[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]
తృతీయ సర్గ
యోగినాం త్రివిధాశ్లీలం మధ్య మత్తాతయోదితమ్।
అసహిష్ట నృపో భక్తయా యదసహ్యం జనైరపి॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 50)
సామాన్యులు కూడా సహించని దుష్ప్రవర్తనను, భక్తి కారణంగా, రాజు, మదమత్తులైన భక్తుల త్రివిధాల అనుచిత ప్రవర్తనను అసహ్యించుకోకుండా సహించాడు.
జైనులాబిదీన్ భక్తిని, సనాతనధర్మం పట్ల గౌరవాన్ని మరింత స్పష్టం చేసే శ్లోకం ఇది. ఈ కాలంలో తమని తాము అభ్యుదయవాదులుగా, నాస్తికులుగా, ఆలోచనల్లో సమతౌల్యం కలవారిగా ప్రకటించుకునే వారు తప్పనిసరిగా చదివి అర్థం చేసుకోవాల్సిన శ్లోకం ఇది.
‘భక్తి’ అతి గమ్మత్తయిన పదం.
ఈ పదాన్ని అందరూ వాడతారు. రోజువారీ మాటల్లో ఎన్నో మార్లు దొర్లుతుందీ పదం. కానీ ‘భక్తి’ అన్న పదాన్ని నిర్వచించటం కష్టం.
‘భక్తి’ అంటే ‘సేవ’, ‘గౌరవంతో కూడిన స్నేహం, శ్రద్ధ’ అన్న అర్థాలున్నాయి.
భగవంతుడి మీద అనంతమైన అనురాగం భక్తి. నిజాయితీతో కూడిన, నిష్కళంక, నిరుపమాన, నిర్మోహ, నిజ, నిర్వికల్ప, నిర్మలమైన ప్రేమ భక్తి.
భక్తిలో పలు రకాలున్నాయి. భాగవతంలో నవవిధ భక్తుల గురించిన ప్రామాణికమైన శ్లోకం ఉంది. శ్రవణ భక్తి, కీర్తనా భక్తి, స్మరణ భక్తి, సేవాభక్తి, అర్చన భక్తి, వందన భక్తి. దాస్య భక్తి, సఖ్య భక్తి, ఆత్మనివేదన భక్తి (ప్రపత్తి). ఇవి నవవిధ భక్తి.
ఆచరణలో ఈ ‘భక్తి’ పలు రూపాలలో వ్యక్తమవుతుంది.
ఉత్సవాలలో, సంబరాలలో భక్తి హద్దులు దాటి ప్రదర్శితమవుతుంది. నాగరీక పరిధులను దాటి వ్యక్తమవుతుంది.
నృత్యాల రూపంలో, దూషణలు ప్రేలాపనల రూపంలో, అసహ్యకరమైన ప్రవర్తన రూపంలోనూ ద్యోతకమయ్యేది మరో రకం భక్తి. తాగిన మత్తులో జరిపే అనుచితమైన ప్రవర్తన కూడా భక్తి ప్రదర్శనలో భాగమే. కొన్ని సందర్భంలో ‘పిచ్చివాళ్ళే నయం’ అనిపించే రీతిలో ఉండే ప్రవర్తన కూడా భక్తిలో భాగమే.
అంటే, భక్తి భావన వ్యక్తిని బట్టి మారుతుంది.
ఒకరు తన ఇంట్లో మౌనంగా కూర్చుని భక్తిని ప్రదర్శిస్తే, మరొకరు మైమరిచి వీధుల్లో నృత్యాలు చేస్తూ భక్తిని అనుభవిస్తారు. ఒకరు గీతాలు, గ్రంథాల ద్వారా భక్తిని అనుభవిస్తే, మరొకరు త్రాగి తందనాలాడి, అసభ్యంగా ప్రవర్తించటం ద్వారా భక్తిని అనుభవిస్తారు.
ఈ సృష్టిలో ‘శక్తి’ని ఎవ్వరూ సృష్టించలేరు, నాశనం చేయలేరు. శక్తి ఒక రూపం నుంచి మరో రూపానికి రూపాంతరం చెందుతుంది తప్ప నాశనం అవటం లేదు అంటుంది శక్తినిత్వత్వ సూత్రం. ఈ శక్తినిత్యత్వ సూత్రాన్ని ‘భక్తి’కి కూడా అన్యయించవచ్చు.
‘భక్తి’ ఒకటే. అది విభిన్నమైన వ్యక్తులలో విభిన్నమైన రూపాలలో వ్యక్తమవుతుంది.
ఇది అర్థం చేసుకోలేని వారు ఆయా వ్యక్తుల ద్వారా ప్రదర్శితమయ్యే ‘భక్తి’ని విమర్శిస్తారు. తమని తాము ఉన్నతమైన స్థానంలో ఊహించుకుని, ఇతరులను నీచంగా భావిస్తూ విమర్శించి తమ అహంకారాన్ని అజ్ఞానాన్ని బహిర్గతపరుచుకుంటారు. అన్నిరకాల భక్తులను, భక్తి ప్రదర్శన పద్ధతులను అర్థం చేసుకుని, మౌనంగా ధ్యానించే వాడి లోను, తాగి తందనాలాడుతూ బూతులు పలుకుతూ అసభ్యంగా ప్రవర్తించేవాడి లోనూ ఒకే భక్తి భావన వేర్వేరు రూపాలలో వ్యక్తమవుతున్నదని గ్రహించి, అర్థం చేసుకునేవాడే అసలైన భక్తి భావనను గ్రహించినవాడు. టీవీని పలికించేది, దీపాన్ని వెలిగించేది, ఫ్యాన్‍ను కదిలించేది ఒకే శక్తి. మంత్రాలు వల్లెవేసేది, నామాన్ని ధ్యానం చేసేది, రికార్డింగ్ డాన్సులు చేయించేదీ ఒకే భక్తి.
జైనులాబిదీన్ ఇది అర్థం చేసుకున్నాడు. అందుకే సామాన్యులు సైతం భరించనటువంటి భక్తుల అశ్లీల ప్రవర్తనను ఆయన భరించాడు. ఎందుకంటే, వారి ప్రవర్తన లోని అశ్లీలత, మద మత్తతల వెనుక ఉన్న భక్తిని ఆయన గ్రహించాడు కాబట్టి.
అంత అవగాహన, అంత పరిణతి లేనివారు జడలు కట్టి, వొడలంతా బూడిదపూసుకుని, దిగంబరంగా వుండే యోగులను చూసి అసహ్యించుకుంటారు. చీదరించుకుంటారు. ‘ఇదేం భక్తి?’ అని ఈసడిస్తారు. ‘మా భక్తే అసలు భక్తి’ అని గర్విస్తారు. ఈ భావన నుంచే, ఈ అహంకారం ఆధారంగానే, తన పూజా పద్ధతి ఉత్తమమైనది, మిగతా వారి పద్ధతి అనాగరికం, దాన్ని నాశనం చేసి, వాడిని ఉద్ధరించాలన్న తాపత్రయం జనిస్తుంది. ప్రపంచంలోని ఉద్విగ్నతలకు, హింసకూ ప్రేరణనిస్తుంది. కానీ జైనులాబిదీన్ ఇందుకు భిన్నంగా విభిన్న రూపాలలో వ్యక్తమయ్యే శక్తి స్వరూపాన్ని గ్రహించాడు. భక్తుల ప్రవర్తన ఎలాంటిదయినా స్వీకరించాడు. జైనులాబిదీన్ పరిణతిని ఎత్తి చూపిస్తుందీ శ్లోకం.
త్రివిధ అశ్లీలాలంటే లజ్జ, జుగుప్స, అమంగళార్థక వాచకాలు. సిగ్గు లేకుండా ప్రవర్తించటం, జుగుప్సాకరంగా వ్యవహరించటం, అమంగళమైన మాటలు పలకటం.
సంబరాలు, ఉత్సవాల సమయంలో మదోన్మత్తులైన భక్తులు ప్రదర్శించే ఈ త్రివిధ అశ్లీలాలను జైనులాబిదీన్ సహించాడు అనేకన్నా, అర్థం చేసుకుని గౌరవించాడు అనటం సబబు.
మహార్వ్య పరిధానోద్యహానమానాదిలాంఛనైః।
తేషామధిపతిం యత్ర పేరం స్వసదృశాం వ్యాఘాత్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 51)
భక్తుల అధిపతిని ఎంతో విలువైన వస్తువులతో అలంకరిచాడు. గౌరవించాడు. కానుకలు సమర్పించాడు. ఇలాంటి చర్యల ద్వారా అతడిని తనతో సమానుడిని చేశాడు. యోగులు, భక్తుల సందోహాలను జైనులాబిదీన్ అంతగా గౌరవించాడన్న మాట.
సత్కంధకిన్నరాముద్రాదండాధైర్ద్వాదిశీదినే।
భారికాన్ యోగినః కృత్వా ప్రత్యముంచత్ తతో వహి॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 52)
ద్వాదశి నాడు యోగులకు సుందరమైన దుస్తులు, సేవకులు, ధనం, దండలను అర్పించాడు. భాద్రపద ద్యాదశీ, శుక్ల ద్వాదశీ కశ్మీరులో అత్యంత వైభవంగా జరుపుకుంటారు. భాద్రపద ద్వాదశిని ‘మహా ద్వాదశి’గా పెద్ద ఎత్తున సంబరాలు జరుపుతారు, ‘దండ’ను ప్రదానం చేయటాన్ని , కొందరు, పర్వత ప్రాంతాలలో నడిచేందుకు యోగులకు రాజు ‘దండ’ను బహుకరించాడని వ్యాఖ్యానించారు. కానీ సాధారణంగా ఉపనయన సమయంలో బ్రహ్మచారి దండధారణ చేస్తాడు. సన్యాసులు దండధారణ చేస్తారు. వీరిని దండీ సన్యాసులు అంటారు. త్రిదండి, ఏకదండి వంటి పదాల ద్వారా దండధారుల సన్యాసులను సూచిస్తారు. దండధారణ చేయటానికి అర్థం సన్యాసం స్వీకరించటం. దండధారణ చేసినవారు యజ్జోపవీతాన్ని విసర్జిస్తారు. అంటే సంసార బంధాలను భస్మం చేసినట్టన్నమాట. ఒడలంతా భస్మాన్ని పూసుకుంటారు. శిరోముండనం చేసుకుంటారు. పూర్వనామాన్ని విసర్జిస్తారు.
ఇలాంటి యోగులకు రాజు ఎన్ని వస్తువులు ఇచ్చాడంటే, వాటిని మోసేందుకు భారవాహకులు అవసరమయ్యారు. వారిని కూడా ఇచ్చాడు రాజు.
వితస్త జన్మదినమైన త్రయోదశీ రోజున, వితస్త జన్మోత్సవాన్ని దీపమాలలతో జరుపుతారు. ఆ దీపమాలోత్సవాన్ని దర్శించేందుకు రాజు నౌకారూఢుడై నగరానికి వచ్చాడు.
భాద్రపద శుక్ల త్రయోదశిని వితస్త జన్మదినంగా అత్యంత వైభవంగా జరిపేవారు కశ్మీరులో. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ ఉత్సవాలు 1947లో స్వాతంత్రం సిద్ధించేంత వరకూ జరిగాయి. ఆ తరువాత ఉత్సవం జరుపుకోవడం అగిపోయింది. నీలమత పురాణం ప్రకారం వితస్త జన్మదినం సందర్భంగా ‘కన్యాదానం’ చేస్తారు.
1947లో ఆగిపోయిన వితస్త జన్మదినోత్సవాన్ని కశ్మీరీ సాంస్కృతిక పునరుజ్జీవం పేరిట 21 సెప్టెంబర్ 2021 నుంచి మళ్లీ జరపటం ప్రారంభించారు. వితస్త జన్మస్థలమైన వేథ్-వాతూర్ (వేత్రావతి), వేరినాగ్ వద్ద రెండు రోజుల హవన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనగర్ పరిసర ప్రాంతాలలో దీపతోరణాలను వెలిగించారు.
కశ్మీరును వదలి ఇతర ప్రాంతలలో స్థిరపడిన కశ్మీరీ పండితులు ఈ దీపోత్సవాన్ని జమ్ము నగరంలో చీనాబ్ – చంద్రభాగ నదుల ఒడ్డున నిర్వహిస్తూ వస్తున్నారు. కానీ రాజకీయ కారణాల వల్ల కొన్నేళ్ల తరువాత ఈ సంబరాలు ఆగిపోయాయి. ఇప్పుడు మళ్ళీ ఆరంభమయ్యాయి.
వితస్తపై జరిగే దీపాలంకరణలను దర్శించేందుకు జైనులాబిదీన్ ఎంతో ఉత్సాహంగా వచ్చాడు.
ఇక్కడ గమనించాల్సిందేమిటంటే, కశ్మీరు సుల్తాను పాలనలో ఉంది. అక్కడ ఉన్నది రాచరికం, ప్రజాస్వామ్యం కాదు. ఓట్ల కోసం పరమత సహనం ప్రదర్శించాల్సిన అవసరం లేని కాలం. ఓట్ల కోసం ఒక మతస్తులను బుజ్జగించాల్సిన ఆవశ్యకత లేని కాలం. అయినా సరే జైనులాబిదీన్ స్వచ్ఛందంగా పర మతస్తుల సంబరాలను ప్రోత్సహించాడు. వారి సంబరాలలో తాను స్వయంగా పాల్గొన్నాడు. దానధర్మాలు చేశాడు. ఇది కదా అసలు లౌకిక రాజ్యం!
సుభాషితాని సంశృణ్వన్ సంగీతాని జలాంతరే।
సమారోహవరోహాంభ్యాం స పౌరాశిషమగ్రహీత్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 54)
నౌకలో నుండి దీపాలంకరణను చూస్తున్నాడు సుల్తాన్. చక్కని భావాలతో కూడిన గీతాలను విన్నాడు. నౌక నుండి దిగేటప్పుడు, ఎక్కేటప్పుడు పురజనుల ఆశీర్వాదం స్వీకరించాడు.
ఇలాంటి రాజును ఏ పౌరుడు హృదయపు లోతుల్లోంచి ఆశీర్వదించకుండా ఉండగలడు? ప్రాణాలు అరచేత పట్టుకుని, కట్టుబట్టలతొ మాతృదేశాన్ని వదిలిపోయిన వారిని సగౌరవంగా కశ్మీరు రప్పించి, ఆశ్రయమిచ్చి, శాంతిభద్రతలను కలిగించి, వారికి గౌరవపూర్వకమైన స్థానాలనిచ్చి, స్వేచ్ఛగా తమ ధర్మాన్ని అనుసరించే వీలు కల్పించటమే కాదు, తానూ వారిలో ఒకడిగా ఆ సంబరాలలో పాల్గొంటున్న రాజును దైవంలా భావించి పూజించటంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఆయిదారువందల ఏళ్ళ తరువాత కూడా ఇలాంటి రాజు గురించి తెలుసుకుని చెయ్యెత్తి దండం పెట్టాలనిపిస్తుంది.
ఇక్కడి నుండి శ్రీవరుడు దీపోత్సవాల అందాన్ని, దీపావళుల సౌందర్యాన్ని అత్యద్భుతమైన రీతిలో వర్ణిస్తాడు.
(ఇంకా ఉంది)