[2025 ఏప్రిల్ 6 న శ్రీరామనవమి సందర్భంగా శ్రీ గోనుగుంట మురళీకృష్ణ రచించిన ‘షోడశ కళానిధికి షోడశోపచారములు’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము.]
ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు గౌరవంగా ఇంట్లోకి ఆహ్వానించి, కాళ్ళు కడుక్కోవటానికి నీళ్ళు ఇచ్చి కూర్చోమని చెబుతాము. “ఎండలో వచ్చారు కాస్త దాహం తీర్చుకోండి” అంటూ చల్లటి మంచినీరో, మజ్జిగో ఇస్తాము. ఆ విధంగా అతిథి అభ్యాగతులను ఆదరించటం ప్రతి గృహస్థు విధి. అతిథి అంటే తిథి, వారాలు చూడకుండా వచ్చేవాడు అని అర్థం. అభ్యాగతుడు అంటే మనం పిలిస్తే వచ్చేవాడు. ‘అతిథి దేవోభవ’ (అతిథి దేవుడితో సమానం), ‘అభ్యాగతః స్వయం విష్ణుః’ (అభ్యాగతుడు స్వయంగా విష్ణువుతో సమానం) అని సనాతన ధర్మం చెబుతుంది. రామాయణం అరణ్యకాండలో సీతారామలక్ష్మణులు అడవిలో అనేక ఋష్యాశ్రమాలు సందర్శిస్తారు. శరభంగుండు, సుతీక్షుడు, అగస్త్యుడు, అత్రి మహర్షి, శబరి మొదలైన వారందరూ వారికి అతిథి సత్కారాలు చేస్తారు. రాక్షసుడైన మారీచుడు కూడా మాయలేడిగా మారమని కోరటానికి రావణుడు వచ్చినప్పుడు అతిథి మర్యాదలు చేస్తాడు.
అదే విధంగా మనం దేవుడిని పూజించేటప్పుడు షోడశోపచారాలతో పూజించాలి. షోడశ అంటే పదహారు, ఉపచారాలు అంటే సేవలు. అవి ధ్యానం, ఆవాహనం (ఆహ్వానం), ఆసనం (కుర్చోటానికి పీట వేయటం), పాద్యము (కాళ్ళు కడుక్కోవటానికి నీళ్ళు ఇవ్వటం), అర్ఘ్యము (చేతులు కడుక్కోవటం), ఆచమనీయం (దాహం తీర్చుకోవటానికి నీరు అందించటం), స్నానము, వస్త్రము (కట్టుకోవటానికి శుభ్రమైన బట్టలు ఇవ్వటం), యజ్ఞోపవీతం (స్నానం చేసిన తర్వాత మైలబడిన జంధ్యం తీసేసి, కొత్తది ధరించటం), గంధం, అక్షతలు, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, ఆత్మ ప్రదక్షిణ చేయటం మొదలైనవి.
బాలకాండలో శ్రీరాముడిని షోడశ కళాపూర్ణుడుగా వర్ణిస్తాడు వాల్మీకి. ధర్మజ్ఞుడు, సత్యవ్రతుడు, ధైర్యవంతుడు, జితక్రోధుడు, సర్వశాస్త్రజ్ఞుడు, ఏక రూప ప్రియదర్శనుడు, సదాచార సంపన్నుడూ.. ఇలా పదహారు లక్షణాలను చెబుతాడు. అటువంటి షోడశ కళాపూర్ణుడిని షోడశోపచారాలతో పూజించాలి అంటూ ‘ఆరుద్ర’గా పేరుపొందిన భాగవతుల శివశంకర శాస్త్రి అనే కవి ఒక చక్కని గీతం రచించాడు. దానిని మధుర గాయని పి.సుశీల గానం చేయగా ప్రైవేటు గీతంగా రికార్డులలో లభిస్తున్నది. ఆ గీత విశ్లేషణ ఇప్పుడు చూద్దాం.
“నా దేహమే నీ దేవళం నా జీవమే ఆరాధనం
నే దినదినమూ షోడశోపచార పూజ చేసెదను రామా!”
దేహమే దేవాలయం, జీవుడే సనాతన దైవం అన్నారు జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు. అలాగే ఇక్కడ కవి కూడా నా దేహమే నీ దేవాలయం, నా ప్రాణంతోనే నిన్ను ఆరాధిస్తున్నాను. నేను ప్రతిదినమూ పదహారు రకాల సేవలు చేస్తాను రామచంద్రా! అని చెబుతున్నాడు. అవేమిటో ఈ మొదటి చరణంలో ఇలా చెప్పాడు.
“అంతరంగమున నిన్నే తొలుత ఆవాహన చేసితి రామా!
ఆ హృదయ కమలమే నిరతము నీ ఆసనమైనది రఘురామా!
ఆనందాశ్రులే పాద్యము, అర్ఘ్యము ఆచమనీయాలయ్యా!
అనురాగామృత ధారల నిత్యము అభిషేకించెద నయ్యా!”
ప్రత్యేక సాధనాలు అలభ్యమైనప్పుడు మానసికంగా భగవంతుడిని ఆరాధించవచ్చు. అదే మానసిక పూజా విధానం. మనసులో మొదటగా నిన్ను ఆవాహన చేసుకుంటున్నాను. బాల్యంలో విద్యాభ్యాసం, తర్వాత యవ్వనంలో వివాహం, గృహస్థ ధర్మం నిర్వహించాలి. అవేమీ లేకుండా, బాధ్యతలు వదిలేసి, మోక్షం కోసం ప్రయత్నిస్తే, సూటిగా మోక్షం రాదు అని వేదాంతులు చెబుతూ ఉంటారు. కనుక బాల్యావస్థ లోనూ, గృహస్థు గానూ తన బాధ్యతలు అన్నీ నిర్వర్తించిన తర్వాతే ఆధ్యాత్మికత లోకి వెళ్ళాలి. అప్పుడే మనసు నిశ్చలంగా ఉండి భగవంతుడి మీద ధ్యాస నిల్పగలుగుతారు. భగవంతుడిని ఆవాహన చేసుకోవటం సామాన్యం కాదు, అందుకు ఎంతో సాధన అవసరం. మనసు నిశ్చల స్థితికి చేరుకోవాలి. అలా మనసులో నిన్నే ఆవాహన చేసుకున్నాను. నా హృదయాన్నే ఆసనం గా చేసి ప్రతిష్ఠించుకుంటున్నాను. నిన్ను దర్శించిన తన్మయత్వంలో నా కళ్ళలో నిలిచిన ఆనందాశ్రువులే నీకు అర్ఘ్యం, పాద్యం అని చెబుతున్నాడు కవి. శ్రీరామ దర్శనం కోసం ఎన్నో ఏళ్ళు ఎదురు చూసిన శబరికి ఆయన్ని చూడగానే కళ్ళల్లో నీళ్ళు కమ్ముకున్నాయట. ‘అసలే ఆనదు చూపు, ఆపై ఈ కన్నీరు, తీరా దయచేసిన నీ రూపు తోచదయ్యయ్యో!’ అనుకుంటుంది అని వర్ణిస్తారు దేవులపల్లి కృష్ణశాస్త్రి ఓ సినీగీతంలో. ఇక్కడ కూడా కవి, భగవంతుడి పై తనకు గల అనురాగం అనే అమృతధారలతో ప్రతిరోజూ అభిషేకం చేస్తూ ఉంటాను అని చెబుతున్నాడు.
“శ్వాసలతోనే నేసిన వస్త్రము స్వామీ నీకు ధరింతు
విశ్వాసాల పేనితినయ్యా జన్నెము స్వీకరించు
ఆశల పరిమళ గంధములున్నవి అయ్యా అవధరించు
చేసిన పుణ్యమే పుష్పము కాగా శ్రీశా చిత్తగించు
ధూపదీపవైవేద్యాలతో ఊపిరి అర్పించేను
సుందర సున్నము గుండెలు వక్కలు మమతలు తాంబూలమ్ము
ప్రాణములైదు నీ చుట్టూ ప్రదక్షిణ నిత్యము సేయు
బ్రతుకంతా నీ పాదసన్నిధి ప్రణామమైనది స్వామీ!”
శ్వాసలతో నేత నేసిన వస్త్రాన్నే నీకు సమర్పిస్తున్నాను. అంటే జీవం ఉన్నంతకాలం శ్వాస ఆడుతూనే ఉంటుంది కాబట్టి జీవితాంతం నిన్ను ధ్యానం చేస్తూనే ఉంటాను అని కవి భావం. నీ మీద నమ్మకం అనే దారాలతో పేనిన జంధ్యాన్ని నీకు అర్పిస్తున్నాను. నాకు నీ దయ లభిస్తుంది అనే ఆశలనే గంధం లాగా ఇస్తున్నాను. ఇప్పటివరకూ తెలిసో తెలియకో పాపాలతో పాటు ఎంతో కొంత పుణ్యం కూడా చేసి ఉంటాను. ఆ పుణ్యమే నీకు పుష్పంగా సమర్పిస్తున్నాను, చిత్తగించు స్వామీ! అని చెబుతున్నాడు కవి.
నేను తీసుకునే ఊపిరే నీకు ధూపం, దీపం, నైవేద్యం. నా గుండెలు నీకు వక్కలు, సున్నము, నా మనసులోని మమతలు నీకు తాంబూలములు. నా పంచ ప్రాణాలు రోజూ నీ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాయి. నా జీవితం ఉన్నంతకాలం నీ పాదాల సన్నిధిలోనే ప్రణామం చేస్తూ ఉంటాను స్వామీ! అని ఈ గీతం భావం.
ఈ విధంగా మానసిక పూజ చేస్తున్నట్లుగా ఈ గీతంలో తెలియజేస్తున్నారు కవి.
గోనుగుంట మురళీకృష్ణ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. జన్మస్థలం గుంటూరు జిల్లా లోని తెనాలి. M.Sc., M.A. (eng)., B.Ed., చదివారు. చదువుకున్నది సైన్స్ అయినా తెలుగు సాహిత్యం పట్ల మక్కువతో విస్తృత గ్రంధ పఠనం చేసారు. ఇరవై ఏళ్ల నుంచీ కధలు, వ్యాసాలు రాస్తున్నారు. ఎక్కువగా మానవ సంబంధాలను గురించి రాశారు. వాటితో పాటు బాలసాహిత్యం, ఆధ్యాత్మిక రచనలు కూడా చేసారు. సుమారు 500 వరకు కధలు, వ్యాసాలు వివిధ పత్రికలలో ప్రచురిత మైనాయి. గురుదక్షిణ, విద్యాన్ సర్వత్ర పూజ్యతే, కధాంజలి వంటి కధా సంపుటులు, నవ్యాంధ్ర పద్యకవి డా.జి.వి.బి.శర్మ (కూర్పు) మొదలైనవి వెలువరించారు. ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం, స్ఫూర్తి పురస్కారం, సర్వేపల్లి రాధాకృష్ణన్ అవార్డ్, నాళం కృష్ణారావు సాహితీ పురస్కారం వంటి పలు అవార్డ్ లతో పాటు సాహితీ రత్న బిరుదు వచ్చింది.