Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

శ్రీవర తృతీయ రాజతరంగిణి-54

[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

చతుర్థ సర్గ

జలాంతర్బింబితా వ్యాపి దీపాలీ నాగలోకతః।
వరుణేన నృపప్రీత్యా దాపితే వార్యు తత్ తదా॥
(శ్రీవర రాజతరంగిణి, చతుర్థ సర్గ, 15)

నీటిలో ప్రతిబింబిస్తున్న దీపాల వెలుతురు, రాజు పాలనతో సంతుష్టుడైన వరుణుడు నాగలోకం నుంచి తెచ్చిన దీపాలతో రాజసభను ప్రకాశవంతం చేస్తున్నట్టుంది.

తా దీపితా దీపమాలా ద్వాధా రంగే చకాశిరే।
దిదృక్షా గతనాగానాం ఫణమాణిగణా ఇవ॥
(శ్రీవర రాజతరంగిణి, చతుర్థ సర్గ, 16)

వేదికపై జ్వాజ్వల్యమానంగా వెలుగుతున్న దీపాలను నృత్యాలను దర్శించాలన్న ఉత్సుకతతో నాగలోకం నుంచి వచ్చిన నాగుల శిరస్సులపై వెలుగుతున్న మణుల వలె ఉన్నాయి దీపాలు.

కిం రాజాలోకలోభాత్ తటభువి మిలితాః పూర్వభూపాలజీవాః
కిం వ్యోమ్నస్తార కౌధః శశధర విముఖః సేవానాయావతీర్ణః।
కిం వా సిద్ధాః సురేంద్రా నిజరూచిరూచిరాః ప్రేక్షణాయోపవిష్టాః
కిం వైతా దీపమాలా ఇతి జనమాన సామస్త దూరాద్ వితర్కః॥
(శ్రీవర రాజతరంగిణి, చతుర్థ సర్గ, 17)

దూరం నుంచి ఆ దీపాలను చూస్తున్నవారు అవి దీపాలు కావు, కశ్మీర వైభవాన్ని తిలకించటానికి దిగి వచ్చిన పూర్వ రాజుల ఆత్మల వెలుతురు అని అనుకున్నారు. ఇంకొందరు, ఈ వైభవాన్ని దగ్గర నుంచి చూసేందుకు ఆకాశం నుండి దిగివచ్చిన చంద్రుడు, తారకలు అనుకున్నారు. మోక్షం పొందిన మహానుభావులు నాట్యం దర్శించేందుకు వచ్చారనుకున్నారు. దేవతలే దిగి వచ్చారనుకున్నారు. ఇలా దూరం నుంచి ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు.

శ్రీవరుడు, రాజతరంగిణి చరిత్ర కథనాన్ని ఆపి మరీ, వైభవంగా సాగుతున్న దీపోత్సవాన్ని సుందరంగా, విపులంగా వర్ణిస్తున్నాడు.

కొన్ని సందర్భాలలో కాలం ఆ క్షణం స్తంభించిపోతే బాగుండుననిపిస్తుంది. ఒక దృశ్యం నుంచో, ఒక సంఘటన నుంచో కదలాలనిపించదు. జీవితం అంతా అక్కడే అలాగే గడిచిపోతే చాలు, ఇంకేమీ అవసరం లేదనిపిస్తుంది.

బహుశా శ్రీవరుడి దృష్టిలో ‘దీపోత్సవం’ అలాంటి కాలం ఆగిపోతే బాగుండుననిపించేటటువంటి ఘడియ కావచ్చు.

ఎందుకంటే, జైనులాబిదీన్ పాలన చివరి దశలో, ఆరిపోయే దీపం గుప్పుమని ఒక్కసారిగా అధికమైన వెలుతురునిచ్చి ఆరిపోయేట్టు, ఒక అద్భుతమైన సంఘటన ఇది. ఆ కాలంలో, రాజ్యం సంపూర్ణంగా ఇస్లాంమయమైన సమయంలో ఇంత వైభవంగా, ఇంత పెద్ద ఎత్తున దీపోత్సవం జరగటం ఒక అద్భుతం. ఇది చివరిసారి అయి ఉంటుంది. ఈ ఉత్సవాల తరువాత కొన్నాళ్ళు జైనులాబిదీన్ ఆనందంగా, ధర్మకార్యాలు జరుపుతూ గడిపాడు. ఆపై మళ్ళీ రాజ్యం కోసం పోరు ప్రారంభమయింది. అందుకేనేమో, ఈ ఆనందకరమైన, అద్భుతమైన క్షణాలను తాను మరిచిపోకుండా, భవిష్యత్తు తరాల వారికి తన అక్షరాలతో సజీవంగా సృష్టించి అందించాడు శ్రీవరుడు.

అందుకే, సృజనాత్మక రచయితలు, కవులు ‘బ్రహ్మ’ కన్నా గొప్పవాళ్ళు. బ్రహ్మ సృష్టి ముందుకే నడుస్తుంది. ఒక్క క్షణం గడిచిపోతే మళ్ళీ వెనక్కు రాలేదు. కానీ సృజనాత్మక కవులు, రచయితలు కాలాన్ని తమ అక్షరాలలో బంధిస్తారు సజీవంగా. పాఠకులు ఏ కాలం వారైనా, ఆ అక్షరాలు సృజించే సజీవ దృశ్యాల దర్శనంతో ఆ కాలాన్ని, గడిచిపోయి తిరిగిరాని ఆ అనుభవాలను పొందుతారు. అంటే, గడచిపోయి, అదృశ్యమైపోయిన కాలాన్ని అక్షరాలలో సజీవంగా నిలిపి, తరతరాలు గతాన్ని వర్తమానంలో అనుభవించేటట్టు చేయగల శక్తి కలవారు ఈ కవులు, రచయితలు. ‘సృష్టికర్త’ కాలాన్ని వెనక్కి తిప్పలేడు. గడిచిన కాలాన్ని మళ్ళీ సృష్టించలేడు. కానీ ఆ పనిని కవులు, రచయితలు చేయగలరు.

భవిష్యత్తులో కశ్మీరం మళ్ళీ దీపోత్సవాన్ని ఇంత వైభవంగా జరుపుకోలేదని శ్రీవరుడికీ తెలుసు. అందుకే ఈ దీపోత్సవాన్ని కళ్ళకు కట్టినట్టు వర్ణించాడు. తన అక్షరాల మంత్రాలతో కాలాన్ని ఘనీభవింప చేసి, ఆ అద్భుతాన్ని బంధించాడు. మంత్ర పఠనంతో నూతన స్వర్గ ద్వారాలు తెరుచుకునేట్టు, శ్లోకాలు చదివే పాఠకుడి హృదయ యవనికపై ఆ వైభవం, ఆ సంరంభాలు, ఆ భవ్యమైన దివ్య కాలం సజీవంగా సాక్షాత్కరిస్తుంది.

సాక్షాదేశ పురంధరః కవిబుధా విద్యాధరాః సేవకా
అంతే దేవసభాసదః సవపుషః సిద్ధా అమీ యోగినః।
ఏతా అప్సరసో రసోర్జితగుణా గంధర్వకా గాయనా
రంగోయం త్రిదివ స్థలీతి జగదుః సర్వే జనాః ప్రేక్షకాః॥
(శ్రీవర రాజతరంగిణి, చతుర్థ సర్గ, 18)

ప్రేక్షకులు రాజును సాక్షాత్ ఇంద్రుడిగా దర్శించారు. కవి పండితులు, రాజు సరసన ఇంద్రుడు పక్కనుండే దేవతల్లా అనిపించారు. వారి సేవకులు దేవతల సేవకుల వలె తోచారు. దేవతలు సభాసదుల్లా, యోగులు శరీరాలు ధరించిన సిద్ధుల వలె, నటీమణులు అప్సరసల్లా, గాయకులు గంధర్వుల వలె వేదిక స్వర్గంలా భావించారు ప్రేక్షకులు.

పురంధరుడు అంటే ఇంద్రుడు. కవి అంటే శుక్రాచార్యుడు.

గంధర్వుల పదం గమ్మత్తుగా వాడేడు శ్రీవరుడు.

ద్యులోకంలో ఉండే గంధర్వులు దివ్యగంధర్వులు. వారు స్వయంప్రకాశకులు. సూర్యుడి సూర్యరశ్మి, తేజస్సు, ప్రకాశం వంటివి వారు నుంచి వెలువడుతాయి. వారి ప్రభువు ఈ వరుణుడు.

మధ్యస్థానంలోని గంధర్వులు, అంటే, అంతరిక్షంలోని గంధర్వులు నక్షత్రాల పాలకులు. మేషం, చంద్రుడు, విద్యుత్ వంటివారు  నిరుక్త శాస్త్రం ప్రకారం ఉంటారీ గంధర్వులు. దేవతలు, మనుష్యులలో కూడా వర్గీకరణ ఉంది. విద్యాధరుడు, అప్సరా, సిద్ధులు వంటి వారంతా సిద్ధపురుషుల వర్గీకరణలోకి వస్తారు. దేవతల గాయకుడు ‘హహహుహు’ అనే గంధర్వుడు. వీరిలో విశ్వావసు, తుంబురుడు, చిత్రరథ వంటి వారుంటారు. చిత్రరథుడు గంధర్వుల రాజు. కశ్యపుడి సంతతిని గంధర్వులంటారు. గంధర్వుల దేశం హిమాలయాల మధ్య భాగం. హిమాలయాల మధ్యభాగంలో ఉండే గంధర్వులు, హిమాలయాల దగ్గరలో జరిగే దీపోత్సవం తిలకించేందుకు రావటంలో ఆశ్చర్యం ఏమీ లేదు! అది స్వాభావికం కూడా.

అంగారక్షార చూర్ణాది గంధ కౌషేధయుక్తిభిః।
రాగైః శిల్పికృతా లీలా క్రీడాలోకమరం జయాత్॥
(శ్రీవర రాజతరంగిణి, చతుర్థ సర్గ, 19)

బొగ్గు, గంధకము (సల్ఫర్), సూరేకారపు చూర్ణాల మిశ్రమంతో చేసిన రంగురంగుల టపాసులతో శిల్పులు ప్రదర్శించిన ‘లీల’ ప్రేక్షకులను ముగ్ధులను చేసింది.

ఈ శ్లోకాల ఆధారంగా ఆ కాలంలో రంగురంగుల టపాసులు సంబరాల సమయంలో పేల్చేవారని తెలుస్తోంది.

భారతీయులకు ఈ టపాసులు వంటి అగ్ని ఆయుధాల గురించి 14వ శతాబ్దం నుంచి తెలిసిందని కొందరు చరిత్రకారుల అభిప్రాయం. చైనావారు 10వ శతాబ్దంలో తుపాకీ గుళ్ళ లాంటివి తయారుచేశారని కొందరంటారు. అయితే, భారతీయ శాస్త్రాలలో పలు సందర్భాలలో సూరేకారం, బొగ్గు  వంటి వాటితో అగ్ని గోళాలను సృష్టించేవారని సూచించే సందర్భాలున్నాయి.

శుక్రాచార్యుడి ‘శుక్రనీతి’లో నాళికాస్త్ర (gun) బృహద్ నాళీక (ఫిరంగి), తోప, బృహద్ గోళం వంటి పదాలు కనిపిస్తాయి. శుక్రనీతిలోనే సూరేకారం, సల్ఫర్, బొగ్గులను కలిపి ప్రేలుడు పదార్థాలు తయారుచేసే సూత్రం కనిపిస్తుంది.

‘అర్థశాస్త్రం’లో కూడా ‘అగ్నిసంయోగా’, ‘అగ్నియోగ’ వంటి పదాలు కనిపిస్తాయి. నీలమత పురాణంలో దీపావళి సంబరాల వర్ణన ఉంది. అయితే, మంగోలులు, ఢిల్లీ సుల్తానుల నడుమ సంబంధాల వల్ల భారత్‍లో చైనావారి అగ్ని ఆయుధాలు ప్రవేశించాయంటారు. ఫరిస్తా తన పుస్తకంలో, 1258లో మంగోలు రాజు ‘హులాగుఖాన్’ దూతను ఆహ్వానించే సమయంలో టపాసులు వాడినట్టు రాశాడు.

విజయనగర రాజ్యంలో రెండవ దేవరాయల పాలనా కాలంలో మహానవమి సంబరాలలో టపాసులు వాడేరని అబ్దుల్ రజాక్ రాశాడు. ‘షబ్-ఇ-బారాత్’ సమయంలో సుల్తాన్ ఫిరజ్ తుగ్లక్ కాలంలో టపాసులు వాడేవారు.

గజపతి ప్రతాపరుద్రుడి ‘కౌతుక చింతామణి’ లో, ‘ఆకాశభైరవ కల్పి’ వంటి గ్రంథాలలో వినోదం కోసం ప్రేలుడు పదార్థాల తయారీకి సంబంధించిన సూత్రాలు పేజీల కొద్దీ పొందుపరిచి ఉన్నాయి. కాబట్టి కశ్మీరులో జైనులాబిదీన్ పాలనా కాలానికి టపాసుల తయారీ అలవాటు ఉండడం, సంబరాల సమయంలో వినోదం కోసం వాటిని వాడటం, ఒక ప్రత్యేక ‘లీల’గా ఎదగటంలో ఆశ్చర్యం లేదు. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం, శ్రీవరుడు వాటిని వర్ణించిన విధానం. శ్రీవరుడు మామూలు కవి కాదన్న నమ్మకానికి బలమిస్తాయి ఈ వర్ణనలు.

తథా క్యౌషద సంపూర్ణాన్నాలాద్ వహ్నికణా ఘనాః।
నిర్యత్ కుసుమ సంపూర్ణ స్వర్ణ వల్లీ భ్రమం వ్యధుః॥
(శ్రీవర రాజతరంగిణి, చతుర్థ సర్గ, 20)

ఔషధాలు కూరిన నాళం నుంచి వెలువడే అగ్నికణాలు పూలవలె, పూతీగల వలె భ్రమ కలిగిస్తున్నాయి.

‘నాళం’ అంటే tube. కశ్మీరంలో ఆ కాలంలో బాణం, గోళం, దుప్పటి వంటి పలు రూపాల నాళాలుందేవి. వీటిలో అగ్ని పదార్థాలు కూరి, వాటిని వెలిగించటం వల్ల పలు భిన్న రకాల అగ్నికణాలు సృష్టించేవారు. ‘గోళం’ ఇప్పటి భూచక్రం, విష్ణుచక్రం లాంటిది. ‘బాణం’ ఇప్పటి రాకెట్ లాంటిది. ఆకాశంలోకి బాణంలా దూసుకుపోయి, అక్కడ బ్రద్దలై, పూల వంటి అగ్నికణాలను వెదజల్లుతుంది. ఇంకా పూతీగల్లాంటి అగ్ని కణాలను వెదజల్లే నాళాలు, దుప్పటిలా పరుచుకుని అగ్ని కణాలు వెదజల్లే నాళాలు ఇలా పలు రకాల అందమైన అగ్నికణాలను వెదజల్లే నాళాలుండేవి.

శ్రీవరుడు వాడిన పదాలు ఆనందం కలిగిస్తాయి. ‘వహ్నికణాలు’, ‘కుసుమ సంపూర్ణ స్వర్ణ వల్లీ భ్రమం’ వంటి పదాలు ఎంతో సంతోషం కలిగిస్తాయి.

సర్పాకారానలజ్జ్వలా నిర్గతా సలిలాన్తరాత్।
చక్రే ప్రేక్షకలోకానం త్రాసార్ఛర్య రసోదయమ్॥
(శ్రీవర రాజతరంగిణి, చతుర్థ సర్గ, 21)

నీటి నుండి సర్పాకారంలో వెలువడిన అగ్నిజ్వాలలు ప్రేక్షకులను ఆనందాశ్చర్య భయాదులకు గురిచేశాయి.

నాలకాదుత్థితా వ్యోమ్ని జ్వాలాగోలకపంక్తయః।
రాజద్రాజతరోచిష్కా జీవశుక్రోపమాం వ్యధుః॥
(శ్రీవర రాజతరంగిణి, చతుర్థ సర్గ, 22)

నాళం నుంచి వెలువడిన రజత కాంతి జ్వాల ఆకాశంలో గోళాకార పంక్తులుగా వెలిగింది. ఇది బృహస్పతి, శుక్రులకు పోటీగా బృహస్పతి, శుక్రులు ఉత్పన్నమైన భావనను కలిగించింది.

ఇంత వర్ణనలతో సంతృప్తి కలగలేదు శ్రీవరుడికి. ఇంకా వర్ణనను కొనసాగించాడు ఆనందంతో, ఉత్సాహంగా!

(ఇంకా ఉంది)

Exit mobile version