Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

శ్రీవర తృతీయ రాజతరంగిణి-64

[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

పంచమ సర్గః

భూపతిర్భోజయన్ యోగి సహస్రం మీల దీక్షణమ్।
నిష్కంపమకరోన్నిత్యం కిం తృప్త్య కిం సమాధినా॥
(శ్రీవర రాజతరంగిణి, పంచమ సర్గ, 48)

వేల సంఖ్యలో యోగులకు రాజు ఎంత సంతృప్తిగా భోజనం అందించాడంటే తృప్తితో వాళ్ల కళ్లు మూతలు పడ్డాయి. ఇంతగా సంతృప్తి లభించిన యోగులకు ఇక సమాధి అవసరం ఏముంది?

గమ్మత్తయిన శ్లోకం ఇది.

ఒక్కో శ్లోకం చదుతుంటే శ్రీవరుడు ఎంతగా మనస్సు లోలోతుల్లోంచి జైనులాబిదీన్‌ను అభినందిస్తున్నాడో అర్ధమవుతుంది. అంతే కాదు, ఆ తరువాత మళ్లీ ఇక కాశ్మీరులో ఇలాంటి ‘అద్భుతం’ జరగదన్న గ్రహింపుతో, భవిష్యత్తు తరాలకు ఈ ‘అద్భుతం’ సజీవంగా అందాలన్న తపనతో మరింత విజృంభించి ఈ వర్ణనా శ్లోకాలు సృజించాడేమో అనిపిస్తుంది.

వేల సంఖ్యలో రాజు యోగులకు భోజనాలు సమకూర్చాడు. ఆ భోజనంతో యోగుల కళ్లు సంతృప్తితో మూతలు పడ్డాయట. సాధారణంగా, కడుపు నిండా తిన్న తరువాత కళ్లకు కునుకు వస్తుంది. ఎలాంటి వాడికయినా కళ్లు మూతలు పడతాయి. కూర్చునే కునికిపాట్లు పడతారు. కడుపు నిండా భోజనం అయిందనటానికి చక్కటి నిదర్శనం వెంటనే పట్టే కంటి నిండా నిద్ర.

అలా పట్టే నిద్ర ఎంత ప్రశాంతంగా, హాయిగా పట్టిందంటే, యోగులు ‘సమాధి’ సంగతి మరచిపోయారన్నమాట.

సమాధిస్థితి సాధించటం యోగుల అత్యున్నత లక్ష్యం. అంతిమ లక్ష్యం. సమాధిస్థితిలో వ్యక్తి ‘తాను’ అన్న స్పృహ కోల్పోతాడు. విశ్వంతో ఏకమవుతాడు. ‘తాను విశ్వం భిన్నం’ అన్న చైతన్యం కోల్పోతాడు. బ్రహ్మానందం అనుభవిస్తాడు. అత్యున్నత చైతన్యం అనుభవిస్తాడు. ‘అహం’ భావన చెదరి పోతుంది. మామూలు భౌతిక స్థాయిని దాటిపోతాడు.

‘గాఢ నిద్ర’లో కూడా వ్యక్తి ‘నేను’ అన్న స్పృహ కోల్పోతాడు. స్వప్న దశలో కూడా తనకు తానే ‘సాక్షి’గా నిలుస్తాడు. ‘గాఢనిద్ర’లో ఉన్న వాడికి ప్రపంచం స్పృహ ఉండదు. దాదాపుగా మరణ స్థితి, సమాధి స్థితి లాంటిది అది. సమాధి స్థితి చైతన్యవంతమైన స్థితి అయితే నిద్ర అన్నది అందుకు భిన్నమైన స్థితి. చైతన్యం వస్తే నిద్ర ఎగిరిపోతుంది. నిద్రకూ మరణానికీ తేడా అల్లా నిద్ర నుంచి మనిషి లేస్తాడు. మరణంతో ‘ఆ’ మనిషి అదృశ్యం అయిపోతాడు. అందుకే భారతీయ తత్త్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి ‘ప్రతి నిద్రనూ ఒక మరణం’తో, ‘నిద్ర లేవటాన్ని మరో జన్మ’తో పోల్చాడు. ప్రతి రోజు రాత్రి నిద్రను ‘మరణం’ అనుకోవాలి. ఉదయం నిద్ర లేవటాన్ని ‘జననం’ అనుకోవాలి. ఎలాగయితే మరణం తరువాత పొందిన మరో జన్మలో  గతం తాలుకు జ్ఞాపకాలు ఉండవో, అలాగే, ప్రతి రోజు నిద్ర లేవగనే, కొత్త జన్మ పొందినట్టు భావించి అంతకు ముందు రోజు తాలుకు జ్ఞాపకాలను, అసూయలను, ఆవేశాలను, ఆశలను, నిరాశలను  సంపూర్ణంగా మరచిపోయి కొత్తగా రోజును ఆరంభించాలి అంటాడు.

అలాగే శ్రీవరుడు కూడా, కడుపు నిండా భోజనం తినటం వల్ల యోగులకు పట్టే సుఖ, ప్రశాంతమైన నిద్ర వల్ల ఇక యోగసమాధి అవసరం లేదని, అంత శాంతమైన సంతృప్తికరమైన నిద్ర వారికి పట్టిందని అంతటి భోజనం అంటే సమాధి స్థితిని  మరపించేటటువంటి భోజనం జైనులాబిదీన్ వారికి ఏర్పాటు చేశాడనీ సూచిస్తున్నాడు.

ఆహారమను తీవ్రోద్యత్కీర్త్యా రసవతీశ్రియా।
దివీవ క్రియతే యత్ర సర్వా రసవతీ ప్రజా॥
(శ్రీవర రాజతరంగిణి, పంచమ సర్గ, 49)

మహారాణి ‘శ్రీ’ అందరికీ ఎంత సంతృప్తికరంగా భోజనం ఏర్పాట్లు చేసిందంటే, అందరికీ స్వర్గం తలపుకు వచ్చింది. అందరినీ రసవంతులను చేసింది.

ఇక్కడ శ్రీవరుడు రసవతి అన్న పదంతో గమ్మత్తు చేశాడు.

‘రసవతి’ అంటే శుద్ధ స్వరవతి రాగిణి అన్న అర్థం వస్తుంది. ‘రసవతీ’ అంటే పలు రసాలను తయారు చేసే వంటశాల అన్న అర్థం కూడా వస్తుంది.

పక్వాన్నరాశయోదభ్రా యత్రాభ్రమాభ్రమప్రదా।
విభ్రత్యభ్రభ్రమచ్ఛుభ్ర శరదభ్ర శ్రియో పమామ్॥
(శ్రీవర రాజతరంగిణి, పంచమ సర్గ, 50)

ఇది కూడా గమ్మత్తయిన శ్లోకం

‘భ్ర’ పదప్రయోగం అత్యంత ఆనందం కలిగిస్తుంది.

‘పక్వాన్న రాశి’, వండిన అన్నం రాశి ఐరావత ఏమగు సహచరి అన్న భ్రమ కలిగించిందట. రాశులు పోసిన అన్నం ఆకాశంలో విహరించే శుభ్ర శారద ఋతువుల మేఘాలతో సమానంగా శోభించిందట.

యత్రాధర్మమృగం హన్తుం శృంగనాదమిపాద్ ధృవమ్।
సంమిలత్సార సారావం శ్రూయతే మృగయారవః॥
(శ్రీవర రాజతరంగిణి, పంచమ సర్గ, 51)

వేటగాడు వేటాడే ధ్వనులు, పక్షులు కలకలరావాలు జంతువు మరణించటాన్ని సూచించినట్టు, పాపం నాశనమవుతున్నట్టనిపించింది.

భోజనం చేస్తూ వారు చేస్తున్న ధ్వనులు, వేటలో జంతువు మరణించినప్పుడు, గాలికి ఎగిరి పక్షులు చేసే కలకలం ధ్వనులను పోలి ఉన్నాయి. అవి పాపాలు పటాపంచలవుతున్న ధ్వనులుగా రాజు భావించాడని ఒక వ్యాఖ్య. కానీ ఎందుకో ఈ శ్లోకానికి ఇక్కడ అన్వయం కుదరదు. భోజన శబ్దాలను వేట శబ్దాలతోనూ, మరణించే జంతువుల శబ్దాలతోనూ పోల్చటం నప్పదు. కానీ, కడుపునిండా భోజనం పెట్టటం అనేది ఒక పుణ్య కార్యం. అక్కడివారు కడుపునిండా భోజనం చేయటంవల్ల తన పాపాలు నశిస్తున్నాయని రాజు భావించటం స్వాభావికం. కానీ, భోజన శబ్దాలను చచ్చే జంతువుల శబ్దాలతో పోల్చటమే ఇబ్బందిగా అనిపిస్తుంది.

సామోదకామ్ నిర్ముక్తమోదకా యత్ర యోగినః।
శ్రమధర్మోదకా జగ్ధేర్జాతా రాజ్ఞాః ప్రమోదకాః॥
(శ్రీవర రాజతరంగిణి, పంచమ సర్గ, 52)

యోగిస్ఫురత్కరక్లిష్ట దధిదిగ్ధాశనచ్ఛలాత్।
యోగాచ్ఛశికలాస్రా వాస్తత్రై వాన్త ఇవాద్యుతన్॥
(శ్రీవర రాజతరంగిణి, పంచమ సర్గ, 53)

ఆనందంతో భోజనం చేస్తున్న యోగులకు పట్టిన చెమట రాజును ప్రసన్నం చేసింది. వేళ్ల కంటిన పెరుగును వాళ్లు నాకుతుంటే చిందిన పెరుగు చుక్కలు వారి యోగ శక్తి వల్ల చంద్రవంక కరిగి చుక్కలు ఏర్పడ్డట్టు అనిపిస్తోంది.

శ్రీవరుడు భోజనం విషయంలో దేన్నీ వదలి పెట్టటం లేదు. చివరికి భోజనం చేసే సమయంలో పట్టే చెమటనూ వర్ణిస్తున్నాడు. చేతికంటిన పెరుగు నాకేటప్పుడు చిందే బిందువులనూ వర్ణిస్తున్నాడు.

యోగులు సంతృప్తిగా భోజనం చేయటాన్ని చూస్తూ  జైనులాబిదీన్ ఎంతగా ఆనందించాడో, అలా ఆనందిస్తున్న రాజును చూసి శ్రీవరుడు ఇంకా ఎంతో ఆనందించినట్టున్నాడు.

మారీ నామ్ నదీ తస్మాద్ వితస్తాన్త రమాగతా।
కేవలం యాభవత్ పౌరస్నానపాన ప్రయోజనమ్॥
(శ్రీవర రాజతరంగిణి, పంచమ సర్గ, 54)

వితస్తలో మిళితమయ్యే ‘మారీ’ అన్న నది నీటిని పురవాసులు స్నానపానాలకు వాడతారు.

పేర్లు కాలక్రమేణా ఎలా మారతాయో, కల్హణుడి రాజతరంగిణి నుంచి శ్రీవరుడి రాజతరంగిణి దగ్గరకు వచ్చే సరికి స్పష్టమవుతుంది.

శ్రీవరుడు ‘మారీ’గా ప్రస్తావించిన నది అసలు పేరు ‘మహాసరిత’. రాను రాను మహాసరిత ‘మారీ’ అయింది. శ్రీవరుడు కూడా ‘మారీ’ అనే ఆ నదిని ప్రస్తావించాడు. ఈ మారీ నదిపై ఏడు వంతెనలుండేవి. ఈ నది వితస్తలో కలిసే వరకూ ఇరవైపులా ఉన్న గ్రామాలకు ఈ నీరే ఆధారం. ఈ నదిని పొడిగించి వితస్తలో కలిసేట్టు కాలువలు నిర్మించింది జైనులాబిదీన్. అయితే ఈ నది ఒక పాయను మరో వైపు ‘షాదీపూర్’ దాకా విస్తరింపజేసి సంగమంలో కలిపేశారు.

హస్తి కర్ణాభిదే క్షేత్రే యుక్త్యా రాజ్ఞా ప్రవేశితా।
సింధు సంగమ పర్యంతం నిర్మితా శాలినాలినీ॥
(శ్రీవర రాజతరంగిణి, పంచమ సర్గ, 55)

రాజు యుక్తిపూర్వకంగా ఈ నది హస్తికర్ణ వరకూ విస్తరింప చేసి షాలి కాలువతో కలిపాడు. దాన్ని వితస్త, సింధు నదుల సంగమం వరకూ పొడిగించాడు.

మృతానం దేహదాహేన స్వర్గదో నగరాన్తరే।
స మారీ సంగమ ఖ్యాతో జాతః సంగాద్ వితస్తయా॥
(శ్రీవర రాజతరంగిణి, పంచమ సర్గ, 56)

వితస్త సింధు నదుల సంగమస్థలి నగరంలో మృత్యువాత పడిన వారి దహన సంస్కారాలు జరిపే స్థలంలా, స్వర్గానికి రహదారిలా మారింది.

నదుల సంగమం స్థలాలు భారతీయులకు అతి పవిత్ర స్థలాలు. శవదహనం ఎక్కడ జరిపినా అస్థికలు, భస్మం సంగమ జలాలలో కలిపితే స్వర్గం చేరుకునట్టుగా భావిస్తారు.

కశ్మీరులో మహాసరిత (మారీ) వితస్తల సంగమ స్థలంలో శ్మశానం ఉన్నట్టు కల్హణ రాజతరంగిణి లోనూ ఉంది. ఉచ్చల రాజు శవదహన సంస్కారాలు ఈ శ్మశానంలోనే జరిగినట్టు కల్హణుడు రాశాడు. శ్రీవరుడు కూడా ఆ ప్రస్తావన చేస్తుండటంతో క్రీ.శ. నాలుగవ శతాబ్దం నుండి శ్రీవరుడి రాజతరంగిణి రచనా కాలం పదిహేనవ శతాబ్దం వరకు కూడా అక్కడ శ్మశానం ఉన్నదని అనుకోవాల్సి వస్తుంది.

యత్ క్షేత్రపాలాః కాలేన కింకరా పంచవారికాః।
పౌరేభ్యః శవదాహోత్థమగృహ్ణన్ శుల్కమన్యహమ్॥
(శ్రీవర రాజతరంగిణి, పంచమ సర్గ, 57)

ఆ సమయంలో క్షేత్రపాలుడు, పంచవారికలు, సేవకులు, పౌరులు నుంచి ప్రతి రోజూ శవదహనానికి రుసుము (శుల్కం) వసూలు చేసేవాడు.

ఆనాడు భారతీయులు జీవించేందుకే కాదు, మరణించిన వారికి దహన సంస్కారాలు చేసేందుకు కూడా పన్నులు కట్టాల్సి వచ్చేది. జిజియా పన్ను సంగతి అందరికీ తెలుసు. ఇస్లాం పాలన ఉన్న రాజ్యాలలో ఇస్లామేతరుల రక్షణకు వారు ప్రభుత్వానికి కట్టవలసిన పన్ను అది. దీని ప్రస్తావన పవిత్ర ఖురాన్‌లో ఉంది. కానీ ‘ఎంత?’ అన్న విషయం లేదు. దాంతో సుల్తాన్‌ని బట్టి, వారి ఇష్టాయిష్టాన్ని బట్టి జిజియా పన్ను ‘రేటు’ ఉండేది. ‘ఇంత’ అని నిర్దిష్టమైన రేటు లేకపోవటంతో ఎవరికి వచ్చినట్టు వారు సందర్భాన్ని పరిస్థితిని బట్టి ‘జిజియా’ వసూలు చేసేవారు.

ఆ కాలంలో ఎవరినయినా మతం మార్చాలని నిశ్చయించుకుంటే, వారి శక్తికి మించిన  జిజియా కట్టమనేవారు.  వారు  కట్టలేకపోతే  ఆస్తులన్నీ లాక్కునేవారు. హింసించేవారు. జిజియా పన్ను నుంచి తప్పించుకోవాలంటే కట్టటమో, మతం మారటమో తప్ప మరో మార్గం ఉండేది కాదు. ఇలా ఔరంగజేబు కాలంలో అధిక సంఖ్యలో మత మార్పడికి ‘జిజియా’ ఒక ఆయుధంలా ఉపయోగపడింది.

అలాగే ఇస్లామీయులు శవాన్ని దహనం చేయరు. భారతీయులలో ‘శవదహనం’ సాధారణం. ఇస్లామీయులు  అధిక సంఖ్యలో ఉన్న ప్రాంతాలలో వారు శవదహనాన్ని వ్యతిరేకించేవారు. పాలన మారింది. ఇస్లామీయుల పాలనలో  కూడా కొనసాగుతూ  వస్తున్నది ఆచారం. పైగా జిజియా పన్ను కట్టినవాడు తన ధర్మాన్ని ఆచరించుకోవచ్చు. కాబట్టి శవదహనాన్ని కాదనే వీలు లేదు. అందుకని శ్మశానంలో శవదహనంపై పన్ను విధించేవారు. ఆ ప్రాంతానికి అధికారి క్షేత్ర పాలకుడికి పన్ను కట్టాల్సిందే. అలాగే ఆ ప్రాంతంపై ఆధికారం కల ప్రభుత్వద్యోగికి రుసుం చెల్లించాల్సిందే. లేకపోతే శవదహనానికి అనుమతి లభించదు. శవం దహనం చేయకపోతే ఘోర అపచారం, ముందు మనస్సాక్షి ఒప్పుకోదు. కాబట్టి శవదహనం తప్పదు. శుల్కం కట్టక తప్పదు. ఈ పరిస్థితిని శ్రీవరుడు వివరిస్తున్నాడు. శ్రీవరుడు రాజతరంగిణిలో రాయకపోతే కశ్మీరులో ఇలాంటి పన్నును వసూలు చేసేవారని తెలిసేది కాదు. పన్నుకట్టి శవ దహనం చేయకపోతే కులం పోతుంది. వెలవేతకు గురవాల్సివస్తుంది.

జోనరాజు రాజతరంగిణిలో ఈ ‘శవదహన పన్ను’ పద్దతిని జైనులాబిదీన్ తండ్రి ‘సికందర్ బుత్‌షికన్’ ప్రవేశపెట్టాడన్న విషయం తెలుస్తుంది. కశ్మీరులో ఇస్లామేతరుడన్న వాడు లేకుండా చేయాలన్నది ‘సికందర్ బుత్‌షికన్’ లక్ష్యం. ఆయన పాలన కాలం సమాప్తమయ్యే సరికి కశ్మీరులో బిక్కుబిక్కుమంటూ తమ జన్మభూమిని మొండిగా పట్టుకుని వ్రేలాడే 13 పండిత కుటుంబాలు మాత్రమే మిగిలాయి. జైనులాబిదీన్ వల్ల శ్రీవరుడుతో సహా పండిత కుటుంబాలు అనేకం కశ్మీరులో మళ్లీ పునర్నివాసం పొందాయి. భద్రంగా జీవించగలిగాయి.

అయితే జైనులాబిదీన్ దృష్టికి రాకుండా ఈ శవదహన పన్ను ఇంకా కశ్మీరులో కొనసాగుతూనే ఉంది. భారతీయులను పలు ఇబ్బందులకు గురిచేస్తూనే ఉంది. ఈ పన్నును తొలగించటంలో శ్రీవరుడు ప్రధాన పాత్ర పోషించాడన్న విషయం తరువాత శ్లోకంలో తెలుస్తుంది.

(ఇంకా ఉంది)

Exit mobile version