[శ్రీ వారాల ఆనంద్ రచించిన ‘శోకం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
శోకం
ఓ సర్వనామం
అది సర్వవ్యాపితం
శోక ధ్వని మోగని ఇల్లులేదు
శోకం దూరని హృదయం లేదు
అయినా అందరూ మందహాసం ముసుగేసుకుని
శోకాన్నుంచి తప్పించుకు తిరుగుతుంటారు
శోకానికి
రూపు రేఖల్లేవు రంగులూ హంగులూ లేవు
అదెప్పుడూ ఒంటరిగా రాదు
కన్నీళ్లను వెంటేసుకొస్తుంది
గుండెల్లో చీకటిని నింపేస్తుంది
ఎవరయినా
శోకంలో పుట్టి శోకంలో పోతే ఏముంటుంది
శోక సముద్రాన్ని మధనం చేయాలి
శోకం లోంచి శ్లోకం పుట్టొచ్చు
రత్న మాణిక్యాలు వెలుగు చూడొచ్చు
అప్పుడు నువ్వే
శోకాన్ని
వ్వె వ్వె వ్వె.. అని వెక్కిరించొచ్చు
కేంద్ర సాహిత్య అకాడెమీ అనువాద పురస్కార గ్రహీత