[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]
ఉచ్చః సత్ఫలదో యథా యమహమప్యే తాదృగోతావతా స్పర్ధా యావదియేష హన్త జనకేనైకేన మందః సుతః। భాస్వానభ్యుదితః స తావదతులః సర్వప్రకాశోద్యతో యన్మాహత్య్మ్యా వశేన వక్రగతయో ధ్వస్తా భవన్తి స్ఫుటమ్॥ (శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 99)
ఏ రకంగా అయితే ఉన్నతమైనవి, ఫలప్రదమైనవి ఈ ప్రపంచంలో ఉన్నాయో, అలాగే, ఇంత తీవ్రంగా తండ్రితో మంద బుద్ధి పుత్రులు స్పర్ధ వహించటం బాధ కలగిస్తుంది. కానీ ఒకసారి సమస్త ప్రజల క్షేమకరుడయిన సూర్యుడు ఉదయించటంతో, అతని మహత్య్మ ప్రభావంతో కుటిలులు తమంతట తామే ధ్వంసం అయిపోతారు.
ఈ శ్లోకానికి రూపాంతరం కూడా ఉంది. దాని అర్థం దాదాపుగా ఇలాగే ఉంటుంది. కానీ కాస్త భిన్నంగా ఉంటుంది.
దుష్టగ్రహమైన శని, సూర్యుడి అంత గొప్పవాడినని, అందరికీ క్షేమం కలిగించేవాడినని భ్రమపడి, సూర్యుడితో సమానుడిగా తనని తాను భావించుకుంటాడు. కానీ సూర్యోదయం తోటి సర్వం వెలుతురు మయం అవుతుంది. అతని శక్తి దుష్టులను నాశనం చేస్తుంది. ఈ రెండు శ్లోకాల అర్థాలను పోలిస్తే రెండవ శ్లోకం శ్రీవరుడు రాసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే దీని తరువాత శ్లోకాలకు ఈ శ్లోకంతో అన్వయం కుదురుతుంది. ముఖ్యంగా ‘తండ్రితో మంద బుద్ధి పుత్రులు స్పర్ధ వహించటం’ అన్న వాక్యం శ్రీవరుడిని పట్టిస్తుంది. కాని మొదటి శ్లోకం శ్రీవరుడు రాసిందని బలమైన వాదనలున్నాయి.
జైనులాబిదీన్ మరణం తరువాత శ్రీవరుడు రాజతరంగిణి రచన ఆరంభించాడు. అప్పటికి రాజ్యం అల్లకల్లోలంగా ఉంది. జైనులాబిదీన్ మరణంతో అంతవరకూ కశ్మీరులో భద్రంగా ఉన్న ఇస్లామేతరుల ప్రాణాలకు భద్రతలేని పరిస్థితులు నెలకొన్నాయి. జైనులాబిదీన్ అణచిపెట్టిన మత ఛాందస భావాలు రెట్టించిన శక్తితో కశ్మీరంలో విజృంభించాయి. ఇటువంటి పరిస్థితులలో శ్రీవరుడు ఇంత స్పష్టంగా ‘మంద బుద్ధి పుత్రులు’ అని అనటం కుదరదు. కాబట్టి ఇది శ్రీవరుడు రాసిన శ్లోకం కాకపోవచ్చని పలువురు అభిప్రాయపడ్డారు. రెండో శ్లోకంలో ‘శనిగ్రహాన్ని’ అడ్డుగా పెట్టుకుని పుత్రుల గురించి సూచనప్రాయంగా అన్నాడు. పైగా గతంలో ఒక శ్లోకంలో జైనులాబిదీన్ పుత్రులను యముడు, శనిలతో పోల్చాడు శ్రీవరుడు. కాబట్టి ఇప్పుడు కూడా అంత స్పష్టంగా పుత్రులు అనే బదులు ‘శని’ అనే అంటాడు. ఎందుకంటే, ఇంకో పుత్రుడిని జైనులాబిదీన్ స్వయంగా ఉత్తరం రాసి రాజ్యానికి అహ్వానించాడు, కాబట్టి శ్రీవరుడు మరో పుత్రుడి ప్రసక్తి తీసుకురాకపోవటం అర్ధం చేసుకోవచ్చు అంటారు. ఏది ఏమైనా, రెండు శ్లోకాలు చెప్పేది దాదాపుగా ఒకటే.
తండ్రి కన్న తాను గొప్ప వాడినని భావించిన పుత్రుడు తండ్రి ప్రతాపం ముందు నిలవ లేకపోయాడు.
తద్దేశ కష్టదైర్దుష్టైః ప్రజానం నాశహేతునా। ఆదమ్ఖానో విత్రాణో లక్ష్మ్యా భాగ్యైశ్చ తత్యజే॥ (శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 100)
ప్రజల వినాశనానికి కారణం ఆదమ్ఖాన్. ఎప్పుడయితే జైనులాబిదీన్ రంగప్రవేశం చేశాడో అతడికి దుర్దినాలు ప్రాప్తించాయి. అతడిని అదృష్టం, ఐశ్వర్యం వదలి వెళ్లిపోయాయి. అతడి అనుచరులు కూడా అతడిని వదలి వెళ్లిపోయారు.
విషయం స్పష్టం. సూర్యోదయమయింది. దుష్టశక్తులు తోక ముడిచి పారిపోయాయి. వారిని నమ్మి తన తండ్రిపై కత్తి దూసిన ఆదమ్ఖాన్ ఒంటరిగా మిగిలిపోయాడు. దుష్టులను నమ్మినవాడు ఎన్నడూ ‘మంచి ఫలితాన్ని’ పొందలేడు. ఇది తెలిసి కూడా తాత్కాలిక లాభాలను ఆశించో, మూర్ఖత్వం వల్లనో దుష్టుల వలలో పడతారు మనుషులు. అనుభవిస్తారు.
ఈత్యాతంకాదిమిర్దు స్వైర్వర దేశేత్ర జీవ్యంతే। సర్వనాశకరీ మాస్తు భూభర్తుర్వహ్వా పత్యతా॥ (శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 101)
ప్రజలు ఈతి భాధలను తట్టుకుంటారు. అతివృష్టి, అనావృష్టి భరించగలరు. పంటల నాశనాన్ని సహించగలరు. కాని దేశంలో సర్వనాశనకారి అయిన సంతానం అధిక సంఖ్యలో రాజుకు ఉండకూడదు.
ఈతి బాధల గురించి భారతీయ ధర్మంలో సవిస్తరంగా ఉంది. వాటిని శ్రీవరుడు ఈ శ్లోకంలో ప్రస్తావించాడు. అయితే ఎన్ని రకాల బాధలనయినా భరించి బ్రతకవచ్చు. కానీ, సర్వనాశనకారి అయిన సంతానం అధికంగా ఉండకూడదంటున్నాడు శ్రీవరుడు. సంతానం వలన కలిగే నాశనం, ఇతర కారణాల వల్ల సంభవించే సర్వనాశనం కన్నా ఘోరం.
‘బహుసంతానం’ అని శ్రీవరుడు అనటం వెనుక బహుశా సుల్తానుల బహుసంతాన ప్రీతి ఉన్నది. గమనిస్తే, సుల్తానులకు బహు భార్యలు, వారికి బహు సంతానం ఉండటం ఆనవాయితీ. వీరందరూ అధికారం తమకే దక్కాలని పోరాడటం, కుట్రలు చేయటం, తద్వారా దేశ ప్రజలు కష్టాలను భరించటం చరిత్రలో పలు సందర్భాలలో కనిపిస్తుంది. ఇలాంటి బహు అధికార పోరులను తప్పించాలని అక్బరు రాజవంశాలకి చెందిన స్త్రీలు వివాహమాడకూడదన్న నియమం విధించాడు. ఎందుకంటే వారి ప్రతి ఒక్క సంతానం తమకే రాజ్యార్హత ఉన్నట్లు భావిస్తుంది. తమ సంతానానికి అధికారం దక్కాలని ఆయా బేగమ్లు ప్రయత్నించటంతో, కుట్రలు, కుతంత్రాలు, రక్తపాతాలు జరుగుతాయి.
శ్రీవరుడు సమయం దొరకగానే ఇస్లామీయుల బహుసంతాన ప్రీతి గురించి వ్యాఖ్యానించాడు.
సా చేత్ తేషాం స్వభేదో మా భూయాద్ చైరాత్ పరస్పరమ్। మా జాయేతాథ్ వా దుష్టః సుతః కస్యాపి దుఃఖదః॥ (శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 102)
ఒక వేళ రాజుకు బహుసంతానం ఉంటే వారి నడుమ పరస్పర వైరం ఉండకూడదు. వారి వల్ల ఇతరులకు కష్టం ఉత్పన్నం కాకూడదు. అంటే ఎవరికి కూడా దుష్ట పుత్రులు కలగకూడదు.
ఇదీ శ్రీవరుడి ప్రార్ధన.
ప్రజాంతకారిణౌ క్రూరౌ రాజపుత్రావు భావపి। సూర్యస్సేవ మహాభర్తుః పంగుకాలా వివోదితౌ॥ (శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 103)
రాజుకు ఉన్న ఇద్దరు పుత్రులు కూడా క్రూరులు. సూర్యుడుకి శని, యముడు లాగా రాజుకు ఉన్న ఇద్దరూ క్రూరులే.
మళ్లీ శని, యముల ప్రసక్తి తీసుకు వచ్చాడు శ్రీవరుడు. తమలో తాము కలహించుకుంటూ ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తూ, అతి గొప్ప రాజయిన జైనులాబిదీన్ను ఇక్కట్ల పాలు చేస్తూ, మానసిక క్షోభకు గురిచేయటం, బహుశా, శ్రీవరుడికి తీవ్రమైన బాధను, పట్టలేని ఆగ్రహాన్ని కలిగించి ఉంటుంది.
అపకర్త్రూన్ విపన్మజ్ఞాన దయమానః పరానపి। క్షమీ దాతా గుణగ్రాహీ స్వామీదృగ్ లభ్యతే కథమ్॥ (శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 104)
అపకారం చేసిన వారికి కూడా ఉపకారం చేసేవాడు, శత్రువులను కూడా క్షమించే దయ కలవాడు, క్షమాశీలి, దాత, ప్రతిభను గౌరవించే వాడయిన రాజు మరొకరు ఉన్నారా? ఇలాంటి వాడు మరొకడు ఎక్కడ లభిస్తాడు?
లభించడు. శ్రీకరుడికి తెలుసు, తమ మంచి రోజులు అయిపోతున్నాయని, ‘దుర్దశ’ దగ్గరలోనే పొంచి ఉందని. ప్రతిభకు పట్టం కట్టేవాడు మరొకరు ఎక్కడ లభిస్తాడు? ముఖ్యంగా పండితుల ప్రతిభను గుర్తించి, అందరి వ్యతిరేకతను కాదని మరీ వారిని కశ్మీరు రప్పించి స్థిరపరచటమనే పని అంతకు ముందు కానీ తరువాత కానీ ఎవరికీ సాధ్యపడలేదు. ఇది అసాధ్యం అనీ శ్రీవరుడికి తెలుసు.
వ్యథితో యత్ సుతైర్దుష్టైః సోస్మార్థ్రద్దాగ్యా విపర్యయః। శృణ్వాన్ స రుదితాక్రందమితి పౌరగిరః పథి। పాదదాహ వ్యథోర్తోపి నగరాన్నిరగాన్నృపః॥ (శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 105)
‘దుష్ట పుత్రుల వల్ల రాజు అమితంగా బాధపడ్డాడు. ఇది మన దౌర్భాగ్యం. ఇది విధి వైపరీత్యం’. రాజు దారిలో వెళ్తుంటే ప్రజలు రోదనలు, ఆక్రందనలతో పాటూ ఈ మాటలు రాజు విన్నాడు. ఈ వేదనాభరిత రోదనలు వినలేక రాజు నగరం వదిలాడు.
పుత్రోత్పత్తి మవేక్ష్య తుష్యతి నృపో వోఢా ధురః స్యాదితి స్నేహాత్ సంపదమస్య యచ్ఛతి నిజాముల్లంఘ్య నీతిక్రమమ్। జ్ఞాత్వా తం బలవంతమాత్మాసదృశం తాదృగ్ భియా శంకతే యేనాసన్నసుఖో న జాతు లభతే నిద్రాం సచిన్తాజ్వరః॥ (శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 106)
పుత్రుడు జన్మించినప్పుడు రాజు ఎంతో సంతోషించాడు. రాజ్యభారం వహించే వారసుడు జన్మించాడని ఆనందిస్తాడు. స్నేహంతో, నీతిని పాటిస్తూ, తన యావదాస్తిని, సంపదను అతడికి అర్పిస్తాడు. కానీ, తన సంతానం తనతో సమానమైన శక్తి కలిగినవాడని బలవంతుడని గ్రహించి, అతడి నుంచి ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందన్న అనుమానంతో భయంతో చింతాగ్రస్థుడవుతాడు. నిద్రకు దూరమవుతాడు.
బద్ధవా మల్లివజస్త్రేథేన స యదా రాజాలిశాహిర్హతో భ్రాతృద్వేషవశాద్ బభూవ కదనం కాశ్మీరికాణం మహత్। తద్దజ్జైన మహీభుజోస్య తనయద్వేషాత్ కిమాలోక్యతే తన్మా భూద్ బహసన్నతినృప గృహే దేశే వినాశప్రదా॥ (శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 107)
రాజు అలీషాహ్ను బంధించి మాలిక జస్రథ్ హతమార్చాడు. భ్రాతృ ద్వేషం వల్ల కాశ్మీరంలో ఎంతో నాశనం సంభవించింది. అదే రకంగా పుత్రుల ద్వేష కారణంగా దేశం నష్టపోవటం జైనులాబిదీన్ చూస్తున్నాడు. అందుకనే దేశపు రాజు ఇంట వినాశకారకులైన బహు పుత్రులు జన్మించకూడదు.
శ్రీవరుడి అవేదనను ఈ శ్లోకాలు స్పష్టం చేస్తాయి. భారతీయ ధర్మంలో రాజ్యం కోసం పోరు లేదు. శత్రు రాజులను జయించి కూడా, ఆ రాజు వారసులనే సింహాసనంపై కూర్చోబెట్టి వెనక్కి తిరిగిన సంస్కారవంతులైన విజేతల దేశం మనది.
కశ్మీరు రాజును సంహరించిన శ్రీకృష్ణుడు, కశ్మీరుని ఆక్రమించమని సలహాలిచ్చిన మంత్రుల మాట వినడు. కృష్ణుడు సంహరించిన రాజు భార్య గర్భవతిగా ఉంటుందా సమయంలో. రాజ్యం ఆమెకు కట్టబెట్టి కశ్మీరు వదలి వెళ్లిపోతాడు శ్రీకృష్ణుడు. ఇదీ మన సంప్రదాయం. ఇదీ మన సంస్కారం!
తండ్రి మాటకు కట్టుబడి రాజ్యం వదలి వెళ్తాడు శ్రీరామచంద్రుడు. తనకు రాజ్యం కట్టబెట్టటం కోసం అన్నని అడవికి పంపిన తల్లి లక్ష్యం నెరవేర్చే బదులు అన్నకు చెందిన రాజ్యం తనకు వద్దని, అన్న పాదరక్షలు సింహసనంపై ఉంచి అన్న ప్రతినిధిగానే పధ్నాలుగేళ్లు రాజ్యం చేసిన తమ్ముళ్లున్న దేశం మనది. నిర్మోహంగా రాజ్యం చేసిన రాజర్షుల దేశం మనది. అధికారం ఒక బాధ్యతగా భావించే సంస్కృతి మనది. అలాంటి వారికి రాజ్యం కోసం అన్నదమ్ములు కొట్టుకోవటం, చంపుకోవటం, రాజ్యం కోసం తండ్రి పైనే కత్తి దూయటం ఒక అనవాయితీగా, సాంప్రదాయంగా చలామణీ అవటం ఆశ్చర్యంతో పాటు అసహ్యం కలిగించటంలో ఆశ్చర్యం లేదు. ఆ అసహ్యం, ఆశ్చర్య భావనలలోంచి రచించిన శ్లోకం ఇది. రాజ్యం కోసం పోటీ పడటమే కాదు, జైనులాబిదీన్ లాంటి పరమత సహనం కల మంచి రాజును, కొడుకులు రాజ్యం కోసం ఇబ్బంది పెట్టటం, దేశాన్ని అల్లకల్లోలానికి గురిచేయటం శ్రీవరుడికి ఆగ్రహం కలిగించటంలో ఆశ్చర్యం లేదు. కాని జైనులాబిదీన్ నిస్సహాయ స్థితిలో, తన ప్రాణానికి ప్రమాదం ఉందనీ, రక్షించేందుకు రమ్మని కొడుకును ఆహ్వానించటం, శ్రీవరుడిలో ఆగ్రహాన్ని హద్దులు దాటించి ఉంటుంది. దీని ఫలితమే, రాజుకు ఎక్కువ సంఖ్యలో కొడుకులు ఉండకూడదు, ఉన్నా వారు దుష్టులు కాకూడదు అన్న భావన శ్రీవరుడు వ్యక్తం చేసేట్టు చేసింది. శ్రీవరుడు ఎంతగా వ్యథ, విరక్తి అనుభవించి ఉంటాడో ఊహించవచ్చు. శ్రీవరుడు ఒక్కడికే కాదు, సుల్తానుల చరిత్రలు చదువుతున్న ప్రతి ఒక్కరికీ సింహాసనం కోసం వారసుల నడుమ జరిగిన పోరులు, రక్తపాతాలు, వారి పోరుల్లో అల్లకల్లోలమైన సమాజం, ప్రజల జీవితాలను గమనిస్తే శ్రీవరుడి ప్రతిపాదన వెనుక ఉన్న ఆలోచన బోధపడుతుంది.
(ఇంకా ఉంది)
ఈవారం రాజతరంగిణి ఆసక్తికరంగా ఉంది…. దుష్టులను నమ్మినవాడు తాత్కాలిక లాభాన్ని పొందుతాడు గానీ, మంచి ఫలితం పొందలేడు అనేది అక్షర సత్యం ..శ్రీవరుడు చెప్పిన మందబుద్దులైన పుత్రులను గురించి వింటుంటే ధృతరాష్ట్ర సంతానం గుర్తువస్తున్నది…ఆధునిక కాలంలో కూడా “నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు, తళుకు బెళుకు రాళ్ళు తట్టేడేల?” అన్నాడు ఒక శతకకవి .
ఇది విజయశ్రీముఖి గారి స్పందన: *సంచికలో ప్రతివారం చదివేది కస్తూరి మురళీకృష్ణగారి “శ్రీవర తృతీయ రాజతరంగిణి”. సవర్లకొండ ఇతర కథలపై మురళీకృష్ణ గారి అభిప్రాయం చదువుతూ ‘బాలేదనుకుంటాలే..’ అనుకుని స్క్రోల్ చేసేంతలో.. వారనుకున్నట్లే మళ్లీ అభిప్రాయం మారి ‘అవునా!’ అనుకున్నాను. వాలెంటైన్లకు ప్రేమతత్త్వం నేర్పే భారతీయ ప్రేమకథా మాలిక పై సుశీలమ్మగారి విశ్లేషణ బావుంది. సత్య ప్రసాద్ గారి కవితలో “కళ్ళున్న మనసు..మనసున్న కళ్ళు” వాక్యం ఎంత బావుందని! – Vijaya sreemukhi.*
You must be logged in to post a comment.
టర్నింగ్..
తెలుగు అసోసియేషన్, సిడ్నీ వారి 30 సంవత్సరాల వార్షికోత్సవ ప్రత్యేక సంచిక ఆవిష్కరణ
డామిట్ కథ అడ్డం తిరిగింది
నూతన పదసంచిక-49
తల్లివి నీవే తండ్రివి నీవే!-49
‘సిరికోన’ చర్చాకదంబం-9
చిరుజల్లు-75
ఫొటో కి కాప్షన్-27
శ్రీరాముడి మీద నిందారోపణలు – వాస్తవాలు
సిరివెన్నెల పాట – నా మాట – 66 – సార్వజనీనమైన సందేశం అందించిన పాట
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *👏👏 Keep moving the story..*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Best wishes to you & your friends and supporters..🙌*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: * Your episodes are going very nice .👍*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Your story is moving consistently. keep it up 👍.*
ఇది జబీనా గారి స్పందన: * Prasuna ne vidyardi jivetam gurtu pettukoni yenta baga rasavamma 👌👏 *
All rights reserved - Sanchika®