[శ్రీ పెద్దాడ సత్యప్రసాద్ రచించిన ‘శిశిరాన్ని స్వాగతించు’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
జీవితం అనే పుస్తకంలో
ప్రతీ పేజీ అందంగా ఉండాలని లేదు
అలా ఉండాలనుకోవడం అత్యాశే
ప్రకృతికి ఆరు ఋతువులు సహజం
చైత్రంలో వికసిస్తూ హర్షించే తీరు
శిశిరానికి రాలుతూ తారుమారు
చైత్రమే ఎల్లకాలం ఉండదు
చక్ర భ్రమణంలో శిశిరాన్ని చూడాలి
శిశిరంలోనూ అందముందని భావించాలి
ఆ సౌందర్యాన్ని మనసారా ఆస్వాదించాలి
బాధలు కష్టాలు సుఖాలు దుఖాలు అన్నీ
ఆస్వాదిస్తూంటేనే జీవితం కదులుతుంది
జ్ఞాపకంగా అనుభవంగా మిగులుతుంది
ప్రకృతి గతి సాగిపోతూనే ఉంటుంది
అనుభవించాల్సింది ఇచ్చి పోతూ ఉంటుంది
దక్కేది ఏదైనా సంతోషంగా స్వీకరించాలి
అపుడు మనిషికి ఏ బాధలు ఉన్నా
మనసుకు అవి తాకనైనా తాకలేవు
పెద్దాడ సత్యప్రసాద్ విశాఖపట్నం జిల్లా వాస్తవ్యులు, కవిగా, రచయితగా దశాబ్దాల ప్రయాణం. వీరి కధలు, కవితలు వివిధ పత్రికలలో ప్రచురితమవడమే కాక, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ద్వారా కూడా ప్రసారం అయ్యాయి. ఇక, వృత్తిగతంగా పాత్రికేయులు. రెండున్నర దశాబ్దాలకు పైగా పాత్రికేయ వృత్తిలో అంకితభావంతో పనిచేస్తున్నారు. రాజకీయ విశ్లేషణలు వీరి ప్రత్యేకత. ప్రస్తుతం ఆకాశవాణి విశాఖపట్నం ప్రాంతీయ వార్తా విభాగంలో న్యూస్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.
