[శ్రీమతి మాలతీ చందూర్ గారి ‘హృదయనేత్రి’ నవలపై శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన సిద్ధాంత గ్రంథాన్ని ధారావాహికగా అందిస్తున్నాము.]
అదీ విధేయతతో కూడిన ఉదాసీనత! “నీవెవరు నాకు చెప్పడానికి?” అనలేదు! “నా యిష్టం! నీ జోక్యం అనవసరం!” అనలేదు. అతని జీవితంలో తండ్రి స్థానాన్ని అలా చెప్పకనే చెప్పాడు కొడుకు.
భార్య ఉదాసీనత ఇంకో రకం. అది ఎత్తిపొడుపు ద్వారా, ఉదాసీనత పరిధిని అతిక్రమిస్తూ ఉంటుంది. భార్యగా ఆమెకున్న స్వతంత్రం అది.
“బతకలేక బడిపంతులు మీరు చేస్తున్నది చాలకా? వీడిని కూడ ఆ రొంపిలోకి దించాలని చూస్తున్నారా?” (పుట 111)
అతడు హిందీ ప్రచార సభలో టీచరుగా చేరడాన్ని ముందు అధిక్షేపించిందామె. దాన్ని ‘రొంపి’గా, దాంట్లోకి కొడుకును కూడా దించాలని అతను చూస్తున్నట్లుగా మాట్లాడింది. ఇది విధేయత కాదు, ఉదాసీనత అంత కన్నా కాదు. డైరెక్టుగా అతని బలహీనత (ఆమె దృష్టిలో) పై దాడి!
రెండవసారి ఎన్నికల్లో నిలబడి గెలిస్తే తప్పకుండా మంత్రి పదవి వస్తుందని కుటుంబ సభ్యుల అభిప్రాయం.
“ఈ రాజకీయాలు నాలాంటి వారికి కొరుకుడు పడవు” అన్నది అతని స్పందన. నందయ్యతో పోలుస్తారు. అతడు ఒప్పుకోడు.
“మా దృక్పథాల్లో తేడా ఉంది. నందయ్య రాజకీయవాది, నేను కాదు” (పుట 112).
తమ్ముడు బుచ్చి అభిప్రాయం కాంగ్రెస్ వాదులంతా రాజకీయవాదులే అని. కాంగ్రెస్ సిద్ధాంతాలు వేరు. రాజకీయ నాయకులుగా మారిన తర్వాత వారి నిజస్వరూపాలు బయటపడతాయనీ, గాంధీజీ, స్వాతంత్ర్యం తర్వాత, కాంగ్రెస్ పార్టీని రద్దు చేయమన్నారు! ఆయన మాట విననంతగా అప్పటికే వారంతా ‘ఎదిగి’ (ముదిరి?) పోయారు. మామగారు మధ్యలో జోక్యం చేసుకొని, “రాజకీయాలకు – ఖద్దరు టోపీకి సంబంధం ఉండాలని ఎన్నడూ లేదే?” అంటే, దానికి అల్లుడు గారిచ్చిన జవాబు అతని వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది.
“ఖద్దరు టోపీని అడ్డం పెట్టుకుని, కాంగ్రెస్ వాదులమంటూ రాజకీయాల్లోకి దిగి. డబ్బు సంపాయించడం నా అంతరాత్మకు వ్యతిరేకం. ఆ పని నేను చేయలేను.” (పుట 112)
ఇక్కడ మామగారి అవకాశవాదం, అల్లుని ఆదర్శవాదం రెండూ ఒకేసారి చూపారు రచయిత్రి.
నందయ్య అధికార దర్పం, చెట్టు, స్వార్థం:
ఒక హరిజన స్టూడెంటుకు కాలేజీలో సీటుకు హస్టల్లో ఫ్రీ బోర్డింగ్‌కు రెకమెండ్ చేయమని అడగడానికి గోపాల రావు వెళతాడు. అప్పటికి నందయ్య రెండోసారి మినిస్టరు. రెండు గంటలు గోపాల రావు వేచి ఉండాల్సి వచ్చింది. కారెక్కబోతూ, అతని రాక గురించే తనకు తెలియనట్లు నటిస్తాడు. “ఎల్లుండి రా చూద్దాం” అని చెప్పి పంపిస్తాడు. ఎల్లుండి కూడ దర్శనం లభించదు. నాలుగోసారి కలిసే అవకాశం వస్తుంది.
నందయ్య మాటల్లో, హావభావాల్లో ఇదివరకు లేని ఒక బెట్టు, Power consciousness కనిపిస్తాయి గోపాల రావుకు. ఆ స్టూడెంటుకు సాయం చేయమంటే, నందయ్య.. “గోపాలం.. నువ్వు వెర్రిబాగుల వాడివయ్యా.. ఇలాంటి పిల్లలు, రోజుకు పదిమంది వస్తూంటారు. అలా చేసుకుంటూపోతే నేను మునిగిపోతాను” (పుట 113) అంటాడు. అదీ అతని నిజస్వరూపం!
“నువ్వు నందయ్య వేనా? ఆ రోజుల్లో నీలో ఉండే కోపం, మా అగ్రకులాల మీద ఉంటే కసి అంతా ఏమయిపోయింది?”
పదవి వచ్చింతర్వాత అంతా పోయింది! మంత్రి ఐనా అతనికి కొన్నిచోట్ల అవమానాలు తప్పడం లేదు. దాన్ని ఇలా మలుచుకోని, స్వార్థానికి ప్రతిరూపం (embodiment) అయ్యాడు.
“మా కులాన్ని, మా జాతిని ఇలా అణగదొక్కుతున్నప్పుడు, నేను ఈ దేశానికి ఎందుకు సేవ చెయ్యాలి? దేశం కోసం అంటూ నా స్వంత లాభం ఎందుకు వదులుకోవాలి?”
అదీ అతని వాదన. దళితుడిగా ఎదిగి, దళితుడి ముసుగులో ఇంకా ఉంటూ, సాటి దళితులకే సాయం చేయని నీచుడు నందయ్య!
అతని మాటలు వినే కొద్దీ గోపాల రావుకు నాలుక మొద్దుబారినట్లు అవుతోంది. అప్పుడు మాలతీ చందూర్ మాటలు, నందయ్యలాంటి దళిత కుహనా మేధావులకు, నాయకులకు చెంపపెట్టు లాంటివి. అలా రాయడానికి చాలా ధైర్యం కావాలి. ఏం మాట్లాడితే, ఏం రాస్తే, ఎవరి మనోభావాలు దెబ్బతింటాయో, ఏం నిరసన వస్తుందో తెలియని పరిస్థితిలో మనం ప్రస్తుతం ఉన్నాం. మాలతిగారు ఆవిష్కరించిన పరిస్థితులు, 75 సం॥ తర్వాత కూడ అలాగే ఉన్నాయి. నాయకుల ఆహార్యంలో మార్పు వచ్చింది. గాంధీ టోపీలు, ఖద్దరు దుస్తులు outdated అయి, ఆధునికంగా మారారు నాయకులు. కాని ఆలోచనావిధానాలు మాత్రం నందయ్య లాంటి వాళ్లవే!
“నందయ్య, తన కులాన్ని – తన జాతిని, చిమ్మ చీకటి నుంచి పైకి లేవనెత్తడం పోయి, తన బాగు తను చూసుకొని, క్రిందవాళ్లని ఇంకా పాతాళానికి అణగదొక్కుతున్నాడు.” (పుట 117)
‘తన’ వారి పట్ల నందయ్యకున్న చిన్న చూపు, అసహ్యం, ఎగతాళి, గోపాల రావుకు జుగుప్స కలిగిస్తాయి.
కొడుకు ఉద్యమ జీవితం, భార్య ఆక్రోశం, గోపాల రావు నిస్సహాయత:
పౌనార్‌లో, వినోబా ఆశ్రమంలో, ప్రింటింగ్ సెక్షన్‍లో పనిచేస్తూ, మూడేళ్లుగా అక్కడే ఉన్న గోపాల రావు ఇంటికి వస్తాడు. కొడుకు కనబడకుండా పోతాడు. భార్య అతన్ని “చేతకాని వాడు, కసాయివాడు, చవట, బండ” అంటూ తిడతుంది. అతని వల్లే కొడుకు చెడిపోయాడంటుంది. అతని దేశభక్తి కొడుక్కు అంటించాడు అంటుందామె.
“వాడు దేశభక్తుడయితే, నా కంటే సంతోషించే వాడు ఇంకెవడూ ఉండడు” అంటాడు గోపాల రావు.
పోలీస్ రిపోర్టు ఇస్తారు. వాడి స్నేహితులందర్నీ కలిపి విచారించారు. పేపర్లో ప్రకటన ఇచ్చారు. అతని ఆచూకీ దొరకలేదు! చివరికి ఒక కార్డు వచ్చింది. కొడుకే రాశాడు.
“నాన్నగారి లాగా ఆశయసిద్ధి కోసం పోరాడుతున్నాను. నా కోసం వెతికి మీ డబ్బు, కాలం వృథా చేసుకోకండి. నా ఆశయం సిద్ధించేంత వరకు వెనక్కి రాను” (పుట 119).
భార్యను ఓదార్చబోతే, అసలు తాకనివ్వదు. అన్నయ్యా, మరిదీ, ఇద్దరే తనకు దిక్కంటుంది.
కాని తన జీవకణం నుంచి రూపు దిద్దుకున్న ప్రాణి, తన కొడుకు, ఆశయసిద్ధి కోసం ఇల్లు విడిచి వెళ్లడం అతనికి గర్వంగా ఉంది; వాడి క్షేమం పట్ల ఆందోళనతో బాటు.
మళ్లీ నాగపూర్ వెళ్లిపోతాడు. భార్య సీరియస్ అని టెలిగ్రాం! హుటాహుటిన వచ్చేస్తాడు. తనకూ తన భార్యకూ, రాముడత్తయ్యకూ, మామయ్యకూ అనుబంధంలోగల తేడాని అతడిలా వితర్కించుకుంటాడు.
“అత్తయ్య, ఆఖరిక్షణం దాకా; అలా మామయ్యని నీడలాగా కాపాడుతూ సేవ చేసింది. అత్తయ్య తనలోని ప్రేమ, భక్తి, గౌరవం వాత్సల్యం అన్నిటిని రంగరించి, భర్త పై కురిపించి, తన జీవితం పునీతం చేసుకొని, మామయ్య జీవితానికి సంపూర్ణత ఇచ్చింది. కాని తన భార్య పార్వతి, తన ప్రేమని, అనునయాన్ని విసిరికొట్టి. తమ వైవాహిక జీవితాన్ని ఎడారి చేసింది” (పుట 122)
అత్తయ్య మామయ్యలాంటి భార్యాభర్తలు చాలా అరుదురా ఉంటారు. సింహ భాగం భిన్నధృవాలే. రుక్మిణీ దేవిని తనతో శ్రీకృష్ణపరమాత్మ తీసుకొని పోతూ ఉంటే, నగర ప్రజలంతా ముచ్చటపడ్డారట. ఆ సందర్భంలో పోతన్న గారు ఈ పద్యం రాశారు:
“తగు నీ చక్రి విదర్భరాజసుతకుం; దథ్యంబు వైదర్భియుం
దగు నీ చక్రికి; నింత మంచి దగునే? దాంపత్య మీ యిద్దఱం
దగులం గట్టిన బ్రహ్మ నేర్పరిగదా; దర్పాహతారాతి యై
మగఁడౌఁ గావుతఁ జక్రి యీ రమణికిన్ మా పుణ్య మూలంబునన్”
ఈ పద్యంలో, ‘ఇంతమంచి దగు నే దాంపత్యము’ అన్నమాటలు, రాముడత్తయ్యకు, వాసుదేవరావు మామయ్యకు సరిగ్గా సరిపోతాయి. వారిద్దరూ ‘made for each other’. ‘వీరిర్వురన్ తగలంగట్టిన బ్రహ్మ నేర్పర’ గాని, ఉప్పుప్పులాగా నిత్యమూ చిటపడుతూ ఉండే భార్యాభర్తలను ‘మ్యాచ్’ చేసేవాడు కూడా ఆయనే. విజాతిధృవాలు వికర్షించుకుంటాయి మరి!
అయితే శ్రీకృష్ణపరమాత్మకూ ఈ బాధ తప్ప లేదు! రుక్మిణీ దేవి ఆయనకు అనుకూలవతి, ఆయన గొప్పదనాన్ని ఎఱిగిన మహాసాధ్వి. భర్త గొప్పదనాన్ని గుర్తించి పొగడగపోయినా ఫరవాలేదుగాని, నలుగురితో అతన్ని చులకన చేసి, ఈసడించుకోక పోతే అంతేచాలు. అలా అయినా, గోపాల రావు లాంటి స్థితప్రజ్ఞులు నిగ్రహంగా, సంయమనంతో, తమ ధర్మాన్ని తాము నిర్వర్తిస్తూ ఉండగలరు.
సత్యభామాదేవి తన దురభిమానంతో, అతిశయంతో, సౌందర్యగర్వంతో స్వామివారిని ఇబ్బంది పెట్టింది. ‘సత్యా విధేయుడు’గా ఆయనకు ముద్ర వేయాలనుకుంది. నారదమహర్షి అన్నట్లు “స్వామి తన నాథుడనే భ్రమించింది గాని, జగన్నాథుడని గ్రహించలేకపోయింది!” ఆమె కళ్ళు తెరిపించడానికి, నారదులవారు కృష్ణస్వామితో కలిసి ‘తులాభారం’ అనే నాటకాన్ని ఆడి, రక్తి కట్టించాడు. అవన్నీ పుక్కిటి పురాణాలని కొట్టివేయడానికి వీల్లేదు. భార్యాభర్తల అనుబంధాన్ని పునర్నిర్వచించిన గొప్ప కథలవి.
“సర్వేశ్వరుండగు శౌరి కింకరుజేయ, ధనమున్నదే భక్తి ధనము గాక” అని సత్యాదేవి చివరకు తెలుసుకుంటుంది. పశ్చాత్తాపపడుతుంది. తన వద్ద ఉన్న అంతులేని సంపదతో స్వామిని తూచలేకపోయింది. కాని రుక్మిణీదేవి “తులసి దళము నిన్ను తూచుగాత!” అని ప్రార్థించి స్వామిని తూచింది.
పార్వతికి బుద్ధి చెప్పగలవారు లేకపోయారు. అన్నయ్య, నాన్న, అమ్మ, మరిది, అత్త, మామ, అందరూ ఆమె లాంటివారే. వారు, భర్తపట్ల ఆమెకున్న తేలిక భావాన్నిమరింత ఎగదోశారు! ఫలితం? ఇద్దరి మధ్య పూడ్చరాని అగాధం!
ఫ్రాన్సిస్ బేకన్ “Of Marriage and single of life” అన్న అద్భుతమైన వ్యాసం వ్రాశాడు. అందులో, కుటుంబ జీవితానికి, ప్రజా జీవితానికి మధ్య గల సున్నితమైన బంధాలను ఆయన ఇలా చెప్పాడు. అవి అటూ, ఇటూగా కూడా ఉన్నాయి.
“The love of country has its rise in family affection”
“దేశంపట్ల ఉన్న ప్రేమవల్ల, కుటుంబం పట్ల ఆపేక్షకూడ పెరుగుతుంది.”
“family considerations often overthrow Public ones”
“కుటుంబాన్ని ఎక్కువగా పరిగణించే వారు తరచు ప్రజా జీవితాన్ని, వదిలేయాల్సివస్తుంది.”
ఈ రెండూ గోపాల రావు, పార్వతిలకు వర్తించవు. అతనికి దేశం పట్ల ఉన్నప్రేమ, కుటుంబం పట్ల అభిమానానికి అడ్డు రాలేదు. భార్య తన పట్ల చూపుతున్న ఉదాసీనతను చూసి బాధపడ్డాడే గాని ఆమెను ద్వేషించలేదు. అతని అనునయం, లాలన ఆమె ముందు పని చేయలేదు. కొడుకును కూడ దగ్గర తీయాలనే చూశాడు. కుదరలేదు. ఈ ప్రయత్నంలో అతడు తన కర్తవ్య దీక్షను మరువలేదు. ‘Individual’ గా మథనపడుతూనే ‘Universal’ గా నిలబడ్డాడు.
కొడుకు రాసిన చివరి ఉత్తరం అతనికి కొత్త బాధ్యతలు తెచ్చిపెట్టింది. అది వాడు అతనికి రాసిన మొదటి, చివరి ఉత్తరం. ఆర్థిక అసమానతలను రూపుమాపాలంటే వర్గపోరాటమే శరణ్యమని నమ్మి, ఉద్యమంలోకి వెళ్లాడు శ్రీనివాస్. అందులోనే తన జీవితభాగస్వామిని ఎన్నుకున్నాడు. ఒక బిడ్డకు తండ్రి అయ్యాడు.
“నాన్నా, మన మార్గాలు వేరు. నువ్వు అహింసను చేపడితే, నేను తుపాకీని ఆయుధంగా ఎన్నుకున్నాను. మన ధ్యేయాలు ఒకటైనా, మార్గాలు మటుకు ఒకటి కాదు” (పుట 123)
ఒక కామ్రేడ్ ద్వారా తన కూతురు, ఒక పసిగుడ్డును, ఈ ఉత్తరాన్ని పంపించాడు శ్రీనివాస్. “ఈ పాప, ఈ పసిది నా వల్ల ఏర్పడిన శూన్యాన్ని పూరించి, యీ ఇద్దరినీ దగ్గరకు చేరుస్తుందేమో?” అని రాశాడు ఉత్తరంలో. తన తల్లిదండ్రుల మధ్య ఉన్న ఇనుప తెర గురించి ఎప్పుడూ మౌనంగా ఉండే ఆ యువకునికి తెలుసు. తన వల్ల అది మరింత పెరుగుతుందని తెలుసు. తన కూతురిని వారి చేతుల్లో పెట్టడం ద్వారా, వారిద్దరిని దగ్గరికి చేర్చాలని ఆశపడుతున్నాడు. అలా జన్మనిచ్చిన తల్లిదండ్రుల రుణాన్ని తీర్చుకోవాలనుకుంటున్నాడు.
నవలలో ఈ దృశ్యాలు మన గుండెను పిండేస్తాయి. మనకూ దుఃఖం వస్తుంది. ‘Destiny leads’ అన్న సూక్తి ఎంత బలీయమైనదో అర్థమవుతుంది. దుఃఖం మనుషులను కలుపుతుందన్నది నిజం! ఆ క్షణంలో పార్వతి భర్తను గట్టిగా పట్టుకోని ఏడ్చింది. ఆమెకు ఫిట్స్ వస్తాయి. ఒకవైపు పసిదాని ఏడుపు. పార్వతి మీద మనకు సానుభూతి కలుగుతుంది. ఆమె భర్త అంత ఆదర్శవాది కాకపోవచ్చు. ఒక సామాన్య గృహిణి ఆమె. కొడుకు కోసం తపించే మాతృహృదయం, ఇప్పుడు మనుమరాలి కోసం తపించాల్సి వచ్చింది పాపం! పార్వతిని కంటికి రెప్పలా కాపాడసాగాడు గోపాల రావు. మూర్ఛపోయిన భార్య తలను ఒళ్లోకి తీసుకొని సేద దీర్చి, చెంచాతో వేడి హార్లిక్స్ తాగించాడు. పాలబుడ్డిని అందుకొని, పాలతిత్తి పిల్లదాని నోటికందించి దాన్నీ ఒళ్లోకి తీసుకొన్నాడు. అదీ ఏడుపాపి ఆకలిగా, ఆత్రంగా పాలు చప్పరించసాగింది.
నాన్నమ్మ, మనుమరాలు తేరుకొని ఆహారం తీసుకోవడం అందరిలో (మనతో సహా) ఆనందాన్ని నింపింది. “Life is an offers an alternative of stress and relief” అన్న G.K. Chesterton గారి మాటలు ఇక్కడ మనం గుర్తుకు తెచ్చుకోవాలి. దానినీ మాలతమ్మ అద్భుతంగా చెప్పారు.
“విషాదపు ఛాయల కొనని, మబ్బు అంచులకున్న మెరుపులాగా సన్నని సంతోష రేఖ..” (పుట 126)
అప్పుడు గోపాల రావు మానసిక స్థితి ఇలా ఉంది:
“ఆ క్షణం నుంచి అతనికి ఒక చేతిలో పసిపిల్ల, మరో చేతిలో మానసిక బాధతో విరుచుకు పడిపోయే భార్య, తనకు ఇద్దరు పసిపిల్లలు అనుకునేవాడు. ఇద్దరూ నిస్సహాయ స్థితిలోనే ఉన్నారు.” (పుట 126)
గోపాల రావు పాపను గుండెలకు హత్తుకున్న వెంటనే, పసిదానికి, అతని స్పర్శలో ఏదో ఆత్మీయత గోచరించింది. గుక్కపట్టి ఏడుస్తున్న ఆ పాప ఏడుపు ఆపి అతని ముఖంలోకి రెప్ప వెయ్యకుండా చూసింది.
రక్తస్పర్శ!
ఇక్కడ మాలతిగారు, ఆ పసిదాని కళ్లళ్ళో రాముడత్తయ్య కళ్లు కనబడ్డాయిని చెబుతారు, గోపాల రావు ద్వారా! ఆమే మనుమరాలిగా పుట్టిందేమో?
పాపకు ‘స్వరాజ్యలక్ష్మి’ అని పేరు పెట్టుకొన్నాడు. ఎవరి సలహ అడగలేదు. పాపగా రాముడత్తయ్య తన కొడుకు బిడ్డగా జన్మనెత్తి తన ఒళ్ళో పెరుగుతోంది. అవన్నీ ఒట్టి భ్రమలని తెలుసు. కాని..
‘జననాంతర సౌహృదాని’ అని మహాకవి కాళిదాసు అన్నట్లు, ‘రాముడత్తయ్యకు తనపై గల ప్రేమ, వాత్సల్యం, ఇవి ఈ జన్మవి కావు ఎన్నెన్నో జన్మలనుంచి వస్తున్న బంధాలు’ అనుకోనేవాడు.
తండ్రి చనిపోయినపుడు అతడు కర్మలు చేయడానికి ముందుకు రాలేదు. అదే, మనవరాలికి పాలు పట్టటం, నిద్రపుచ్చటం, పక్కబట్టలు ఉతకటం, పక్కన పడుకోబెట్టుకుని జోకొట్టి నిద్రపుచ్చడం శ్రద్ధగా చేసేవాడు. ఈ కర్మలు బాధ్యతలు. అకర్మలపై అతనికి నమ్మకం లేదు. అప్పుడు ఇంట్లో పెద్ద యుద్ధమే జరిగింది.
“బుచ్చి కర్మకాండలు అన్నీ చేసి అందరి మెప్పు పొందినా, అతనికి చిన్నతనంగా అనిపించలేదు” అంటారు రచయిత్రి. ఎందుకంటే ‘Rituals for Rituals sake’ అన్నది అతని అంతరాత్మకు విరుద్ధం. అదే బుచ్చి, అతని భార్య, కన్న తల్లి సుబ్బమ్మగారిని బతికుండగానే ఎంత హీనంగా చూశారు? చివరికి ఆమెను ఆమె నగల కోసం పీక నులిమి చంపేశారు. మాలతిగారు రాయలేదు గాని, సుబ్బమ్మ గారి అపరకర్మలు ఆపర శ్రావణ కుమారుడైన బుచ్చి, అతని భార్య, శాస్త్రోక్తంగా చేసి ఉంటారు. ఎందుకంటే దాని వల్ల అనుమానం తమ మీదికి రాకుండా. సుబ్బమ్మగారి హత్య ఒక విషయాన్ని పునఃనిర్ధారించింది.
“All human relations are financial relations” – Karl Marx .
“మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే” అన్న మార్క్స్ మహాశయుని ఈ మాటలు శిలాక్షరాలే! తరాలు గడచినా అవి మారవు!
భుక్తి కోసం ఉద్యోగం:
మనవరాలిని పెంచి పెద్దచేయడం కోసం, గోపాల రావు ఒక తెలుగు దినపత్రికలో ప్రూఫ్ రీడర్‌గా చేరి. ఆపైన సబ్ ఎడిటర్‌గా ఎదిగాడు.
సంపాదన బాగానే ఉంది.
‘గాంధీయ దృక్పథం’ అనే శీర్షికన అతడు వ్రాసే వ్యాసాలు గాంధేయవాదులని చాలా ఆకర్షించాయి. మూడేళ్ల స్వరాజ్యలక్ష్మిని ఒళ్లో కూర్చోబెట్టుకుని తన భావాలు గట్టిగా చెబుతూ ఉండేవాడు. ఆ పసిపిల్లకు అర్థం అవుతోందనే భ్రాంతిలో ఉండేవాడు. ఆ పిల్ల కూడ “ఆఁ, ఊఁ” అని ధ్వనులు చేస్తూ తల ఊపుతూ ఉండేది.
“అలా ఆరంభమైంది – తాతా మనవళ్ల మధ్య భావవారధి” (పుట 127) అంటారు రచయిత్రి.
‘భావవారధి’ అనే పదబంధం వాడడం ద్వారా, రాబోయే కాలంలో స్వరాజ్యం అతని ఆదర్శాలకు వారసురాలిగా ఎలా ఎదిగిందో, తల్లి, నాన్నమ్మల ప్రభావానికి లోను కాకుండా, తన వ్యక్తిత్వాన్ని తాతయ్య మార్గదర్శకత్వంలో ఎలా తీర్చిదిద్దుకుందో, ‘కావ్యార్థ సూచన’ చేశారామె
శ్రీనివాస్ కోరుకున్నట్లే, స్వరాజ్యం రాకతో భార్యాభర్తల మధ్య ‘కించిత్’ సామరస్యం ఏర్పడింది. గోపాల రావు జీవితంలో స్థిరత్వం, ఆర్థికమైన స్థిరత్వం కూడ కలిగాయి.
‘కౌపీన సంరక్షణార్థమ్ అయం పటాటోపః’ అన్న సూక్తిని ఒక కథగా, సరదాగా మనుమరాలికి చెబుతుంటాడు తాతయ్య. ఆ పిల్ల అసాధ్యురాలు. ‘లాజిక్’లు తీస్తుంది. కథలో పార్వతి సందు దొరికిందని భర్తను చెప్పుతుంది. తమకంటూ ఒక ‘కొంప’ లేదనీ, ఆ సన్యాసి పెళ్ళామే మేలనీ అంటుంది.
బుచ్చి భార్య, వీళ్లు తమ ఇంట్లో ఉన్నారని నిరంతరం పార్వతిని లోకువ కడుతూ ఉంటుంది. ఎవరి పొయ్యి వారిదే అయినా ఆమె సాధింపులు తప్పవు. ‘తోడికోడలి మాత్సర్యం’ అలా ఉంటుంది మరి! ఆమె (పార్వతి) కోణంలో చూస్తే ఆమె చెప్పేదే సబబే.
(సశేషం)
శ్రీ పాణ్యం దత్తశర్మ 1957లో కర్నూలు జిల్లా వెల్దుర్తిలో పుట్టారు. తండ్రి శతావధాని శ్రీ ప్రాణ్యం లక్ష్మీనరసింహశాస్త్రి. తల్లి శ్రీమతి లక్ష్మీనరసమ్మ. టెంత్ వరకు వెల్దుర్తి హైస్కూలు. ఇంటర్, డిగ్రీ, ఎం.ఎ. (ఇంగ్లీషు), ఎం.ఎ. (సంస్కృతం), ఎంఫిల్, పిజిడిటియి (సీఫెల్), ప్రయివేటుగానే.
దత్తశర్మ ఇంటర్మీడియట్ విద్యాశాఖలో లెక్చరర్‌గా, ప్రిన్సిపాల్‌గా, రీడర్‌గా, ఉపకార్యదర్శిగా సేవలందించారు. కవి, రచయిత, విమర్శకులు, గాయకులు, కాలమిస్టుగా పేరు పొందారు. వీరివి ఇంతవరకు దాదాపు 50 కథలు వివిధ పత్రికలలో ప్రచురితమై వాటిలో కొన్ని బహుమతులు, పురస్కారాలు పొందాయి.
వీరు ‘చంపకాలోచనమ్’ అనే ఖండకావ్యాన్ని, ‘Garland of poems’ అన్న ఆంగ్ల కవితా సంకలనాన్ని, ‘దత్త కథాలహరి’ అన్న కథా సంపుటాన్ని ప్రచురించారు. వీరి నవల ‘సాఫల్యం’ సంచిక అంతర్జాల పత్రికలో 54 వారాలు సీరియల్‌గా ప్రచురితమై, పుస్తక రూపంలో ప్రచురింపబడి అశేష పాఠకాదరణ పొందింది. 584 పేజీల బృహన్నవల ఇది. ‘అడవి తల్లి ఒడిలో’ అనే పిల్లల సైంటిఫిక్ ఫిక్షన్ నవల సంచిక డాట్ కామ్‌లో సీరియల్‌గా ప్రచురించబడింది.
వీరికి ఎ.జి రంజని సంస్థ కవి సామ్రాట్ విశ్వనాథ పురస్కారాన్ని, ‘తెలంగాణ పాయిటిక్ ఫోరమ్’ వారు వీరికి ‘Poet of Profundity’ అన్న బిరుదును, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంవారు వీరి సిద్ధాంత గ్రంథానికి అవార్డును, సి.పి. బ్రౌన్ సమితి, బెంగుళూరు వారు వీరికి ‘NTR స్మారక శతకరత్న’ అవార్డును బహూకరించారు.
ఇద్దరు పిల్లలు. ప్రహ్లాద్, ప్రణవి. కోడలు ప్రత్యూష, అల్లుడు ఆశిష్. అర్ధాంగి హిరణ్మయి. సాహితీ వ్యాసంగంలో రచయితకు వెన్నుదన్నుగా ఉన్న గురుతుల్యులు, ప్రముఖ రచయిత వాణిశ్రీ గారు. వీరు – తమ సోదరి అవధానం లక్ష్మీదేవమ్మ గారు, మేనమామ శ్రీ కె. సీతారామశాస్త్రి గార్లకు ఋణగ్రస్థులు.