[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]
తృతీయ సర్గ
అథోదవిష్టత తుములస్తత్కాలం సిఅన్యయోద్ధ్యయోః।
ఉన్నద్దఖానసన్నద్దయుద్ధేక్షణసురుఃసహః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 93)
రెండు సైన్యాల మధ్య భీకరమైన యుద్ధం కొనసాగింది.
అష్టావింశావ్దవదసస్మిన్ పంచాత్రిశోపి వత్సరే।
వైర నీత్వా పితాపుత్రౌ పిశునైః కారితో వధః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 94)
గతంలో 28వ సంవత్సరంలో జరిగిన యుద్ధం లాగానే ఈ 35వ సంవత్సరంలోనూ దుష్టుల కారణంగా యుద్ధం ఆరంభమయింది. వీరు తండ్రీ కొడుకుల నడుమ వైరాన్ని సృష్టించగలిగారు.
స్వతహాగా ఆదమ్‍ఖాన్ వీరుడు కాడు. ఆశలున్నాయి కానీ అర్హత లేనివాడు. రాజు అతడిని యువరాజుగా ప్రకటించి రాజ్యం చేసుకునేందుకు ఊళ్ళిచ్చినప్పుడు పరిపాలనలో తన ప్రతిభను, ప్రజల పట్ల తనకున్న ప్రేమను ప్రదర్శించి ఉంటే, అతడే కచ్చితంగా రాజు అయి ఉండేవాడు. కానీ అతడి ప్రవర్తన పట్ల, ప్రజలను పీడించటం పట్ల జైనులాబిదీన్ కోపంగా ఉన్నాడని తెలియగానే, రాజ్యం సోదరుడికి కట్టబెడతాడని భయం వేసి ఉంటుంది. చుట్టూ ఉన్న దుష్టశక్తులు ఈ భయాన్ని పెంచి ఉంటాయి. దాంతో మౌనంగా, మంచిగా ఉంటే సులభంగా దక్కాల్సిన రాజ్యం కోసం యుద్ధం ఆరంభించాడు ఆదమ్‌ఖాన్.
‘దుష్టశక్తులు’ అని శ్రీవరుడు అనటం మరో అర్థాన్ని కూడా ఇస్తుంది. జైనులాబిదీన్ పట్ల మత ఛాందసవాదులు వ్యతిరేకతను ప్రదర్శిస్తూన్నారు. అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా, కశ్మీరీ పండితులను వెనక్కు రప్పించి, వారికి కీలకమై పదవులు ఇచ్చి గౌరవించటం, స్వేచ్ఛ, భద్రతలను కల్పించటం నచ్చని ఛాందసవాదులు జైనులాబిదీన్ పట్ల వ్యతిరేకతను ప్రదర్శిస్తూనే ఉన్నారు. తాను శక్తిమంతంగా ఉన్నంత కాలం వారివి అదుపులో పెట్టాడు జైనులాబిదీన్. వారు హాజీఖాన్ ద్వారా జైనులాబిదీన్‌ను దెబ్బతీయాలని చూశారు. కుదరలేదు. ఆదమ్‌ఖాన్ వారి ప్రలోభంలో పడ్డాడు. అందుకే, తన ఆధీనంలో ప్రజలపైనే హింస జరిపాడు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాల ఆధారంగా ఊహిస్తే, ఆదమ్‌ఖాన్ హింస ఇస్లామేతరులపై జరిపాడనిపిస్తుంది. అందుకే, ‘హింస ఆపమ’న్న సందేశం జైనులాబిదీన్ పంపగానే, యుద్ధానికి సిద్ధమై వచ్చాడు ఆదమ్‍ఖాన్. అతడిని ఎదిరించి ప్రాణాలు కోల్పోయిన వాడి పేరు భట్టు. దీన్ని బట్టి చూస్తే, ఆదమ్‍ఖాన్ భవిష్యత్తులో రాజ్యం సులభంగా దక్కే వీలున్నా యుద్ధ బాటను ఎంచుకోవటం వెనుక రాజ్య దాహం కన్నా ‘మతం’ ప్రధాన పాత్ర వహించిందనిపిస్తుంది.
పర్షియన్ రచయితలంతా జైనులాబిదీన్‍ను విమర్శించారు.
‘బహరిస్తాన్’లో సుల్తాన్ పట్ల ఘాటైన అసంతృప్తి కనిపిస్తుంది.
“The one great fault of this Sultan consisted in this that heresy and idolatry and temple building which had disappeared during the regime of Sikandar, the iconoclast, and nothing remained of them, were revived by Zain-ul-Abideen. And in every village jashns were organised on particular occasions which gave birth to innumerable blasphemous innovations in the Islam of Prophet.”
‘తబాకత్-ఇ-అక్బరీ’లో “Many of Brahmins who had accepted Islam in the reign of Sikandar abjured and no ulama could stop them” అని ఆవేదనతో రాశారు.
దాదాపుగా పర్షియన్ రచయితలందరూ జైనులాబిదీన్‍ని పొగుడుతూనే అతడు ఇస్లామేతరులకు తమ మతాన్ని, ధర్మాన్ని అనుసరించే స్వేచ్ఛను ప్రసాదించటాన్ని విమర్శించారు. బాధపడ్డారు. క్రోధం వ్యక్తపరిచారు. సికందర్ బుత్‌షికన్ పాలనా కాలంలో ధ్వంసమైన మందిరాలను పునర్నిర్మించటం, పునరుద్ధరించటం, ఆగిపోయిన మతపరమైన సంబరాలను (జష్న్) మళ్ళీ జరిపించటమే కాదు, సుల్తాన్ స్వయంగా వాటిల్లో పాల్గొనటం, బలవంతంగా మతం మారినవారు మళ్ళీ తమ పాత ధర్మాన్ని అనుసరించే వీలు కల్పించటం, ఎవరినీ బలవంతాన మతం మార్పించకూడదన్న ఆంక్షలు విధించటంతో పాటు, ఇస్లామీయుడిని, ఇతర మతాల వారితో సమానంగా చూడటం వంటి సుల్తాన్ ‘పరమత సహన’ ప్రవర్తన ఇస్లామీయులకు సుల్తాన్ పట్ల ఆగ్రహం కలిగించింది. ఆ ఆగ్రహాన్ని ఆచరణలో పెట్టేందుకు సుల్తాన్ కొడుకు ఆదమ్‌ఖాన్‌ను వాడుకున్నారు.
చరిత్రను గమనిస్తే, ‘ఇస్లాం ప్రమాదంలో పడింది’, ‘ఇస్లాంలో మార్పులు తెస్తున్నాడ’న్నది ఇస్లామీయులందరినీ ఏకత్రాటిపైకి తెచ్చి అందుకు కారణమైన వారిని వ్యతిరేకించేటట్లు చేస్తుంది. ఇటీవలే ఓ ఆఫ్రికా దేశంలో తాను ‘స్వలింగ సంపర్కానికి అలవాటు పడ్డాన’ని ప్రకటించిన ఇమామ్‍ను కాల్చి చంపారు. ‘Blasphemy’ అన్న పదం ఇస్లామ్‍ను అనుసరించేవారి విచక్షణను హరిస్తుంది. సాల్మన్ రష్దీపై దాడి ఇందుకు ఉదాహరణ. కార్టూన్ గీసినందుకు జరిగిన అల్లర్ల వంటివి ‘blasphemy’ అన్న పదం ఇస్లామీయులలో కలిగించగల ఆవేశానికి నిదర్శనాలు.
‘అక్బర్’ పరమత సహనం నచ్చనివారు ఆయనను ఆ కాలంలోనే తీవ్రంగా విమర్శించారు. ఆయన ‘దీన్-ఇ-ఇలాహీ’ను ప్రతిపాదించటంతో అక్బర్ పట్ల వ్యతిరేకత తీవ్రమైంది. అక్బర్ పై దుష్ప్రభావం చూపించాడని ‘అబుల్ ఫజల్’ పట్ల కూడా విమర్శలు వెల్లువెత్తాయి. ‘దీన్-ఇ-ఇలాహీ’ను విమర్శిస్తూ, అసలైన ఇస్లామ్ సూత్రాలను విశ్లేషిస్తూ, వివరిస్తూ పర్షియన్ రచయితలు పుస్తకాలు రాశారు. అన్న దారో షుకో పై, తండ్రి షాజహాన్‍పై ఔరంగజేబ్ కత్తి కట్టేందుకు ప్రేరణ ‘ఇస్లాం ప్రమాదంలో పడింది’ అన్న వాక్యాలే అని చరిత్ర రచయితలు రాశారు.
ఈ నేపథ్యంలో చూస్తే, జైనులాబిదీన్ ఎంతో సమర్థవంతంగా పరమత సహనం పట్ల వ్యతిరేకతను అణచిపెట్టాడని స్పష్టమవుతుంది. చివరికి, జైనులాబిదీన్ అనారోగ్యానికి గురయి న సమయంలో, కొడుకులు ఆయనకు వ్యతిరేకమయ్యేట్టు చేసి, ఆయనను బలహీనుడిని చేసిన తరువాతనే దుష్టశక్తులు తలెత్తగలిగాయి.
తత్రత్యా దరదా వాన్యే పరితః సరితో జలే।
మమజ్జుస్తద్ధయాద్ యేన శవపూర్ణమభూత్ సరః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 95)
దరద రాజ్య ప్రజలు, ఇతర ప్రాంతాల ప్రజలు ఆదమ్‍ఖాన్ భయంతో నదులలో, సరస్సులలో దూకి ప్రాణాలు విడిచారు. అక్కడి సరస్సులు శవాలతో నిండిపోయాయి.
‘ఆదమ్‍ఖాన్’ అంటే ప్రజలలో ఎంతగా భయం కలిగిందో ఈ శ్లోకం నిరూపిస్తుంది. ఆదమ్‍ఖాన్ రాజు సేనను ఓడించాడన్న వార్త వినటంతోటే పరిసర ప్రాంతాల లోని ప్రజలు నీళ్ళల్లో దూకి ప్రాణాలు త్యాగం చేశారు. అలా త్యాగం చేసినవారు ‘ఎవరో’ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
‘దరద’ జాతి కశ్మీరులో ప్రత్యేకమైన జాతి. వీరు పర్వత ప్రాంతాలలో నివాసం ఉంటారు. వీరి భాషను ప్రాకృతం, పైశాచీ భాష అంటారు. దీనిపై సంస్కృత ప్రభావం అధికంగా ఉంటుంది. ఆరంభంలో వీరు క్షత్రియులు. బ్రాహ్మణుల శాపంతో వీరు శూద్రులయ్యారు. సింధునది పరివాహక ప్రాంతంలోని ‘గిల్గిత్-బాల్టిస్తాన్’ ప్రాంతంలో వీరు అధికంగా ఉండేవారు. వాయు, బ్రహ్మాండ, వామన పురాణాలలో కాంభోజీలు, బాహ్లీలతో పాటు దరదుల ప్రస్తావన వస్తుంది. ‘మహాభారతం’లో కూడా కాంభోజీలు, బాహ్లీలకు దరదలు పొరుగువారని ఉంది. వీరు ఉండేది ‘హిమవత్ ప్రదేశం’ అంటుంది భారతం. కశ్మీరు ఉత్తర ప్రాంతంలో లడాఖ్, గిల్జిత్ నడుమ అధిక సంఖ్యలో దరదులు ఉండేవారు. దరదులు తిబ్బత్తుకు సమీపంగా ఉండటంతో ఆ కాలంలో అనేక తిబ్బత్తు పుస్తకాలలో దరదుల ప్రస్తావనలున్నాయి. ఇప్పటికీ పామిర్ పర్వత ప్రాంతంలో ‘దరదస్తాన్’ ఉంది. జోనరాజు కాలంలో వీరు తమ ప్రత్యేకతను నిలుపుకున్నారు. అందుకే ఆదమ్‍ఖాన్‍కు భయపడి ప్రాణత్యాగం చేశారు. కానీ తరువాతి కాలంలో దరదులంతా ఇస్లాం స్వీకరించారు. ఇప్పుడు, ఒకప్పుడు దరదులుండే ప్రాంతంలో దరదుడన్న వాడు ఒక్కడూ లేడు. సంపూర్ణంగా ఇస్లామీయులయిపోయారు.
ఇలాంటి వివరాలు తెలుస్తున్నప్పుడే మన పూర్వీకులు ఎంతటి ఘోరమైన పరిస్థితులను ఎదుర్కుని కూడా తమ ధర్మాన్ని నిలుపుకుని తరువాతి తరాల వారికి అందించారో అర్థమవుతుంది. తమని హింసించేవాడు వస్తున్నాడంటే కనీసం పారిపోయి ఎక్కడో తల దాచుకోవాలన్న ఆలోచన కూడా రాలేదు. పారిపోయేందుకు స్థలం కూడా లేదు. అందుకే ప్రాణత్యాగం చేశారు తప్ప మతం మారలేదు. శ్రీవరుడు రాయకపోతే ఆనాడు జరిగిన అత్యాచారాలు, సామాన్యులు ఎదుర్కున్న హింసల విషయం భవిష్యత్తు తరాలకు తెలిసే వీలుండేది కాదు. పర్షియన్ రచయితలు రాసిన చరిత్ర వారి దృక్కోణంలో ఉంటుంది. ఎంతమంది కాఫిర్లను చంపితే అంత గొప్ప. ఎంత మందిని మతం మారిస్తే అంత గొప్ప. ఆనాడు శ్రీవరుడు వర్ణించిన అత్యాచారాలను తెలుసుకుంటూ ఈనాడు మన చుట్టూ జరుగుతున్నది గమనిస్తే, ఆనాటికీ ఈనాటికీ ఒక్క సాంకేతికాభివృద్ధి తప్ప, మానవ మనస్తత్వంలో పెద్ద తేడా రాలేదనిపిస్తుంది.
హత్వా మృత్యుంవాత్యుగ్రస్తద్దికే మృశతత్రయమ్।
నౌసేతుబంధముచ్ఛిద్య నదీపారం సమాసదత్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 96)
ఆ రోజు ఆదమ్‌ఖాన్ సేవకులు అత్యంత ఆగ్రహంతో మూడు వందల మంది మనుషులను సంహరించారు. వారు నావలను, సేతువును విరిచి, నది దాటారు. సయ్యపురం వద్ద వితస్తపై ఉన్న వంతెనను ధ్వంసం చేశారు. నది దాటారు. అయితే, ‘పీర్ హసన్’ ఇందుకు వ్యతిరేకమైన అర్థం వచ్చేట్టు రాశాడు. ఆదమ్‍ఖాన్ సేనలు ఓడిపోయి వంతెన దాటుతుంటే, వంతెన కూలిపోయి, మూడు వందల సైనికులు ప్రాణాలు కోల్పోయారని రాశాడు.
‘తబాకత్-ఇ-అక్బరీ’లో కూడా దాదాపు ఇలాగే రాశారు. ‘సుల్తాన్ పెద్ద సైన్యాన్ని ఆదమ్‍ఖాన్‍కు వ్యతిరేకంగా పంపాడు. రెండు సేనల నడుమ ఘోరమైన యుద్ధం జరిగింది. ఆదమ్‍ఖాన్ పరాజితుడయ్యాడు. అతని సేనలు సుయ్యపురం వద్ద వితస్త నది వంతెనను దాటుతుంటే వంతెన కూలి మూడు వందల మంది సైనికులు మరణించారు’. పర్షియన్ రచయితలు చెప్పినది సత్యదూరం అని శ్రీవరుడు తరువాత రాసిన శ్లోకాలు నిరూపిస్తాయి. జరిగిన సంఘటనలకు శ్రీవరుడు ప్రత్యక్ష సాక్షి. కాబట్టి, వందల సంవత్సరాల తరువాత, పక్షపాత దృష్టితో పర్షియన్ రచయితలు రాసిన దానికన్నా ప్రత్యక్ష సాక్షి కథనానికే ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది.
ధిక్ తం యః పైత్రుకె దేశే రక్షాణీయేపి నిప్కృపః।
పరదేశజయం త్యక్త్వా తాదృడ్ నిన్ధ్యం సమాచరత్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 97)
శత్రుదేశాలపై దాడి చేసి గెలుచుకు వచ్చే బదులు, తాము రక్షించాల్సిన తమ దేశ ప్రజలపైనే అత్యాచారాలు చేసే వీళ్ళని ఏమనాలి?
ఇది ప్రజలు వీధులలో రోదిస్తూ ఆదమ్‍ఖాన్, అతడి సేనకు పెడుతున్న శాపనార్థాలు. ఆదమ్‍ఖాన్ జైనులాబిదీన్ కొడుకు. కాబోయే రాజు. ఏ రాజ్యాన్ని అతడు పాలించాలో, ఏ ప్రజలను అతడు రక్షించాలో, ఆ ప్రజలనే అతడు నిర్దాక్షిణ్యంగా సంహరిస్తున్నాడు. ఇబ్బందుల పాలు చేస్తున్నాడు. ఇంతకన్నా ఘోరం ఏమైనా ఉందా? అని రోదిస్తున్నారు ప్రజలు.
దీన్ని బట్టి చూస్తే ఆదమ్‍ఖాన్ ఓడిపోయినట్టు అనిపించదు. ఆదమ్‍ఖాన్‍ను గనుక సుల్తాన్ సేనలు ఓడించి ఉంటే, ప్రజలకు ఇలా దూషించాల్సిన అవసరం ఉండేది కాదు. దుష్టుడు ఓడిపోయాడు కాబట్టి సంబరాలు చేసుకునేవారు. రోదిస్తూ, శాపనార్థాలు పెట్టేవారు కాదు.
పాపాస్తే శిఖజాదాద్వాః గృహీస్వోభయేవేతనమ్।
భూపముద్దే జయామాసుః ఫలం యైరనుభూయత్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 98)
శిఖజాదాలు ఇతరులు రెండు పక్షాల నుంచి ధనం స్వీకరించేవారు. వారు రాజును ఉత్తేజితుడిని చేశారు. ఫలం కూడా అనుభవించారు.
‘శిఖజాదా’ అన్న పదాన్ని, ‘శిఖ్దార్’ అన్న పదాన్ని సమానార్థకాలుగా భావిస్తారు. వీరు ‘హకీమ్’ అంటే వైద్యులుగా వ్యవహరించేవారు. వైద్యులు కాబట్టి వీరికి రెండు వైపుల నుండి డబ్బులు ముట్టేవి. అంటే ‘డబుల్ ఏజంట్’ లాంటివారన్న మాట. వీరు ఆదమ్‍ఖాన్‌ను రెచ్చగొట్టారు. ఇప్పుడు, బహుశా, ఆదమ్‍ఖాన్ సైన్యంతో పాటు దోచుకోవడంలో చురుకుగా పాల్గొని ఉంటారు. ‘పాపాస్తే’ అని శ్రీవరుడు వారిని ‘పాపులు’ అన్నాడు. జైనులాబిదీన్‍కు అన్యాయం చేశారు కాబట్టి శ్రీవరుడు వారిని పాపాత్ములు అని ఉంటాడు. లేకపోతే ‘పాపి’ అనేవాడు కాదు.
(ఇంకా ఉంది)