Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

శ్రీవర తృతీయ రాజతరంగిణి-41

[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

తృతీయ సర్గ

నాగయాత్రాదినే యత్ర ప్రత్యబ్దం దినపంచకమ్।
గణచక్రోత్సవే రాజా యోగినో భోగినో వ్యాధాత్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 46)

నాగయాత్ర, గణచక్రోత్సవాల  సందర్భంలో, రాజు, ప్రతి సంవత్సరం అయిదు రోజుల పాటు యోగులను భోగులుగా మార్చేస్తాడు.

ఇక్కడి నుంచి శ్రీవరుడు భారతీయుల పండుగలు, సంబరాలు, ఉత్సవాలను జైనులాబిదీన్ ప్రోత్సహించిన విధానం, ఆయన స్వయంగా పాల్గొన విధానాలను విపులంగా వర్ణిస్తాడు. ఇది తెలుసుకుంటుంటే ఆశ్చర్యం హద్దులు దాటుతుంది.

మత ఛాందస యుగంగా చరిత్ర విశ్లేషకులు అభివర్ణించిన యుగంలో మత ఛాందసులు పరివృతమై ఉండగా, ప్రత్యేక పరమత సహన, లౌకిక రాజ్య ద్వీపంలా కశ్మీరును నిలబెట్టాడు  జైనులాబిదీన్. దీన్ని ప్రపంచంలో ప్రథమ వింతగా, అత్యంత ఉన్నతమైన పాలనా విధానంగా భావించవచ్చు.

లౌకిక రాజ్యంగా పరిగణనకు గురువుతున్న ఆధునిక కాలంలోనే ఒక నేత ఒక మత ఉత్సవానికి వెళ్తే దాన్ని మత పక్షపాత చర్యగా విమర్శించి దూషించటం మనం చూస్తున్నాం. వ్యక్తిగతానికి, రాజకీయానికి తేడా తెలియని విచక్షణా రాహిత్యాన్ని మనం అనుభవిస్తున్నాం. విశ్వాసాన్ని వివక్షగా చూడకుండా ఉండలేని హ్రస్వదృష్టి సమాజాన్ని మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం.

కానీ ఆ కాలంలో, మత ఛాందసాన్ని సంకుచితంగా భావించని కాలంలో చుట్టూ మత ఛాందసులు పొంచి ఉండగా, జైనులాబిదీన్ పరమత సహనాన్ని ప్రదర్శించటమే కాదు,పర  ధర్మానుయాయులతో పోటీ పడి సంబరాలలో పాల్గొన్నాడు. వారిని ఆదరించాడు. సకల సౌకర్యాలు కల్పించాడు. ప్రజాస్వామ్యంలో ఒక మతం వారికి మైనారిటీల పేరిట రాయితీలు కల్పించి, మెజారిటీ మతమని ఇంకొకరిపై పన్నులు పెంచటం చూస్తున్న మనం ఆ కాలంలో అటు ఛాందసులను సంతృప్తిపరుస్తూ, ఇటు పాశవిక దాడులకు గురవుతున్న పరమతస్తులు స్వేచ్ఛగా సంబరాలు జరుపుకునే విశ్వాసాన్నిచ్చిన ఏకైక సుల్తాన్ జైనులాబిదీన్. అందుకే ఇకపై వచ్చే కొన్ని శ్లోకాలను జాగ్రత్తగా విశ్లేషించాల్సి ఉంటుంది. ఎందుకంటే, కల లాంటి, ఎన్నటికీ నిజం కాని ఒక ‘యుటోపియా’ లాంటి ప్రపంచాన్ని మనకు సాక్షాత్కరింపచేస్తాడు. ఈ శ్లోకాలు చదువుతుంటే, ఈ కాలంలో ఇలాంటి పాలకుడు ఉండి ఉంటే బాగుంటుందనిపిస్తుంది. అయితే, అది రాచరిక పాలన కాలం కాబట్టి రాజు అభిప్రాయాన్ని అందరికీ మన్నించక తప్పలేదు. ఇది ప్రజాస్వామ్యం యుగం కాబట్టి మంచి చెడు చూడకుండా ఆధికారంలో ఉన్నవారు ఏం చేసినా, గుడ్డిగా వ్యతిరేకించటమే రాజకీయం అన్నట్టు ప్రతీదాన్ని విమర్శించి, దూషించి, వ్యతిరేకించటం ఆనవాయితీ అయిపోయింది. కాబట్టి ఈ కాలంలో జైనులాబిదీన్ లాంటివాడు ఎన్నికవటమే కష్టం అవుతుంది.

నాగయాత్ర గణచక్రోత్సవాలు ప్రతి సంవత్సరం జరుగుతాయి. ఈ ఉత్సవాలు జరిగే అయిదు రోజులు యోగులను భోగులుగా మార్చేస్తాడట జైనులాబిదీన్. ‘యోగులను భోగులుగా మార్చటం..’ ఒక్క ముక్కలో చెప్పాలంటే జైనులాబిదీన్ భక్తులకు అందజేసే సౌకర్యాలు, వారికి అడుగడుగునా అవసరాలను తీర్చే శ్రద్ధాభక్తులను చెప్పేశాడు శ్రీవరుడు.

దేశంలో నాగపూజకు కేంద్రం వంటిది కశ్మీరు. ‘నీలమత పురాణం’ కశ్మీరుకు నాగులకు ఉన్న సంబంధాన్ని వివరిస్తుంది. నీల నాగుడి మతం  నీల మతం. ఆ మతానికి చెందిన పురాణం ‘నీలమత పురాణం’. ఈ ‘నీలమత పురాణం’లో కశ్మీరు లోని సరస్సులకూ, నాగులకూ ఉన్న సంబంధం, సరస్సుల దగ్గరలోనే మందిరాలు నిర్మితమవటం. కశ్మీరు పండుగలు, సంబరాలు, పూజా విధానాలు సర్వం నీలమతపురాణంలో  పొందుపరచి ఉన్నాయి.

కశ్మీరులో ఉన్నన్ని  నాగదేవత పూజలు దేశంలో మరే ప్రాంతంలోనూ లేవు. బసవ్ దేవ్ (వాసుదేవుడు), భైర దేవ్, వైదేకల్, బాబా సురగల్, మన్సర్ దేవల్, భద్యవదేవత, తన్సర్ దేవత ఇలా పలు పేర్లతో నాగదేవతలను కశ్మీరీయులు పూజిస్తారు.

కశ్మీరులో ‘నాగయాత్ర’ సమయంలో అత్యంత ప్రాధాన్యం వహించేది నాగపూజ. ఒక్కో నాగ దేవతను ఒక్కో ప్రత్యేక సమయంలో పూజిస్తారు. ‘వాసుకి నాగు’ పూజ భాద్రపద మాసంలో జరుగుతుంది. వాసుకి మందిరం నుంచి కైలాస కుండం దగ్గరకు రెండు రోజుల పాటు పాదయాత్ర చేస్తారు. కైలాస కుండం దగ్గర బ్రహ్మాండమైన జాతర జరుగుతుంది. సరస్సు చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. నైవేద్యాలు సమర్పిస్తారు. పరిసర ప్రాంతాలలో ఉన్న పవిత్ర స్థలాలను దర్శిస్తారు. ఈ ఉత్సవాలలో పాల్గొనడానికి దేశం నలుమూలల నుంచి యోగులు, సాధువులు కశ్మీరు వచ్చి చేరుతారు. సామాన్యులతో, యోగులు, సాధువులతో – భజనలు, గీతాలు, నృత్యాలతో ఈ నాగయాత్ర శోభాయమానంగా, కన్నుల పండుగగా సాగుతంది. వేల సంఖ్యలో భక్తులు భక్తి ప్రపత్తులలో సంబరాలు జరుపుతారు.

ఇలా పలు ప్రాంతాల నుంచి వచ్చే వారికి అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేశాడు జైనులాబిదీన్. అడుగడుగునా వారికి శ్రమ అన్నది తెలియకుండా, కోరిక పెదవి దాటక ముందే తీరే విధంగా ఏర్పాట్లు చేయటం వల్ల ఈ సర్వసంగ పరిత్యాగులు అన్ని సౌఖ్యాలను త్యజించిన వారు సైతం భోగులయి పోయారు.

యత్ర కాదంబరీ క్షీరవ్యంజనాదిప్రపూరితాః।
కృత్వా పుష్కరిణీః సర్వాన్ స యథేచ్ఛమమోజయత్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 47)

ఎక్కడ వీలయితే అక్కడ అంటే అడుగడుగునా , రాజు పాలు, కాదంబరితో సహా పలు రకాల తినుబండారాల కలశాలు నింపి ఉంచాడు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు తినవచ్చు. ఏది కావాలో అది తినవచ్చు. ఏది కావాలంటే దాన్ని స్వీకరించవచ్చు. అమర్‍నాథ్ యాత్ర చేసేవారికి ‘బండారా’ల వ్యవస్థ పరిచయమే. దారి పొడుగునా స్వచ్ఛంద సేవకులు ‘బండారా’లను ఏర్పాటు చేస్తారు. పలు రకాల భోజ్య పదార్థాలుంటాయి. పానీయాలుంటాయి. ఎవరికి ఏది కావాలంటే దాన్ని సేవించవచ్చు. భక్తులకు సేవ చేయడమంటే, ప్రత్యక్షంగా శివుడికి సేవ చేయటంగా భావించి ప్రతి భక్తుడిలో శివుడిని దర్శిస్తూ ప్రేమగా సేవలందిస్తాయా ‘బండారా’లు. ఇలాంటి బండారాలను దారి పొడుగునా ఏర్పాటు చేశాడు జైనులాబిదీన్. ఇప్పుడు ఈ బండారాలను వ్యక్తులు స్వచ్ఛందంగా ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేశాడు జైనులాబిదీన్. ఎక్కడ వీలయితే, అక్కడ, పుష్కరిణిలను, కాదంబరీ, క్షీర వ్యంజనాలతో పరిపూర్ణం చేశాడు జైనులాబిదీన్ అని చెప్తున్నాడు శ్రీవరుడు.

ఈ కాలంలో అమర్‍నాథ్ యాత్ర సైనికుల రక్షణలో భద్రంగా సాగుతోంది. ఆ కాలంలో శక్తివంతమైన ఇస్లాం మత ప్రచారకులు, ప్రజలలో సంకుచిత భావనలను రెచ్చగొడుతూ, ఇతర మతస్తులపై ద్వేషాన్ని, వారికి అండనిస్తున్న సుల్తాన్ పై క్రోధాన్ని రెచ్చగొడుతున్న సమయంలో కూడా కాఫిర్‍లు ఉత్సవాలు భద్రంగా, సంతోషంగా జరుపుకునే వీలు కల్పించిన జైనులాబిదీన్‌ను ఎంతగా ప్రశంసించినా తక్కువే. అయితే, కాఫిర్లకు ఇలాంటి స్వేచ్ఛ భద్రతలను ఇవ్వటం  ఇస్లామీయుల దృష్టిలో జైనులాబిదీన్‌ను నేరస్థుడిగా, పాపిగా నిలిపింది. ఉలేమాలు, ముల్లాలు జైనులాబిదీన్‌ను తమ రచనల్లో తీవ్రంగా దూషించారు. పర్షియన్ రచయితలు,  అహ్మద్ నిజాముద్దీన్ ‘తబ్కత్-ఇ-అక్బారీ’లో, అలీ సైయద్ ‘తక్బత్-ఇ-కశ్మీరీ’ లో  జైనులాబిదీన్ పై విమర్శలు గుప్పించారు. ‘దైవంపై విశ్వాసం లేని వారిని దైవంపై విశ్వాసం గలవారితో సమానంగా చూడటం ఆమోదయోగ్యం కాద’ని నిర్ద్వంద్వంగా విమర్శించారు. అంతేకాదు, జైనులాబిదీన్ పరమత సహనం వల్ల ‘ఇస్లాం కలుషితమవుతున్నద’నీ, ముస్లిం పండితులు, ఉలేమాలు, ఖాజీలు సైతం కాఫిర్ల పద్ధతులను పాటించటం సర్వసాధారణమవుతున్నదనీ, ఇస్లాం స్వీకరించిన వారు, ఇస్లాం వదిలి తమ పూర్వ మతానికి వెళ్ళిపోతున్నారనీ, ఇది అనర్థదాయకం అనీ, ఇందుకు బాధ్యత జైనులాబిదీన్‍దే అని, అతను ‘అల్లాకు జవాబుదారీ’ అని ప్రకటించారు.

 విమర్శలను, దూషణలను, వ్యతిరేకతను పట్టించుకోకుండా తాను నమ్మినదాన్ని ఆచరించాడు జైనులాబిదీన్. కానీ, అదే అతని పాలన చివరి దశలో ఆయన అనుభవించిన కష్టాలకు కారణయింది.

యత్ర యోగిమహస్త్రోత్యభృండనాదాసకృచ్ఛుతేః।
జానే మానసనాగోపి న్యమీలన్నిజచక్షుపీ॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 48)

వేల సంఖ్యలోని భక్తుల సందోహలు చేస్తున్న శృంగనాదాలకు మానస సరోవరంలోని మానసనాగుతో సహా ఇతర  నాగులన్నీ కళ్ళు మూసుకున్నాయి.

మానస సరోవరం లోని మానస నాగుతో సహా ఇతర నాగులన్నీ కళ్లు మూసుకున్నాయని శ్రీవరుడు అనడం ఓ చమత్కారం.

పాములకు చెవులుండవు, కానీ అవి శబ్దాలకు స్పందిస్తాయి. బూర ఊదుతూ అటూ ఇటూ తిరిగే వాడి కదలికను అనుసరించి పాములు పడగను అటూ ఇటూ తిప్పుతాయి. అంటే అవి కళ్లతోనే శబ్దాలు వింటున్నట్టన్న మాట. అందుకని పాములకు ‘చక్షుశ్రవ’ అంటారు. ఏవైనా విపరీతమైన శబ్దాలు వినిపిస్తుంటే భరించలేక చెవులు మూసుకుంటాం. పాములు కళ్లతోనే చూస్తాయి, వింటాయి కాబట్టి, అందరూ శబ్దాలు భరించలేక చెవులు మూసుకునేట్టు పాములు కళ్ళు మూసుకుంటాయి.

న తదన్నం న తన్మాంసం న తత్ శస్యం న తత్ఫలమ్।
న తే భోగా న తే రాజ్ఞా భోజితా భోజన క్షణే॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 49)

అన్నం, మాంసం, శస్యాలు, పళ్లు ఒకటేమిటి, ఎవరికి ఏది కావాలో అది, అందరికీ అందించాడు రాజు. ఏదంటే, అది, ఎవరంటే వాఇర్కి, ప్రతి ఒక్కరికీ భోజనంలో భాగం అందించాడన్న మాట రాజు.

ఇలాంటి శ్లోకాలను జాగ్రత్తగా పరిశీలిస్తే, ఇప్పుడు అనేకులు వర్ణిస్తున్న వివక్షత ఆ కాలంలో, కనీసం శ్రీవరుడి కాలంలో లేదనిపిస్తోంది. వేల సంఖ్యలో భక్తులు వస్తున్నారు. వారందరికీ సమానంగా, ఎవరికేం కావాలో అది అందేట్టు చేశాడు రాజు. ఎక్కడా ఎవరి కులం ప్రస్తావన లేదు. సామాజిక స్థాయి ప్రసక్తి లేదు. అందరూ భక్తులు. అందరికీ అన్నీ సమానంగా అందేట్టు చూశాడు రాజు. ఆహారం విషయంలో కూడా అన్నం ఉన్నది. మాంసం ఉంది. ఫలాలున్నాయి. ఎవరి తిండి వారిది. ఎవరి పద్ధతి వారిది. ఎవరి ఇష్టం వారిది. ఎవరికి ఏం కావాలో అది అందరికీ అందుతోంది. ‘నీ తిండి’, ‘నా తిండి’ అన్న వేర్పాటు లేదు. ‘నువ్వు అది తినవద్దు’, ‘వాడు అది తింటే నాకు నచ్చదు’ అన్న ఆక్షేపణలు లేవు. వ్యక్తిగతంగా ఎవరికి వారు మంచివారే. సామూహికంగా అంతా ఒకే నది నీరు, ఒకే ప్రవాహం. ఇది ఒకప్పటి భారతీయ సమాజం. ఇది ఒకప్పటి భారతీయ ధర్మ స్వరూపం. ఇది తెలియని వారు ఈ సమాజం అన్యాయమైనదని, ఈ ధర్మం దుర్మార్గమైనదనీ, ఎలాంటి అధ్యయనం, ఆలోచనల్లేకుండా, దురహంకారంతో కన్నూ మిన్నూ కానక తమకు తెలిసిందే ‘సర్వం’ అన్న అహంకారంతో వ్యాఖ్యానిస్తారు. అజ్ఞానగర్వంలో మదోన్మత్తుల్లా ప్రవర్తిస్తారు. అభాసుపాలవుతారు.

(ఇంకా ఉంది)

Exit mobile version