Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

శతసహస్ర నరనారీ హృదయనేత్రి, భరత ధాత్రి!-14

[శ్రీమతి మాలతీ చందూర్ గారి ‘హృదయనేత్రి’ నవలపై శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన సిద్ధాంత గ్రంథాన్ని ధారావాహికగా అందిస్తున్నాము.]

వర్గాంతర్గత శత్రువులు

ఆమె లోని outspokenness కు, straightforwardness కు మరో ఉదాహరణ, ‘హృదయనేత్రి’ నవలలో అగ్రకులాలపైన, దళితులపైన, సమానంగా, నిష్పక్షపాతంగా ఆమె చేసిన విమర్శ. దళితుల్లో నందయ్యను. బ్రాహ్మణుల్లో బుచ్చిని, టార్గెట్ చేసిందామె. ఎదిగిం తర్వాత తెప్ప తగలవేసే రకాలు వీళ్ళు! నందయ్య తన కులం వారిపట్ల చూపే న్యూనతా భావమే ఇందుకు తార్కాణం. వారిని ‘దూరం పెట్టకపోతే’ నెత్తికెక్తి తొక్కుతారంటాడు!

శత్రువులు వీరే వాళ్లల్లోనే కాదు, మన వాళ్లల్లోనూ ఉంటారు. దీనిని అత్యంత ప్రభావవంతంగా చిత్రీకరించారు, డా॥ కేశవరెడ్డి, తమ నవల ‘స్మశానం దున్నేరు’ లో. ఒక ఊరిలో హారిజనులుంటారు. మాలవాళ్లు. వారిలో అత్యధిక సంఖ్యాకులు పోకనాటోళ్లు. వారిలోనే ‘రంపాల’ వాళ్లని ఉంటారు. వారు చాలా తక్కువ స్థాయి వారు. అందరూ ‘హరిజనులే’ అని గాంధీ గారు చెప్పినా, వారిలో వారికి విభేదాలు పోలేదన్న సత్యాన్ని కేశవరెడ్డి ఆవిష్కరించారు.

పోకనాటోళ్లలోని ఒక కుంటివాడు ఇలా అంటాడు.

“జాతుల్లో కెల్ల కనాకష్టమైంది రంపాల జాతి. అట్టా రంపాలోనితో తలకొరివి పెట్టించుకున్నాడు. నరకంలో పడిచస్తాడు.” (స్మశానం దున్నేరు, – డా. కేశవరెడ్ది – పుట 46).

పెదరెడ్డి గారి స్మశానాన్ని చదును చేస్తుంటారు 31 మంది మాలలు. అది పోరంబోకు. మాలలకు అదే స్మశానం. కానీ పెదరెడ్డి దాన్ని సాగు చేయాలని సంకల్పిస్తాడు. అతన్ని అడిగే వారెవరు?

మాలలు 31 మందిలో 30 మంది పోకనాటి జాతికి చెందినవారు. ఒక్కడు మాత్రం రంపాల జాతివాడు. అతని పేరు వీరభద్రుడు. వారు స్మశానం తవ్వుతుండగా ఒక కుండ బయటపడుతుంది. దానిలో 92 బంగారు కాసులుంటాయి. పెదరెడ్డికి తెలియకుండా వాటిని పంచుకుందామనుకుంటారు. తలా 3 తీసుకోకుండా 31వ వానికి రెండే వస్తాయి. ఆ రెండు ఎవరికి? ఎవరు తీసుకోవాలి? అన్న దానిపై వాదోపవాదాలు పెరిగి, వారిలో తక్కువ జాతివాడైన రంపాలోన్ని, అంటే వీరభద్రున్ని, తీసుకోమంటారు. అతడు ఒప్పుకోడు. అసలు కుండను చూసింది అతడే. దాంట్లో కాపుగా ‘మిత్తవ’ ఉంటుంది. దానికి రక్త తర్పణం చేస్తేగాని కుండను ముట్టుకోనివ్వదు. వీరభద్రుడే కలబంద ముల్లుతో కాలి బొటన వేలిని గుచ్చుకొని రక్తాన్ని ‘దుత్త’ మీద ధారపోస్తాడు. అయినా వారికి లెక్కలేదు. రెండు కాసులు తీసుకోలేకపోతే అది కూడా ఇవ్వమంటారు. అతడు ఎదురు తిరిగితే అందరూ కలిసి అతడిపై దాడిచేసి కుళ్లబొడిచి, ఒక చెట్టు కింద పడేస్తారు.

హింసకు, దోపిడీకి ఒక వర్గం మాత్రమే పరిమితం కాదని, అన్నివర్గాల్లో, తక్కువ స్థాయి వారిని పీడించడం, దోచుకోవడం ఉంటుందని కేశవరెడ్డి నిరూపించారు. యన్.సి. యస్.టి. వర్గీకరణ పేరుతో వారిని విభజించి పాలించాలని ప్రభుత్వాలు ప్రయత్నిస్తుంటాయి. దళితుడు అనేవాడు అన్ని వర్గాల్లో, కులాల్లో ఉంటారు.

నందయ్య ఎదిగిపోయింతర్వాత తన స్వంత దళితులనే ఎంత హీనంగా చూశాడో మాలతి గారు చెప్పారు. మంత్రి అయినా అతనికి కులవివక్ష రూపంలో అవమానాలు ఎదురవుతుంటాయి. దానికి ప్రతీకారం, తన వర్గంలోని తక్కువ స్థాయి వారి మీద చూపిస్తుంటాడు. అతనే గోపాల రావుతో ఇలా అంటాడు –

“ఈసారి నేను తెలివి మీరాను. క్రిందవాళ్లు కిందా, పైవాళ్లు పైనా ఉంటం మంచిది అనే ఆర్థిక న్యాయం తెలుసుకున్నాను” (పుట 116)

ఎంత పచ్చి అవకాశవాదం! పైగా అది ఆర్థిక న్యాయమట. కూతురు పెళ్లి మద్రాసులో చెయ్యడు. ఇక్కడ పెళ్లి పెట్టుకుంటే.. “మా ‘గుంపు’ని తట్టుకోలేను!” అంటాడు

బ్రాహ్మల్లో కూడా శాఖా భేదాలున్నాయి. మధ్వలు, సాతాసి జియ్యరులు, కరణాలను బ్రాహ్మలుగా వైదీకులు నియోగులు స్వీకరించరు. తద్దినాల్లో భోక్తలుగా వారు వీరికి పనికిరారు. వివాహలు పనికిరావు. ఇక శైవ, వైష్ణవ తేడాలు సరేసరి. వైష్ణవ పీఠాధిపతులు కొందరు శివుడిని ఎగతాళి చేసి మాట్లాడుకుంటారు. ‘దశావతారం’ సినిమాలో ఈ విభేదాలు ఆ కాలంలో ఎంత తీవ్రంగా ఉండేవో చక్కగా చూపించారు. మన నవలలో సుబ్బమ్మగారు అలాంటిదే. ఆడపడుచు రామలక్ష్మమ్మ అంటే ఆమెకు పడదు. కారణం వారింట్లో అనాచారం పాటిస్తారు. ఆమెకు నందయ్య అంటే ఇష్టం. గొప్ప! ఇక బుచ్చి సరేసరి. పాలకుల ప్రాపు కోసం ఎంతకైనా తెగిస్తాడు. రోడ్డు వార – అరుగులపై కస్టమర్ల కోసం ఎదురు చూసే ఆ క్లాస్ బాహ్మలంటే, పెద్ద పురోహితులకు చులకన! ఇంచుమించు ‘లేబర్ అడ్డా’ లాగా బ్రాహ్మలకు కొన్ని చోట్లు ఉంటాయి!

అలాంటి సమాజంలో గోపాల రావు వంటి అత్యుత్తమ వ్యక్తిని నాయకుడిగా చేసి నవల రాయడం ద్వారా మాలతిగారు తమ విశాల దృక్పథాన్ని చూపారు. తన, పర అన్న తేడాలకు అతీతుడుగా ఉన్నవాడే మనీషి. ఆ మిగతా అందరూ ఒట్టి మనుషులే.

***

స్వరాజ్యం అరెస్టు – గోపాల రావు వ్యక్తిత్యంలో తొలి రాజీ – బుచ్చిని బ్లాక్‌మెయిల్ చేయడం – స్వరాజ్యం విడుదల

ఎం.ఎ. (ఎకనమిక్స్) సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు ప్రెసిడెన్సీ కాలేజీలో జరిగిన సంఘటన గోపాలరావు వ్యక్తిత్వంలోని మరో కోణాన్ని ఆవిష రిస్తుంది. అదే సమయంలో స్వరాజ్యం యొక్క ‘ఎక్కడ అన్యాయం జరిగినా భరించలేని’ స్వభావాన్ని కూడా చూపిస్తుంది. ఆమె ఫ్రెండ్ శ్యామలకు రెండు పేపర్లలో బి, సి గ్రేడ్లు వస్తాయి. ప్రొఫెసర్, రిజిస్ట్రార్, వి.సి, ఇలా అధికార క్రమానుగతశ్రేణి (official hierarchy) యథాప్రకారం బాధ్యతను అవతలివారిపై నెట్టుతూ పోయింది. రీ-వాల్యుయేషన్ కోసం విద్యార్థులు క్లాసులు బాయ్‌కాట్ చేసి, “ఇది అన్యాయం అక్రమం” అని నినాదాలు చేయడం ప్రారంభించారు. కానీ శాంతియుతంగానే! ఎటువంటి హింసాకాండకు దిగలేదు.

‘అసలే కోతి, ఆపై కల్లు తాగింది’ అన్నట్లు, ఎమర్జెన్సీలో విశేషాధికారాలతో కైపెక్కి ఉన్న పోలీసులు వచ్చి, ఆరుమంది విద్యార్థులను, తిరుగుబాటు చేస్తున్నారని, జీప్‌లో ఎక్కించి పట్టుకుపోయారు. గోపాల రావుకు విషయం ‘ఎవరో’ చెప్పారు. చెప్పిన వాడు అతని శ్రేయోభిలాషి. ఐనా పేరు చెప్పటానికి కూడా భయపడ్డాడు. గోపాల రావు కుప్పకూలిపోయాడు. ఎడిటర్, మేనేజర్ అతన్ని కాలేజీకి తీసుకొని వెళ్లారు. అక్కడి పరిస్థితిని మాలతమ్మ ఇలా వర్ణించారు.

“ఇది ఎమర్జెన్సీ సమయం. పోలీసుల చేతుల్లో సర్వాధికారాలు ఉన్నాయి. ఒక మనిషిని ఎందుకు నిర్బంధంలోకి తీసుకొన్నారు? ఎన్నాళ్లు ఉంచుతారు? న్యాయవిచారణ జరుపుతారా? ఈ ప్రశ్నలకు జవాబు ఇవ్వక్కరలేని వ్యవస్థలో ఉన్న తాము ఎమ్.ఎ చదివే ఒక ఆడపిల్లను రక్షించగలమా?”

ప్రజాస్వామ్యం కాస్తా నియంతృత్వంగా మారితే ఉత్పన్నమయ్యే ప్రశ్నలివి.

“ఆరుగురు స్టూడెంట్స్‌ని దేశ విద్రోహక చర్య కింద కస్టడీ లోకి తీసుకుని ప్రస్తుతానికి రిమాండ్ ఉంచారు.”

ఇంతకూవారు దేశానికి చేసిన విద్రోహం ఏమిటి?

గ్రేడ్స్ తక్కువ వచ్చిన పేపర్లను ‘రీ-వెరిఫికేషన్’ చేయమని అడగటం! ఎమర్జెన్సీలో ‘రామా’ అన్నా బూతు గానీ వినబడేది ప్రభుత్వానికి. పోలీసులు పెట్టే కేసులన్నీ ఇలాంటివే. ప్రభుత్వం పోలీసుల ద్వారా ప్రజలపై తీర్చుకుంటున్న ‘అక్కసు’ ఇది!

పోలీసు అధికారి “ఎమర్జెన్సీ అని తెలిసీ అలా ప్రవర్తిస్తే ఎలా?” అని అడుగుతాడు. సూడెంట్స్ కాబట్టి అంతటితో ఆగారు. మామూలు వాళ్లయితే ఎలా చితగ్గొడతారో గోపాల రావు ఎడిటర్‌కు బాగా తెలుసు. స్వరాజ్యాన్ని చూడడానికి కష్టం మీద అనుమతి దొరుకుతుంది – ధైర్యం చెప్పి వచ్చేశారు.

ఎడిటర్ లౌక్యుడు. “ఇప్పుడు న్యాయం, రూల్స్ అని వాదిస్తే ప్రయోజనం ఉండదు. ఎవరైనా పెద్దవాళ్లను పట్టుకొని ఈ పిల్లల్ని తప్పించాలి. వీళ్లని నక్సలైట్లుగా ముద్ర వేసి అతీగతీ లేకుండా చేసినా చేస్తారు” అని గోపాల రావుకు హితబోధ చేశాడాయన. గోపాల రావుకు స్పృహ తప్పినంత పనవుతుంది. సేద దీరుస్తారు. ‘దొడ్డిదారిన’ పరపతి ఉపయోగించాలంటాడు

ఆయన. బుచ్చి అప్పుడు ఎం.పి. ‘అమ్మగారి ఇన్నర్ సర్కిల్స్ వార’ని బుచ్చికి పేరుంది. అతన్ని రంగంలోకి దింపమని చెప్పి, గోపాల రావును ఇంటి దగ్గర దింపుడాయన. ఆయన నిస్సహాయుడు! పార్వతి విషయం విని తల్లడిల్లుతుంది. అటువంటి పరిస్థితిలో కూడా భర్తను సాధిస్తుందామె. ఆమెకో అవకాశం దొరికినట్లయింది. Crisis వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించటం కంటే, ముందు దానికి ఎవర్ని బాధ్యులను చేసి నింద వేయాలా? అని చూస్తారు కొందరు. పార్వతి ఆ కోవకు చెందిందే. భర్తను నిలదిసే అవకాశం ఆమె వదులుకోదు. ‘శివంగి’ లాగా అతనిపైకి దూకింది. హిస్టీరికల్‍గా ఇలా కేకలు వేస్తూ, అతడే దీనికంతటికీ కారణం అని తేల్చింది.

“మీ వల్లే వచ్చింది. దానికి ఈ బద్ధులు మీ వల్లే వచ్చాయి. పుట్టినప్పటి నుంచి న్యాయం, నీతి అంటూ నూరిపోసి.. గడేకారి గుంజలా తయారు చేశారు. మీరు జైలు కెళ్లింది గాక, ఆ పిల్లదాన్ని కూడా పంపారు . మీ కళ్ళు చల్లబడ్డాయా? ఇప్పడు తృప్తిగా ఉందా?” (పుట 181).

ఎడిటర్ గారు పార్వతిని సముదాయిస్తారు. జైలుకెళ్లి వచ్చినదాన్ని పెళ్లెవరు చేసుకుంటారని ఆమె బాధ! మీ మరిది గారు తల్చుకుంటే పిల్లని రేపీపాటికి విడిపించెయ్యగలరని ఆమెకు తత్త్వబోధ చేశాడాయన.

ఇద్దర్నీ బుచ్చి బంగళా ముందు దింపి వెళ్లిపోతాడు. న్యాయం, ధర్మం కోసం నిలబడి వారు అరెస్టు అయితే, రక్షించడానికి అన్యాయం, అధర్మం కోసం నిలబడిన వారు కావలసి రావడం ఎంత విచిత్రం! ఎంత ఘోరం: దీన్నే ‘ప్యారడాక్స్’ (Paradox) అంటారు. ఘోషయాత్రలో సుయోధనుడిని, గంధర్వులు బంధిస్తే, ఆగర్భ శత్రువులైన పాండవులు విడిపించాల్సి రావడం ఇలాంటిదే. కాని ఇక్కడ దృశ్యం తారుమారు అయింది. ధర్మాన్ని, అధర్మం విడిపించాల్సి వచ్చింది!

బుచ్చి ఇంట్లోనే ఉన్నాడు. వాళ్లను చూసి కూడా లేవలేదు. పార్వతి మరిదిని దీనంగా బ్రతిమిలాడుతుంది, తన మనవరాలిని విడిపించమని. యథాప్రకారం అతడు స్వరాజ్యం ‘నోటి దురుసు’ను, ‘ఎవ్వరినీ లెక్కచేయనితనాన్ని’ విమర్శించాడు.

పార్వతి గోపాల రావును విమర్శించడానికీ, బుచ్చి స్వరాజ్యన్ని విమర్శించడానికీ పెద్ద తేడా లేదు. “తన కాలేజీ కాదు, తన మార్కులు కావు, పెద్ద ఝాన్సీరాణి ననుకుంది! దాన్ని ఎవడెళ్లమన్నాడు?” ఇదీ సొంత చిన తాతయ్య వరుస ! అవకాశం దొరికింది అతగాడికి, అన్నను దెప్పటానికి.

“మేమేదో చెడిపోయినట్లు, నువ్వు, తనూ పెద్ద సంస్కర్తలన్నట్లు దాని పోజులూ అదీనూ” (పుట 182)

బుచ్చి తనలో అన్న పట్ల పేరుకుపోయిన కచ్చనంతా మాటలతో తీర్చుకుంటున్నాడు. పైగా తన చేతుల్లో ఏమీ లేదని చేతులెత్తేశాడు. తన కూతురయితే కాళ్లు విరిచి యింట్లో కూర్చోబెట్టి పెళ్లి చేసేవాడినన్నాడు. దానికి పెళ్లి ఇక కాదు, అది చెడిపోయిన పిల్ల కింద లెక్కన్నాడు. రాజసూయ యాగంలో శిశుపాలుడు శ్రీకృష్ణుడిని ఎలా నిందించాడో. అలా నానామాటలూ అన్నాడు దుర్మార్గుడు. గోపాల రావు అంతవరకు సహించాడు. బ్రతిమిలాడి లాభం లేదని గ్రహించాడు. పార్వతిని బయటకి వెళ్లమని అరిచాడు. అతని కంఠంలోని తీవ్రతను చూసి వారు భయపడ్డారు. తమ్ముడితో ఇలా చెప్పాడు –

“బుచ్చీ. నీకు స్వరాజ్యం మీద ఇంత ద్వేషం ఉందని ఇప్పుడే గుర్తించాను. నువ్వు తల్చుకుంటే నీ అధికారం ఉపయోగించి స్వరాజ్యన్ని విడిపించగలవు. నువ్వు తలుచుకోనపుడు నేను చెయ్యబోయేది చెప్పి, మరీ ఇక్కడి నుంచి కదలదలుచుకున్నాను.

‘అమ్మ నగలు ఏమయ్యాయి? ఆమెను ఎవరు చంపారు?’ ఇవి ఇన్నాళ్లూ నేను తిరగతోడ దల్చుకోలేదు. ఇప్పుడు తిరగదోడబోతున్నాను.

ఢిల్లీలో నీకు ఎంత ఇన్‍ఫ్లుయెన్స్ ఉందో ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారో నాకు తెలుసు. అయితే అంతమంది విరోధులూ ఉంటారని మర్చిపోకు.

జైలు నాకు కొత్త కాదురా! ఎమర్జెన్సీ పేరున నీ పలుకుబడితో నన్ను జైల్లో తోయించు, పరవాలేదు. స్వరాజ్యానికి గూడ జైల్లో గడపగల మానసిక శక్తి ఉంది.

స్వరాజ్యన్ని రేపు మధ్యాహ్నం లోపల విడుదల చేయించావా.. సరే! లేకపోతే..”

ఓ గాలి దుమారంలా బయటికి వచ్చేశాడు గోపాలరావు.

దండం దశగుణం భవేత్! అఫెన్స్ డిఫెన్స్ కంటే గొప్పది! గోపాల రావు ధర్మాగ్రహం! బుచ్చికి గుణపాఠం; వెరసి స్వరాజ్యం కథ సుఖాంతం

గోపాలరావుకు అంత కోపం రావడం ఎప్పుడూ జరుగలేదు. ‘అలుగుటయే ఎరుంగని అజాతశత్రుడే అలిగిన నాడు’ ఏం జరగాలో అదే జరిగింది. బుచ్చి భయపడ్డాడు. మర్నాడు పదకొండు గంటలకు స్వరాజ్యాన్ని కారులో తీసుకొచ్చి దిగవిడిచి వెళ్లిపోయాడు.

ఇక్కడ గోపాల రావు సహజమైన తన వ్యక్తిత్వానికి విరుద్ధంగా ప్రవర్తించాడు. కానీ, మనవరాలి కోసం అది తప్పలేదు. ‘ప్రాణవిత్తమాన భంగమందు బొంక వచ్చునధిప’ అన్నట్లు ప్రతిదానికి కొన్ని మినహాయింపులుంటాయి. స్వరాజ్యాన్ని విడిపించటానికి అంతకంటే మరో ప్రత్యామ్నాయం లేదు. అవతలివాడు నయాన చెచితీ వినే రకం కాదు. వాడి వైపున్న వీక్ పాయింట్స్ పై దెబ్బకొట్టాలి. వీక్ పాయింట్స్ రెండు. ఒకటి తల్లి హత్య, నగల అపహరణ; రెండు అతని విరోధులు.

ఎమోషన్స్ అనేవి ఏ కోశానా లేని దుర్మార్గుడు బుచ్చి. ఆ సిచ్యుయేషన్‌ను ‘ఎంజాయ్’ చేశాడు. తన క్రిందికీ నీళ్లు వస్తాయని బెదిరిస్తే గాని, కదలలేదు. అలా తమ్ముడి మీద అఫెన్స్‌ను ప్రయోగించాడు. అది డిఫిన్స్ కంటే శక్తివంతమైనది.

ఇక్కడ మాలతమ్మ అంటారు –

“గోపాల రావుకు పాము, ముని కథ జ్ఞాపకం వచ్చింది.”

పార్వతి మనవరాలిని గుండెలకు హత్తుకుంది. వాళ్లకున్న ఏకైక ఆశాకిరణం ఆ మనుమరాలే! ఆ దుఃఖం నుంచి తేరుకున్నాక తన టిపికల్ కేకలు వేసింది. దానికి కారణం స్వరాజ్యం, జైలులో గడపడాన్ని క్యాజువాల్ గా తీసుకొని,

“జైల్లో ఉంచినా మాకు పొద్దుటే కాఫీ తెచ్చిపెట్టారు” అంటుంది.

బుచ్చికి కృతఙ్ఞతలు చెబుదామంటుంది పార్వతి. అన్నాదమ్ముల మధ్య ఆ రోజు జరిగింది ఆమెకు తెలియదు. ఊరు విడిచి వెళ్లిపోదామంటుంది. ఎమర్జెన్సీ దేశమంతా ఉందంటాడు. పైగా,

“మన పరిధిలో మనం ఉండి, ఎవరి జోలికి వెళ్లకపోతే ఏ గొడవలూ రావు” అంటాడు.

ఆ సూచన తనకేనా అని అడుగుతుంది మనవరాలు అప్పుడు.

“ఈ ముసలి వాళ్లమిద్దరం నీ మీద ప్రాణాలు పెట్టుకుని బ్రతుకుతున్నాం. నువ్వు న్యాయ రక్షణలో కంకణం కట్టుకు మమ్మల్ని క్లోభ పెట్టకు” అంటాడు. స్వరాజ్యం ఆశ్చర్యపోతుంది. మనం కూడా ఆశ్చర్యపోతాము. ఇది అతని స్వభావానికి విరుద్ధం. అన్యాయంతో రాజీపడేవాడు కాదతడు. కాని పేగు బంధానికి లొంగిపోయాడు. మనవరాలికేమయినా అయితే భార్య దక్కదని అతనికి తెలుసు. పోరాడి, పోరాడి అలసిపోయాడు. అందుకే ‘స్వభావోదురతిక్రమః’ అన్న సూక్తి అతని పట్ల అతిక్రమించబడింది!

ప్రస్తుత సమాజాన్ని అడవితో పోల్చారు రచయిత్రి. అడవిలో ఉన్నపుడు వేటగాడి బాణం నుంచి న్యాయం ఆశించడం తెలివితక్కువతనం అవుతుందని చెప్పించారు.

స్వరాజ్యంను కాలేజీలో తిరిగి చేర్చుకోలేదు. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తానంటుంది. పెళ్లి చేసుకోనంటుంది. చేసుకున్నా కట్నం ఇవ్వకూడదంటుంది.

ఎమర్జెన్సీ వెర్రితలలు వేయసాగింది. స్నేహలతా రెడ్డి, పట్టాభి దంపతులు లాంటి మానవహక్కుల ఉద్యమకారులు చిత్రహింసలకు లోనై, మరణించారు. అయినా స్వరాజ్యానికి ఇందిరమ్మ మీద కోపం రాదు! వ్యక్తి ఆరాధన అన్నది ఎంతదూరమైనా వెళుతుంది. జె.పి గారిని విడుదల చేస్తారని స్వరాజ్యం నమ్మకం – ఈ విపరీత ధోరణి గోపాలరావుకు ఆశ్చర్యం కలిగిస్తుంది. తనకు అపకారం జరిగినా ద్వేషించనంత మానసిక పరిపక్వతా ఇది? కేవలం గుడ్డి ఆరాధనా?

“దాన్ని అవకాశంగా తీసుకుని ఎమ్సర్జెన్సీని ప్రజలపై రుద్ది అధికారంలో ఉండగలగటం ఒక్క ఈ దేశంలోనే సాధ్యం.”

దీన్ని ప్రజాస్వామిక నియంతృత్వం అనాలా లేక నియంతృత్వ ప్రజాస్వామ్యం అనాలా?

(సశేషం)

Exit mobile version