[శ్రీమతి మాలతీ చందూర్ గారి ‘హృదయనేత్రి’ నవలపై శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన సిద్ధాంత గ్రంథాన్ని ధారావాహికగా అందిస్తున్నాము.]
కానీ ఎమర్జెన్సీని ఎత్తేసి, ఎన్నికలు జరిపిస్తుంది ఇందిర. ఎన్నికల ప్రచారానికి ఆమె మద్రసు వచ్చి బీచ్‍లో బహిరంగ సభ పెట్టినపుడు స్వరాజ్యం వెళుతుంది. లక్షలమంది హాజరవుతారు. ఆ ప్రజాభిమానం వెల్లువలా ఉంటుంది. గోపాల రావుకీ ఆశ్చర్యం!
ఇందిరమ్మ ఓడిపోయింది. బుచ్చీ డిటో. జనం అంత మంది ఆమె సభలకు ఎందుకు వచ్చారు? ఆ కాలంలోనే “కిరాయి యిచ్చి సభలకు జనాన్ని మందల్లా తోలుకొస్తున్నారు” అని రచయిత్రి ప్రస్తావించింది. మరి ఇందిరమ్మ సభలకు లక్షల మంది స్వచ్ఛందంగా వచ్చారని పత్రికలు రాశాయి.
దానికి గోపాలరావు విశ్లేషణ ఇది.
“క్యూరియాసిటీ.. కుతూహలం – ఎమర్జెన్సీ పెట్టి ఇన్ని ఘాతుకాలు చేసిన వ్యక్తి ఎలా ఉంటుందో – ఏం మాట్లాడుతుందో చూద్దామని వచ్చి ఉంటారు.”
“అది మానవ నైజంలో ఒక భాగం. ఖైదీకి గాని, నేరస్థునికి గాని బేడీలు వేసి తీసుకొని వెళుతుంటే, రోడ్డు మీద జనం ఆగిపోయి విచిత్రంగా చూస్తారు.”
ఇది కొంచెం ‘అతి’ అనిపించినా దానిలో నిజం లేకపోలేదు. సినిమా హీరోలు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కూడా ఇదే జరిగింది. వారి సభలకు విపరీతమైన జనం. ఓట్లు మాత్రం వేసేవారు కాదు. ఒక్క ఎన్.టి.ఆర్., ఎమ్.జి.ఆర్ మాత్రం దీనికి మినహాయింపు. మిగతా అందరూ విఫల మనోరథులే గాని అతిరథ మహారథులు కారు.
జనతా ప్రభుత్వం కొలువు తీరిన రోజు పార్వతిని పాయసం చెయ్యమంటాడు గోపాల రావు. నియంతృత్వం మీద ప్రజాస్వామ్యం సాధించిన విజయానికి సెలబ్రేషన్ అది!
కాని జనతా ప్రభుత్వం, ప్రజలని పట్టించుకోకుండా ఇందిరాగాంధీ మీద కక్ష సాధించడమే పనిగా పెట్టుకుంది. వారి ప్రభుత్వం మూన్నాళ్ల ముచ్చటయింది. స్వరాజ్యం టీచర్‌గా చేరింది. యథాప్రకారం అక్కడి అక్రమాల నెదిరించి, ఇమడలేక రాజీనామా చేసింది. గోపాల రావు తన పెళ్లిని తమ బాధ్యతగా అభివర్ణిస్తుంటే, వారిని కనిపెట్టుకొని ఉండటం తన బాధ్యత అని ఎదురు వాదన చేస్తుంది స్వరాజ్యం.
జానకమ్మగారిని చూడాలని ఇద్దరూ చీరాల బయలుదేరుతారు. సూర్యారావు దంపతులు నడుపుతున్న స్కూలు బాగుంది. టెంత్ వరకు ఉంది. ఆరేడు వందల మంది పిల్లలు. జానకమ్మ గారు, ఒంటరిగా, అవసానదశలో ఒక పాకలో ఉన్నారు. వృద్ధాప్యం ఆమెను క్రుంగదీయలేదు. కళ్లకు చత్వారం రాలేదు. జ్ఞాపకశక్తి బాగుంది. చెవులు పనిచేస్తున్నాయి. ‘ఆత్మశక్తి గలవారికి దేహశక్తికి లోపముండదు’ అన్న సత్యాన్ని ఆమె రుజువు చేసింది.
“ఏం చేస్తున్నావమ్మా?” అని స్వరాజ్యాన్ని అడుగుతుందామె. “ఎం.ఏ. అయ్యింది. పెళ్లి చేసుకోలేదు. ఏం చేయాలో తోచక చీకట్లో వెతుక్కుంటున్నాను” అంటుంది ఆ అమ్మాయి.
అప్పుడు జానకమ్మ గారన్న మాటలు యువత కంతకూ తత్త్వబోధలు!
“చెయ్యదలచుకొంటే మంచి పనులు చాలా ఉన్నాయి”
కోటి వరహల కంటే విలువైన మాటలివి. ఏం చేయాలో తోచని జడులను జాగృతం చేస్తాయి.
“They shock the sluggishness into awareness” అంటారు రఘుకుల తిలక్ అనే విమర్శకుడు జాన్‌డాన్ కవితల గురించి. అది వీటికీ వర్తిస్తుంది. రాముడత్తయ్య ఇంటిని మంచి పనికి వినియోగించ మంటుందామె. తన దగ్గరున్న పదివేలు కూడా ఇచ్చేస్తుంది. ఆమె మందులకు పనికొస్తాయంటే.. తనలాంటివారు దేశంలో ఎందరో ఉన్నారు, వారి సంగతేంటి అంటుంది.
“old age hath its honour and toil” అన్న టెన్నిసన్ మాటలకు ప్రతిరూపం జానకమ్మ గారు. స్వరాజ్యం ఆమెను తన తాతమ్మతో పోల్చుకుంటుంది. ఎంత తేడా?
ఇందిరాగాంధీ గెలిచి మళ్లీ అధికారం లోకి రావడం, హత్య చేయబడటం జరిగిపోతాయి. స్వరాజ్యం దుఃఖిస్తుంది. గోపాల రావు కూడా! మళ్లీ చీరాల వెళదామంటుంది స్వరాజ్యం. ఆమెకు తన గమ్యం పట్ల అప్పుడు ఒక రూపం ఏర్పడుతుంది. ఇలా అంటుంది – “నా జీవితానికి గమ్యం ఎక్కడుందో ఇప్పుడు తెలుసుకున్నాను. ఎక్కడ నీ జీవితంలో తొలివెలుగు చూశావో అక్కడే నేనో మంచి పనిని నా జీవిత లక్ష్యంగా ప్రారంభించబోతున్నాను.”
అదే, రాముడత్తయ్య యింట్లో ఒక వృద్ధాశ్రమాన్ని ప్రారంభించడం.
“చీకట్లో వెతుక్కుంటున్న నాకు ఒక దీపం కనిపించింది” అంటుంది స్వరాజ్యం. ‘తమసోమా జ్యోతిర్గమయ!’
“అన్ని జీవితాలకు పెళ్ళే గమ్యం కాదు. అంతకు మించిన ఆదర్శాలు కూడా ఉంటాయి” అంటుంది.
అలా జానకమ్మగారి దూరదృష్టి – భవిష్యత్ వాణిని గుర్తించగల అపూర్వశక్తి, స్వరాజ్యానికి దిశానిర్దేశం చేయడంతో నవలను ముగించారు శ్రీమతి మాలతీ చందూర్. కాని అది కేవలం ముగింపు కాదు ఆరంభం మాత్రమే .
“Old order Changeth, yielding place to the new” అన్నట్లు, శతాధిక వృద్ధురాలు, ఒక యువతిని, దేశానికి కరదీపికగా స్ఫూర్తినిచ్చింది. ఆమె విజన్‌ను స్వరాజ్యం తన హృదయనేత్రంతో చూస్తున్నదా? అనే విస్మయం గోపాల రావుకు కలిగిందంటారు మాలతమ్మ. “భవిష్యత్తును ఫలవంతం చేయడం యువత బాధ్యత” అన్న సందేశంతో నవల తన లక్ష్యాన్ని, కావ్యప్రయోజనాన్ని, సాధించింది.
***
గోపాల రావు, నాయకులలో ధీరశాంతుడు:
మన కావ్యాలలో, ప్రబంధాలలోని నాయకులను, నాయికలను లాక్షణికులు వారి స్వభావాలను బట్టి రకరకాలుగా విభజించారు. వారు
ధీరోదాత్తుడు:
ధీరత్వం అంటే స్థితప్రజ్ఞత చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం, మొక్కవోని ధైర్యం, ఇలా రకరకాల అర్థాలు చెప్పుకోవచ్చు. ‘మగధీరుడు’ అన్న పదము దుష్టసమాసం. అంటే ఒక తెలుగుపదం, ఒక సంస్కృతపదం కలిసి ఏర్పడేది. అది నియమ విరుద్ధం – సినిమాల వరకు పరవాలేదు!
ధీరోదాత్త నాయకులతో దుష్యంతుడు, విక్రమార్కుడు, దిలీప చక్రవర్తి, చంద్రగుప్త మార్యుడు, ప్రవరాఖ్యుడు లాంటి వారున్నారు. ధీరగుణంతో బాటు ఉదాత్తత (generosity) వీరిలో ఉంటుంది.
ధీరోద్ధత్తుడు:
వీరిలో ధీరత్వంతో పాటు ఔద్ధత్యం ఉంటుంది. ఔద్ధత్యం అంటే తీవ్రమయిన ప్రకృతి ఆవేశం, దీనికి ఉదా: భీమసేనుడు, శివాజీ మహారాజు, భగత్ సింగ్ లాంటి వారు.
ధీరశాంతుడు:
వీరిలో శాంతం అనే గొప్ప గుణం ఉంటుంది; ధీరులు సరేసరి, క్షమాగుణం, సత్యగుణం కలిస్తే శాంతం. తామసగుణం వీరిలో మచ్చుకైనా కాన రాదు. వీరు ఏ విషయంలోనూ సంయమనం కోల్పో రు. ధర్మరాజు, శ్రీరామచంద్రుడు, ఈ కోవకు చెందుతారు. మన నవలా నాయకుడు గోపాలరావు ధీరశాంతుడు. ఎన్ని కష్టాలనైనా ఓర్చి ‘కూల్’ గా ఉండగలడు. శాంతం అన్నంత మాత్రాన అసమర్థత కాదు. అన్ని గుణాలలో అది గొప్పది. భీమసీనుడు ఒకసారి ధర్మజుని శాంతస్వభావాన్ని నిందించినప్పుడు అర్జునుడు ఆయన గొప్పతనాన్ని భీమునికి వివరిస్తాడు ‘ఎవ్వాని వాకిట నిభమద పంకంబు రాజభూషణ రజోరాజినడగు’ అన్న పద్యంలో.
గోపాలరావు కూడా శాంతచిత్తుడే. తీవ్రంగా స్పందించడం అతని స్వభావంలోనే లేదు. పార్వతి, బుచ్చి లాంటి వారు అతన్ని ఎంత విమర్శించినా, తన Point of view ను చెబుతాడే తప్ప, నిగ్రహం కోల్పోడు. ఒక్క స్వరాజ్యం జైలుకెళ్లిన సందర్భంలోనే అతడు తమ్ముడికి తన విశ్వరూపం చూపాల్సివస్తుంది.
నందయ్య అతన్ని గురించి ఇలా అంటాడు –
“నువ్యు పెట్టి పుట్టావు. కొన్ని ఆదర్శాలకు కట్టుబడి నిన్ను నీవు నిగ్రహించుకోగల స్థితిలో ఉన్నావు.”
“నీకున్న ఆత్మ నిగ్రహం నాకు లేదు. నీ పడికట్టు రాళ్ళు బలమైనవి.”
‘‘నీకు వ్యామోహం లేదు. అధికార దాహం లేదు.” – (పుట 114)
ధీరలలితుడు:
ఇది కొంచెం శృంగారానికి చెందినదంటారు. లాలిత్యం అంటే సుకుమారం. శ్రీకృష్ణ పరమాత్మ ధీరలలితుడు.
ఒకసారి విద్యన్మణులు, మహామహోపాధ్యాయ అనదగ్గవారు శ్రీమాన్ కోవెల సుప్రసన్నాచార్యుల వారితో ఈ నాయక లక్షణాలు చర్చించడం జరిగింది. ప్రతిపదంలో “ఈ ధీర శబ్దం ఎందుకుంది?” అని ఆయనను సవినయంగా ప్రశ్నించాను. ఆయనా ధీరశాంతుడే. ఇలా చెప్పారు – “ఉదాత్తత, శాంతత్వం, ఔద్ధత్యం, లాలిత్యం లాంటి గుణాలు విభిన్నమైనవి. వీటికి ధీరగుణం కలిస్తేనే వ్యక్తిత్యం పరిపూర్ణమవుతుంది. ధీరత్వం లేని వాడు పైవన్నీ కాలేడు. కాబట్టి ఆ ‘పదం’ విలువైనది.”
నాయకులంటే కేవలం కావ్యాల్లో ప్రబంధాల్లోని వారు మాత్రమే కాదు. అన్నిచోట్లా ఉంటారు. మన కుటుంబాల్లో కూడా కనిపిస్తారు. అలాంటి క్యారెక్టరే గోపాల రావు. అలాంటి పాత్రను తీర్చిదిద్దిన శ్రీమతి మాలతీ చందూర్ ధన్యురాలు.
నవలలోని విశ్వజనీనత (Generalisations):
General నుంచి Particular కు, individual నుంచి universal కు పాఠకులను తీసుకోని వెళ్లడమే కావ్య ప్రయోజనాల్లో ముఖ్యం. ‘హృదయనేత్రి’ నవల నిండా ఈ Generalisations పరుచుకుని ఉన్నాయి.
“గోళ్ళు గిల్లుకుంటూ కూర్చుంటే స్వరాజ్యం రాదు” – రాముడత్తయ్య (పుట 6)
“మంచి మాల అయితే నేను మాల అవుతాను” – జానకమ్మగారు (పుట 18)
“కాకులు మటుకు ప్రాణులు కావా?” – మాలక్ష్మి (పుట 21)
“కోతికొమ్మచ్చి ఆడుకోవడం స్వేచ్ఛ కాదు రా – నీ ఇష్టం వచ్చిన విధంగా బ్రతకగలగాలి.” – రాముడత్తయ్య (పుట 25)
“సర్కారువారు నిషేధించారు కాబట్టి తప్పకుండా చదవాలి” – నందయ్య (పుట 37)
“ధర్మయుద్ధానికి భార్యాపిల్లలూ శృంఖలాలు కాకూడదు” – వాసుదేవరావు (పుట 47).
“నలుగురి కోసం మేము బ్రతకడం ఎప్పుడో మానుకొన్నాము. మేము నమ్మిన సిద్ధాంతాల కోసం బ్రతికాము” – రాముడత్తయ్య (పుట 58)
ప్రభుత్వానికి బుద్ధి వస్తే ప్రభుత్వ కార్యాలయానికీ బుద్ధి వస్తుంది” – త్రిపాఠి (పుట 71)
“తాత్కాలికమైన ఫలితాల కోసం మానవ విలువలను మరచిపోకూడదు” – గోపాలరావు (పుట 71)
“వృద్ధాప్యం అన్నది యింత భయంకరమైనదా?” – స్వరాజ్యం (పుట 196)
నవలలో రచయిత్రి ఉపయోగించిన అలంకారాలు (Figures of Speech):
‘హృదయనేత్రి’ నవల ఒక సోషల్ కమిట్మెంట్‌తో రాయబడింది. కల్పనలకు అవకాశం లేదు. హిస్టారికల్ ఫిక్షన్‌లో అలంకారాలకు అవకాశం తక్కువ. కాని మాలతమ్మ కలం అప్రయత్నంగా భావ సౌకుమార్యాన్ని సంతరించుకుంటుంది.
“అవును స్వరాజ్యం అనే మందుపెట్టాను” – రాముడత్తయ్య – రూపకాలంకారం (Metaphor) – పుట 18.
“నరసంచారం లేని వీధులు, పొగ రాజుకోని ఇళ్ళు, పెంపుడు జంతువులు లేని లోగిళ్లు, మాంత్రికుడు మంత్రదండంతో ప్రాణులను మటుమాయం చేసినట్లు. ఖాళీ ఇల్లు, నోళ్లు తెరుచుకొని ఆకాశం లోకి చూస్తున్నాయి.” ఉపమ (Simile) – పుట 20.
“అక్కడే ‘చదువులు, అక్కడే వంటలు, అక్కడే పురుళ్ళు, అక్కడే మరణాలు.” – విరోధాభాసం – పుట 21.
“పూలమాలల్తో ఊరేగుతున్నది ఆయన భౌతికకాయం అనిపించలేదు, పూలరథంలా అనిపించింది” – ఉపమ (Simile) – పుట 28
మాలతీ చందూర్, ఒక సోషియల్ రెబెల్:
మొదటగా బ్రాహ్మణుల్లోని అస్పృశ్యత పాటింపు:
సీత మామ్మ దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. స్వాతంత్ర్యోద్యమంలో అందరూ పాల్గొంటూ కూడా సాలెవీధి, కోమటి వీధి, బ్రాహ్మణ వీధి. ఇలా మళ్ళీ ఎవరికి వారు కులాల విభజన చేసుకొని, మడి, ఆచారం అంటూ తిరుగుతుంటారు. సీతం మామ్మ హరిజనుడైన వీరయ్యను ‘అసింటా పొమ్మని’ తిట్టడం, ‘అసింటా’ అంటే ఏమిటని గోపాలరావు రాముడత్తయ్యను అడగడం ఆమె సీతం మామ్మలాంటి వారిని దేశద్రోహులని – మేనల్లుడికి చెప్పడం, ఇదంతా సామాజిక తిరుగుబాటే. కానీ, ఎంత వివాదాస్పద విషయాన్ని చెప్పినా, అందులలో ఉభయ పార్శ్వాలనూ నిష్పక్షపాతంగా, నిర్మొహమాటంగా స్పృశించనిదే రచయిత్రి వదలరు.
సీతంమామ్మ, సుబ్బమ్మ గారు లాంటి ఛాందసులున్న సమాజంలోనే జానకమ్మ గారి లాంటి ‘సర్వత్ర సమ దర్శనులై’న యోగులున్నారని ఆమె నిరూపిస్తారు. రాముడత్తయ్య దంపతులు సరేసరి. ఆమె (జానకమ్మ) కడజాతి, అగ్రజాతి అన్న భేదం లేకుండా అందరికీ పురుడ్లు పోస్తుంది. ఆమెను అగ్రకులాలవారు వెలివేసినా, ఆమె లెక్క చేయదు. రాముడత్తయ్య వాళ్లింట్లో ఒక హరిజన బాలుడు తోటమాలి. వాడికి వాళ్లు చదువు నేర్పించేవారు. నందయ్య లోని ప్రతిభను గుర్తించి, చదువుకోవడానికి అవకాశం కల్పించిన కొండా వెంకటప్పయ్య గారు, ‘మాలపల్లి’ అనే ప్రభుత్వ నిషేధిత నవలను రాసి, కుల దురభిమానాన్ని నిరసించిన ఉన్నవ లక్ష్మీ నారాయణ గారు బాహ్మణులే. వీరంతా గోపాల రావులో ‘equanimity’ అన్న సద్గుణాన్ని కలుగ చేశారు.
దళితుడు ఎదిగినా, సాటి దళితులను ఎదగనివ్వడనడానికి ఉదాహరణగా నందయ్య నిలుస్తాడు. స్వార్థం, అవకాశవాదం, కృతఘ్నత, లాంటి దుర్గుణాలు అన్ని కులాల్లోనూ ఉంటాయని, అతని పాత్ర ద్వారా; బ్రాహ్మణుల్లో, బుచ్చి, అతని మామ పాత్రల ద్వారా, సుబ్బమ్మ గారి ద్వారా నిరూపించారు రచయిత్రి.
భర్త చనిపోయినపుడు బొట్టు, జుట్టు తీయకుండా (ఆయన ఆదేశం కూడా అదే) రామలక్ష్మమ్మ ఒక సోషియల్ రెబెల్‌గా అవతరిస్తుంది. ఆ కాలంలో అది ఎంతో సాహసోపేత చర్యే. భర్తకు అపరకర్మలు కూడా చేయదామె. పైగా ఆ ఖర్చును హరిజన నిధికి ఇస్తుంది. దానికి తమ్ముని స్పందన, ‘రామ రామ’.
పెళ్లికి భోగం మేళం వద్దనమని, అలక పానుపుపై, హరిజన నిధికి డొనేషన్ ఇమ్మని అడగమని గోపాల రావుకు బోధిస్తాడు మామయ్య. ఇదో రకం లెబెలియన్! మన ఆచారాల లోనే సంస్కరణలు చూపడం. దాన్ని గోపాల రావు పాటిస్తాడు. ‘శారదా చిల్లు’ను గురించి విని సుబ్బమ్మ గారు అది ‘తమ సంప్రదాయాలను ముంచి పారిస్తుందేమో’ నని భయపడుతుంటారు. ఆడపడుచు వీరేశలింగం గారి వితంతు శరణాలయానికి తరచు వెళుతూ ఉంటుందని, అక్కడ జరిగిన రెండు మూడు వితంతు పునర్వివాహాలకు ఆమె వెళ్లిందని కూడా ఆమె విని ఉంది.
“చూసి చూసి తన ముద్దుల మేనల్లుడికి వెధవముండను తీసుకొచ్చి పెళ్లి చేసేస్తుందేమోనన్న భయం సుబ్బమ్మ గారిని పట్టి వీడిస్తుంది” -పుట 41.
ఒక స్త్రీ విధవ కావడంలో ఆమె ప్రమేయం ఏముంది? సుబ్బమ్మ గారికి కూడా తన భర్త పోయాక అదే గతి పట్టింది కదా! చాలామంది స్త్రీలు ఇది గ్రహించరు. సాటి స్త్రీకి గాజులు పగలగొట్టడం, బొట్టు చెరిపేయడం, జుట్లు తీయించడం లాంటి అత్యంత హేయమైన పనుల్లో అత్యుత్సాహంగా పాల్గొంటారు వారు. ఆ ఉత్సాహం తోనే సుబ్బమ్మగారు చీరాలకు వచ్చింది! కాని ఆమె ఆటలు అక్కడ సాగలేదు. దానికి కారణం రామలక్ష్మమ్మగారి మనోస్థైర్యమే! భర్త అంత్యక్రియలు చేయడానికి గోపాలరావు సిద్ధపడినా, బ్రాహ్మణ్యం ఒప్పుకోదు. కారణం తండ్రి బ్రతికే ఉండటం, పెళ్లయి నెల రోజులే అవటం. ‘కాంగ్రెస్ వర్కర్స్‌లో ఎవరో ఒకరు ఆయనకు తలకొరివి పెడతారంటుంది అత్తయ్య! వాసుదేవరావు గారు కులానికి అతీతుడు. ఇది కూడా సామాజిక నియమోల్లంఘనమే!
తన తండ్రి చనిపోయినపుడు కూడా గోపాల రావు ఆయనకు కర్మలు చేయడు. తమ్ముడు చేస్తాడు. ‘Ritual for Ritual’s Sake – తంతు కోసమే తంతు’ అన్న Dogmatic notion (మూఢ సిద్ధాంతాన్ని) అలా నిరసింపజేసి రచయిత్రి తన లోని రెబెల్‌ను చాటుకున్నారు.
గోపాల రావు స్వాతంత్య్ర్య సమరయోధులకు ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న ఐదెకరాల భూమిని తృణపాయంగా తిరస్కరించడం కూడా తిరుగుబాటే. అట్లే, దానిని తీసుకొని, అయిదు దళిత కుటుంబాలకు సాగు చేసుకోడానికి ఇచ్చిన జానకమ్మ గారిదీ తిరుగుబాటే. మొదటిది నిర్మమత్వం, రెండవది నిస్వార్థంతో కూడిన లౌక్యం!
చీరాలలో, రిక్షా ముసలయ్య పాత్ర ద్వారా, తాగుడు, సినిమాలు, సమాజాన్ని ఎలా ఛిద్రం చేస్తున్నాయో నిర్దయగా, నిర్భీతిగా బయటపెట్టారు రచయిత్రి. వాటి పట్ల ఆమెకున్న ద్వేషం, జుగుప్స ప్ప, మనకు అందులో అవగతమౌతుంది.
ఎన్నికలంటే ప్రహసనాలని తేటతెల్లం చేశారామె. లక్షలు గుమ్మరిస్తే గాని, సీటు రాదని, ప్రచారం చెయ్యలేయని కుండ బద్దలు కొట్టారు. ‘కిరాయి యిచ్చి జనాలని ఎన్నికల ప్రచార సభలకు తోలడం’ ప్రస్తావించారు. ఎమర్జెన్సీని, ఇందిరాగాంధీని తీవ్రంగా విమర్శించి, తనలోని పొలిటికల్ రెబెల్‌ని కూడా ఆవిష్కరింపచేసుకున్నారు. తోటి రైలు ప్రయాణీకుడితో చర్చ ద్వారా కార్పొరేట్ విద్యను తూర్పారబట్టారు. ‘క్వీన్ మేరీస్’ లో స్వరాజ్యాన్ని చేర్చేటపుడు పబ్లిక్ ఫండెడ్ విద్యావిధానాన్ని గ్లోరిఫై చేశారు.
ఆమె సోషల్ రెబెలియన్ లోని అత్యంత మానవీయ కోణం, తనను మొదటినుంచి చులకనగా చూసిన తల్లిని గోపాల రావు ఆదరించి, అక్కున చేర్చుకోవడం. దీని ద్వారా, సంప్రదాయలను ఉల్లంఘించడం వేరు, మానవతా విలువలను పాటించడం వేరని రచయిత్రి నిరూపించారు.
స్వాతంత్య్ర సమరం లోని ముఖ్య ఘట్టాలు; అనంతర పరిణామాలు నవలలో సహజంగా ఒదిగాయి.
ఈ విషయంలో రచయిత్రి chronological order ను ఎక్కడా తప్పలేదు. గొప్ప గొప్ప నాయకులందరూ నవలలో పాత్రలై, ఇతర పాత్రలతో కలిసిపోయారని మనం ముందుగానే చెప్పుకున్నాం. గాంధీజీ గారి నించి, జితేంద్రనాధ్ దాస్ గారివరకు ఇది సాధ్యమైంది. ఇక చారిత్రిక క్రమానికొస్తే, ఉద్యమంలోని ప్రధాన సంఘటనలు, అవి జరిగిన క్రమంలోనే నవలలో చోటు చేసుకుంటాయి. దీనికోసం రచయిత్రి ప్రత్యేక శ్రద్ధ తీసుకోలేదు. అలవోకగా రాసుకుంటా పోయినట్లే అనిపిస్తుంది. కాని దాని వల్ల నవలకు విశ్వసనీయత, authenticity పెరిగాయి.
- దుగ్గిరాలవారు పన్నులు కట్టొద్దనడం.
- గాంధీజీ బెజవాడకు రావడం (బెజవాడ కాంగ్రెస్ సమావేశం, 1921)
- గాంధీజీ రామనగర్ సందర్శన. స్వరాజ్యనిధికి స్త్రీలు స్వచ్ఛందంగా తమ నగలు ఆయనకు ఇచ్చేయడం.
- బ్రిటిష్ వారి ‘ప్యూనిటివ్ టాక్స్’ కు నిరసనగా ప్రజల నిరసన
- గాంధీజీ అరెస్టు
- పన్నుల నిరాకరణోద్యమం, ఉన్నవ వారి ఖైదు, కన్నెగంటి హనుమంతరావుగారిని పోలీసులు బహిరంగంగా చంపడం, ఆయన అంతిమయాత్ర (1922)
- శారదాపీఠ జగద్గురు శంకరాచార్యుల వారికి జైలుశిక్ష
- కాకినాడ కాంగ్రెస్ సభలు – బులుసు సాంబమూర్తి గారి గొప్పతనం. దుర్గాబాయి దేశముఖ్ గారి చురుకుతనం (1923)
- కాంగ్రెస్ సభ్యత్వ నమోదుకు నూలు తీసే నిబంధన
- ఉన్నవ వారి ‘మాలపల్లి’, దాని ప్రభావం (1922)
- మహాత్ముని నిరాహర దీక్ష
- శారదా బిల్లు (1929)
- డా. బ్రహ్మజోస్యుల సుబ్రమణ్యం గారు స్థాపించిన గౌతమి సత్యాగ్రహ ఆశ్రమం – సీతానగరం – మహత్ముని బస (1925)
- సైమన్ కవిషన్ రాక – నిరసనలు. కాళేశ్వర రావు గారు డైరెక్ట్‌గా సర్ జాన్ సైమన్‌కు బెజవాడ రైల్వేస్టేషన్లో బహిష్కరణ తీర్మానాన్ని అందింపచేసిన సాహసం (1928)
- లాలా లజపతిరాయ్ పై పోలీసుల హింస – భగత్ సింగ్ సార్జంట్ సాండర్సును హత్య చేయడం, విద్యార్ధులకు ఆయన పట్ల గల హీరో వర్షిప్ (1928)
- భగత్ సింగ్ కుట్ర కేసు (1931)
- రాజకీయ ఖైదీలు సామాన్య ఖైదీల కంటే వేరు. వారు నేరస్థులు కారు, జైల్లో వారిని గౌరవంగా చూడాలని నిరాహార వ్రతం – జితీంద్రనాధ్ దాస్ ఉద్యమం – నిరాహరదీక్ష లోనే ఆయన దేహత్యాగం – కలకత్తాలో ఆరు లక్షలమంది ఆయన అంత్యక్రియలకు హాజరు (1929)
- ఉప్పు సత్యాగ్రహము (ఏడాది పాటు) (1930)
- గాంధీ ఇర్విన్ ఒడంబడిక – వ్యక్తిగత శాసనోల్లంఘనం చెయ్యమని గాంధీజీ ప్రజలకు పిలుపు (1931)
- సి. రాజగోపాలాచారి గారు ముఖ్యమంత్రిగా మద్రాస్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ స్వపరిపాలన.
- ప్రపంచయుద్ధం. గాంధీగారి నైతిక వ్యతిరేకత-వ్యక్తి సత్యాగ్రహం. బ్లాక్ అవుట్
- క్విట్ ఇండియా ఉద్యమం. హింసాత్మకం (1942)
- కస్తూరి బా మరణం (1944)
- దేశానికి స్వాతంత్ర్య ప్రకటన. ప్రజల ఆనందోత్సాహాలు
- దేశవిభజన- మతకల్లోలాలు – గాంధీజీ నిరాహారదీక్ష
- గాంధీజీ హత్యకు గురికావడం (1948)
- స్వాతంత్య్రానంతర పరిస్థితులు.
- పొట్టి రాములు గారు – భాషాప్రయుక్త రాష్ట్ర ఉద్యమం- ఆయన ప్రాణత్యాగం (1952)
- ఎమర్జెన్సీ – ప్రభుత్వ దమనకాండ -ప్రెస్ సెన్సారింగ్ (1975)
- ఎమర్జెన్సీ ఎత్తివేత – ఎన్నికలు. జనతాపార్టీ పాలన (1977)
- మళ్లీ ఇందిర విజయం
- ఇందిరాగాంధీ దారుణహత్య (1984)
***
పైన పేర్కొన్నవాటిలో, ముఖ్యమైన వాటి పక్కన కుండలాలలో అవి సంభవించిన సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. ఇది నవల గురించిన మరింత authentic approach కోసమే. Chronological order అనేది fiction కు ప్రమాణం కాకపోయినా, హిస్టారికల్ ఫిక్షన్‌కు అవసరం. దాన్ని పకడ్బందీగా నిర్వహించారు శ్రీమతి మాలతీ చందూర్.
ఇన్ని సంఘటనలను పొందుపరచడం వల్ల, నవల ఒక హిస్టారికల్ డాక్యుమెంట్‌లా అసలు అనిపించదు పాఠకులకు. ఇక్కడ హిస్టరీ, ఫిక్షన్, రెండూ పోటీపడి, ఫిక్షన్ పైచేయి సాధిస్తుంది. ఈ చారిత్రిక సంఘటనలన్నీ పాయసంలో జీడిపలుకుల్లాగా కలిసిపోయి నవల రుచిని పెంచాయి.
ఉపసంహారం:
చరిత్రను కధలో ఇమిడ్చి, అత్యంత ఆసక్తికరంగా శ్రీమతి మాలతీ చందూర్ నవలను తీర్చిదిద్దారు. స్వాతంత్ర్యానంతరం పుట్టిన పాఠకుల్లో సైతం దేశభక్తిని, స్వాతంత్య సమరస్ఫూర్తిని రగిలించగలిగిన శక్తి ఈ నవలకుంది. స్వాతంత్య్ర సమరయోధులను నవలలోని పాత్రులతో మమేకం చేయడం సామాన్యమైన విషయం కాదు.
కేవలం స్వాతంత్ర్య పోరాటమే పరమావధి కాకుండా, సున్నితమైన మానవ సంబంధాలను చిత్రీకరించడం రచయిత్రి కృతకృత్యులైనారు. మానవుల ఇగోలు, స్వార్థాలు, నిస్వార్థాలు, సమానతలు, అసమానతలు, అవకాశవాదాలు, త్యాగాలు, రాజీపడడాలు, ఇవన్నీ కలిసి, అత్యంత సంక్లిష్టమైన మానవ స్వభావాన్ని, మానవ సమాజాన్ని Depict చేయడంలో శ్రీమతి మాలతీ చందూర్ చూపిన ప్రతిభ అనన్య సామాన్యం. కధా కథన చాతుర్యం కదం తొక్కిన ఈ నవల మాలతిగారి కీర్తి కిరీటంలో కలికితురాయి.
ఉపయుక్త గ్రంథసూచి:
- బాహ్మణీకం – చలం
- భగవద్గీత
- శంకర – ఆదిశంకర సంవాదం.
- ఉన్నవ లక్ష్మీనారాయణ – మాలపల్లి.
- మాలదాసరి కథ – ఆముక్తమాల్యద – శ్రీకృష్ణ దేవరాయలు
- సయ్యదయ్య శతకము – సయ్యద్ మహమ్మద్ ఆజం
- కృష్ణాతీరం నవల – మల్లాది రామకృష్ణశాస్త్రి
- హితోపదేశం
- ‘My Experiments with Truth’ – Mahatma Gandhi
- మహోపనిషత్తు (సామవేద సాంప్రదాయం)
- విశ్వంభర – డా. సి.నారాయణ రెడ్డి.
- Asia Monitor, Ramakrishna Simha, Oct 1, 2020
- Means and Ends’ – Gandhian Thought
- Creative Vs Critical Genius. Mathew Arnold (Study of Poetry)
- కావ్యాదర్శం
- Unto the Last – John Ruskin
- Hamlet – William Shakespeare
- హరిశ్చంద్ర నాటకం – బలిజీపల్లి లక్ష్మీకాంతకవి
- Carl Marx ; తరిమెల నాగిరెడ్డి
- సౌందరానందము – అశ్వఘోషుడు
- సంచిక.కామ్ – ఉగాది ప్రత్యేక సంచిక- సంపాదకీయం – కస్తూరి మురళీ కృష్ణ
- Essays (civil co Moral) – Francis Bacon
- స్నేహానికన్న మిన్న”(కథ) : శ్రీమతి ఉప్పులూరి మధుపత్ర శైలజ
- Public Funded Education; M.V. Gona Reddy, CEO, Prateek foundation, Member, World Teachers’ Federation (WTF)
- National Institutional Ranking Frame Work (NIRF) వారి నివేదిక
- స్మశానం దున్నేరు – డా. కేశవ రెడ్డి
- Ulysses – Alfred Lord Tennyson.
- నాయక లక్షణాలు – డా. జెట్టి యల్లమంద
(సమాప్తం)
శ్రీ పాణ్యం దత్తశర్మ 1957లో కర్నూలు జిల్లా వెల్దుర్తిలో పుట్టారు. తండ్రి శతావధాని శ్రీ ప్రాణ్యం లక్ష్మీనరసింహశాస్త్రి. తల్లి శ్రీమతి లక్ష్మీనరసమ్మ. టెంత్ వరకు వెల్దుర్తి హైస్కూలు. ఇంటర్, డిగ్రీ, ఎం.ఎ. (ఇంగ్లీషు), ఎం.ఎ. (సంస్కృతం), ఎంఫిల్, పిజిడిటియి (సీఫెల్), ప్రయివేటుగానే.
దత్తశర్మ ఇంటర్మీడియట్ విద్యాశాఖలో లెక్చరర్‌గా, ప్రిన్సిపాల్‌గా, రీడర్‌గా, ఉపకార్యదర్శిగా సేవలందించారు. కవి, రచయిత, విమర్శకులు, గాయకులు, కాలమిస్టుగా పేరు పొందారు. వీరివి ఇంతవరకు దాదాపు 50 కథలు వివిధ పత్రికలలో ప్రచురితమై వాటిలో కొన్ని బహుమతులు, పురస్కారాలు పొందాయి.
వీరు ‘చంపకాలోచనమ్’ అనే ఖండకావ్యాన్ని, ‘Garland of poems’ అన్న ఆంగ్ల కవితా సంకలనాన్ని, ‘దత్త కథాలహరి’ అన్న కథా సంపుటాన్ని ప్రచురించారు. వీరి నవల ‘సాఫల్యం’ సంచిక అంతర్జాల పత్రికలో 54 వారాలు సీరియల్‌గా ప్రచురితమై, పుస్తక రూపంలో ప్రచురింపబడి అశేష పాఠకాదరణ పొందింది. 584 పేజీల బృహన్నవల ఇది. ‘అడవి తల్లి ఒడిలో’ అనే పిల్లల సైంటిఫిక్ ఫిక్షన్ నవల సంచిక డాట్ కామ్‌లో సీరియల్‌గా ప్రచురించబడింది.
వీరికి ఎ.జి రంజని సంస్థ కవి సామ్రాట్ విశ్వనాథ పురస్కారాన్ని, ‘తెలంగాణ పాయిటిక్ ఫోరమ్’ వారు వీరికి ‘Poet of Profundity’ అన్న బిరుదును, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంవారు వీరి సిద్ధాంత గ్రంథానికి అవార్డును, సి.పి. బ్రౌన్ సమితి, బెంగుళూరు వారు వీరికి ‘NTR స్మారక శతకరత్న’ అవార్డును బహూకరించారు.
ఇద్దరు పిల్లలు. ప్రహ్లాద్, ప్రణవి. కోడలు ప్రత్యూష, అల్లుడు ఆశిష్. అర్ధాంగి హిరణ్మయి. సాహితీ వ్యాసంగంలో రచయితకు వెన్నుదన్నుగా ఉన్న గురుతుల్యులు, ప్రముఖ రచయిత వాణిశ్రీ గారు. వీరు – తమ సోదరి అవధానం లక్ష్మీదేవమ్మ గారు, మేనమామ శ్రీ కె. సీతారామశాస్త్రి గార్లకు ఋణగ్రస్థులు.