[శ్రీ కొండూరి కాశీవిశ్వేశ్వర రావు రచించిన ‘శోకం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.. సంచిక సాహితి ప్రచురణలు సంయుక్తంగా నిర్వహించిన 2025 శ్రీ విశ్వావసు ఉగాది కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత.]
వ్యయ ప్రయాసల
జోడెద్దుల మేడి పట్టి
దుక్కి దున్నాడు రైతు
నారు పోశాడు
నాట్లు వేశాడు
కలుపు తీశాడు
అప్పు చేసి
ఎరువులు వేశాడు
పొలం గట్టు మీద
పచ్చడన్నం తిన్నాడు
ధాన్యం పండించాడు
తూర్పారబెట్టడు
బస్తాలలో నింపాడు
బండిలో వేశాడు
సంతకు చేరుకున్నాడు
గిట్టుబాటు ధరకై
ఎండలో నుంచున్నాడు
దళారీలు మోసగించారు
తడిసిన ధాన్యమని
సొమ్మసిల్లి పోయాడు రైతు
ఎడ్లకు దాణా వేయాలి!
ఆలుబిడ్డలకు కూడా
దాణా తప్పదుగా!
పిల్లలని చదివించాలి
కొత్తబట్టలు కొనాలి
పండగ పబ్బాలకు
బక్ష్యాలు తినాలి
ఆలోచనల
చెమట బిందువులను
తువ్వాలుతో తుడుచుకున్నాడు
‘కోకిలమ్మ పాట
శోకంలా తోచింది’
‘చచ్చినోడి పెళ్లికి
వచ్చిందే కట్నం’
తిండిగింజలను తెగనమ్యాడు
బీడీ కాలుస్తూ గూడు చేరుకున్నాడు
నాలుగు రూపాయలు
భార్యకిచ్చేశాడు
చేతి సంచితో
తిరిగి రేషన్ షాపుకెళ్ళాడు.