[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]
పంచమ సర్గః
వర్ధితా జీవనోపాయైర్దేవేన ఫలదాః సదా।
యాతాః సహస్రశాఖత్వం విద్యాః కల్పలతా ఇవ॥
(శ్రీవర రాజతరంగిణి, పంచమ సర్గ, 71)
రాజు ప్రోత్సాహం వల్ల విద్య, కల్పలతలా సహస్ర శాఖలుగా (పలు విభిన్న విద్యలు) అభివృద్ధి చెందింది.
కల్పలత అంటే కల్పతరువు. ఇంద్రుడి వనంలో ఉండే ఈ వృక్షం కోరిన కోర్కెలను తీరుస్తుంది. అంటే కల్పతరువులా కశ్మీరంలో విద్య అభివృద్ధి చెందింది. విద్య అన్నది ఒక్క పదమైనా దాన్లో పలు విభిన్న రకాల విద్యాశాఖలు ఇమిడి ఉంటాయి. అలాంటి విద్యా శాఖలన్నీ కశ్మీరంలో రాజు ప్రోత్సాహం వల్ల అభివృద్ధి చెందాయన్న మాట.
శ్రీవరుడు ఇలా ప్రత్యేకించి విద్య, విద్యాభివృద్ధి వంటి విషయాలను పదే పదే నొక్కి చెప్పటానికి కారణం కూడా తరువాత శ్లోకాలు తేటతెల్లం చేస్తాయి.
న సా విద్యా న తచ్ఛిల్పం న తత్కావ్యం న సా కళా।
శ్రీజైనభూపతే రాజ్యే నాభూద్ యా ప్రథితా భువి॥
(శ్రీవర రాజతరంగిణి, పంచమ సర్గ, 72)
జైనులాబిదీన్ పాలనాకాలంలో ప్రచలితంలో లేని విద్య అంటూ లేదు. శిల్ప విద్య, కావ్య విద్య, కళలు వంటి వాటితో సహా జైనులాబిదీన్ పాలనా కాలంలో అన్ని కళలూ అభివృద్ధి చెందాయి.
విదూషాం మాన్యతాం దృష్ట్వా భూపతెర్గుణి బాంధవాత్।
కాంక్షన్తి స్మాపి సామన్తాః పాండిత్యం నిత్యమాదరాత్॥
(శ్రీవర రాజతరంగిణి, పంచమ సర్గ, 73)
విద్యావంతులను, పండితులను జైనులాబిదీన్ ఆదరించి గౌరవించటం చూసిన సామంత రాజులు కూడా పండితులను, కళాకారులను, విద్యా నిపుణులను ఆదరించారు.
నాయకుడిని ఇతరులు అనుసరిస్తారు. రాజు జైనులాబిదీన్ మెప్పు పొందేందుకు, ఆయన ఆదరణ పొందేందుకు సామంత రాజులు కూడా పండితులను, విద్యావంతులను, కళాకారులను ఆదరించారు.
మంచి చెడు రెండూ ‘అగ్ని’ వంటివని అంటారు. మంచి ఒకరి నుంచి ఒకరికి దీపం వెలుగులా ప్రసరిస్తుంది. ఒక దీపం మరో దీపాన్ని వెలిగించటంతో జగతి వెలుగుమయం అవుతుంది. అదే ‘చెడు’ కార్చిచ్చులా వ్యాపిస్తుంది. ఒక ప్రతిభావంతుడో, శక్తివంతుడో చెడు చర్య చిన్నది చేసినా అడవిలో ఎండుగడ్డికి నిప్పు అంటినట్టు అది మొత్తం అడవినంతా దగ్ధం చేస్తుంది. లోపం అగ్నిలో ఉందా? అంటే, దహించటం అగ్ని లక్షణం. ఆ దహించే లక్షణాన్ని నిర్మాణాత్మకంగా వాడితే చీకటిని పారద్రోలి వెలుగు తెస్తుంది. లేకపోతే దహించి బూడిద చేస్తుంది. కాబట్టి దోషం వాడే వారిలో ఉంటుంది తప్ప అగ్నిలో కాదు. ‘అగ్ని’ శక్తి వాడేది రాజు. రాజు తన శక్తిని మంచి కార్యాలను వినియోగిస్తే, సత్ప్రవర్తన ప్రదర్శిస్తే దాన్ని ఆదర్శంగా తీసుకుని అందరూ సత్ప్రవర్తన ప్రదర్శిస్తారు. సన్మార్గంలో ప్రయాణిస్తారు. రాజు ఇందుకు భిన్నంగా ప్రవర్తిస్తే, అందరూ అలాగే ప్రవర్తిస్తారు.
శ్రీవరుడు విద్య, పాండిత్యం వంటి పదాలు వాడటం వల్ల జైనులాబిదీన్ కేవలం భారతీయ పాండిత్యాన్ని, వైదుష్యాన్ని ఆదరించాడన్న అపోహ కలిగే అవకాశం ఉంది. కానీ ఇస్లామీ పండితులు అనేకులు కశ్మీరు వచ్చి చేరారు. రాజు ఆదరణ పొందారు. సామంత రాజులు కూడా వీరిని గౌరవించి, ఆదరించారు. ఈ విషయం ‘బహరిస్తాన్’ వంటి పర్షియన్ పుస్తకాల ద్వారా తెలుస్తుంది.
సయ్యద్ మహమ్మద్ రూమీ, ఖాజీ సయ్యద్ అలీ షిరాజీ, సయ్యద్ మహమ్మద్ లురిస్తానీ, కాజీ జమాల్, సయ్యద్ మహమ్మద్ శీస్తానీ వంటి వారు తమ తమ స్వదేశాలు వదలి కశ్మీరు వచ్చారు. సుల్తాన్ వారిని ఆదరించాడు. ముల్లా అహమ్మద్, ముల్లా నాదరీ, ముల్లా ఐతహీ వంటి వారు రాజకవులుగా స్థిరపడ్డారు. ఇంకా ముల్లా పరసా బుఖరీ, సయ్యద్ మహమ్మద్ మదానీ వంటి వారు పేర్కొనదగ్గ విద్వాంసులు. వీరంతా జైనులాబిదీన్ పండితులను ఆదరించటం గురించి విని కశ్మీరు వచ్చినవారు. అంటే జైనులాబిదీన్ భాష, మతం, ధర్మం, వంటి సంకుచితాలు వదలి ‘పాడిత్యం’ అన్న విషయానికే ప్రాధాన్యం ఇచ్చాడన్నమాట. ఈనాడు ఓ వైపు ‘పరమత సహనం’, ‘లౌకిక రాజ్యం’ అంటూ హోరెత్తించేవారే ప్రాంతీయం, ప్రాంతీయ భాష అంటూ అతి సంకుచితం ప్రదర్శిస్తూ ఇతర భాషీయులపై హింస నెరపటం, బెదిరంచటం మనం అనుభవిస్తున్నాం. ఆ కాలంలో జైనులాబిదీన్ అన్ని భాషలను, ధర్మాలను, మతాలను, సమానంగా ఆదరిస్తూ, ప్రాంతీయ భాషలు కశ్మీరీ, డోగ్రీలతో సహా అనేక విదేశీ భాషలను సైతం ఆదరించి, ప్రోత్సాహం ఇవ్వటం ఒక అద్భుతం. ఆ అద్భుతాన్ని మనకు సజీవంగా అందించటంలో ప్రధాన పాత్ర పోషించాడు శ్రీవరుడు.
నిదాధకాలే విషమః ప్రతాపో
దహేద్ ధరిత్యాం తృణాగుల్మపూగాన్।
వన్ధో న కేషాం ఘనకాల ఏకో
యో జీవనైస్తాన్ వితతాన్ కరోతి॥
(శ్రీవర రాజతరంగిణి, పంచమ సర్గ, 74)
ఎండాకాలం గడ్డితో సహా పలు మొక్కలను దగ్ధం చేస్తుంది. అంటే నశింపచేస్తుంది. కానీ వర్షపు చినుకు భూమిని తిరిగి చిగురింప చేస్తుంది. పచ్చదనం విస్తరింప చేస్తుంది.
శేకాంధర ధరానాథో యవనైః ప్రేరితః పురా।
పుస్తకాన్ సకలాన్ సర్వాం స్తృణాన్యగ్నిరివాదహత్॥
(శ్రీవర రాజతరంగిణి, పంచమ సర్గ, 75)
కంటనీరు తెచ్చి, గుండెను ఆవేశాగ్నితో మండించే శ్లోకం ఇది.
ఆవేశం కానీ, విషాదం కానీ శ్లోకంలో లేదు. భావంలో ఉంది. ఆ భావాల్ని భావించటంలో ఉంది. అగ్ని గడ్డిని దహించి వేసినట్టు, కొద్ది కాలం క్రితం సికిందర్ అనే రాజు, యవన ప్రేరితుడై పుస్తకాలన్నింటినీ సంపుర్ణంగా తగుల బెట్టించాడు.
శ్రీవరుడు వాడిన పదాలు శ్రీవరుడి హృదయాన్ని పట్టిస్తాయి. శ్రీవరుడు అణుచుకున్న ఆవేశాన్ని, అదిమి పట్టిన విషాదాన్ని ప్రదర్శిస్తాయి. పైపైన చూస్తే ఒక వార్తను నిర్మోహంగా రాసినట్టుంటుంది. తరచి చూస్తే వార్తలోని అవేదన, అవేశాల లోతు తెలుస్తుంది. ‘యవనైః ప్రేరిత’ అన్న పదం వల్ల దోషం సికందర్ బుత్షికన్ నుంచి తప్పిస్తున్నాడు. ఇది మనం జోనరాజు లోనూ చూశాం.
‘సికందర్’ ఇస్లాం మతం పుచ్చుకున్నవాడు. అతను ఇస్లాం మతం స్వీకరించిన తరువాత ఇస్లామేతరులపై అత్యాచారాలు ప్రారంభించాడు. ఇందుకు కారణం సూఫీ హమదాని ప్రేరణ అంటారు. ఆయన కశ్మీరులో కాఫిర్లు ఇస్లామీయులతో సమానంగా సుఖాలు, భోగాలు, స్వేచ్ఛ అనుభవించటం చూసి ఆగ్రహించాడు. సుల్తాన్ ఆయనను గురువుగా స్వీకరించడంతో ఆయన తన ఆభిప్రాయాలను సుల్తాన్ ద్వారా ఆచరణలో పెట్టాడు. ఫలితంగా రాజు మెప్పు కోసం మతం మారిన ‘సూహభట్టు’ రాజు కుడి భుజమై అత్యాచారాల పర్వంకు తెర తీశాడు. దాంతో నేరం సికందర్ నుంచి తప్పించే వీలు చరిత్ర రచయితలకు దక్కింది.ఈ అవకాశాన్ని జోనరాజు సంపూర్ణంగా వినియోగించుకుని సూహభట్తుపై సికందర్ అత్యాచారాల నేరాన్ని నిలిపాడు. సికందర్ బుత్కిషన్ జరిపిన ఘోరమైన అకృత్యాలకు దమనకాండకు ‘సూహభట్టు’ను దోషిగా చూపాడు జోనరాజు. శ్రీవరుడు కూడా సికందర్ను దోషిగా నిలపలేదు కానీ, యవనుల ప్రోద్బలాన్ని దోషిగా చూపించాడు. ‘యవనులు’ అంటే ఇక్కడ ఇస్లామీయులు. అరబ్, తుర్కిస్తాన్ నుండి వచ్చినవారు. శ్రీవరుడు సూహభట్టు ప్రసక్తి తేలేదు. కారణం, శ్రీవరుడికి తెలుసు, సూహభట్టు కూడా హమదానీ ప్రభావితుడేనని. తండ్రి పాలనకు భిన్నంగా జైనులాబిదీన్ పరమత సహనం పాటించాడు. కశ్మీరు వదలిపోయిన వారిని వెనక్కి రప్పించాడు. జిజియా పన్ను తొలగించాడు. ఉన్నత ఉద్యోగాలిచ్చి భద్రత కల్పించాడు. గౌరవించాడు.
అయితే, శ్రీవరుడు తెలివైనవాడు. ‘శేకందరోధరానాధో’ అన్నాడు. సికందర్ ధరానాథుడిగా ఉన్న కాలంలో, అంటే ప్రజలు ఏది చేసినా బాధ్యత రాజుదే అవుతుంది. ఇంతకు ముందరి శ్లోకాలలో రాజుకు పండితులు ఇష్టం కాబట్టి, సామంతులు రాజును అనుసరించారని రాశాడు. ఇప్పుడు సికిందర్ రాజు, అంటే రాజ్యంలో ప్రతి వారి ప్రవర్తనకూ సికిందర్దే బాధ్యత. కానీ ‘యవనైః ప్రేరిత’ – యవనుల ప్రేరణ వల్ల రాజు అకృత్యాలు చేశాడంటున్నాడు. ప్రత్యక్ష దోషులు యవనులు. పరోక్ష దోషి సికందర్.
వారి ప్రేరణతో రాజు ‘పుస్తకాన్ సకలాన్’ అన్ని పుస్తకాలను తృణాన్నిదహి – అగ్ని దహించినట్టు దహించి వేశాడు. ‘తృణం’ పోలిక గమనార్హం. ‘గడ్డిపోచ’ విలువ లేనిది. దాన్ని తక్కువ దానిలా చూస్తాడు. సకల గ్రంథాలను గడ్డిపోచల్లా హీనంగా చూసి తగులబెట్టించాడు రాజు. అంతకు ముందు శ్లోకంలో, ఎండాకాలం అగ్ని గడ్డిని తగుల బెడుతుందన్నాడు. వర్షాకాలంలో మళ్లా చిగురించినట్టు జైనులాబిదీన్ రాకతో అంతా పచ్చదనం మళ్లీ విస్తరించిందన్నాడు. ఆ శ్లోకంతో ఈ శ్లోకం కలిపి చెప్పుకుంటే, శ్రీవరుడి మనస్సు బోధపడుతుంది.
అన్నింటినీ సికందర్ బుత్షికన్ తగులబెట్టాడు. కానీ జైనులాబిదీన్ అన్నిటినీ పునర్నిర్మించాడు. సికందర్ పాలన ఎండాకాలం లాంటిది. జైనులాబిదీన్ పాలన అన్నీ చిగురించి మొలచి మొగ్గలు వేసి పచ్చదనం నిండే వర్షకాలం లాంటిది. సికిందర్ ఇతరుల గ్రంథాలను గడ్డిపోచల్లా భావించాడు. సికిందర్ సకల పుస్తకాలను తగులబెట్టించాడంటే, ఎవరి పుస్తకాలను తగులబెట్టించాడో చెప్పనవసరం లేదు. తమ పవిత్ర పుస్తకం పుట గాలికి చెదిరితేనే ఇతరులపై విరుచుకుపడేవారు, ఇతరుల పవిత్ర పుస్తకాలను తృణప్రాయంలా భావించటాన్ని ఎత్తి పొడుస్తున్నాడు శ్రీవరుడు. ఈ ద్వంద్వ వైఖరిని తేటతెల్లం చేస్తున్నాడు. తరువాత శ్లోకాలు ఈ విషయాన్ని మరింత స్పష్టం చేస్తాయి.
శ్రీవరుడు నిజానికి అసలు విషయం సరిగ్గా చెప్పలేదు. పదాలలో తన ఆవేదనను, ఆవేశాన్ని నిక్షిప్తం చేసి వదిలేశాడు. జరిగిన విషయం ‘బహరిస్తాన్’ తెలుపుతుంది.
సికందర్ బుత్షికన్ అన్ని పుస్తకాలను కాల్పించేశాడు. హాక్ పరగణాలలో సికందర్ షాలిమార్ సరస్సును తయారు చేశాడు. కశ్మీరులోని సమస్త సంస్కృత గ్రంథాలతో ఆ సరస్సును నింపేశాడు. ఆ సరస్సులో పుస్తకాలన్నీ మిడుతలు ఒక్క చోటకి చేరినట్టు చేరాయి. సరస్సులో వాటిని నింపిన తరువాత, వాటన్నింటి పై మట్టి వేసి నొక్కించాడు. దాంతో నెమ్మదిగా పుస్తకాలు శిధిలమై మట్టిలో కలసిపోయాయి.
శవాలను పాతిపెట్టినట్టు పుస్తకాలను పాతిపెట్టించి, మట్టిలో కలిపేశాడన్న మాట సికందర్ బుత్షికన్. శ్రీవరుడు ‘పుస్తకాలు’ అనినా, ‘బహరిస్తాన్’ సంస్కృత పుస్తకాలు అని స్పష్టంగా చెప్పింది. వాటిని ఎలా సరస్సులో నింపాడంటే మిడుతల దండులా. మిడుతలు దట్టమైన గుంపులా వస్తాయి. మిడుతలు చెడ్డవి. పంటలను నాశనం చేస్తాయి. సంస్కృత పుస్తకాలు మిడతలు. మిడుతల దండును నశింపచేసినట్టు వాటిని నాశనం చేయాలి. లేకపోతే మిడుతలు పంటను నాశనం చేసినట్టు ఈ సంస్కృత పుస్తకాలు కొత్తగా మతం మారిన వారిని పాడుచేస్తాయి. ఇంకా మతం మారని వారికి శక్తిని ధైర్యాన్ని ఇస్తాయి. కాబట్టి నష్టం కలిగించే ఈ సంస్కృత పుస్తకాలను మిడుతల దండును నాశనం చేసినట్టు నాశనం చేయాలి.
శ్రీవరుడు పుస్తకాలు కాల్చటం గురించి చెప్తాడు. ‘బహరిస్తాన్’ సంస్కృత గ్రంథాలను పాతిపెట్టటం గురించి చెప్పింది. ఏ రాయి అయితేనేం?
ఇలా ఎన్నెన్ని అమూల్యమైన అపురూపమైన గ్రంథాలు నాశనం అయిపోయాయో! కొన్ని గ్రంథాలు ఉన్నట్టు మనకు అందుతున్న గ్రంథాలలోని వాటి ప్రస్తావన ద్వారా తెలుస్తోంది. ప్రస్తావన లేని గ్రంథాలన్నీ ఎల్లప్పటికీ అదృశ్యం అయిపోయాయి. ఇదొక సాంసృతిక ఆత్యాచారం. ఒక గ్రంథం లేకుండా, ఒక భాష లేకుండా చేయటం ద్వారా సంస్కృతిని నశింపచేసి తమ ఆధికారాన్ని నిలుపుకోవటం ఇది. ఎదుటివాడి అస్తిత్వం సంపూర్ణంగా నశిస్తే కాని తన అస్తిత్వానికి ప్రమాదం తొలగదన్న పిరికి వాళ్లు, ఆత్మవిశ్వాసరహితులు చేసే పిరికి అమానుష అకృత్యం ఇది.
తస్మిన్ కాలే బుధాః సర్వే మౌసులోపద్రవాజ్జవాత్।
గృహీత్వా పుస్తకాన్ సర్వాన్ యయుర్దూరం దిగన్తరమ్॥
(శ్రీవర రాజతరంగిణి, పంచమ సర్గ, 76)
ఆ కాలంలో ముసల్మానుల త్రీవ ఉపద్రవాల నుంచి తప్పించుకునేందుకు విజ్ఞులు తమ పుస్తకాలను తీసుకుని కశ్మీరు కదలి వేరే దూర దేశాలు పారిపోయారు.
‘దిగంతం’ అంటే దిక్కులు కలిసే చోటు. ‘దూరం దిగన్తరమ్’. ఎంతో దూరం పారిపోయారు. దూరదేశాలు పారిపోయారు. ఎలా పారిపోయారంటే అన్ని పుస్తకాలనూ తీసుకుని పారిపోయారు. దేన్నుంచి పారిపోయారు. మౌసులోపద్రవం నుంచి. ముసల్మానులను శ్రీవరుడు ‘మౌసుల’ అన్నాడు.
భారతీయులు మరచిపోకుండా, అనుక్షణం స్మరిస్తుండాల్సిన సంఘటనలివి. ఈనాడు ఆ కాలంలో జరిగిందంతా కప్పిపెట్టి మేధావులు చరిత్రలో అసలు భారతీయులపై అత్యాచారాలే జరగనట్టు, కేవలం అగ్రవర్ణాల వారు మాత్రమే అత్యాచారాలు చేశారన్నట్టు ప్రచారం చేస్తూ అన్నింటికి వారిని బాధ్యులుగా చేస్తూ విద్వేష భావనలను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. జోనరాజు, శ్రీవరుడు రచించిన రాజతరంగిణిలు, కల్హణుడి రాజతరంగిణిలో చివరి తరంగాలు వీరి ప్రచారంలోని డొల్లతనాన్ని నిరూపిస్తాయి. ఆ కాలంలో తమ ధర్మాన్ని నిలుపుకుందుకు ప్రాణాలు అరచేత పట్టుకుని పారిపోవటమే కాదు తమ గ్రంథాలను సైతం రక్షించుకుని వెంటతీసుకుని పారిపోవాల్సి వచ్చింది. అలా ఎన్నో గ్రంథాలు పోగా, మిగిలిన గ్రంథాలను మనం ప్రస్తుతం అధ్యయనం చేస్తున్నాం. వారు ప్రాణాలొడ్డి కాపాడిన గ్రంథాలను ఈనాడు పనికిరానివిగా భావించి పరాయి గ్రంథాలు చదవటమే ‘పరువు’గా భావించి ఆనాడు రక్షించిన గ్రంథాలను ఈనాడు మూర్ఖత్వంతో వ్యర్థం చేస్తున్నాం. కొన్నాళ్లకు గ్రంథాలున్నా, చదివేవారు లేని పరిస్థితులు కల్పిస్తున్నాం.
(ఇంకా ఉంది)