎలాగయితే కశ్మీరులో బ్రహ్మణులు మిగలలేదో, అలాగే కశ్మీరులో గ్రంథాలు కూడా మిగలలేదు. ఈ విషయాన్ని మంచు కరిసే కాలంలో సర్వనాశనమయ్యే కమలంతో పోలుస్తున్నాడు.
కమలం భారతీయ ధర్మానికి ప్రతీక. కమలం నశించిందంటే – కశ్మీరులో భారతీయ ధర్మం అంతరించిందని అర్థం. సూర్యరశ్మి వెలుతురుకు, జ్ఞానానికి ప్రతీక. వెలుతురు, జ్ఞానం ఉన్న పరిస్థితులలో కమలం, అంటే, భారతీయ ధర్మం వికసిస్తుంది. అందుకు విరుద్ధమైన పరిస్థితులలో వెలుగుండదు. జ్ఞానం ఉండదు. కమలం ఉండదు. భారతీయ ధర్మం ఉండదు. కానీ, కమలం మళ్ళీ సూర్యోదయం రాగానే వికసిస్తుంది. జైనులాబిదీన్ పాలన సూర్యుడి వెలుతురు లాంటిది.
సుమనోవల్లభేనాత్ర రాజ్ఞా భూషయతా క్షితిమ్।
నవీకృతాః పునః సర్వే మధునేవ మధువ్రతాః॥
(శ్రీవర రాజతరంగిణి, పంచమ సర్గ, 78)
వసంత ఋతువు ఎలాగయితే భ్రమరాలకు నూతన శక్తినిచ్చి పునరుజ్జీవతం చేసినట్టు సుమనోవల్లభుడైన రాజు, జగతిని అలంకరిస్తూ పండితులంటే ప్రేమ కలవాడు, పుస్తకాలను తిరిగి కశ్మీరు రప్పించాడు.
పురాణ తర్కమీమాంసా పుస్తకాన్ పరానపి।
దూరాదానాద్య విత్తేన విద్యద్భయః ప్రాప్యపాదయత్॥
(శ్రీవర రాజతరంగిణి, పంచమ సర్గ, 79)
పురాణ, తర్క, మీమాంస వంటి పుస్తకాలను, ధనం వెచ్చించి దూర ప్రాంతాల నుంచి తెప్పించి పండితులకు ప్రదానం చేశాడు.
కశ్మీరులో ఏయే పుస్తకాలు నష్టమయ్యాయో శ్రీవరుడు చెప్పకనే చెప్పాడు. తాను రాజ్యాధికారాన్ని చేపట్టిన తరువాత జైనులాబిదీన్ దూర దేశాలకు మనుషులను పంపి పుస్తకాలను తెప్పించి పండితులకు ఇచ్చాడు. అంటే, కశ్మీరు నుండి పండితులు ప్రాణాలు దక్కించుకుని కట్టుబట్టలతో పారిపోయారు తప్ప వారి గ్రంథాలను వెంట తీసుకుని పారిపోలేదన్నది అర్థమవుతుంది. వారి ద్వారా ఏయే గ్రంథాలుండేవో తెలుసుకుని, ఏయే గ్రంథాలు అవసరమో తెలుసుకుని, అవి ఏయే దేశాల్లో ఉన్నాయో ఆయా దేశాలకు మనుషులను పంపి గ్రంథాలను తెప్పించి ఇచ్చాడన్న మాట జైనులాబిదీన్. నిజంగా జైనులాబిదీన్ గురించి ఎంత తెలుసుకుంటే అంతగా మనసు ఉప్పొంగుతుంది. ఏమి రాజు! ఏం మనస్సు! ఎంత విశాల హృదయం! ఎంతటి అత్యుత్తముడు! నిజానికి భారతీయులంతా బ్రహ్మరథం పట్టాల్సిన రాజు జైనులాబిదీన్. భవిష్యత్ పాలకులంతా అదర్శంగా భావించాల్సిన రాజు జైనులాబిదీన్.
బహరిస్తాన్ ప్రకారం, రాజు, హిందుస్తాన్, ఇరాన్, ఇరాక్, తుర్కిస్తాన్ లకు తన మనుషులను పంపించాడు. వీరి ఏకైక లక్ష్యం ఏమంటే పుస్తకాలను తేవటం. ఎలాగైనా పుస్తకాలను చేజిక్కించుకుని కశ్మీరం తీసుకు రావటం. ఒకవేళ గ్రంథం అమ్మేందుకు ఎవరయినా సిద్ధంగా లేకపోతే, వ్రాయసగాండ్రను నియమించి, వాళ్ళకు డబ్బులిచ్చి ఆ ప్రతిని రాయించుకుని కశ్మీరు తీసుకురావటం వాళ్ళ విధి. అసలు ఊహిస్తేనే అద్భుతం అనిపిస్తుంది. అలా ఎన్నెన్ని గ్రంథాలు సేకరించాడో? ఎంత ధనం వెచ్చించాడో?
ఇలా సేకరించిన గ్రంథాలకు పలు ప్రతులు చేయించి, పండితులకు అందిచటమే కాదు, ఒక ప్రతిని ప్రత్యేక గ్రంథాలయం నిర్మించి దానిలో భద్రపరచే ఏర్పాట్లు చేశాడు జైనులాబిదీన్. ఈ గ్రంథాలయం ‘ఫతేహ్ షా’ కాలం వరకూ నిలచి ఉంది. కానీ ఆ తరువాత అధికారం కోసం జరిగిన పోరాటాల వల్ల, విదేశీయుల దాడుల వల్ల గ్రంథాలయం నేలమట్టం అయింది. పుస్తకాలు మట్టిపాలయ్యాయి. భవిష్యత్తు తరాలు కోల్పోయిన దాన్ని లెక్క వేయటం కుదరదు. ఇలా దేశమంతా ఎన్నెన్ని గ్రంథాలు నష్టమయ్యాయో, నామరూపాలు లేకుండా, అదృశ్యమయ్యాయో ఊహకు కూడా అందదు.
మోక్షోపాయ ఇతి ఖ్యాతం వాశిష్ఠం బ్రహ్మదర్శనమ్।
మన్ముఖాదశ్రుణేద్ రాజా శ్రీమద్వాల్మీకిభాషితమ్॥
(శ్రీవర రాజతరంగిణి, పంచమ సర్గ, 80)
మోక్ష సాధనకు మార్గం అయిన వాల్మీకి విరచిత వాశిష్ఠ బ్రహ్మదర్శనాన్ని నా ముఖతః విన్నాడు.
యోగవాశిష్ఠం ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక గ్రంథం. భగవంతుడు మనిషికి బోధించిన జ్ఞానం ‘భగవద్గీత’. మనిషి భగవంతుడికి అందించిన విజ్ఞానం ‘యోగవాశిష్ఠం’. యోగవాశిష్ఠం ఎన్నో దర్శనాల విశ్లేషణాత్మక సంకలనం. ఇందులో ఏ దర్శనాన్ని, ఏ ఆలోచనను విమర్శించటం ఉండదు. ప్రతి దర్శనానికి వ్యాఖ్యానం ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే భారతీయ దర్శనాల సంకలన గ్రంథం ‘యోగవాశిష్ఠం’.
బ్రహ్మజ్ఞానం, ఆత్మజ్ఞానాలకు సంబంధించిన అత్యద్భుతమైన గ్రంథం ‘యోగవాశిష్టం’. ముసల్మానులను విపరీతంగా ఆకర్షించిన గ్రంథం. జైనులాబిదీన్ ఈ గ్రంథాన్ని స్థానిక భాషలలోకే కాదు పారసీ భాషలోకి కూడా అనువదింప చేశాడు. యోగవాశిష్ఠం గ్రంథ సారం ఆధారం చేసుకుని జైనులాబిదీన్ స్వయంగా ‘షికాయిత్’ అనే గ్రంథం రచించాడు. అక్బర్ కూడా ‘యోగవాశిష్టం’ గ్రంథాన్ని పారసీ లోకి అనువదింప చేశాడు. ‘దారాషుకో’ సైతం యోగవాశిష్టాన్ని పారసీ భాషలోకి అనువదించాడు.
మోక్షం కోరిన జైనులాబిదీన్ మోక్ష మార్గదర్శిని అయిన యోగవాశిష్ఠాన్ని, శ్రీవరుడి ముఖతః చెప్పించుకున్నాడని శ్రీవరుడే చెప్తున్నాడు. దీన్ని బట్టి శ్రీవరుడు సుల్తాన్‌కు ఎంత సన్నిహితుడో, సుల్తాన్ అంటే శ్రీవరుడికి ఎంతగా గౌరవాభిమానాలున్నాయో తెలుస్తుంది.
శ్రుత్వా శాంతరసోపేతాం వ్యాఖ్యాం స్వప్నేపి నో నృపః।
అస్మార్పీదభితః కోన్తాహావభావ క్రియామివ॥
(శ్రీవర రాజతరంగిణి, పంచమ సర్గ, 81)
ఒక కాముకుడు కాంత హావభావాలను ప్రతి కదలికను ఏ రకంగా అనుక్షణం స్మరిస్తూ, జ్ఞాపకం చేసుకుంటాడో, అలాగే ,జైనులాబిదీన్ – శ్రీవరుడు చేసిన శాంతరసం పూర్వకమైన వ్యాఖ్యానాల్ని విని రాత్రింబవళ్ళు, స్వప్నంలోనూ స్మరిస్తూన్నాడు.
జైనులాబిదీన్‌పై శ్రీవరుడు, ఇతర పండితుల ప్రభావాన్ని ఊహించవచ్చు. అంతేకాదు, ఎందుకని జైనులాబిదీన్‍పై ఇస్లామీయులు కోపం పెంచుకున్నరో కూడా అర్థం చేసుకోవచ్చు.
ఔరంగజేబు పై పోరాటంలో దారా షుకో పైన ఒక ఆరోపణ – ఆయన కాఫిర్ గ్రంథాలపై ఆసక్తి చూపుతున్నడని, వాటిని అనువదిస్తున్నాడని, ఆదరిస్తున్నాడని. ఫలితంగా ‘దారాషుకో’ సమర్థకులు కూడా చివరి క్షణంలో అతడికి మద్దతు నివ్వలేదు. అతడిని ఔరంగజేబు హింసించి చంపటాన్ని సమర్థించారు. అలాంటప్పుడు జైనులాబిదీన్ ఎంతగా పర్షియన్ గ్రంథాలను సేకరించినా అందుకు ఎంతగా ధనం వ్యయం చేసినా కాఫిర్‍ల గ్రంథలనూ సేకరిస్తున్నాడనీ వాటికి ప్రాధన్యం ఇవ్వటమే కాదు, వాటిని పఠిస్తూ, స్మరిస్తున్నాడన్నది క్రోధానికి కారణం అవుతుంది. అందుకే శ్రీవరుడు లాంటి వారు జైనులాబిదీన్‌ను దైవసమానుడిగా భావించినా, పర్షియన్ రచయితలు అతడిని గొప్ప రాజుగా చిత్రించలేదు. దాంతో ఆంగ్లేయులు జైనులాబిదీన్‌ను గొప్ప రాజుగా పరిగణించలేదు. చరిత్ర రచనలో అతని ప్రస్తావనను అంత ప్రాధాన్యం లేనిదిగా భావించారు.
యో యద్భాషా ప్రవీణోస్తి స తద్భాషోపదేశభాక్।
లోకే నహి జనా నానా భాషా లిపి విదోఖిలాః॥
(శ్రీవర రాజతరంగిణి, పంచమ సర్గ, 82)
లోకంలో అందరికీ అన్ని భాషలూ, లిపులు రావు, తెలియవు. కాబట్టి, ఎవరికి ఏ భాషలో బోధపడుతుందో ఆ భాషలోనే భోధనలు వింటాడు. ఏ లిపి తెలుస్తుందో ఆ లిపిలోనే చదవుకుంటాడు.
శ్రీవరుడు ఆ కాలంలో రాసిన ఈ శ్లోకం, దేశమంతా ప్రజలందరికీ వినిపించి, బోధించి, ప్రొద్దున లేవగానే చదవాల్సిన శ్లోకంలా నియమించాలి.
అందరికీ అన్ని భాషలు రావు. అందరికీ అన్ని భాషలు రావాలని ఆశించటం కూడా సబబు కాదు. భాష అన్నది వ్యక్తుల నడుమ సంబంధం ఏర్పరిచే మాధ్యమం. కానీ మా ప్రాంతం వస్తే మా భాషనే మాట్లాడాలని నిర్భంధించటం, హింసించటం ఏ రకంగానూ ఆమోదయోగ్యం కాదు, సమర్థనీయం కాదు. అన్ని భాషలూ సరస్వతీ దేవి స్వరూపాలన్న భావన ఉన్ననాడు ఇలాంటి సంకుచితాలు చెలరేగవు. కానీ ఎవరికీ వారు సంకుచిత పరిధి నిశ్చయించుకుని, సంకెళ్ళు బిగించుకుని, మెదడుకు పని పెట్టనప్పుడే ఇలాంటి సంకుచితాలు విజృంభిస్తాయి. అంతెందుకు ఒకే ఇంట్లో ఏకగర్భ జనితులు , ఒకే భాష మాట్లాడే వారయినా, వారి భావ వ్యక్తీకరణలో తేడా ఉంటుంది.
కాబట్టి ఎవరికి ఏ భాష వస్తే భాషలో వారికి భోధన సాగాలి. ఎవరికి ఏ భాషలో సౌలభ్యం ఉంటుందో, వారికి ఆ భాషలో బోధించాలి అంటున్నాడు శ్రీవరుడు. పర్షియన్ మాత్రమే తెలిసినవాడికి సంస్కృతంలో బలవంతాన బోధించటం లాభం ఉండదు. అందుకని జైనులాబిదీన్ ఒక భాష నుంచి మరో భాషలోకి గ్రంథాలను అనువదింప చేశాడు.
ఇతి సంస్కృతదేశాదిపారసీవాగ్విశారదైః।
భాషా విపర్యయాత్ తత్తచ్ఛాస్త్రం సర్వమచీకరత్॥
(శ్రీవర రాజతరంగిణి, పంచమ సర్గ, 83)
సంస్కృత భాష, పారసీ భాష విద్వాంసుల ద్వారా ఆయా శాస్త్రాలను అనువాదం చేయించాడు.
శ్రీవరుడు సంస్కృత, పారసీ అని వేర్వేరుగా చెప్పటం వెనుక ఒక కారణం ఉంది. జైనులాబిదీన్ కాలంలో కశ్మీరు వచ్చి స్థిరపడిన బ్రాహ్మణులలో కొందరు పర్షియన్ నేర్చి రాజాస్థానంలో స్థిరపడ్డారు. వీరిని కర్కున్ బ్రాహ్మణులంటారు. మిగతా వారు సంస్కృతానికి పరిమితమై పూజలు, ఇతర కర్మకాండలకు పరిమితమయ్యారు. రాను రాను వీరి నడుమ తేడాలు ఎంత తీవ్రమయ్యాయంటే ఒకరితో ఒకరు వివాహ సంబంధాలు కూడా పెట్టుకోవడం మానేశారు. వీరిలో జ్యోతిష్కులు మళ్ళీ వేరుగా ఉండేవారు. అందుకని ఎవరికి ఏ భాష తెలిస్తే వారితో ఆ భాష గ్రంథాలను అనువదింప చేశాడు జైనులాబిదీన్. ఈ గ్రంథాలను ప్రాంతీయ భాషలలోకి కూడా అనువదింప చేశాడు, అందిరికీ అన్నీ తెలియాలన్న ఉద్దేశంతో.
ఆ కాలంలో కశ్మీరులో హిందువులు తర తమ బేధాలు మరచి అందరూ పండితులుగానే చలామణీ అయ్యారు. ఇప్పటికీ కశ్మీరీ పండితులు అంటారు తప్ప, కశ్మీరీ దళితులు, బీసీలు, బ్రాహ్మణులు అన్న మాట వినపడదు కశ్మీరులో.
(ఇంకా ఉంది)