[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]
తృతీయ సర్గ
క్వచిద్రీత్యా క్వచిద్రీత్యా క్వచిన్నీత్యా విలోభయాన్।
లోభగ్రస్తో బలాత్కారన్న కేపామహారద్వనమ్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 68)
రచన ఒక గమ్మత్తయిన ప్రక్రియ.
ఒకే సమయంలో ఆనందం, బాధలను రెండు విభిన్నమైన అంశాల ద్వారా కలిగిస్తుంది వాక్యం. మరే కళ కూడా ఇలాంటి పరస్పర విభిన్నమైన భావనలను ఏకకాలంలో ఒకే విషయం ద్వారా కలిగించలేదు. శ్రీవరుడి రచన దీన్ని నిరూపిస్తుంది.
ఒక విషయాన్ని కవి ప్రదర్శించిన రీతి కవి ప్రతిభను తెలుపుతుంది. అతను భావాన్ని వ్యక్తపరిచిన తీరు, పదాల ఎంపిక, పదాల కూర్పు ఆనందం కలిగిస్తుంది.
కానీ అతను వ్యక్తపరుస్తున్న విషయం అత్యంత దుర్భరమూ, వేదనాకరమూ అయితే, ఈ ఆనందాన్ని వేదన ముంచేస్తుంది. కానీ శ్రీవరుడి రచనలో కవి ప్రతిభ పట్ల ఆనందం కలుగుతూనే ఉంటుంది. ఆయన ప్రకటించిన అంశం గుండెలను తొలిచేస్తూ తీవ్రమైన భరించలేనంత వేదన కలిగిస్తుంది. ఇక్కడ ఒకదాన్ని మరొకటి ముంచెత్తే ప్రసక్తి లేదు. ఎందుకంటే, ఆనందం ‘బుద్ధి’ అనుభవిస్తుంటుంది. విషాదం హృదయం అనుభవిస్తుంటుంది. రెండూ సమాన స్థాయిలో మనసును తాకుతూంటాయి.
ఆదమ్‌ఖాన్ అకృత్యాల వివరణను కొనసాగిస్తున్నాడు శ్రీవరుడు. ఆ అకృత్యాలను ఆయన ఒక పద్ధతి ప్రకారం, ఒకటొకటిగా వివరించటం ఒక ఎత్తయితే, ఆ వివరణ కోసం వాడిన పదాల అమరిక మరో ఎత్తు.
ముందు శ్లోకంలో ఎక్కడకు వెళ్తే అక్కడ, ఎవరి భూమి పడితే వారిది ఎలా కాజేసేవాడు అన్న శ్లోకం రాశాడు. ‘భూమి మాత్రమేనా కాజేసింది? అది ఎవరైనా కాజేస్తారు’ అని ఎవరైనా సమర్థించేలోగా, తరువాత శ్లోకం వస్తుంది.
లోభంతో అతడు (ఆదమ్‌ఖాన్), యుక్తితో ఒక చోట, భయపెట్టి మరో చోట, రాజకీయంతో, ప్రలోభం ద్వారా, బలవంతంగా ఇంకోచోట ప్రజల భూములను అపహరించాడు.
భూములనే కాదు, ధనాన్ని కూడా వదిలిపెట్టలేదు ఆదమ్‌ఖాన్.
యుక్తి పన్ని అపహరించాడు. బెదిరించి దోచుకున్నాడు. బలవంతంగా కొల్లగొట్టాడు. రాజనీతి ఉపయోగించి దోచుకున్నాడు. ప్రలోభపెట్టి కొల్లగొట్టాడు. అంటే, భూమిని ఎలాబడితే అలా తన పరం చేసుకున్నాడో, ఎన్ని రకాలుగా ప్రజలను దోచుకోవాలో అన్ని రకాలుగా ప్రజలను దోచుకున్నాడన్న మాట ఆదమ్‍ఖాన్.
సాధారణంగా పలు వ్యక్తులు చెరో రకంగా ప్రజలను మోసం చేయవచ్చు. కానీ ఒకే వ్యక్తి ఇన్ని రకాలుగా ప్రజలను కొల్లగొట్టటం ఆదమ్‌ఖాన్ ప్రత్యేకత, ఒక వ్యక్తికి ఎన్ని రకాలుగా చావు రాగలదో, అన్ని రకాలుగా వచ్చి ప్రాణం కొల్లగొడుతాడు యముడు. యముడి లాగే, ఆదమ్‍ఖాన్ ఎన్ని రకాలుగా కొల్లగొట్టచ్చో, అన్ని రకాలుగా కొల్లగొట్టాడు.
‘క్వచిద్రీత్యా క్వచిద్రీత్యా క్వచిన్నీత్యా’ అన్న పదాలు చదువుతుంటేనే ఎంతో హాయిగా, ఆనందంగా అనిపిస్తుంది. కానీ వాటి భావం బాధిస్తుంది.
స ప్రాకృత ఇవ వ్యాజామైవీం కువర్న్ గృహాగతః।
లోభాదన్యాంల్లారిన్యాస్తానన్యాన్ విత్తైర్వచ్చయత్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 69)
సామాన్యుడిలా సామాన్యులైన లావణ్యులతో స్నేహం చేశాడు. వాళ్ళ ఇళ్ళకు వెళ్లాడు. అక్కడ వాళ్ల ధనాన్ని దోచుకున్నాడు, వాళ్ళతో స్నేహం చేసి.
ఆదమ్‍ఖాన్ యువరాజు. అతడు సామాన్యుడిలా అందరి ఇళ్లకు వెళ్లటం ఒక అద్భుతం. యువరాజు తమ ఇంటికి రావటం సామాన్యుడిని ఉబ్బి తబ్బిబ్బు చేస్తుంది. దాంతో సామాన్యుడు తన హృదయాన్ని రాజు పాదాల క్రింద పరుస్తాడు. యువరాజు వాటిని తొక్కుతూ ముందుకు సాగాడు. అలా అందరి ఇళ్ళకు వెళ్ళి వాళ్ళ ఆస్తుల్ని చూసి కనబడిన ప్రతీదాన్నీ దోచాడు యువరాజు.
భూమిని దోచాడు. ధనాన్ని దోచాడు. ఇళ్ళనూ దోచాడు. ఇంతటితో ఆగలేదు ఆదమ్‍ఖాన్.
లావణ్యుల ప్రసక్తి కల్హణుడి రాజతరంగిణి నుండీ ఏదో ఓ సందర్భంలో శ్రీవరుడి రాజ తరంగిణి వరకూ వస్తూనే ఉంది. కశ్మీరు చరిత్రలో లావణ్యులు కీలకమైన పాత్ర పోషించారు కొన్ని వందల సంవత్సరాలుగా.
కల్హణుడి రాజతరంగిణిలో లావణ్యులు వీరులు, శూరులు. హింసకు సిద్ధంగా ఉండేవారు. యుద్ధంలో వారిని ఎదుర్కోవటం ఎంతో కష్టమైన పని. వారి క్రౌర్యం, వారి వీరత్వం, కశ్మీరు రాజులకు ఎంతగానో ఉపయోగపడింది. వారి దళాలను ఏర్పరిచి శత్రవుల పైకి ఉసిగొలిపేవారు. జోనరాజు కాలానికి వీరు రాజ్యాధికారం కోసం అరాచకాలు సృష్టించేంత శక్తివంతులయ్యారు. సాంఘిక, రాజకీయ జీవితాలలో కీలకమైన పాత్రను పోషించారు. శ్రీవరుడి రాజతరంగిణిలో జైనులాబిదీన్ వ్యతిరేకులలా కనిపిస్తారు. అతనితో పోరాడారు. కానీ శ్రీవరుడి తరువాత రాజతరంగిణులలో లావణ్యుల ప్రసక్తి రాదు. ఎందుకంటే, కాలక్రమేణా వీరంతా ఇస్లాం స్వీకరించారు. ఈ కాలంలో ‘లోన్/లోనె’ ఇంటిపేరుగా కలవారందరూ ఒకప్పటి లావణ్యులేనని పరిశోధకులు తేల్చి చెప్పారు. మతం మారని లావణ్యులు ఉత్తర కశ్మీరు ప్రాంతాలకు వలస వెళ్ళారు. వీరు ‘చిలాస్’లో (పాక్ ఆక్రమిత గిల్జిత్-బాల్టిస్తాన్ ప్రాంతంలో ఉంది) నిలదొక్కుకున్నారు. కానీ కొన్నేళ్ళకే ఇస్లాం స్వీకరించారు. ఈ రకంగా లావణ్యులు అన్న పదం కశ్మీరు చరిత్ర నుంచి అదృశ్యం అయింది.
‘లావణ్యులు’, ‘లోన్’లుగా మారటానికి దారితీసిన అనేక పరిస్థితులలో కొన్నిటిని ఆదమ్‍ఖాన్ వ్యవహారం చూపుతుంది. ఇళ్ళల్లో దూరి ఇంటిలోని ఆస్తిపాస్తులను దోచుకోవటం, భూములు లాగేసుకోవటం వల్ల మతం మారటం తప్ప, మరే రకమైన రక్షణ లేని పరిస్థితులు నెలకొన్నాయి. అందుకే శ్రీవరుడి రాజతరంగిణి తరువాత ప్రజ్ఞాభట్టు, శుకుడు రచించిన రాజతరంగిణులలో ‘లావణ్యులు’ అన్న పదం కనబడదు. వీరి ప్రస్తావన కూడా కనబడదు. మట్టి నీటిలో కరిగిపోయినట్టుగా లావణ్యులు ఇస్లామీయులుగా మారిపోయారు.
నీతా జారకృతాద్ యుక్త్యా సభయాస్తాడయన్ స్త్రియః।
తదుక్త్యా దండయత్ తస్య గ్రామీణాన్ సేవక ప్రజ॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 70)
ఆదమ్‍ఖాన్ సేవకులు మహిళలను మాయోపాయాలతో ఎత్తుకుపోయేవారు. వారిని బెదిరించి, హింసించేచేవారు. ఆదమ్‌ఖాన్ ఆజ్ఞలతో వారిని దండించేవారు.
తత్తద్వినిగ్రహాస్థావ సావధాన వచిస్తదా।
స తార్కిక ఇవాత్యుగ్రే రాష్ట్రియైర్దుర్జయో భవత్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 71)
తనును ఎదిరించిన, లేక, లొంగని స్త్రీలను చెరబట్టి, న్యాయస్థానాలను తప్పించుకుని వారితో క్రూరంగా వ్యవహరించేవారు. ఎలాగయితే రాజులు బలహీన స్థలాలపై ముందుగా తమ ఆధిక్యతను ప్రదరిస్తారో, అలాగ సేవకులు స్త్రీలపై తమ బల ప్రదర్శన చేశారు.
జాయాస్నుపాదృహిత్రాద్యా భవ్యా యేప్యభవన్ గృహే।
వలాత్ ప్రవిశ్య సంభుక్తా నిలెజ్జైస్తస్య సేవకైః ॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 72)
ఏయే గృహాలలో అందమైన స్తీలు, భార్యలు, కోడళ్ళు, సోదరిలు, కూతుళ్ళు వంటి వారున్నారో, ఆయా ఇళ్ళల్లోకి బలవంతంగా దూరి సిగ్గులేకుండా, ఆదమ్‌ఖాన్ సేవకులు ఆనందించేవారు.
కశ్మీరు ప్రజలు, భారతీయ ధర్మంలోని కులభేదాలు, అసమానతల వల్ల; అందరూ సమానమనే విశాల దృక్పథం కల ఇస్లామ్ మతాన్ని స్వచ్ఛందంగా స్వీకరించారని తీర్మానించి, ప్రకటించి, నిర్ధారించి, పుస్తకాలలో రాసేసి ప్రపంచాన్ని నమ్మించాలని ప్రయత్నిస్తున్న వారితో శీర్షాసనం వేయించి, శ్రీవరుడు రచించిన ఈ శ్లోకాలను వెయ్యిసార్లు వల్లె వేయిస్తే కానీ వారి మెదళ్లలో నిండి గడ్డకట్టిన అబద్దం కరగిపోదు. కళ్ళకు కమ్మిన పొరలు జారిపోవు.
భారతదేశ చరిత్రను అనాథలా భావించి ఎవరికి వారు ఇష్టమొచ్చినట్టు కాళ్లతో, చేతులతో, తలతో కూడా బంతిలా ఆటలాడుతున్న వైనం బోధపడాలంటే శ్రీవరుడి రాజతరంగిణిని ప్రతి ఒక్కరూ శ్రద్ధగా పఠించాల్సి ఉంటుంది. అర్ధం చేసుకోవాల్సి ఉంటుంది. ఈనాడు మన చుట్టూ సంభవిస్తున్న పరిణామాలను అధ్యయనం చేస్తూ సమాజంలో సంభవించిన సంఘటనల స్వరూపాన్ని అవగతం చేసుకోవాల్సి ఉంటుంది. భారతీయ సమాజం ఎలాంటి దుర్భర దౌర్జన్య రాక్షస క్రీడలను భరించిందో, నీచ, నికృష్ట, భయావహా క్రీడలకు వేదికగా మారిందో అవగాహన చేసుకోవాల్సి ఉంటుంది. భవిష్యత్ తరాలు మళ్లీ అలాంటి అమానుష రాక్షస చర్యల పాలపడే దుస్థితి రాకుండా ఉండేందుకు ఈనాటి నుంచే జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
సమండ మత్స్యం కుండైస్తే పీత్యా శుండాంతరే మధు।
భాండా ఇవ మదోచ్చండాః శ్వాసైర్భాండమవదయన్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 73)
మద్యం దుకాణాల్లో ఇష్టం వచ్చినట్టు తాగి వీరు పాత్రలన్నీ పగలగొట్టేవారు. హింసాకాండ నెరపేవారు. నృత్యాలు చేవారు.
తండులాశ్చ కుసూలేభ్యః శాలాభ్యః పీనబర్కరాః।
వీటికాభ్యః స్వయం మద్యం భుక్తం తైర్బలకారిభిః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 74)
హింసాత్మకంగా వారు ఇళ్ళల్లో దూరి ఆహారం తినేవారు. భాండాలలోని మద్యం తాగేవారు. ఆ మత్తులో వారు అధిక పన్నలను బలవంతంగా వసూలు చేసేవారు.
సేవకానౌచిత తస్య కియతీ వర్ణ్యతే మయా।
యే శ్వమూర్ధని వాస్తవ్యాన్ ఘృతాభ్యంగకారయన్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 75)
ఆదమ్‌ఖాన్ సేవకుల అనౌచిత్య ప్రవర్తన గురించి నేనంతని చెప్పాలి? వాళ్లు రాత్రి పూట గ్రామీణుల తలలపై నెయ్యి రాసేవారు.
‘ఇదొక కష్టమా?’ అనిపించవచ్చు ఈ శ్లోకం చదివిన తరువాత. గ్రామీణుల తలలపై నెయ్యి పూశారు. బాగుంది. వెళ్లి తలస్నానం చేయండి. అదో గొప్ప నేరమైనట్టు ప్రవర్తిస్తారెందుకు? అని ఆధునిక లౌకిక స్వేచ్ఛావాదులు ఎడ్డంతెడ్డంగా ఆక్షేపించవచ్చు. తరువాత శ్లోకం చదివితే ఈ నెయ్యి లేపనం తలలపై ఎందుకు పూసేవారో తెలుస్తుంది. బలహీన మనస్కులు కాస్త జాగ్రత్తగా చదవాల్సి ఉంటుంది ఇకపై.
హసన్తీరివ జ్వాలాభిస్తైలపూర్ణా హసన్తికాః।
తాన్ కారయిత్యా యే దీపాన్ నిశాస్వజ్జ్వలయన్షాఠాః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 76)
రాత్రి పూట తలలపై నెయ్యి రాసి వారి తలలకు నిప్పు అంటించటం వల్ల వాటిని దీపాలుగా వెలిగించేవారు. వారి తలలపై జ్వాలలు విరగబడి నవ్వుతున్నట్టున్నాయి.
‘హసంతిక’ అంటే కాగడా! అంటే, నిలుచున్న మనుషుల తలలపై నెయ్యి పూసి నిప్పు వెలిగించటం వల్ల వారిని కాగడాలుగా మార్చేవారన్న మాట.
తల మండుతుంటే ఎవ్వరూ కదలకుండా స్థిరంగా ఉండలేరు. అటూ ఇటూ ఎగురుతారు. పరుగులిడతారు. అది చూసి వారి తలపై జ్వాలలు నవ్వుతున్నట్టు భుగభుగలాడుతున్నాయి.
నాలుగు రోడ్ల కూడలి వద్ద వారిని వెలిగించి నూనె నిండిన వాహనాల్లోకి తోసి వాహనాలకు నిప్పు పెట్టేవారు.
ఇంకా ఏం చెప్తాడు శ్రీవరుడు వారి నైచ్యం గురించి? వారి రాక్షసత్వం గురించి ఇంకా చెప్పాల్సింది ఏముంది?
ఒకప్పుడు కశ్మీరు వీధులలో మానవ కాగడాలను వెలిగించి ఆనందించేవారనీ, అలా కాగడాలుగా వెలిగి బూడిదయిన వారికి మనం వారసులమనీ, వారు మన పూర్వీకులనీ, వారి ప్రాణ త్యాగాలవల్ల ఈనాడు ఇంకా మన దేవుళ్ళు సజీవంగా నిలచివున్నారనీ, మనం మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను ఇంకా నిలుపుకోగల స్థితిలో వున్నామన్న నిజం తలచుకుంటేనే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. ఇదంతా తెలుసుకోకుండా, నోటికి వచ్చినట్టు వ్యాఖ్యానిస్తూ, హేళన చేస్తూ తామే తెలివయినవారని కాలర్లెగరేస్తున్న మూర్ఖులూ మనవాళ్ళేనని బాధపడి సిగ్గుతో చితికి పోతాము.
యువరాజు భూములు లాక్కున్నాడు. ధనం లాక్కున్నాడు. సేవకులు ఇళ్ళల్లో దూరి స్త్రీలపై అత్యాచారాలు చేశారు. అందమైన అమ్మాయి కనిపిస్తే ఎత్తుకుపోయి, హింసించి, అనుభవించి ఆనందించారు. ఎదురుతిరిగిన వారిని నిలబెట్టి తలలపై నెయ్యి రాసి కాగడాలుగా మార్చారు. నూనె నిండిన వాహనాల్లోకి తోసి నిప్పంటించారు.
ఇంకా చేయవలసింది ఏముంది?
ఇంతటి ఘోరమైన, క్రూరమైన, రాక్షస చర్యల బారిన పడకుండా ఉండాలంటే దేశం వదిలి పారిపోవాలి. లేదా, మతం మారిపోవాలి. మతం మారిపోతే తమపై అత్యాచారాలు జరిగే బదులు, తామే ఇంకా మతం మారని వారి ఆస్తులు కాజేసి, అత్యాచారాలు జరపవచ్చు.
ఇలా ఒక జాతి మొత్తంపై క్రూరమైన దాడి జరిగింది. కానీ ఆ జాతి ఇప్పుడు ఇవేవీ జరగనట్టు నమ్ముతూ మళ్ళీ అదే దారిలో ప్రయాణిస్తోంది. శ్రీవరుడు ప్రత్యక్షంగా చూసి చెప్తున్నదాన్ని నమ్మని వారు బంగ్లాదేశ్, పాకిస్తాన్, అఫ్ఘనిస్తాన్, వంటి దేశాలలో అల్ప సంఖ్యాకుల జీవితాల గురించి తెలుసుకుంటే చాలు. ఆనాటికీ ఈనాటికీ పరిస్థితి ఏమీ మారలేదని తెలుస్తుంది. First eye witness account of genocide in the world is Srivara అని విదేశీయులు అన్నా, మనకి శ్రీవరుడెవరో తెలియదు, ఏం రాశాడో అసలు తెలియదు. మనకి మన రంగుటద్దాల చూపే నిజం. విదేశీయుల నిరాధార, కుట్రపూరిత కుటిల తీర్మానాలే సత్యం!
(ఇంకా ఉంది)