[‘శ్రావణ లక్ష్మి’ అనే శీర్షికతో రెండు పద్య కవితలను అందిస్తున్నారు శ్రీ చిరువోలు విజయ నరసింహారావు.]
యా దేవీ సకలార్థ సిద్ధి వరదా! యానంద సంవర్ధినీ!
యా దేవీ పరతత్వ జ్ఞాన నిలయా! ఆరోగ్య సంధాయినీ!
యా దేవీ నిరవద్య ధర్మ నిరతా ఆచార సమ్మోదినీ
యా దేవీ పరమాత్మ ప్రేమ భరితా ఆధ్యాత్మికానందినీ
సా దేవీ కరుణార్ద్ర చిత్త విభవా! సంరక్షిణీ! పాహిమామ్ (1)
భూమాతా పతి, శ్రీ హరీశ సుదతీ, భూభార నిర్మూలినీ
శ్రీ మాతా ధవు విష్ణుమూర్తి ముదితా, శ్రేయార్థ వాంఛప్రదా
ధీమం తార్చిత పాద పద్మ యుగళా తేజస్వినీ, పావనీ
సా మాంపాతు సదా సమస్త సుఖదా శాస్త్రార్థ సంబోధినీ! (2)
21 అక్టోబర్ 1939 న జన్మించిన శ్రీ చిరువోలు విజయ నరసింహారావు ప్రవృత్తి రీత్యా కవి. దుర్గా మహాలక్ష్మి, దుర్గా ప్రసాదరావు గార్లు తల్లిదండ్రులు. ఎం.ఎ. విద్యార్హత. రైల్వే మెయిల్ గార్డుగా ఉద్యోగ విరమణ చేశారు. భార్య సత్యప్రసూన. ముగ్గురు కుమారులు.
15 శతకములు ముద్రితములు. రెండు జీవితచరిత్ర గ్రంథాలు వెలువరించారు. అనువాదాలు చేశారు. నీతి శతకములు, సాయి శతకములు తదితర రచనలన్నీ కలిపి 73.