Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

శ్రమజీవన హరితం

నం నిలబడిన చోటల్లా
తరువులన్నీ గొడుగు పట్టాలి

తలయెత్తితే ఆకాశమంతా
ఆకుపచ్చదనం అలుముకోవాలి

చూపులు సారిస్తే, విస్తరించిన వృక్షరాజం
కళ్ళనిండుగ కలియ దిరగాలి

చేతులు అందిన దూరంలోనే
ఆకుల గలగలలు స్వరజిమ్మాలి

అడుగు పెట్టిన చోటల్లా
గడ్డి పూల సోయగం విరజిమ్మాలి

ప్రతి ముఖ అద్దం లోనూ
పత్ర హరితం ప్రతిబింబించాలి

తాకితే తనువూగి, ప్రతి కొమ్మా రెమ్మా
ఆనంద బాష్పాలు దోసిట రాల్చాలి

అణువణువునా
నీటి ప్రవాహ స్పర్శ ఔషధమవ్వాలి

కిరణ జన్య సంయోగ క్రియలా
శక్తి కాసారాలు ద్విగుణీకృతం కావాలి

ఏ వూరెళ్ళినా పూల తోరణాలు స్వాగతించాలి
దారులన్నీ హారాలుగ తళుకులీనాలి

మొదటగా తలవంచి, తలదించి
చెట్ల పాదులకై పలుగూ పారలా
తలమునకలవ్వాలి

మన భుజ స్కంధాలపై
శ్రమ జీవన సౌందర్యం ఊరేగుతుండాలి

 

Exit mobile version