Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

శ్రీవర తృతీయ రాజతరంగిణి-47

[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

తృతీయ సర్గ

క్రమరాజ్యాంతరం ప్రాప్తే తస్మిన్ ద్వైరాజ్యశంకితః।
స్వాక్షారైహజ్యిఖానం స ప్రాహైషీత్ పత్రమిత్యదః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 86)

ఆదమ్‌ఖాన్ క్రామరాజ్యం చేరి సైన్యం సమీకరిస్తుండటంతో దేశం రెండుగా విభజితమవుతుందన్న భయంతో రాజు హాజీఖాన్‌కు ఉత్తరం రాశాడు.

శ్రీవరుడు రాసిన  ఈ శ్లోకం ఎంతో అర్థాన్ని పొదుగుకున్న శ్లోకం.

ఆదమ్‌ఖాన్ వెనక్కు తగ్గినా క్రామరాజ్యం చేరగానే మళ్లీ రాజ్య వ్యతిరేక చర్యలు అరంభించాడు. అంటే తాత్కాలికంగా వెనక్కు మళ్లాడు కానీ రాజ్యం ఆక్రమించాలన్న ఆలోచనను మాత్రం విరమించలేదు. ఇది జైనులాబిదీన్‌కు తెలుసు.

ఓ వైపు ఆదమ్‍ఖాన్ యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడు. మరో వైపు హాజీఖాన్, రాజు అన్నకే ప్రాధాన్యానిస్తున్నాడన్న ఆగ్రహంతో ఉన్నాడు. ఆదమ్‌ఖాన్ కనుక శ్రీనగరాన్ని ఆక్రమిస్తే హాజీఖాన్ మౌనంగా ఉండడు. తండ్రి రాజ్యం స్వచ్ఛందంగా అప్పగించటం వేరు. తండ్రి నుంచి రాజ్యం లాక్కోవటం వేరు. తండ్రి రాజ్యాన్ని ఆదమ్‍ఖాన్‌కు స్వచ్ఛందంగా కట్టబెడితే హాజీఖాన్ వ్యతిరేకత తండ్రిపై ఉంటుంది. అప్పుడు యుద్ధంలో తండ్రి, ఆదమ్‌ఖాన్‌లు ఒక వైపు; హాజీఖాన్ మరో వైపుగా సాగుతుంది. ఇప్పుడు పరిస్థితి జటిలమయింది.

ఆదమ్‍ఖాన్ యువరాజు. తండ్రి తరువాత రాజ్యాధికారం అతడిదే. అయినా సరే అతడు అధికారం కోరి తండ్రిపై దండెత్తుతున్నాడు. హాజీఖాన్ ప్రకారం రాజ్యాధికారంలో అతడికీ వాటా ఉంది. కానీ తండ్రి ఆదమ్‍ఖాన్‌కు రాజ్యం కట్టబెడుతుంటే ఉండే క్రోధం కన్నా, ఆదమ్‍ఖాన్ తండ్రితో యుద్ధం చేసి రాజ్యాన్ని గెలుచుకుంటే కలిగే క్రోధం ఎక్కువ. ఇప్పుడు రాజ్యంలో వాటా అడిగే వీలుండదు. రాజ్యాన్ని యుద్ధం చేసి గెలుచుకోవాలి కాబట్టి హజీఖాన్ కూడా యుద్ధానికి రావచ్చు. ఇది క్లిష్టమైన పరిస్థితి. ఇద్దరూ చెరో వైపు నుంచి దాడి చేస్తే కష్టం. పైగా ముగ్గురూ ఎవరికి వారుగా తనయులు రాజ్యాధికారం కోసం; తండ్రి రాజ్యాధికారం నిలుపుకోవటం కోసం పోరాడటం అర్థరహితం, అనర్థదాయకం. పోరు రెండు పక్షాల మధ్య జరగాలి. అప్పుడు ఎవరో ఒకరు విజేతగా నిలుస్తారు. రాజ్యానికి సక్రమమైన, స్వచ్ఛమైన పాలన లభించే  వీలుంటుంది.

ఆదమ్‍ఖాన్‌ను జైనులాబిదీన్ యువరాజుగా ప్రకటించిన తరువాత కూడా చుట్టూ చేరిన దుష్టుల మాటల ప్రభావంతో ఆదమ్‍ఖాన్, తండ్రి మరణం కన్నా ముందే రాజ్యాధికారం కోసం యుద్ధానికి వచ్చాడు. పైగా అధికారం ఉన్న ప్రాంతాలలో ఆదమ్‍ఖాన్ చేసిన అరాచకత్వం జైనులాబిదీన్‌కు తెలుసు. కాబట్టి రాజ్యం అతనికి కట్టబెట్టటం అంటే కన్నబిడ్డల్లా చూసుకున్న ప్రజలను కన్నబిడ్డే అయినా కసాయివాడికి అప్పచెప్పినట్టుంటుంది. పైగా యుద్ధానికి వచ్చిన వాడితో సంధి చేసుకోవటం ఓటమిని ఒప్పుకున్నట్టే అవుతుంది. అందుకని ఆదమ్‍ఖాన్‌తో సంధి ప్రసక్తి లేదు. కానీ ఈ వయసులో ఇద్దరు కొడుకులతో యుద్ధం చేయలేడు. తరచి చూస్తే ఆదమ్‍ఖాన్ కన్నా హజీఖాన్ మంచి వాడనిపిస్తున్నది. అతడు వీరుడు కూడా. కాబట్టి జైనులాబిదీన్ ఆదమ్‍ఖాన్‌తో పోరాడేందుకు తన వైపు నుంచి హాజీఖాన్‌ను ఆహ్వానిస్తున్నాడు ‘లేఖ’ ద్వారా. ఈ ఆలోచనలన్నిటినీ శ్రీవరుడు ‘ద్వైరాజ్యం’ అన్న పదంలో పొందుపరచాడు.

చాణుక్యుడి ప్రకారం నాలుగు రకాల పాలన రాజ్యానికి లభించవచ్చు. ద్వైరాజ్య, వైరాజ్య, సంఘవృత్త, యువరాజ. ఇవి కాక రాజ్యం అరాచకానికి గురి కావచ్చు. ద్వైరాజ్య పాలన అంటే ఇద్దరి పాలన. వైరాజ్య పాలన అంటే విదేశీపాలన, సంఘవృత్త అంటే మంత్రిమండలి, గణాల పాలన, దళగత పాలన. మండలిని కాన్సిల్‌గా ఆమోదించవచ్చు.

ఇద్దరు రాజులు పాలిస్తే ‘ద్వైరాజ’ పాలన.  ఈ ఇద్దరు రాజుల నడుమ సమన్వయం, సహకారం లేకపోతే రాజ్యం అరాచకం పాలవుతుంది. చరిత్రలో స్పార్టాలో ద్వైరాజ పాలన ఉండేది. రోమ్‍లో రెండు కౌన్సిళ్ల పాలన ఉండేది. ‘అవంతి’లో వింద అనువిందల పాలన ద్వైరాజ పాలన. నేపాల్ లోనూ పదవ శతాబ్దంలో ద్వైరాజ పాలన ఉండేది. ఈ ఇద్దరు రాజుల నడుమ ఎలాంటి రక్త సంబంధం, బంధుత్వం ఉండేది కాదు. పశ్చిమ భారతంలో క్షత్రపుల రాజ్యంలో తండ్రి, కొడుకు ఒకేసారి రాజ్యపాలన చేసేవారు. తండ్రిని ‘మహా క్షాత్రపుడు’ అనేవారు. కౌటిల్యుడు ద్వైరాజ పాలన అంత వాంఛనీయం కాదనీ, రాజ్యానికి క్షేమకరం కాదనీ భావించాడు.

‘ద్వైరాజ్యవైరాజ్యో ద్వైరాజ్యమనోన్య పక్షద్వేపానుగమ్య పరస్పర సంఘర్షేణ వా వివశ్యతి’ అన్నాడు. ఇద్దరు రాజుల నడుమ సమన్వయం, సహాకారాలు లేకపోతే రాజ్యం నశిస్తుంది. కాబట్టి ద్వైరాజ్య పాలన వాంఛనీయం కాదన్నాడు. ఇప్పుడు ఆదమ్‍ఖాన్, జైనులాబిదీన్‌లు పాలన పంచుకున్నా; ఆదమ్‍ఖాన్, హాజీఖాన్‌లు పాలన పంచుకున్నా, కశ్మీరు అల్లకల్లోమవుతుంది. పైగా, ఇద్దరూ ప్రత్యర్థులు కాబట్టి వారి నడుమ సమన్వయ, సహకారాలు ఉండవు. ఒకవేళ ఇద్దరూ కలసికట్టుగా వచ్చి, జైనులాబిదీన్‌ను ఓడించినా, అధికారం సాధించిన తరవాత వారి నడుమ సయోధ్య ఏర్పడటం కుదరదు. కాబట్టి రాజ్యం అల్లకల్లోలం అవుతుంది. అది కాకూడదంటే పోరాటంలో రెండే పక్షాలుండాలి. ఒక పక్షంలో జైనులాబిదీన్ ఉండాలి. అది జరగాలంటే ఆదమ్‍ఖాన్, హజీఖాన్‌లు కలవకూడదు. తను ఆదమ్‍ఖాన్‌తో కలవలేడు కాబట్టి, హజీఖాన్ తోనే కలవాలి. అప్పుడు పోరాటం హజీఖాన్, ఆదమ్‌ఖాన్ నడుమ జరుగుతుంది. తన మద్దతు ఉండంటం వల్ల హజీఖాన్ గెలుస్తాడు. తన తరువాత రాజవుతాడు. ‘ద్వైరాజ’ ప్రసక్తి ఉండదు.

పుత్ర మేవసరో దృష్టస్తా దృక్ ప్రాప్తో దురూత్తరః।
యత్ర మత్ప్రాణాసందేహే గతిర్నాన్యా త్వయా వినా॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 87)

పుత్రుడా! నా జీవితంలో దుష్ట సమయం ప్రాప్తించింది. నేను అధిగమించలేని కష్టాలు సంభవించాయి. నా ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. నువ్వు తప్ప వేరే గతి లేదు నాకు.

‘గతిర్నాన్యాత్వయావినా’ – జైనులాబిదిన్ అంతటివాడు ‘నువ్వు తప్ప నాకు వేరే గతి లేదు’ అనటం హృదయ విదారకమైన విషాదం. ‘నీవే తప్ప నితః పరం బెరుగన్’ అన్నట్లు తన కొడుకును చేతులు జోడించి తండ్రి ప్రార్థించటం కన్నా దౌర్భాగ్యకరమైన విషయం మరొకటి లేదు. తల్లిదండ్రులు పిల్లలే తమ సర్వస్వం అనుకుంటారు. వారికోసం ఎలాంటి కష్టాన్నయినా భరిస్తారు. అలాంటి వారి ముందు ‘నువ్వు తప్ప వేరే ఎవరూ లేరు’ అని ప్రార్థించాల్సి రావటం కన్నా దౌర్భాగ్యం ఇంకొకటి లేదు. అలాంటి దౌర్భాగ్యం జైనులాబిదీన్ లాంటి ఉత్తముడికి కలగటం ‘కర్మ’ తప్ప మరొకటి కాదు!

మత్పత్రావేక్షణే యుక్తం శయితస్య తవాసనమ్।
ఆసీనస్య సముత్థానాముద్ధివస్య చ ధావనమ్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 88)

నా ఈ ఉత్తరం చదవగానే పడుకుని ఉంటే లేచి కూర్చో. కూర్చుని ఉంటే లేచి నుంచో, నుంచుని ఉంటే పరుగెత్తు.

శ్రీవరుడికి జైనులాబిదీన్ కొడుకుకు రాసిన ఉత్తరం గురించి ఎలా తెలుస్తుందనే సందేహం అనవసరం. ఈ ఉత్తరం రాయటంలో శ్రీవరుడి ముద్ర ఉందన్నది తెలుస్తూనే ఉంది. ఈ విషయంలో ఎవరికైనా సందేహం ఉంటే రాజతరంగిణిలో తరువాత వచ్చే శ్లోకాలు, జరిగే సంఘటనలు ఈ సందేహాన్ని తొలగిస్తాయి.

కిమన్యత్ సత్యమేవోక్తం త్యక్తవాపి శృతయంత్రణామ్।
యద్యాగచ్ఛసి తత్ తూర్ణ పూర్ణం ప్రాప్స్యసి వాంఛితమ్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 89)

ఇంకా ఈ విషయం గురించి ఏం చెప్పను? ఆలస్యం చేయకుండా, శ్రమ అనుకోకుండా,  సమయం వృథా చేయకుండా త్వరగా వస్తే, నీ కోరిక (మనోవాంఛ) తీరుతుంది. ఉత్తరం చదవగానే, సమయం వ్యర్థం చేయకుండా వస్తే నీ కోరిక తీరుతుంది అనటం వెనక ఒకటే భావం, నీకు రాజ్యం దక్కుతుంది. అంతే.

అతితూర్ణ న చేత్ ప్రాప్తో మయి జీవితి విహ్వలే।
గతే మయి మద భ్యర్ణ పునరాగమనేన కిమ్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 90)

నేను ఇంకా జీవించి ఉన్నప్పుడే తొందరగా నువ్వు రాకపోతే, ఆ తరువాత నేను లేనప్పుడు నువ్వు నా దగ్గరకు వచ్చి కూడా లాభం ఉండదు.

ఈ శ్లోకం చదివితే, జైనులాబిదీన్ ఏదో అనారోగ్యంతో బాధపడుతున్నాడన్న అనుమానం బలపడుతుంది. లేకపోతే, కొద్ది కాలం క్రితం హజీఖాన్‌తో పోరాడి ఓడించి తరిమికొట్టినవాడు ఇలా ‘నా ప్రాణం ప్రమాదంలో ఉంది. నీవు తప్ప దిక్కు లేదు’ అన్నట్లు సందేశాలు పంపడు. ఎందుకంటే, ఆదమ్‍ఖాన్ గొప్ప వీరుడు కాదు. భీరువు. అతని చుట్టూ చేరినవారు వీరులు కారు. మోసగాళ్లు. వాళ్లకి ఇంతలా భయపడి తను బహిష్కరించిన హాజీఖాన్‌కు ఇలా బేలగా ఉత్తరం రాయలంటే మానసికంగా ఎంతగా దిగజారి, బలహీనుడయి ఉండాలో అర్థం చేసుకోవచ్చు.

జైనులాబిదీన్ వీరుడు. ఎవరినీ లెక్క చేయనివాడు. అందరి వ్యతిరేకతను అణచి పండితులను మళ్లీ కశ్మీరం రప్పించి రక్షణ కల్పించినవాడు. అలాంటివాడు ఇంత భీరువులా బేలగా కొడుకుకు ఉత్తరం రాయాలంటే, మానసికంగా పూర్తిగా దెబ్బతిని ఉండాలి. అనారోగ్యం, నిస్సహాయతలు తప్ప అంత వీరుడిని ఇంత స్థాయికి దిగజార్చేది మరోకటి లేదు.

తావత్ సుయపురం ప్రాప్తః సోభూత్ తీర్ణో నృపాత్మజః।
రాజనీకైః సమం యుధముద్ధంత సబలో వ్యధాత్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 91)

శక్తిమంతుడయిన రాకుమారుడు సుయ్యపురం చేరుకున్నాడు. అక్కడ రాజ సేనతో తలపడ్డాడు. ఇక్కడ శ్రీకరుడు చెప్తున్న రాకుమారుడు ఆదమ్‍ఖాన్. పెద్ద సైన్యంతో ఆదమ్‍ఖాన్ సూయపురం చేరుకున్నాడు. అక్కడ ఉన్న రాజ సైన్యాలతో ఘోరమైన యుద్ధం జరిగింది. ‘సుయపురం’కు శివపురం అని కూడా పేరు ఉంది. ఇక్కడ పెద్ద శివుడి గుడి, ఓ కోట ఉండేవి. 18వ శతాబ్దంలో వచ్చిన భూకంపం వల్ల కోట కూలిపోయింది. కానీ గుడి చెక్కు చెదరలేదు.

క్రామరాజ్యం నుంచి ఆదమ్‍ఖాన్ సుయ్యపురం చేరుకున్నాడు. యుద్ధం ఆరంభించాడు. సుయ్యపురంను ప్రస్తుతం ‘సోపోర్’ అని అంటున్నారు. మొత్తానికి, కొడుకుకు లేఖ పంపి అతని స్పందన కోసం ఎదురు చూసే సమయం కూడా జైనలాబిదీన్‌కు ఇవ్వలేదు ఆదమ్‍ఖాన్. బహుశా ఖాన్ సలహాదార్లు జైనులాబిదీన్ హాజీఖాన్ మద్దతును కోరుతాడని ఊహించి, అతని సహాయం వచ్చేలోగా రాజ్యాన్ని ఆక్రమించమని సలహా ఇచ్చి వుంటారు.

రాష్ట్రాధికారిణం తత్ర నత్థ భట్టం భటైః సహ।
హత్వా కృత్వా చ కదనం దేశోత్పన్జం కృధా వ్యధాత్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 92)

అక్కడ క్రోధంతో భటులను  చంపాడు. అధికారి నత్థభట్టును కూడా చంపాడు. నగరాన్ని నాశనం చేశాడు. దేశం మొత్తానికి ఉపద్రవాన్ని తెచ్చిపెట్టాడు. భట్టులు అంటే, కశ్మీరీ పండితులు.

సూయవరం (సోపోర్) లో ఆదమ్‍ఖాన్ ఘోరమైన యుద్ధం చేశాడు. అక్కడి అధికారి నత్థభట్టు అతడిని ఎదుర్కున్నాడు. కాని అతనిని, భటులను సంహరించాడు ఆదమ్‍ఖాన్. అంతటితో ఆగలేదు. నగరాన్ని సర్వనాశనం చేశాడు.

ఆదమ్‍ఖాన్ సర్వనాశనం చేయటం అంటే ఇంతకు ముందే వివరించాడు శ్రీకరుడు. సూయపురంలో జరిగిన యుద్ధంలో రాజు సేనలు ఓడిపోయాయన్న మాట. ఈ సంఘటన వల్ల  బహుశా, తన సేనలో, తనకు వ్యతిరేకంగా ఎంతో మంది ఉన్నారని, తనకు ద్రోహం తలపెట్టారని జైనులాబిదీన్ ఊహించి ఉండవచ్చన్న ఆలోచనను కూడా కలిగిస్తుంది. ఎవరినీ నమ్మటానికి లేదు. ఎందుకంటే యువరాజు కాబట్టి ఆదమ్‍ఖాన్ రాజు అవటం ఖాయం. అలాంటప్పుడు వయసు మళ్లిన జైనులాబిదీన్ కన్నా ఆదమ్‍ఖాన్ వైపు ఉంటేనే లాభం. దాంతో తన చుట్టు ఉన్న వారిలో ఎవరు ద్రోహులో ఎవరు నమ్మకస్థులో తెలియని పరిస్థితి నెలకొని ఉంటుంది. ఇలాంటి పరిస్థితులలో హాజీఖాన్ సేనలు తోడుగా వస్తే ఆ కనీసం అతడు, అతడి సేనలు తనపై కుట్రలు చేయరన్న నమ్మకం ఉంటుంది. అందుకని కూడా జైనులాబిదీన్ హాజీఖాన్‌కు ఉత్తరం రాసి సహయానికి రమ్మని ఉంటాడు. ఆ ఆహ్వానంలో సహయం చేస్తే రాజ్యం నీదే అన్న పిలుపు కూడా ఉంది.

(ఇంకా ఉంది)

Exit mobile version