[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]
తృతీయ సర్గ
వంధో సౌ గుణివాన్ధవో దినపతిర్యస్యోదయానుగ్రహాద్
దుష్టా కుత్ర న సర్వదర్శనసుఖాత్ సచ్చకహర్షస్థితిః।
నింద్యౌ తస్య సుతో పితుర్విదృశౌ లోకవ్యయోత్పాదాకౌ
యౌ కాలోయమితి ప్రథాముపగతౌ క్రూరగ్రహో నిశ్చితౌ॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 59)
సూర్య దర్శనం కాని స్థలం భూమి మీద లేదు. అంతరిక్షంలో ఉదయించే సూర్యుడిని అందరూ ఆరాధిస్తారు. సూర్యుడు అందరికీ ఆనందం కలిగిస్తాడు. అందరి మిత్రుడు సూర్యుడు. కానీ సూర్యుడి ఇద్దరు కుమారులు యముడు, శని, తండ్రికి భిన్నంగా, ప్రజలందరికీ క్లేశం కలిగిస్తారు. అందరి శాపనార్థాలు అందుకుంటారు. దూషణలకు గురవుతారు. వారిని మృత్యువు అని, దుష్టగ్రహం అనీ భావిస్తారు. దూషిస్తారు.
శ్రీవరుడి ధైర్యాన్ని మెచ్చుకోవాలి.
రాజు సూర్యుడి లాంటి వాడు. సమస్త జనులకు వెలుగునిచ్చేవాడు. వేడినిచ్చేవాడు. దైవ సమానుడు. సూర్య దర్శనం కోసం ప్రజలు తపిస్తారు. సూర్య దర్శన మాత్రంతోటే ఆనందం పొందుతారు. నిజానికి ప్రపంచ ప్రాణం మొత్తం సూర్యుడి కిరణాలలో ఉంటుంది. అలాంటి సూర్యుడి పుత్రులు యముడు, శని. సూర్యుడు విశ్వకర్మ కూతురు సంజనను వివాహమాడాడు. ఆమె వల్ల మనువు, యముడు, యమి జన్మించారు. ఛాయా వల్ల శనీశ్వరుడు, మను, తపతి జన్మించారు. అశ్వ రూపం ధరించిన సూర్యుడి వల్ల సంజనకు అశ్వనీ కుమారులు, రేవంతుడు జన్మించారు. వీరిలో శ్రీవరుడు ఇద్దరినే ప్రస్తావిస్తున్నాడు. యుముడు, శనీశ్వరుడు.
యముడంటే అందరికీ భయం. శనీశ్వరుడంటే హడలు. ప్రతి ఒక్కరూ జాతకంలో ముందుగా భయంతో చూసేవి ఈ రెండు అంశాల గురించే. శని దృష్టి ఎలా ఉంది? యమానుగ్రహం ఎప్పుడు కలుగుతుంది? ఈ రెండు విషయాల పట్ల చింత మనిషి జీవితాన్ని నిర్దేశిస్తుంది. మనిషి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ ఈ ఇద్దరంటే భయపడతారు. వీరిద్దరూ తమకు దూరంగా ఉండాలని వాంఛిస్తారు. ప్రార్థిస్తారు.
సూర్యుడు ప్రాణం పోసేవాడయితే, యముడు ప్రాణం తీసేవాడు. శని ప్రాణాన్ని కష్టపెట్టేవాడు. సూర్యుడు తండ్రి. వీరిద్దరూ ఆయన సంతానం. తండ్రి అందరి మిత్రుడు. అందరి పొగడ్తలు, దీవెనలు అందుకుంటాడు. సంతానం దుష్టులు. అందరి తిట్లు, శాపనార్థాలు పొందుతారు.
జైనులాబిదీన్ ఎంత గొప్పవాడో, కొడుకు అంత నీచులు.
జైనులాబిదీన్ ఎన్ని ప్రశంసలు, ప్రేమలను పొందాడో, అతని సంతానం ఇద్దరూ అన్ని తిట్లు, ద్వేషాన్ని పొందుతున్నారు.
ఈ విషయాన్ని స్పష్టంగా, సూటిగా, నిర్భయంగా చెప్పాడు శ్రీవరుడు.
జైనులాబిదీన్ మరణం తరువాత సోదరుల నడుమ అధికారం కోసం పోరు జరిగింది. కశ్మీరు అల్లకల్లోలం అయింది. ఎవరి ప్రాణాలకు భద్రత లేదు. ముఖ్యంగా ఇస్లామేతరులకు రక్షణ పోయింది. అటువంటి పరిస్థితులలో ఇలాంటి శ్లోకం రాయటం శ్రీవరుడి ధైర్యం, తెగింపులకు నిదర్శనం. జైనులాబిదీన్ మరణం తరువాత దాదాపుగా రెండు దశాబ్దాలు శ్రీవరుడు అదృశ్యం అయ్యాడు. ఈ మధ్య కాలంలో ఎలా బ్రతికాడో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కున్నాడో ఎవరికీ తెలియదు.
అత్రాంతరే అనుజద్వేష వశాత్ కలుషితాశయః।
ఆదామ్‌ఖానో నిఃశేషం దేశమాకామయా యధృఠాత్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 60)
ఇంతలో తన సోదరుడి పట్ల ద్వేషభావం వహించి అసూయతో రాజ్యంపై దాడి చేశాడు దుష్టుడు ఆదమ్‌ఖాన్. మళ్ళీ దేశం మొత్తం అల్లకల్లోలమయింది.
యత్రాశ్మేవాతి కఠినాస్తన్వత తంత్రియంత్రిణః।
దుర్మన్త్రిణో భజన్ రాజ్ఞి తస్మిన్ సోపి స్వతంత్రామ్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 61)
రాతి హృదయం కల శాసకులు రాజు నుండి స్వతంత్రులయ్యారు. రాజ్య సంక్షేమం గురించి పట్టించుకోవటం మానేశారు. వీరందరినీ దుష్ట మంత్రులు తప్పుదారి పట్టించారు.
స్ఫీతే భీతే న కామాస్త్రే శాస్త్రే న రసికో భవత్।
కేవల్ మృగాయాసక్తశ్చమత్కార శ్వభిర్వ్యధాత్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 62)
రాతి లాంటి హృదయుడు ఆదమ్‌ఖాన్. అతడికి విజ్ఞానార్జన పట్ల ఆసక్తి లేదు. అతడికి ఆసక్తి కామం పట్ల, స్త్రీల పట్ల మాత్రమే. మిగతా సమయాల్లో వేటాడేవాడు. కుక్కలతో ఆటలాడుతూ సమయం గడిపేవాడు. అతడికి రాత్రుళ్ళు పగళ్లలా ఉండేవి. పగళ్లు రాత్రుళ్లు. అంటే, రాత్రంతా కేళీవిలాసాలలో గడిపి, పగలంతా నిద్రించేవాడన్నమాట.
సరసామంతరేరణ్యే యత్ర కుత్రాపి తిష్ఠతః।
మృగయారసికస్యాస్య రాత్రిదినమివాభవత్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 63)
ఎక్కడున్నా, అంటే అరణ్యంలో వేటలో లో ఉన్నా, సరోవరాలున్న రాజభవనంలో ఉన్నా అతడికి రాత్రి దినంతో సమానం అయింది. ఇక్కడ ఆదమ్‌ఖాన్‌ను సూచించేందుకు ‘మృగయరసికుడు’ అన్న పదం వాడేడు శ్రీవరుడు. చక్కని పద ప్రయోగం. ‘రసికుడు’ అన్న పదాన్ని అధికంగా శృంగారం పట్ల ఆసక్తి కలవారిని, సాహిత్యంలోనూ, కళల్లోనూ ప్రీతికలవారిని సూచించేందుకు వాడతారు. ‘మృగయారసికుడు’ అన్న పదంతో వేట పట్ల ఆసక్తి కలవాడని సూచించాడు శ్రీవరుడు.
కిముచ్యతేన్యన్నీచత్వ యద్ భృత్యైర్వ్యవహారివత్।
శ్యేనసంహృతపక్ష్యోధవిక్రయో నగరే కృతః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 64)
గ్రద్దలు చంపిన పక్షుల ఈకలను నగరంలో అమ్ముకుని వ్యాపారం చేసే నీచులు సేవకులుగా కలవాడి నైచ్యం గురించి ఏం చెప్పాలి?
శ్రీవరుడి రాజతరంగిణిలో ఆరంభం నుంచీ ఆదమ్‌ఖాన్ అంటే చులకన భావం కనిపిస్తూనే ఉంది. అతడిని చేతకాని వాడిగా, నీచుడిగా వీలు చిక్కినప్పుడల్లా ప్రస్తావిస్తునే ఉన్నాడు శ్రీవరుడు. ఇప్పుడూ అంతే.
యజమానిని బట్టి సేవకులుంటారు. యజమాని నిజాయితీపరుడయితే సేవకులు కూడా నిజాయితీగా ఉంటారు. యజమాని కఠినుడు, క్రూరుడు అయితే సేవకులూ అంతే. ఆదమ్‍ఖాన్ సేవకులు ఎంతటి నీచులంటే గ్రద్దలు చంపిన పక్షుల ఈకలను ఏరుకుని అమ్మేవారు.
కశ్మీరులో గ్రద్దలను పెంచటం ఒక వ్యాపారంగా ఉండేది. ముఖ్యంగా మొఘలులు, పఠాన్లు గ్రద్దలను పెంచటమే వృత్తిగా ఉండేవారు. వీరి పని గ్రద్దలను పెంచి వాటికి శిక్షణనిచ్చి ఆకాశంలో వదలటమే. ఈ గ్రద్దలు పక్షులను చంపి తెచ్చి యజమానికి ఇచ్చేవి. వారు పక్షి ఈకలను నగరంలో అమ్మేవారు. వీరి పని ఈకలను అమ్మటం.
భారతీయులలో పక్షులను పట్టేవారు ప్రత్యేకంగా ఉండేవారు. వీరు వలలు వేసి పక్షులను పట్టేవారు. వాటిని పక్షులను పెంచుకునేవారికి అమ్మేవారు. పక్షిని చంపేందుకు గ్రద్దను వాడటం వారికి కొత్త. అందుకే శ్రీవరుడు ‘గ్రద్దలు చంపిన పక్షి ఈకలు అమ్మే వారంత నీచులు’ అని ప్రత్యేకంగా చెప్తున్నాడు. రెండు విభిన్నమైన నాగరికతలు కలిసి బ్రతకాల్సి వచ్చినప్పుడు ఇలాంటి భావనలు కలగటం సహజం. పైగా, ఎవరికి వారు తామే అధికులమన్న భావన కలవారయి, ఒకరు మరొకరిపై ఆధిక్యం సాధిస్తే, ఇలాంటి భావనలు మరింత తీవ్రమవుతాయి. ఎంతగా అంటే, ఒకరొనొకరు అసహ్యించుకునేంతగా, ద్వేషించుకునేంతగా! తమ ఆధిక్యం నిరూపించుకునేందుకు ఒకరినొకరు చంపుకునేంతగా!
అథైకదా విభజ్యాసో యౌవరాజ్యమదోద్దత్తః।
క్రమరాజ్యం నృపత్యాజ్యం యయో ప్రాజ్యపరిచ్ఛదః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 65)
యువరాజు మదోన్మత్తుడు. తాను యువరాజుననే అహం నరనరాన జీర్ణించుకుపోయినవాదు. క్రామరాజ్యాన్ని ఆక్రమించేందుకు తన సేవకులు, సైన్యంతో వెళ్ళాడు.
‘తవాకత్ అక్బరీ’ ప్రకారం, క్రామరాజ్యం క్షామానికి గురియిందనీ, అక్కడి పరిస్థితిని చక్కపెట్టేందుకు స్తులాన్ జైనులాబిదీన్ ఆదమ్‌ఖాన్‌ను పంపించాడని ఉంది. కేంబ్రిడ్జ్ హిస్టరీ పుస్తకంలో కూడా క్రామరాజ్య పాలన బాధ్యతలను జైనులాబిదీన్, యువరాజు ఆదమ్‍ఖాన్‌కు అప్పగించాడని ఉంది. కానీ శ్రీవరుడు ప్రత్యక్ష సాక్షి. పర్షియన్ రచనలు – అసలు సంఘటనలు జరిగిన వందేళ్ళ తరువాత రాసినవి. దాని అనువాదం కేంబ్రిడ్జ్ చరిత్ర పుస్తకం. కాబట్టి, ప్రత్యక్ష సాక్షి కథనానికే ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది.
ఈ శ్లోకం కన్నా ముందు శ్లోకంలో దుష్ట మంత్రులు, ఇతర శక్తిమంతులు స్వతంత్రులయ్యారని రాశాడు శ్రీవరుడు. ఇప్పుడు ఆదమ్‌ఖాన్ క్రామరాజ్యాన్ని ఆక్రమించాడని రాస్తున్నాడు. తర్కబద్ధంగా ఉంది శ్రీవరుడి రచన. కాబట్టి, ఆదమ్‌ఖాన్ తన సేవకులు, సైన్యంతో క్రామరాజ్యాన్ని ఆక్రమించాడని నిస్సంకోచంగా నమ్మవచ్చు.
యత్ర యత్రోపవిష్టః స పాపనిష్ఠోప్యనిష్టవత్।
అమవన్ పీడితగ్రామీణాక్రందముఖురా దిశః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 66)
అప్పటికే కరువు కాటకాలతో తల్లడిల్లుతున్న ఆ దేశంలో ఏయే ప్రాంతం నుంచి ఆ దుష్టుడు వెళ్లినా, ఆయా ప్రాంతాలు ప్రజల హాహాకారాలతో నిండిపోయాయి. ఒక ఉపద్రవం సంభవస్తే ప్రజలు ఎలా రోదిస్తారో, అలా ఆదమ్‍ఖాన్ అడుగుపెట్టిన ప్రాంతాలలో ప్రజలు రోదించారు.
ఈ శ్లోకం చదవగానే గతంలో శ్రీవరుడు రాసిన శ్లోకం, జైనులాబిదీన్ సూర్యుడు, అతని సంతానం యముడు, శనీశ్వరుడి లాంటి వారు అన్నది గుర్తుకొస్తుంది. ఆదమ్‍ఖాన్ అడుగుపెట్టిన చోటల్లా హాహాకారాలే!
‘పీర్ హసన్’ ప్రకారం, ఆదమ్‌ఖాన్ ప్రజల దగ్గర ఏది కనిపిస్తే దాన్ని లాక్కునేవాడు. అంతేకాదు, గతంలో ప్రజలకు దానాలుగా, బహుమతులుగా అందిన భూములన్నీ తనవే అని లాక్కునేవాడు. అతని సేవకులు అతడిని అనుసరించారు. ప్రజాపీడనం, బలత్కారాలు వంటివన్నీ క్రామరాజ్యంలో ఆదమ్‍ఖాన్, అతని సేవకులే ఆరంభించారంటాడు పీర్ హసన్. అయితే, తాను చేసిన దుశ్చర్యల ఫలితం కూడా ఆదమ్‌ఖాన్ అనుభవించాడు. కొన్నాళ్ళకి అతను ప్రాణాలు అరచేత పట్టుకుని క్రామరాజ్యం గుండానే పారిపోవాల్సి వచ్చింది.
ప్రసాదమతులోదగ్ర ప్రతిగ్రహద్రుఢాం క్షితిమ్।
ఉపగ్రహ ఇవాత్యుగ్రః సంజహార పదే పదే॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 67)
ఉపగ్రహం లాగా అతడు ప్రయాణించే మార్గంలో ఉన్న భూములన్నీ, న్యాయమైన యజమానులున్నా, వారి వద్ద నుండి అతడు లాక్కున్నాడు.
ఇక్కడ ఉపగ్రహం అన్న పదం అర్థాన్ని స్పష్టంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ‘ఉపగ్రహం’ అంటే పెద్దగ్రహం చుట్టూ తిరిగే చిన్న గ్రహం. భూమికి ఉపగ్రహం చంద్రుడు. జ్యోతిషం ప్రకారం రాహు, కేతువు వంటివి ఉపగ్రహాలు. మరో జ్యోతిష సిద్ధాంతం ప్రకారం సూర్యుడి నుంచి అయిదవ, ఎనిమిదవ, పద్నాలుగవ, పద్దెనిమిదవ, ఇరవయ్యటొకట, ఇరవై రెండు, ఇరవై మూడు, ఇరవై నాలుగవ నక్షత్రాలు ఉపగ్రహాలు.
ఈ పెద్ద గ్రహలపై ఉపగ్రహాల ప్రభావం సాధారణంగా దుష్టమే అయి ఉంటుంది. ఈ ఉపగ్రహాలు సూర్యుడిపై దుష్ట ప్రభావం చూపిస్తే వంశం నాశనమవుతుంది. లగ్నాన్ని, చంద్రుడిని ప్రభావితం చేస్తే అల్పాయుష్కులవుతారు. తెలివి హీనులవుతారు (భారత పరాశర హోర శాస్త్రం, 3. 65).
ఉపగ్రహాలకు సంబంధించిన జ్యోతిష శాస్త్రం ఓ సముద్రం. దాన్లో లోతుగా దిగేకన్నా పైపైనే స్పృశించి ముందుకు సాగటం ఉత్తమం. మొత్తానికి రాహువు, కేతువులు దుష్ట గ్రహాలు జ్యోతిషం ప్రకారం. వీటిని ఛాయాగ్రహాలంటారు. వీటికి భౌతిక రూపం లేదు. నీడల్లాంటివి. కానీ వ్యక్తి జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేయగల శక్తిమంతమైన గ్రహాలివి. సూర్య, చంద్ర గ్రహణాలకు కారణం ఇవి. వేదం ప్రకారం రాహుకేతువులు ఆత్మకారకాలు. జాతకంలో వీటి స్థానం వ్యక్తి జీవన గతిపై అత్యంత ప్రభావం చూపిస్తుంది. ఇక్కడ శ్రీవరుడు ‘ఉపగ్రహం’ అన్నా పదాన్ని దుష్ట ప్రభావం చూపించే గ్రహం అన్న అర్థంలోనే వాడేడు. ఆదమ్‍ఖాన్ అడుగుపెట్టిన చోటల్లా సర్వం దోచేస్తున్నాడు దుష్టగ్రహంలా అన్న అర్థంలో.
పట్టాలున్న భూములు, న్యాయబద్ధంగా యజమానులయిన వారి భూములు, బహుమతిగా పొందినట్టు నిరూపణలున్న భూములన్నిటినీ ఆదమ్‍ఖాన్ ‘తనవే’ అని లాగేసుకోడం చదువుతుంటే, ఇటీవలి కాలంలో ఎక్కడెక్కడి భూములనో తమవి అని ప్రకటించుకుని తమవిగా చేసుకోవాలని తహతహలాడుతున్న ‘వక్ఫ్ బోర్డ్’ వారి ప్రవర్తన మనసులో మెదులుతుంది. అధికారం మనిషిని ఎంతటి దుష్టుడిగా మారుస్తుందో, ఆదమ్‍ఖాన్ ప్రవర్తన ప్రదర్శిస్తుంది.
ప్రస్తుత సమాజంలో, ప్రజాస్వామ్యంలో మంచి చెడుతో సంబంధం లేకుండా, ‘చట్టం’ మద్దతు ఉంటే, దాని ఆధారంగా సృష్టించగల అల్లకల్లోలం, చేయగల అన్యాయం – ఆధునిక వక్ఫ్ చట్టం, వక్ఫ్ బోర్డు తనవని ప్రకటిస్తున్న భూముల వివరాలు తెలుసుకుంటుంటే అర్థమవుతుంది.
(ఇంకా ఉంది)