Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

శ్రీవర తృతీయ రాజతరంగిణి-60

[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

పంచమ సర్గః

యదన్తరే సువిస్తీర్ణః సర్వదర్శన మండపః।
కాచభిత్తిమయో భాతి త్రయశ్ర సింహాసనోజ్జ్వలః॥
(శ్రీవర రాజతరంగిణి, పంచమ సర్గ, 10)

యద్గర్భాద్ ధూపసందర్భ నిర్భ రాన్నృప సంశ్రితాత్।
వాతోపి సఫలో యాతః ప్రాతర్ప్రాణ సుఖప్రదః॥
(శ్రీవర రాజతరంగిణి, పంచమ సర్గ, 11)

తన శేషజీవితం హాయిగా, సుఖంగా, ఆనందంగా, ఏ చీకూ చింతా లేకుండా గడపేందుకు జైనులాబిదీన్ తన కోసం ప్రత్యేకంగా కట్టుకున్న భవంతి వైభోగాన్ని, జైనులాబిదీన్ అనుభవించిన సుఖశాంతులను వర్ణిస్తున్నాడు శ్రీవరుడు.

జైనులాబిదీన్ నిర్మించుకున్న భవనం మధ్య విశాలమైన భాగంలో రాజు కొలుపు తీరేవాడు.

ఈ భవంతి నాలుగు వైపులా గాజుతో శోభాయమానంగా నిర్మితమయింది. ఆ సర్వదర్శన మండపంలో మూడు కోణాలు కల శిల్పమయమైన సింహాసనంపై రాజు కొలువు తీరేవాడు. ఆ సర్వదర్శన మండపంలో రాజ సేవకులు చేసే ధూపగంధ వ్యాప్తి వల్ల రాజప్రాసాదం పరిమళభరితమయ్యేది. అక్కడ వీచే గాలులు కూడా సుఖం కలిగిస్తూ, పరిమళభరితమయ్యేవి.

అదృష్టవంతుడు జైనులాబిదీన్! అతని భవన వర్ణన అద్భుతంగా ఉంది. బంగారు సింహాసనంపై విశాలమైన సర్వదర్శన మండపంలో కూర్చుని పాటలు వింటూ నృత్యాలు చూస్తూ, శ్రీవరుడు భోధించే శాస్త్రాలు గ్రహిస్తూ, సువాసన భరితమై సుఖప్రదంగా వీచే గాలులు సౌఖ్యం అనుభవిస్తూ శేషజీవితాన్ని తాను ప్రత్యేకంగా నిర్మించుకున్న భవంతిలో గడిపాడు జైనులాబిదీన్.

ఈ శ్లోకంలో ‘సర్వ దర్శనం’ అన్న పదం అసందర్భోచితమైన ఆలోచనలను కలిగిస్తుంది.

ఇక్కడ శ్రీవరుడు జైనులాబిదీన్ ఆ మండపంలో కూర్చుని సామాన్యులను, సభికులను కలిసే సందర్భంలో ‘సర్వ దర్శనం’ అన్న పదం వాడాడు.

‘సర్వ దర్శనం’ అనగానే ప్రస్తుతం మనకు గుళ్లల్లో, ముఖ్యంగా తిరుపతిలోని ‘ఉచిత దర్శనం’ గుర్తుకు వస్తుంది.

శ్రీవరుడు ఈ ‘సర్వదర్శనం’ అన్న పదం రాజు, ప్రజలందరినీ స్వేచ్ఛగా, ఉచితంగా కలసే సందర్భంలో వాడేడు.

అంటే, మిగతా సందర్భాలలో అందరనీ కాక కొద్దిమంది ఎంపిక చేసిన వారిని కలిసే వాడన్నమాట.

‘దర్శనం’ అంటే చూడటం, కనబడటం, ప్రకటితమవటం అన్న అర్థాలతో పాటు ఆరు సాంప్రదాయ తత్త్వాలు కూడా గుర్తుకు వస్తాయి.

అంటే మనం చేసుకునే దైవ దర్శనం అత్యంత ఆధ్యాత్మిక, అదిభౌతిక, ధార్మిక,  తాత్విక అర్థాన్ని తనలో పొదుగుకుని ఉందన్నమాట.

గుళ్లలో ‘సర్వ దర్శనం’ అంటే ఉచిత దర్శనం అన్న ఆలోచన స్థిరపడింది కానీ, ఆలయంలో భగవంతుడి దర్శనం అంటే అన్ని తత్వాలను, సమస్త విశ్వాన్ని దర్శించటం అన్న అత్యంత లోతైన ఆధ్యాత్మిక భావన మరుగునపడింది. ఆభావన కలిగే వీలుకూడా మనగుళ్ళల్లో లేదు.

అదీగాక, ఒకటి ఉచిత దర్శనం అయితే, మిగతావి ‘అనుచిత దర్శనాలు’ కావాలి.

గమనిస్తే, సుల్తాన్ ప్రజలందరితో, ఎలాంటి భేదభావాలు, తేడాలు లేకుండా స్వేచ్ఛగా కలవటాన్ని శ్రీవరుడు ‘సర్వదర్శనం’ అన్నాడు.

రాజు కాబట్టి ప్రజలకు ‘సభ’లో ఇచ్చే ‘స్వేచ్ఛాదర్శనం’ గా భావించవచ్చు. అంటే సామాన్యులు కూడా రాజును దర్శించే వీలున్న సమయం అన్నమాట.

కానీ ‘దైవం’ ఇలా సర్వ దర్శనాలు, ధర్మ దర్శనాలు ఇవ్వటం అనౌచిత్యమే కాదు, అర్థరహితం కూడా! ఎందుకంటే, దైవం రాజు కాదు. దైవానికి రాచకార్యాలుండవు. మంత్రులను, చారులను ప్రత్యేకంగా కలవాల్సిన అవసరం దైవానికిలేదు. సర్వాంటర్యామి ఆయన. కాబట్టి ఆయన దగ్గర వీఐపీలకు ప్రత్యేక దర్శనాలు, మంత్రులకు ప్రత్యేక సమయాలు ఉండటం అనవసరం, అసందర్భం, అనౌచిత్యం, అన్యాయం కూడా!

మామూలు సమయాలల్లో దర్శనం ఇవ్వటానికి రాజో, మంత్రియో రుసుము వసూలు చేసి, కొద్ది సమయాల్లో ఉచిత దర్శనం ఇస్తే ఎంత అసహ్యంగా, అర్థరహితంగా ఉంటుందో, దైవ దర్శనం కోసం కూడా ఉచిత దర్శనం, వంద రూపాయల దర్శనం, మూడు వందల దర్శనం, విఐపి దర్శనం వంటి విభిన్నమైన దర్శన విభజనలు చేయటం, హాస్యాస్పదమే కాదు అసహ్యంగా కూడా ఉంటుంది.

‘దైవం’ దగ్గర అందరూ సమానమే.

ఎలాగయితే, మృత్యువు- ధనికుడు, రాజు, పండితుడు, సేవకుడు, మూర్ఖుడు అన్న వివక్షత చూపదో, అలాగే ‘దైవం’ దగ్గర కూడా వివక్షత ఉండదు. కానీ మన మందిరాలు వ్యక్తి సామాజిక స్థాయిని బట్టి ‘దైవదర్శన’ స్థాయి – అని నిర్ణయించటం అన్యాయం. దాన్ని అమలు పరచం అసహ్యం. దాన్ని ప్రజలు ఆమోదించటం మూర్ఖత్వం. ఇది భక్తుల భక్తిని, భక్తుల అమాయకత్వాన్ని దైవం పేరు చేప్పి వ్యాపారం చేయటమే అవుతుంది. సృష్టిలోని అణువణువున భగవద్దర్శనం చేయగలగటము అత్యుత్తమ స్థితిగా భావించే ధర్మంలో, డబ్బు ఇస్తేకానీ దర్శనం సులభంగా లభించని వ్యవస్థను నడిపిస్తున్నామన్నమాట !

గమనిస్తే, ఈ టిక్కెట్ దర్శనాలు ఆధునిక కాలంలో ఆరంభమయిన వికృతి. దేవాలయాల చరిత్రను గమనిస్తే, ఎప్పుడూ ఇలాంటి టిక్కెట్ దర్శనాలు లేవు. దేవాలయాలు ఆధ్యాత్మిక, సాంసృతిక, ధార్మిక భావాలకు కేంద్రాలు. వ్యాపార కేంద్రాలు కావు. రాజులు దేవాలయాలకు దానాలిచ్చేవారు. వాటి నుంచి వచ్చే ఆదాయం ఆ దేవాలయాలకు ఆధారం. అంతే తప్ప సామాన్యుల నుంచి దర్శనాలకి ధనం వసూలు చేసి, ధనం బట్టి దర్శనం అన్న పద్ధతులెప్పుడూ లేవు. నిజానికి ప్రాచీన కాలంలో క్యూ కాంప్లెక్సులూ, ఇనుప బార్లు భక్తులను నియంత్రించేవి కావు. అది ఆధునిక వ్యాపార మేధ సృష్టించిన వికృతి. దేవాలయాలలో దైవాన్ని ఒక ప్రదర్శన వస్తువు చేసి, దేవాలయాన్ని ఒక ప్రదర్శనశాల చేసి,  దైవ దర్శనాన్ని  వ్యాపారం చేసి దైవభావనను అపహాస్యం చేస్తున్నది ఆధునిక సమాజం. ఒక రాజు ప్రజలకు అప్పుడప్పుడు ‘సర్వ దర్శనం’ ఇవ్వటంలో అర్థం ఉంది. దైవం టిక్కెట్ దర్శనం ఇవ్వటం మొత్తం ధర్మాన్నే అపహాస్యం చేసే విషయం. దైవం దగ్గర సమానత్వం ప్రదర్శించలేని ధర్మం, ఇక నిత్య జీవితంలో ఎలాంటి సమానత్వం సాధిస్తుంది?

కదాచిల్లాహరం దుర్గం యాత్రాం ద్రష్టుం గతో నృపః।
రాజవాసం నవం కృత్వా జీర్యోద్ధార మకారయత్॥
(శ్రీవర రాజతరంగిణి, పంచమ సర్గ, 12)

ఒకసారి రాజు లోహరం ప్రయాణమయ్యాడు. లోహరం కోట దగ్గర జీర్ణమైన భవనాలను పునరుద్ధరించాడు. నూతన రాజభవనాలను నిర్మించాడు.

ఇక్కడి నుంచి శ్రీవరుడు, తన చివరి దశలో జైనులాబిదీన్ చేపట్టిన నిర్మాణాలను ప్రజోపయోగ కార్యాక్రమాలను వర్ణిస్తాడు. అధికారికంగా రాజు జైనులాబిదీన్ అయినా, రాజ్యకార్యభారం కొడుకుకు అప్పగించి, రాజు దేశపర్యటన చేస్తూ ప్రజోపయోగ కార్యక్రమాలు చేపట్టాడు.

సముద్రకోటాదారంభ్య యావచ్చీద్వారకావధి।
తత్తన్నవనవా వాసవాసనాలయ సుందరాన్॥
(శ్రీవర రాజతరంగిణి, పంచమ సర్గ, 13)

జైననామాంక్తితాన్ గ్రామానకరోన్నగ భూషితాన్।
ఉపతీరం మహాపద్మ శ్రీమత్పన్నగ భూషితాన్॥
(శ్రీవర రాజతరంగిణి, పంచమ సర్గ, 14)

మహాపద్మ సరస్సు వెంబడి, చెట్ల నీడలో అనేక గ్రామాలను నిర్మించాడు. సుభద్రకోట నుండి శ్రీద్వారక వరకూ నిర్మించిన  ఈ అందమైన, ఇంద్రుడి భవనాలల్లాంటి ఈ గృహ సముదాయాలను ‘జైననగరం’ అన్న పేరుతో పిలిచారు. ఇలాంటి ఏడు గ్రామాలను నిర్మించాడు.

‘సుభద్ర కోట’ అన్నది ఇప్పటి ‘సుందర్ కోట్’. ఊలూరు సరస్సు తీరప్రాంతంలో ఉంటుంది. ‘శ్రీద్వారక’ అన్నది ప్రస్తుతం ‘అందర కోట్’ గా గుర్తించారు.

తదన్నసత్రతృప్తానామర్థినాం త్రిపురేశ్వరే।
ఉదరం మేదురం క్షాన్తో రాజా లంబోదరః కథమ్॥
(శ్రీవర రాజతరంగిణి, పంచమ సర్గ, 15)

త్రిపురేశ్వరంలో రాజు నిర్మించిన అన్నసత్రంలో భోజనం చేసి తృప్తులవటంతో రాజు లంబోదరుడయ్యాడు.

గమ్మతయిన  శ్లోకం ఇది.

‘త్రిపురేశ్వరం’ అన్నది శ్రీనగరంలో ‘దాల్’ సరస్సు నుండి మూడు మైళ్ల దూరంలో ఉండే తీర్థంగా భావిస్తున్నారు. ఇక్కడ, కశ్మీరు సుల్తాను పాలనలోకి రాక ముందరి రాజులు నిర్మించిన బ్రహ్మండమైన అన్నసత్రం ఉండేది. ప్రాచీన కాలంలో రాజులు, పలు  ప్రాంతాలలో అన్నసత్రాలు నిర్మించారు. ప్రయాణీకులు, ఇతర దేశాల నుంచి వచ్చేవారికి ఇక్కడ ఉచిత వసతి, భోజన సౌకర్యాలు లభించేవి. సుల్తానుల  కాలంలో ఇవి అదృశ్యం అయ్యాయి. వీటి స్థానాలలో, ఇస్లాం ప్రయాణీకులకు మాత్రమే సౌకర్యాలు అందించే ‘కన్‍ఖా’లు వెలిశాయి. కానీ జైనులాబిదీన్ శ్రీవరుడితో సహా, ఇతర  పండితుల ప్రభావంతో కశ్మీరలో అదృశ్యమైన అన్నసత్రాల వ్యవస్థను పురనరుద్ధరించాడు. అన్నసత్రాల భవనాలు నిర్మించాడు. ఆ రాజు నిర్మించిన అన్నసత్రాలలో భోజనం చేసిన ప్రజలు సంతృప్తులయ్యేవారు. వారి సంతృప్తితో రాజు లంబోదరుడు అయ్యాడని అంటున్నాడు శ్రీవరుడు. లంబోదరుడంటే వినాయకుడు. వినాయకుడి ‘పొట్ట’ సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జైనులాబిదీన్ లంబోదరుడుయ్యాడని అనటంతో ‘సంతృప్తితో ఆయన పొట్ట ఉబ్బిపోయింద’ని చెప్పటం అవుతుంది. నిండినది యాత్రికుల పొట్ట. లంబోదరుడయ్యింది రాజు.   యాత్రికులు ఎంత సంతృప్తితో భోజనం చేశారో అర్థం అవుతుంది.

అన్నసత్రే క్షితీశాన్నైర్వరాహక్షేత్రే భూమిషు।
అస్తు నమ్ర శిరాః శేషశ్చిత్ర మింద్రోపి చాభవత్॥
(శ్రీవర రాజతరంగిణి, పంచమ సర్గ, 16)

వరాహక్షేత్రంలో జైనులాబిదీన్ నిర్మించిన అన్నసత్రంలో అందించిన భోజనం బరువుకి అనంతశేషుడి శిరస్సు వంగిపోయింది. ఆశ్చర్యంతో ఇంద్రుడు చకితుడయ్యాడు.

మత్స్యేభ్యో నిత్యతృప్తేభ్యః సూక్ష్మాణామభయం దదో।
మత్స్యానామన్నసత్రేణ వితస్తాసింధుసంగమె॥
(శ్రీవర రాజతరంగిణి, పంచమ సర్గ, 17)

వితస్త, సింధునదుల సంగమ స్థలంలో నిర్మించిన అన్నసత్రంలోని భోజనంతో నిత్యతృప్తులయిన  పెద్ద చేపలు చిన్న చేపలకు అభయం ఇచ్చాయి.

పెద్ద చేపలు చిన్న చేపలను వెంటాడుతాయని అందరికీ తెలుసు. కానీ అన్నసత్రాలలో భోజనం ఎంత తృప్తిగా లభించేదంటే, చెరువులలో పెద్ద చేపల కడుపులు నిండిపోయేవి. దాంతో అవి చిన్న చేపలను తినటం మానేసి వాటికి అభయం ఇచ్చేశాయి. అంత తృప్తిగా భోజనం లభించేదన్నమాట అన్నసత్రాలలో. మనుష్యులకే కాదు, ఇతర జీవాలకు కూడా తృప్తిగా ఆహారం లభించేదన్నమాట.

అర్థినామతితృప్తానం శ్రీశంకరపురే నృపః।
అపేక్ష్య విదధే ఛాయాం న ఫలాని మహీరుహమ్॥
(శ్రీవర రాజతరంగిణి, పంచమ సర్గ, 18)

శంకరపురంలో అత్యంత తృప్తులయిన వారి అభ్యర్థనను అనుసరించి రాజు దారికి ఇరువైపుల నీడనిచ్చే చెట్లు, కానీ ఫలాలను ఇవ్వని చెట్లను నాటించాడు.

జైనులాబిదీన్ గొప్పతనాన్ని వర్ణించే సందర్బాలలో శ్రీవరుడు మైమరచే ఆనందాన్ని పొందుతాడనిపిస్తుంది ఈ శ్లోకాలను చదువుతూంటే.

శంకరపురంలో రాజు అన్న సత్రం నిర్మింపచేశాడు. ఆ అన్నసత్రంలో కడుపు నిండా భోజనం చేసిన వారు విశ్రమించేందుకు దారి కిరువైపులా నీడనిచ్చే చెట్లు నాటించమని కోరారు. వారు నీడనిచ్చే చెట్లను కోరారు, కానీ ఫలాలనిచ్చే చెట్లను కోరలేదు. ఎందుకంటే రాజు అన్నసత్రంలో అందించిన భోజనం వారు ఎంత తృప్తిగా తిన్నారంటే వారికి విశ్రమించటానికి  నీడ అవసరమయింది. కానీ తినటానికి పండ్లు అవసరమే లేదు. అంత తృప్తిగా భోజనం చేశారన్న మాట వారు. రాజు వారి మాట మన్నించాడు.

ఆశ్రమాయం వ్యధాదన్నసత్రైః సన్తర్పయన్ జనాన్।
భంగం శృంగాటవల్లీనాం శృంగాటైరతి సంస్కృతైః॥
(శ్రీవర రాజతరంగిణి, పంచమ సర్గ, 19)

‘ఆశ్రమా’ వద్ద రాజు జరిపిన అన్నదాన కార్యక్రమంలో వండిన కూరల పరిమళం కుంకుమపువ్వు పరిమాళాన్ని మించింది.

కశ్మీరు కంకుమ పువ్వుకు ప్రసిద్ధి. కుంకుమ పువ్వు మధ్య ఉండే రేణువులతో కుంకుమ పువ్వును తయారు చేస్తారు, అత్యంత ఖరీదైనది కుంకుమ పువ్వు. దీన్ని కూరలలో వాడతారు. అది కూరలకు, రుచి, పరిమాళాన్ని ఇవ్వటమే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మంచి చేస్తుంది. సాధారణంగా, కూరలకు మరిమళం ఇచ్చే కుంకుమ పువ్వు పరిమాళాన్ని కూడా భోజన సత్రాలలో వండిన కూరల పరిమళాలు మించి పోయాయాట.

గమ్మతైయిన వర్ణన.

శ్రీవరుడి ఈ వర్ణనలు చదువుతుంటే, ఎందుకని భారతీయులు జైనులాబిదీన్‌ను దైవంగా  భావించారో, పర్షియన్ రచయితలు జైనులాబిదీన్‌ను విమర్శించారో బోధపడుతుంది.

(ఇంకా ఉంది)

Exit mobile version