[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]
పంచమ సర్గః
సౌరాజ్య సుఖితే దేశే విద్యాభ్యాసపరాయణః।
అకాండక్షీత్ సర్వదారోగ్యం నృపతేః స్వస్య చాహ్వహమ్॥
(శ్రీవర రాజతరంగిణి, పంచమ సర్గ, 68)
రాజు సుపరిపాలనతో సుఖంగా ఉన్న ప్రజలు విద్యాభ్యాస పరాయణులు. దేశంలో ప్రజలు ప్రతిరోజు తమ రాజు సర్వదా ఆరోగ్యవంతుడై చిరకాలం జీవించాలని అభిలషించేవారు. దేవుడిని ప్రార్థించేవారు.
“Reading between the lines” అన్న మాట ఉంది. అంటే, పదాలలో చెప్పినదాన్ని కాక, చెప్పేదాన్ని, పదాలలో నిగూఢంగా పొందుపరచిన దాన్ని గమనించాలని అర్థం. ఇక్కడ శ్రీవరుడు చెప్పినది సర్వసాధారణమే అనిపిస్తుంది. రాజు మంచివాడు. ప్రజల అవసరాలు తీరుస్తున్నాడు. వారి అభివృద్ధికి తగిన చర్యలు తీసుకుంటున్నాడు. విద్యలను ప్రోత్సహిస్తున్నాడు. పండితులను గౌరవిస్తున్నాడు. దానధర్మాలు చేస్తున్నాడు. అలాంటి ప్రభువు చిరకాలం జీవించాలని, ఆయురారోగ్యాలతో చిరంజీవిగా జీవించాలని ప్రార్థించని ప్రజలుండరు.
కానీ శ్రీవరుడు వాడిన ‘సురాజ్య’, ‘విద్యాభ్యాసపరాయణ దేశ ప్రజలు ’ అన్నవి ఈ reading between the lines కు అర్హమైనవి. శ్రీవరుడు, మనం గతంలో అనుకున్నట్టు భారతీయ దృక్కోణాన్ని తన రచనలో ప్రదర్శించాడు. జోనరాజు, శ్రీవరుడి రచనలను బట్టి ఆ కాలంలో జైనులాబిదీన్ ఆదరణ కెంద్రంగా పర్షియన్ పండితులకు, సంస్కృత పండితులకు నడుమ ఉద్విగ్నతలుండేవని తెలుస్తోంది. అలాగే జైనులాబిదీన్ ఇస్లామేతరులను ఎంతగా చేరదీస్తుంటే, వారికి భద్రతతో పాటుగా ఇతర సౌకర్యాలు కల్పిస్తూంటే, అంతగా, అతని పట్ల ఇస్లామీయులకు విముఖత, నిరసన, క్రోధం కలుగుతున్నాయన్నది పర్షియన్ రచయితల రాతల వల్ల తెలుస్తున్నది. ఈ రెండు విషయాలను కలిపి చూస్తే, శ్రీవరుడు పదాల మాటున దాచిన చేదు నిజం గ్రహించే వీలు కల్గుతుంది.
శ్రీవరుడు వర్ణిస్తున్నది జైనులాబిదీన్ భారతీయులకు చేస్తున్న మేలు గురించి. విద్యాభ్యాస పరాయణ దేశ ప్రజలు.. భారతీయులు. ఎందుకంటే శ్రీవరుడి దృష్టిలో ‘విద్య’ అంటే ఏమిటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తరువాతి శ్లోకాలలో ఈ విషయం మరింత స్పష్టమవుతుంది. అంటే, ఇస్లామేతరులంతా జైనులాబిదీన్ జీవించి ఉన్నంత కాలం, అధికారంలో ఉండి, ఆయన మాట చెల్లినంత కాలమే తమకు కశ్మీరులో మనుగడ అని గ్రహించటం వల్ల, జైనులాబిదీన్ చిరకాలం ఆరోగ్యంతో జీవించాలని, రాజ్యం చేయాలని భగవంతుడిని ప్రార్ధించటం అర్ధం చేసుకోవచ్చు.
రాజ్యోత్పత్యా నృపస్తాద్రుక్ తుష్టోభూన్న ప్రతిష్ఠయా।
యథా పండితసామయా యామగ్ర్యా మవిదద్ గుణైః॥
(శ్రీవర రాజతరంగిణి, పంచమ సర్గ, 69)
రాజు విద్యావంతులను, పండితులను గౌరవించాడు. తన ప్రతిష్ఠ గురించి, ఇతర అంశాల కన్నా రాజు పండితుల ప్రతిష్ఠ, గుణాలు వంటి వాటినే సర్వోత్కృష్టంగా భావించాడు. అంటే, తాను సాధించిన ఇతర కార్యాలు, చేసిన మంచి పనుల కన్నా పండితులు, వారి ప్రతిష్ఠలను రాజు ఉత్తమంగా భావించాడన్న మాట.
రాజు అనేక ప్రజోపయోగ కార్యక్రమాలు చేశాడు. కానీ వాటన్నిటి కన్నా పండితులకు ఇళ్ళు కట్టించాడు. వారికి దానాలు చేశాడు. వారికి ఎన్నో సౌకర్యాలు కల్పించాడు. తాను చేసిన ఇతర ప్రజోపయోగ కార్యక్రమాల కన్నా రాజు తాను పండితులకు కల్పించిన సౌకర్యాలను ఉన్నతంగా భావించాడు. అంటే, విద్య అంటే రాజుకు ఎంత ఇష్టమో అర్థం చేసుకోవచ్చు.
యేషాం స్వప్నేపి పాండిత్యం నా భూజ్జాతుచిదన్వయే।
తేపి భూప ప్రసాదేన జాతాః పాండిత్య మండితాః॥
(శ్రీవర రాజతరంగిణి, పంచమ సర్గ, 70)
కలలో కూడా ‘పాండిత్యం’ గురించి ఊహించని వారు కూడా రాజు దయతో పండితులై పేరు ప్రఖ్యాతులు పొందారు.
కొన్ని కుటుంబలలో పాండిత్యం అన్నది పలు కారణాల వల్ల ఊహకు అందదు. అలాంటి వారు కూడా జైనులాబిదీన్ అందించిన ప్రోత్సాహంతో, పండితులయ్యారట. పేరు ప్రఖ్యాతులు పొందారట.
సాధారణంగా రాజుకు ఇష్టమైన దాన్ని ప్రజలు అనుసరిస్తారు. జైనులాబిదీన్‍కు పాండిత్యం, విద్య అంటే ఇష్టం. దాంతో రాజు మెప్పు కోసం ప్రజలందరూ ఆ వైపు దృష్టి పెట్టారు. దాంతో ‘పాండిత్యం’ అన్నది దరిదాపులకు కూడా రానివారు, కలలో కూడా ఊహించనివారు కూడా ఆ విషయమై కృషి చేశారు. పండితులయ్యారు. విద్యకు జైనులాబిదీన్ ఇచ్చిన ప్రాధాన్యాన్ని ఇది ఎత్తి చూపిస్తుంది.
(ఇంకా ఉంది)