[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]
చతుర్థ సర్గ
దేశభాషాకవిర్యోధభట్టః శుద్ధం చ నాటకమ్।
చక్రే జైనప్రకాశాఖ్యం రాజవృత్తాన్తదర్పణమ్॥
(శ్రీవర రాజతరంగిణి, చతుర్థ సర్గ, 38)
దేశీభాష (కశ్మీరీ) కవి యోధభట్టు ‘జైనప్రకాశం’ అనే నాటక రచన చేశాడు. ఇది జైనులాబిదీన్ కథకు దర్పణం లాంటిది.
‘యోధభట్టు’ రాసిన ‘జైనప్రకాశం’ ప్రస్తుతం అలభ్యం. శ్రీవరుడి ప్రకారం ఈ నాటకం జైనులాబిదీన్ జీవితాన్ని అద్దం చూపినట్టు చూపుతుంది. ఒక కవి మరొక కవిని పొగడటం ఆనాటి పండితుల నడుమ ఉన్న సామరస్యాన్ని చూపిస్తుంది. ఇద్దరూ జైనులాబిదీన్ గురించి రాశారు. ఒకరు సంస్కృత కావ్యం. మరొకరు కశ్మీరీ భాషా నాటకం. ఇంకా జైనులాబిదీన్ చరిత్రను రచించిన వారి గురించి శ్రీవరుడు ప్రస్తావించాడు.
ఆ కాలం నాటి కవులు, పండితులు, కళాకారులు ఎంతగా జైనులాబిదీన్కు కృతజ్ఞులుగా ఉన్నారో ఈ రచనలు తెలుపుతాయి.
శ్రీవరుడు ‘యోధభట్టు’ను కవి అన్నాడు మొహబిల్ హసన్ యోధభట్టును గొప్ప సంగీత విద్వాంసుడన్నాడు. సంగీత శాస్త్ర పుస్తకం రచించి, సుల్తాన్‌కు అంకితం ఇచ్చాడని రాశాడు. ఫిరదౌసీ రచించిన ‘శాహనామా’ ఇతనికి కంఠస్థం అనీ రాశాడు.
భట్టావతారః శాహనామదేశగ్రంథొబ్ధి పారగః।
వ్యధాజ్జైనవిలాసాఖ్యం రాజోక్తి ప్రతిరూపకమ్॥
(శ్రీవర రాజతరంగిణి, చతుర్థ సర్గ, 39)
వీణాతుంభీరబాబాధ్యాః సర్వాస్తుష్టేన భూభుజా।
సువర్ణ శైప్యరత్నౌధైర్ధటితాస్తాశ్చకాశిరో॥
(శ్రీవర రాజతరంగిణి, చతుర్థ సర్గ, 40)
భట్టావతార్ అనే కవి జైనులాబిదీన్ గురించి జైనవిలాసమనే గ్రంథం రచించాడు. ఈయన ‘షాహనామా’ గ్రంథం పఠనంలో నిష్ణాతుడు. సంతుష్టుడయిన రాజు వీణ, తుంభీ, రబాబ్ వంటి వాయిద్యాలను బంగారం, రత్నాలు, ధనంతో అలంకరించి బహుకరించాడు. అవి ఎంతో మెరిసాయి.
కశ్మీరీ పండితులలో ‘షాహనామా’ ఎంతో పేరుపొందిన గ్రంథంలా ఉంది. ఆ గ్రంథంలో నిష్ణాతుడవడం పారశీ భాషలో పాండిత్యానికి నిదర్శనంలా ఉండేదేమో ఆ కాలంలో. ‘జైనవిలాసం’ అన్న పేరు ఆ గ్రంథం జైనులాబిదీన్ గురించేనని తెలుపుతుంది. ఈ గ్రంథం కూడా అలభ్యం.
ఆ కాలం కవులు జైనులాబిదీన్ గురించి రాసిన గ్రంథాలన్నీ లభ్యమయితే, మనకు జైనులాబిదీన్ గురించి మరింత సమాచారం లభించేది. ఆ కాలంలో కశ్మీరులో స్థిరపడిన ఇస్లామేతరులకు జైనులాబిదీన్ ఎందుకు దైవ సమానుడో ఇంకా గొప్పగా ఆధారాలు దొరికేవి.
తద్వాచికాంగికాహార్యసాత్త్వికాభినయోజ్జ్వలమ్।
నాట్యం దృష్ట్వా జనః సర్వశ్చతుర్ముఖమశంసత్॥
(శ్రీవర రాజతరంగిణి, చతుర్థ సర్గ, 41)
ఆంగికం, ఆహార్యం సాత్త్వికం సుందరమైన అభినయంతో కూడిన ఆ నాటకం వల్ల వేదిక చతుర్ముఖుడిలా అనిపించింది.
ఆంగికం, వాచికం, ఆహార్యం, సాత్త్వికాభినయం – ఈ నాలిగింటిని ప్రస్తావిస్తూ – చతుర్ముఖునిలా వేదిక భాసిల్లిందని అనటం శ్రీవరుడి చమత్కారం.
ఇత్థం త్రివర్గ విద్రాజా త్రిజగత్ఖ్యాత పౌరుషః।
త్రియామాస్త్రి విధై నృత్యై రనయత్ త్రిదశోపమః॥
(శ్రీవర రాజతరంగిణి, చతుర్థ సర్గ, 42)
ఈ రకంగా మూడు లోకాలలో ప్రఖ్యాతుడు, మూడు ఉత్తమ గుణాలు కల రాజు దేవతల వలె మూడు దశలు (వృద్ధాప్యం ఉండదు) కల రాజు, మూడు రాత్రుళ్ళు నృత్యాలు చూస్తూ గడిపాడు.
‘మూడు’ సంఖ్య ఆధారంగా చక్కని శ్లోకం రచించాడు శ్రీవరుడు.
మూడు జగత్తులలో విఖ్యాతుడు అన్నదానికి వివరణ అవసరం లేదు.
‘త్రివర్గ’ అన్న పదాన్ని కొందరు సాంసారిక జీవనంలొని ధర్మార్థకామంతో పోలిస్తే, మరికొందరు జీవితంలోని మూడు దశలు – బాల్యం, కౌమారం, యవ్వనం మాత్రమేనని భావించారు. జైనులాబిదీన్‌ను వృద్ధాప్యం లేనివాడిగా భావించారు.
నాట్యశాస్త్రం ప్రకారం ‘నృత్త, నృత్య, నాట్య’ అనే మూడు రూపాలున్నాయి. ‘నృత్త’ అన్నది వేగవంతమైనది. ఇందులో కథ ఉండదు. పూర్తిగా సాంకేతికమైనది. ‘నృత్యం’ అన్నది మందగమనం కలది. ఇందులో కథ ఉంటుంది. భావం ఉంటుంది. రసోత్పత్తి ఉంటుంది. అంటే భావ, రస ప్రధానమైనది నృత్యం.
‘నాట్యం’ అన్నది నాటకం. నాట్యం చేసేవారు పలు రకాల పాత్రల అభినయాలను చేస్తారు. దీనిలో ‘నృత్యం’ కూడా ఉంటుంది. ఈ మూడింటికి సంబంధించినవే ఆంగికం, వాచికం, ఆహార్యం, సాత్త్వికం అన్నవి. వీటి గురించి శ్రీవరుడు ముందు శ్లోకాలలో ప్రస్తావించాడు.
నృత్యంలో తాండవం, లాస్యం అని రెండు రకాలున్నాయి.
దీపోత్సవ వర్ణన ఎంత అద్భుతంగా చేశాడో, సంగీతం, నాట్యాలకు సంబంధించిన అంశాలనూ అంతే లోతుగా వర్ణిస్తున్నాడు శ్రీవరుడు. అందుకేనేమో, జైనులాబిదీన్కు అత్యంత ఆప్తుడు, ఆంతరంగికుడిగా నిలచాడు శ్రీవరుడు.
స్ఫురద్విచకిలోల్లాసహాసం స భవనాన్తతరమ్।
ఆసదత్ తారకాపూర్ణం పూర్ణచంద్ర ఇవాంబరమ్॥
(శ్రీవర రాజతరంగిణి, చతుర్థ సర్గ, 43)
ఆకాశంలో తారల అలంకరణతో పూర్ణచంద్రుడు శోభిల్లినట్టు, పుష్పాలతో అందంగా అలంకరించిన భవనం ఉల్లాసంగా చేరుకున్నాడు.
తతో విమలకుండాన్తే పానక్రీడాం మహీపతిః।
కర్తుం ప్రచక్రమ్ తత్ర పుత్రమిత్ర విభూషితః॥
(శ్రీవర రాజతరంగిణి, చతుర్థ సర్గ, 44)
విమలకుండం సమీపంలో పుత్ర, మిత్రులతో కలిసి రాజు ‘పానక్రీడ’ ఆరంభించాడు.
పిత్రు ప్రేమామృతోత్సిక్తో హాజ్యఖానేథ భక్తిమాన్।
వసన్త వర్ణనోన్మిశ్రాం చాటూక్తి మవదద్ విభోః॥
(శ్రీవర రాజతరంగిణి, చతుర్థ సర్గ, 45)
వసంతాన్ని వర్ణిస్తున్న నెపంతో, రాజు ప్రేమామృత దృష్టిలో తడిసి ముద్దయిన హాజీఖాన్ రాజును ప్రశంసించాడు.
సంగీత నాద నిపుణాన్ కలకంఠ భృంగాన్
కృత్వానిలం వ్రతవిలాస్య విధాన దక్షమ్।
గీతప్రియం నరపతే కిము సేవితుం త్వాం
ప్రాప్తో వసన్తఋతుచారన చక్రవర్తీ॥
(శ్రీవర రాజతరంగిణి, చతుర్థ సర్గ, 46)
ఓ రాజా! ఋతువులకు రాజు అయినటువంటి వసంతం, నటనలో నిష్ణాతుడైనవాడిలా తేనెటీగకు పాడటం నేర్పిస్తున్నది. గాలికి నృత్యం నేర్పి తీగలతో నృత్యం చేయిస్తోంది. పాటలను, నృత్యాలను మెచ్చుకుని ఆదరించే రాజుకు తన ఆటను దర్శింపచేసి, పాటను వినిపించేందుకు వచ్చిందా వసంతం.
మేఘాడంబరమంబరం యది తదా నిర్నష్ట శోభా వయం
నిత్యం తీక్ష్ణకరేణ తేన దివసే తాత్రాప్యహో బాధితాః।
స్వామీ నః శశభృల్లయోదయహతో దుఃఖాదితీవాగతా
ఉద్యానే నరదేవ సేవనపరాః పుష్పచ్ఛలాత్ తారకాః॥
(శ్రీవర రాజతరంగిణి, చతుర్థ సర్గ, 47)
ఆకాశం మేఘావృతమైతే మా శోభ నష్టమయిపోతుందంటాయి తారకలు. ఉదయం పూట సూర్యుడి వెలుతురు వల్ల మేము ఎవ్వరికీ కనబడము. తారకల ప్రభువు అయిన చంద్రుడు సైతం పెరుగుతాడు, తరుగుతాడు. ఓ రాజా, ఈ దుఃఖాన్ని ఉపశమింప చేసేందుకు తారకలన్నీ పూలై మీ ఉద్యానవనంలోకి వచ్చాయి.
అద్భుతమైన వర్ణనలు.
జైనులాబిదీన్ పట్ల శ్రీవరుడి భక్తి ప్రపత్తులు, ఆరాధనా భావం అన్నీ హాజీఖాన్ నోట ప్రతిధ్వనింప చేశాడు శ్రీవరుడు.
ఆకాశంలో తారకలు – మేఘాలు, సూర్యుడు, చంద్రుడి వల్ల బాధితులు. చివరికి వాటి ప్రభువైన చంద్రుడికి కూడా వృద్ధి, క్షయం ఉన్నాయి. క్షయం లేక నిత్యం ప్రచండమైన వెలుగుతో వెలిగేవాడైన చక్రవర్తి అండలో ఎలాంటి భాధలు లేకుండా ఉండాలని తారకలు ఆకాశం విడిచి రాజు ఉద్యానవనంలో పూలలా భూమికి వచ్చాయట.
అందమైన భావం.
మామూలు మనుషులకు, కవులకూ ఇదే తేడా!
ఇద్దరూ చూసేది అవే.
మామూలు మనుషులు పూలను చూసి అందంగా ఉన్నాయని అనుకుంటారు. కానీ కవులకు ఆ పూలు ఆకాశం నుంచి దిగివచ్చిన తారకలలా కనిపిస్తాయి. కవి దృష్టికీ, సామాన్యుడి దృష్టికీ ఇదీ తేడా.
ఈ తేడా వల్ల సామాన్యుడు కవిత చదివి, తనకెందుకు పూలలో తారకలు కనిపించలేదని ఆలోచిస్తాడు. కవి ఊహకు స్పందిస్తాడు. ఆశ్చర్యపోతాడు. ఆనందిస్తాడు.
అందుకే ఒకప్పుడు ‘కవి’ అంటే ప్రత్యేకత ఉండేది.
మాటలతో ఆడుతూ, పదాల నర్తనలతో మురిపింప చేస్తూ, భావంతో హృదయాన్ని దోచుకుంటూ, పఠితల భావనల బలానికి రెక్కలిచ్చేవారు కవులు.
ఉన్నదున్నట్టు రాయాలన్న సిద్ధాంతాన్ని అనుసరిస్తూ ఈనాటి కవులు కవిత్వంలో ‘అద్భుతం’ అన్న వాటికి తిలోదకాలిచ్చి, సృజన అన్నదాన్ని వదిలించుకుని, భాషా పటిమకు, భావానికి బహిష్కరణా విధించి, సామాన్యుడు చూసే దాన్నే, సామాన్యుడికన్నా తక్కువ స్థాయి భాషతో, తమ కవితల్లో సామాన్యుడికి కూడా అర్థం కాని రీతిలో భావాలు ప్రదర్శిస్తూ తమని తాము అభినందించుకుంటున్నారు. సామాన్యుడి దృష్టిలో అభాసుపాలవుతున్నారు. కవిత్వ ప్రక్రియను చులకన చేసి నవ్వులపాలు చేస్తున్నారు.
శ్రీవరుడి రాజతరంగిణి చదువుతుంటే, ఆ కాలంలో కవులు ఎందుకని అంత గౌరవాభిమానాలు, ఆదరణ, ప్రశంసలు అందుకున్నారో అర్థమవుతుంది. ఎందుకని, రాజులు, ప్రజలు కవులకు నీరాజనాలర్పించి, వారు నడిచిన భూమిని పవిత్రంగా భావించేవారో బోధపడుతుంది.
(ఇంకా ఉంది)