Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

శతసహస్ర నరనారీ హృదయనేత్రి, భరత ధాత్రి!-11

[శ్రీమతి మాలతీ చందూర్ గారి ‘హృదయనేత్రి’ నవలపై శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన సిద్ధాంత గ్రంథాన్ని ధారావాహికగా అందిస్తున్నాము.]

ఆ కాలంలోనే వ్యాపారాత్మకమైన కార్పొరేట్ విద్య:

ప్రయాణికుడు ‘కడుపు కట్టుకుని’ తన ఇద్దరు మగపిల్లల్నీ కొడైకెనాల్‌లో చేర్చాడు; ఇంగ్లీష్ మీడియం, రెసిడెన్షియల్ స్కూల్లో!

అక్కడున్నన్నాళ్లూ బాగుంటారట. సెలవులకొస్తే బలాదూరు తిరుగుతారట. సిగరెట్లు కూడా కాలుస్తారట. వారికి కంప్లెయింట్ చేస్తే వారు నింద తమ మీదే వేశారట. ఈనాడూ అది జరుగుతూంది. మన పిల్లల గురించి మనం వారికి ఫిర్యాదు చేస్తే, వారు బాధ్యత తీసుకోరు. మనదే తప్పంటారు! ఇక్కడ డా॥ సర్పేపల్లి రాధాకృష్ణన్ గారన్న మాటలు గుర్తుకు వస్తాయి.

“A teacher who blames his student is unfit for his job!”

విద్యార్థిని నిందించే ఉపాధ్యాయుడు ఆ పదవికి అనర్హుడు!

అదే స్కూల్లో చదివే వాళ్ల బంధువులబ్బాయి మత్తుమాత్రల కలవాటుపడ్డాడట. వాడిని డిస్‌మిస్ చేసి పంపారు. మత్తుమాత్రలు ఎందుకో తీసుకుంటారో తెలిస్తే మనం నిర్ఘాంతపోతాము.

రాత్రిళ్ళు వసారాల్లో దీపం వెయ్యరట. చీకట్లో బాత్ రూమ్‌కు వెళ్ళడానికి భయంవేసి, ఆ అవసరం రాకుండా మత్తుమాత్రలు వేసుకొని పడుకుంటారట.

స్కూలు యూనిఫాం, తళతళ మెరిసే బూట్లు, ప్రేయర్, ఇవే వాళ్లకి ముఖ్యం.

“పైకి కనిపించే క్రమశిక్షణ గురించి జాగ్రత్త పడతారు. పిల్లవాడి మనసు గురించి ఆలోచించరు” అంటాడా ప్రయాణీకుడు (పుట 141).

స్టేటస్ కోసం చదివిస్తున్నామని ఆయన ‘confess’ చేస్తాడు. మానిపించడానికి వాళ్లావిడ అస్సలు ఒప్పుకోదట. ఆస్తి ఆమె పుట్టింటి వారిది. అందుకని ఈయన మాటకు విలువ లేదు!

గోపాలరావు, తన భార్య కూడా తన మాట వినదని అనుకుంటాడు. ఆమె కూడా స్వరాజ్యాన్ని కాన్వెంటులో చేర్చాలని గోల చేసింది.

గోపాల రావు వాదన ఇది.

“కాన్వెంటుకు పంపడంలో తప్పుందని నేను అనను. అది ఒక స్టేటస్ సింబల్ అయితే మటుకు విచారించాల్సి వస్తుంది. ఏ విద్యా విధానం సరిగ్గా లేదని అన్నామో, ఆ విద్యనే మన వాళ్లు తిరిగి కోరుకుంటున్నారు.”

చదువులు ఉదోగానికి తప్ప వ్యక్తి వికాసానికి కాదు. విద్య వైద్యం ఈ రెండు రంగాలూ ప్రభుత్వమే నిర్వహించాలని గాంధీజీ చెప్పారు. దురదృష్టవశాత్తు అవి నేడు పేదలకు, దిగువ మధ్యతరగతి వారికి అందని మానిపళ్లలా అయిపోయాయి.

‘Public funded Education’ అన్నది గొప్ప సిద్ధాంతం నేను 1983 లో లెక్చరర్‌గా చేరినపుడు అది ఉచ్చస్థితిలో ఉండేది. ప్రైవేటు విద్య ఇంచుమించు ఇంటర్మీడియట్‌లో లేదు. ఎంతవారయినా సరే గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చేరాల్సిందే. పలాసలో, మా కాలేజీలో MPC, BPC లలో సీటు రావాలంటే టెంత్‌లో కనీసం 480 మార్కులు దాటి రావాలి.

శ్రీకాకుళు ఎం.పి. అప్పయ్యదొర గారి పిల్లలు కూడా మా కాలేజీలోనే చదివారు. నేను సోంపేటలో పనిచేసినపుడు గౌతు లచ్చన్నగారి మనుమడు (గౌతు శ్యామసుందర శివాజీ, సోంపేట, అప్పటి ఎం.ఎల్.ఎ. గారి కుమారుడు), నా శిష్యుడే. వాడు క్లాసులో అల్లరి చేస్తూంటే నాలుగు దెబ్బలు వేశానొకసారి. శివాజీగారు అది తెలిసి, నన్ను పిలిచి, “మా వాడిని ఒక దారిలో పెట్టండి మాస్టారు!” అని అడిగారు. అప్పటి చదువులు అలా ఉండేవి!

ఈ మధ్య ‘సర్’ అనే సినిమా చూశాను. ధనుష్ సినిమా. Public funded Education యొక్క అవసరాన్ని చక్కగా చూపించారు. కమర్షియల్ ఎలిమెంట్స్ కొన్ని వున్నా, సినిమా Central idea మాత్రం చాలా బాగుంది.

ఈ రోజూ పేపర్లో కార్పొరేట్ రెసిడెన్షియల్ కాలేజీల్లో చదివే పిల్లలు, రూములలో ఉరిపోసుకొని, బిల్డింగ్ మీది నుంచి దూకి, తమ చావుకు ప్రిన్సిపాల్, లెక్చరర్ల వేధి౦పులే కారణమని సూయిసైడ్ నోట్ రాసి మరీ చచ్చిపోతున్నారు. అయినా తల్లిదండ్రుల ఆలోచనా విధానం మారటం లేదు. పిల్లలను అంత ఒత్తిడికి గురిచేయడం అవసరమా?

ఇక విదేశాల్లో చదవడమనేది పెద్ద క్రేజ్‌గా మారింది. ఈ విషయాలన్నీ శ్రీమతి మాలతీ చందూర్ తన రచనలో స్పృశించారు. సామాజిక ప్రయోజనం లేని రచనలు వ్యర్థం. ఇలాంటి చర్చల ద్వారా ఆమె ‘హృదయనేత్రి’ నవలలో ‘Poetic purpose’ ను సాధించారు.

గోపాలరావు ఆ ప్రయాణీకుడితో ఇలా అంటాడు –

“ఫారిన్ వెళ్ళాలన్న పిచ్చి, మన దేశానికి పట్టుకొన్న పెద్ద జబ్బు” (పుట 143).

“స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మభయావహః” అన్నాడు పరమాత్మ. శతాంధాః కూపం ప్రవిశన్తి”. వందమంది గుడ్డివాళ్ళు ఒకరి వెంట ఒకరు వెళ్లి నూతిలో పడినట్లుంది ఈ క్రేజ్. వాళ్లకంటే కళ్ళు కనబడవు, మరి వీళ్ళకేం?

వేదిక మీద ఉపన్యాసాలు దంచే పెద్ద కమ్యూనిస్టు నాయకులు సైతం, తమ పిల్లల్ని విదేశాలతో చదివిస్తున్నారంటాడా ప్రయాణీకుడు. దిగిపోతూ, గోపాలరావుతో ఇలా అంటాడు.

“శలవు తీసుకుంటానండి! మీలాంటి పెద్దలతో మాట్లాడుతున్నపుడు.. మేము ఏమి పోగొట్టుకున్నామో అర్థం అవుతూ ఉంటుంది.” (పుట 143).

అప్పుడు మళ్లీ గోపాలరావు మానసిక సుషుప్తి లోకి జారిపోతాడు.

‘తను పెద్దవాడా? దేనిలో? వయసులోనా? అనుభవంలోనా? తన అనుభవాలు ఎవరికి ఉపయోగపడతాయ్? తన ఆదర్శాలు ఎవరికి కావాలి? ఎవరికీ అక్కరలేదు! ఆఖరికి తన భార్యకు కూడా అక్కరలేదు!’

ఈ నిరాశానిస్పృహల వెనుక self-examination (ఆత్మపరిశీలన) ఉంది. ‘తన కొలది తాను ఎఱింగెడు’ జ్ఞానముంది. కాని నిస్సహాయ స్థితి లేదు. కాని తన ఆదర్శాలు ఎవరికి కావాలన్న ప్రశ్నమాత్రం నిలబడదు. పక్కనే ఉన్న ఎనిమిదేళ్ల మనుమరాలు, రాబోయే కాలంలో వాటిని పుణికి పుచ్చుకోబోతున్న విషయం అతనికి అప్పుడు తెలియదు. అతని భావజాలానికి వారసురాలు స్వరాజ్యలక్ష్మి!

చీరాల: జానకమ్మగారు, ముసలయ్య – పాతజ్ఞాపకాలు, కొత్త పరిణామాలు:

చీరాల స్టేషన్ బయట, గోపాలరావుకు చిరపరిచితుడైన రిక్షావాడు, ‘ముసలయ్య’ కనిపించాడు. ఆప్యాయంగా పలకరించాడు. ‘ముసలయ్య’ అనేది పేరు మాత్రమే, అతడు వృద్ధుడు కాదు. ‘ముసలయ్య, ముసలమ్మ’ అన్న పేర్లు కొన్ని ప్రాంతాల్లో పెట్టుకుంటారు. ప్రముఖ విద్యావేత్త, ఆంధ్ర విశ్వవిద్యాలయం తొలి వైస్ ఛాన్సలర్ శ్రీ కట్టమంచి రామలింగారెడ్డి వ్రాసిన ‘ముసలమ్మ మరణము’ అన్న కావ్యం లోని ‘ముసలమ్మ’ కూడా ఒక యువతి.

ముసలయ్యకు గోపాలరావంటే ఎందుకంత అభిమానమంటే అతన్ని అందరిలాగా ఒరేయ్, ఏరోయ్ అని పిలవకుండా గౌరవంగా చూసేవాడు. అది అతని సంస్కారం. మనిషిని మనిషిలా గౌరవించకుండా, పదవిని బట్టి, హొదాని బట్టి, సంపదను బట్టి గౌరవించడం అతనికి తెలియదు. ‘సర్వత్ర సమదర్శినః’ అన్న, equanimity ని ప్రవచించే మన ఆర్షధర్మానికి అది విరుద్ధం.

చాలా సంవత్సరాల క్రిందటి సంగతి. సందర్భం కాకున్నా, సందర్భానికి కొంచెం ఊతమిస్తుందనిపించి ప్రస్తావిస్తున్నాను. ఆర్. నారాయణమూర్తి నిర్మించి నటించిన ‘ఒరేయ్ రిక్షా!’ అనే సినిమా, కోడి రామకృష్ణ దర్శకత్వంలో, క్రాంతికుమార్ నిర్మించగా చిరంజీవి నటించిన ‘రిక్షావోడు’ సినిమా, ఒకేసారి విడుదలయ్యాయి. మొదటిది రిక్షావాళ్ల జీవితాన్ని, ఆత్మగౌరవాన్ని అద్భుతంగా ‘down to earth’ గా చిత్రీకరిస్తే, రెండవది, యథాప్రకారం, రిక్షావాడిని, చిరంజీవి ఇమేజ్‍కి అనుగోణంగా, మసాలా చొప్పించి, తీశారు. కమిట్‌మెంట్‌కు, కమర్షియల్ దృక్పథానికి ఉన్న తేడా అది!

ముసలయ్య, గోపాలరావును, పాపను ఎక్కించుకుని, జానకమ్మ గారింటికి తన రిక్షాలో తీసుకువెళతాడు. ఆ దారిలో రచయిత్రి మనకు మారిన సమాజాన్ని, మారిన ప్రజల జీవనవిధానాన్ని, అతని ద్వారా చెప్పిస్తారు. గోపాలరావు గమనించింది ఇది.

“నలభై ఏళ్లనాటి చీరాలకి, ఈ చీరాలకి పోలిక లేదు” (పుట 145).

ముసలయ్య చెబుతాడు –

“సంజ పడితే సాలు, సినిమా, సుక్కా.. ఈ రెండూ లేందే ఉండరండి..”

సినిమాలు, మద్యం ప్రజల జీవితాలతో ఎలా మమేకమయ్యాయో చెబుతాయి

ఈ మాటలు! ఇక గోపాల రావు ఆలోచనల ద్వారా, ప్రజలను వినోదం పేరిట తప్పుదారి పట్టించే సినిమా హీరోలను విమర్శించారు మాలతీ చందూర్.

“సినిమా హీరోలు, భూతాల్లాగా, దెయ్యాల్లాగా వికృతమైన సైజులో ప్రజలని పలకరిస్తున్నారు.” (పుట 145).

వారి కటౌట్స్ పట్ల రచయిత్రికి ఎంత ఏహ్య భావముందో మనకు ఇక్కడ తెలుస్తుంది. కళను సామాజిక ప్రయోజనం కోసం, జనాన్ని జాగృత పరచడం కోసం కాకుండా, కేవలం కాసుల కోసం, జనాల బలహీనతలను సొమ్ము చేసుకోవడం కోసం తీస్తున్నారు. సినిమా హాళ్ల ముందు బారులు తీరి టికెట్ల కోసం నిలుచున్నవారిలో ఆడవాళ్ళే ఎక్కువ కనిపించారు గోపాలరావుకి. ముసలయ్య వ్యాఖ్యానం..

“ఈ ఆడోళ్లకండీ – సినిమా పిచ్చండీ. తిండి మానేసి సినిమాకి పోతారండి. వీళ్ళు యింటికొచ్చేసరికి మొగాడు బాగా తాగి తంతాడండి. గంజి మానేసి మొగాడు కల్లు తొగితీ, పిల్లలకు తిండెట్టక ఆడది సినిమాకెడుతుందండి.”

సినిమాలు, తాగుడు, ఈ రెండూ పేద కుటుంబాలను ఎలా నాశనం చేస్తున్నాయ్ ఈ మాటల్లో వివరించారు రచయిత్రి. ఈమధ్యనే ఓ.టి.టి.లో ఒక సిరీస్ వచ్చింది. దాని పేరు ‘Anger Tales’. దానిలో హీరో వర్షిప్ పేరుతో వెర్రి ఫాన్స్ ఎలా బలవుతారో బాగా చూపించారు. మొదటి కథలో ఒక సూపర్ స్టార్ సినిమా విడుదలకు ముందు, అభిమానుల కోసం బెనిఫిట్ షో (ప్రివ్యూ) వెయ్యడమే సినిమా అంతా. ఒక్క టికెట్ 1500 రూపాయల నుంచి మూడు వేల రూపాయల వరకు అమ్ముతారు. సమయానికి డిస్ట్రిబ్యూటర్ సినిమా పంపడు. థియేటర్‌ని ధ్వంసం చేస్తారు అభిమానులు. అభిమాన సంఘం అధ్యక్షుడు ఆర్థికంగా, మానసికంగా, శారీరికంగా హింసను అనుభవిస్తాడు. హీరో మాత్రం బానే ఉంటాడు. సినిమా అట్టర్ ఫ్లాప్ అవుతుంది. హీరో నిర్మాతకు ఆర్థిక సాయం చేస్తానని ప్రకటిస్తాడు. ఆ ఫ్లాప్ డైరెక్టర్‍కే తన నెక్స్ట్ సినిమా తీసే ఛాన్స్ ఇస్తున్నానంటాడు. మరి ఫాన్స్ సంగతి? రాష్ట్రమంతా ఈ సినిమా వల్ల నష్టపోయిన అభిమాన సంఘాల నాయకులందరూ హైదరాబాద్ లోని హీరో ఇంటి ముందు ‘మాకు న్యాయం చేయ’మని ప్లకార్డులు పట్టుకుని నిలబడడంతో సినిమా ముగుస్తుంది. వారిది అరణ్యరోదనే అని వేరే చెప్పనక్కరలేదు! హీరోలను దేవుళ్ళుగా కొలిచే సినిమారంగంలో, ఇలాంటి సినిమా తీయడం సాహసమే. మాలతీచందూర్ ఎన్నో ఏళ్ల క్రితమే ఈ సాహసం చేశారు, హీరోల కటౌట్లను భూతాలతో దయ్యాలతో పోల్చడం ద్వారా!

కొంత దూరం వెళ్లాక సారాకొట్టు కనిపించింది. ఆ వాసన భరించలేక గోపాల రావు “ఇంకో దారిలో తీసుకువెళ్లలేకపోయవా?” అనడిగితే ముసలయ్య జవాచిది.

“ఈ ఊళ్లో సారాకొట్టు లేని రోడ్డు లేదండి. సందుసందుకు కల్లు కొట్టు పెట్టారండి కాంగ్రెసోళ్లు.”

మద్యపాన నిషేధానికి కంకణం కట్టుకున్న మహాత్ముని వారసులమని చెప్పుకునే ‘కాంగ్రెసోళ్లు’ చేసిన ఘనకార్యమిది!

జానకమ్మ గారి లౌక్యం, ఆ వయసులో ఆమె ప్రజల కోసం తపన, గోపాలరావుకు దిశానిర్దేశం:

జానకమ్మగారు గోపాలాన్ని సాదరంగా ఆహ్వానించింది. వృద్ధాప్యం వల్ల కొద్దిగా వంగి ఉంది, కర్ర ఊతగా పట్టుకుంది. ఆమె శరీరం వంగింది కానీ ఆమె మనస్సు నిటారుగానే ఉంది. ఆవిర్లు కక్కుతున్న అన్నం, దొండకాయ కూరతో భోజనం పెట్టింది.

స్వరాజ్యాన్ని, ఆ పిల్లదాని కళ్లను చూసి రాముడత్తయ్య కళ్ల లాగే ఉన్నాయంది. తనకు పూర్వజన్మల నమ్మకం ఉంది. ఈ పిల్ల అచ్చు మీ రాముడత్తయ్యలాగా ఉంది అన్నదామె. ఒంట్లో బాగలేదని రాశారంటే ఆమె అన్న మాటలు ఆమె లోని ఆధ్యాత్మిక భావనలను తెలుపుతాయి.

“ఒంటికేముంది? ఇది చినిగి పోయిన వస్త్రం లాంటిది. ఎప్పుడు కావాలంటే అప్పుడు వదలిపోవచ్చు. పోవడానికి ముందు కొన్నిపనులు చేసిపోవాలి అనుకుంటున్నాను.” (పుట 146).

“వాసాంసి యధావిహాయ” అని గీతాచార్యుడు చెప్పినదాన్ని చెప్పింది. మరణం కోసం నిత్య సన్నద్దులుగా ఉండటం ఉత్తమ మానవుల లక్షణం. కాని వెళ్ళే ముందు తాను చేయవలసినది చేసిపోవాలి.

ఆధ్యాత్మికత అనే పునాది దేశ సేవకు, పరహితార్థానికి కూడా తప్పక ఉంటుంది. నశ్వరమైన ఈ శరీరం వాద వ్యామోహం లేని వారే సమాజ హితం కోసం తమను తాము అర్పించుకోగలరు. ఆధ్యాత్మికత-నిస్వార్థం విడదీయరానివేమో! “Death closes all but something ere the end” అన్నాడు టెన్నిసన్, తన ULYSSES అనే పద్యంలో.

స్వాతంత్య్రానంతర భారతం – జానకమ్మ గారి ఆవేదన, కోపం:

“మా విలువలు, మా ఆదర్శాలు ఎవ్వరికీ అక్కరలేదు. ఒకప్పుడు ‘కల్లు మానండి’ అని పికెటింగ్ చేసి, లాఠీ దెబ్బలు తిని జైలుకెళ్లాము. ఇప్పుడు మనం సర్వస్వతంత్రులమయ్యాం. వీధివీధినా కల్లు కొట్లని వేలం పాడి ఆ డబ్బుతో ఓట్లు కొనుక్కుంటున్నారు.” (పుట 147).

“అసలు మనకి స్వరాజ్యం పొందే అర్హత లేదనిపిస్తుంది – ఈనాటి వాళ్లను చూస్తుంటే! దీని కోసం ఇన్ని త్యాగాలు చేశామా? మనం చేసిన త్యాగాల వల్ల వొక్కటంటే ఒక్కటి మారిందా? చెప్పు!” (పుట 147).

“హరిజనోద్ధరణ, అస్పృశ్యతానివారణ ఉన్నాము. ఇప్పుడేం జరుగుతోంది? ఊరు బయట దూరంగా కాలనీలు కట్టించి వారిని ఇంకా అంటరాని వాళ్లను చేస్తున్నారు.” (పుట 147).

Post-Independence Scenario జానకమ్మగారి ఈ మాటల్లో కళ్లకు కట్టినట్లు చూపించారు రచయిత్రి. గోపాలరావు నిస్సహాయతను వ్యక్తం చేస్తే, ఆమె ఒప్పుకోదు. మహా నాటకంలో మనందరం పావులమంటాడు అతడు. అప్పుడు జానకమ్మగారు, స్వాతంత్ర్యానంతరం Passive గా మారిన స్వాతంత్ర్య సమరయోధులను ఇలా విమర్శిస్తారు:

“మీరంతా ఆదర్శాలు వల్లిస్తూ మడిగట్టుకు కూచోడం వల్లనే దేశం ఇలా భ్రష్టుపట్టిపోతోంది.”

ఏం చెయ్యాలంటాడు. కేవలం తిట్టటం కాదు, కర్తవ్యాన్ని కూడ చెబుతుందా వృద్ధురాలు.

“ప్రజల మధ్యకెళ్లండి. ఈ రాజకీయ నాయకులు, మంత్రులు చేస్తున్న అన్యాయాలు ప్రజలకు చెప్పండి. ప్రజల కళ్ళు తెరిపించండి” (పుట 147)

“అప్పుడు లక్ష్యం వేరు” అంటాడు గోపాల రావు.

“అటువంటిదే. మరో లక్ష్యం ప్రజలకు ఎందుకు కలగడం లేదు? అవినీతి, రాజకీయ దురహంకారం, కులతత్వాలు – వీటిని తరిమికొట్టాలన్న లక్ష్యశుద్ధి మీలాంటి వాళ్లలో ఎందుకు కలగటం లేదు?” అని గద్దిస్తుందా ఆడపులి (పుట 148).

గోపాలరావు మౌనంగా ఉండిపోతాడు. ఎందుకంటే తమ inertia (జడత్వం) ను తాను తెలుసుకొన్నాడు గనుక. ప్రభుత్వం పొలం ఇస్తానంటి గోపాల రావు వద్దనడాన్ని కూడా ఆమె తప్పు పడుతుంది. నందయ్య చెప్పాడంది.

ఆమె పొలం తీసుకుందని ఆమెపై కొంత వైముఖ్యం గోపాల రావుకు కలిగింది. కాని ఆమె వాదన విన్న తర్వాత, పొలాన్ని ఆమె ఎలా సద్వినియోగం చేస్తూందో కళ్లారా చూసిన తర్వాత, వైముఖ్యం ఆరాధనగా మారింది. అందరూ గోపాల రావులాగే ముసలిదానికి డబ్బాశ అనుకున్నారని ఎత్తిపొడిచిందామె. తాను వద్దంటే ఎవడో అప్రాచ్యాడు దాన్ని పొందుతాడు. తన కోసం అని తీసుకొని నలుగురికే పనికివచ్చే పని చేద్దామని అనుకున్నానంది. సమాజ సేవలో కూడా కొంత లౌక్యం ఉండాలని జానకమ్మగారు నిరూపించారు.

తన పని అయిపోయిందనీ, తన మనుమరాలి కోసమే పాటుపడుతున్నాననీ గోపాల రావు అంటే ఆమె “నీలో కూడా. ‘నా’ అన్న స్వార్థం తలఎత్తింది. అందుకే చేతులు ముడుచుకు అస్త్ర సన్యాసం చేశావు” అని దెప్పిపొడుస్తుంది.

ఇదంతా జానకమ్మ గారు ఎందుకు చేస్తున్నారు? అంత పరుషంగా, రెచ్చగొడుతున్నట్లుగా, గోపాలరావు గారితో ఎందుకు మాట్లాడుతున్నారు?

గోపాల రావు నిజాయితీపరుడు. వయసులో తనకంటే చాలా చిన్నవాడు. దేశానికి ఎంతో ఇంకా చేయవలసిన అతడు క్రియాశూన్యుడుగా, నిస్సహాయుడిగా ఉండిపోవడం ఆమెకు ఇష్టం లేదు. అతనిలో మళ్లీ పూర్వపు చైతన్యాన్ని తీసుకురావడం కోసమే ఆమె ఈ తపన – తానేం చెయ్యాలో అతనికి మరుసటి రోజు తెలిసింది.

తనకు ప్రభుత్వం ఇచ్చిన ఐదెకరాల్లో, ఐదు కుటుంబాలకు, వ్యవసాయం ద్వారా ఉపాధి కల్పించిందామె. దాదాపు ఇరవై మంది ఆడ – మగ అందులో పని చేస్తూండడం తన కళ్లారా చూశాడు గోపాలరావు. సగం పొలంలో కూరగాయలు, సగం పొలంలో మెట్టధాన్యాలూ పండిస్తున్నారు. అందులో వచ్చే ఫలసాయం అయిదు కుటుంబాలు సరిగ్గా పంచుకుంటారు. ఆమెకు అందులో దమ్మిడీ అక్కర్లేదు. దటీజ్ జానకమ్మగారు.

ఆ ఊర్లోని తన యింటికి రాముడత్తయ్య గోపాల రావుని సంరక్షకుడుగా నియమిస్తూ విల్లు రాసింది. అక్కడికి తీసుకెళ్లిందతన్ని. ఇల్లు పాతబడింది. కానీ శుభ్రంగా ఉంది. సూర్యారావు అనే కుర్రవాడు తన భార్యతో ఉంటున్నాడు అక్కడ. అతడు హరిజనుడు. అతని భార్య సాలె శివయ్య మనుమరాలు.

వారిని ఇరు వైపులవాళ్లు కులం నుంచి వెలివేశారు. జానకమ్మ గారు వారిద్దరినీ అక్కున చేర్చుకోన్నారు. సంఘసంస్కరణను చేసి చూపిందా ఆదర్శమూర్తి. రాముడత్తయ్య గొడ్లశాల బాగు చేయించి, పక్కా ఇల్లు కట్టించి, వారిని అందులో ఉంచింది. దానికి గోపాల రావు పర్మిషన్ కావాలట ఆమెకు!

స్థానిక రాజకీయ నాయకులు ఆ ఇంటిని ‘దుగ్గిరాల పఠనమందిరం’గా మార్చాలని చూస్తున్నారు. కులాంతర వివాహం చేసుకున్న జంటను ఆమె ఆదరించటం వారికి ఇష్టం లేదు. పైగా ఆవరణంతా మల్లె తోట వేసి, వారికి ఇచ్చింది. వాళ్లిద్దరూ గ్రాడ్యుయేట్లు. వాసుదేవ రావు గారి పేరిట ఆ యింట్లో నైట్ స్కూలు స్థాపించేందుకు అనుమతి రాసివ్వమని గోపాల రావును కోరింది, కాదు, ఆదేశించింది! అతనికి అంతకంటే కావలసిందేముంది?

కాలం, పరిస్థితులు, విలువల పతనం, సుబ్బమ్మ గారి దుస్థితి, మారని ఆమె స్వభావం:

మళ్లీ నవలలో ‘కాలం’ గురించిన చర్చ చేయిస్తారు రచయిత్రి. అదేదో ‘Digression’ (టాపిక్ మార్పు) కాదు. వర్ణించబోయే దానికి అది నాంది. అది ప్రస్తావన. ఆ general చర్చ లోంచి, individual character కి, దాన్నించి, విశ్వజనీన సత్యంలోకి తీసుకుని వెళతారు. దాన్నే ‘Traversing into Reality’ అంటారు. చర్చ గోపాల రావు అంతరంగంలోనే యథాప్రకారం ఈసారి కూడా జరుగుతుంది.

“కాలం మారిపోయింది. కాలం చెడిపోయింది” అన్న మాటలు వింటే గోపాల రావుకు నవ్వొస్తుందంటారు రచయిత్రి. నిజానికి అక్కడ నవ్వు వస్తూన్నది రచయిత్రికి. మనం ముందుగా చెప్పుకున్నట్లు, అతడు మాలతిగారికి ‘spokesperson!’. అంటే వాక్ప్రతినిధి అనవచ్చు.

“కాలానికి ప్రాణం ఉందా? దానికి రూపం ఉందా? కాలానికి గమనం ఉంది తప్ప ప్రాణం లేదు! అటువంటి కాలం, మారడమేమిటి?” (పుట 152)

గమనాన్నే మనిషి మారడం అని భ్రమిస్తాడు. “మనిషి తను చేసిన కొన్నిటికి మటుకే బాధ్యత వహించి, మిగతా వాటిని చుట్టూ ఉన్నవారి మీద, కాలం మీద నెట్టుతూ ఉంటాడు” అంటారు రచయిత్రి.

ఎంత లోతైన పరిశీలన! ఎంత సునిశితమైన విశ్లేషణ! మానవ స్వభావాన్ని కాలాన్ని సమన్యయం చేసి చెప్పగలగడం ఆమెకీ చెల్లింది.

“కాలపురుషుడు దైవస్వరూపుడు అంటుంటారు ఆధ్యాత్మికవాదులు. మనిషి మనిషిలా బ్రతకలేక, తనలోని ప్రలోభాలను జయించలేక, తన బలహీనతని కాలానికి అంటగడుతున్నాడు. కాలం మారదు.” (పుట 152)

“మనిషి తాను మారిపోతూ, విజ్ఞాన వనరులను. దుర్వినియోగపరుస్తూ, పరిసరాలని కలుషితం చేసి కాలాన్ని తప్పుపడుతున్నాడు.” (పుట 152)

సుబ్బమ్మగారు తరచూ అనే మాట, “పిదపకాలం – మా కాలంలో ఈ బుద్ధులు లేవమ్మా”

కాలం ఇప్పుడూ అప్పుడూ ఒకలా ఉంది. అందులో మార్పు లేదు.

“అయితే, తన తల్లి స్ధితిలో, ఆమె చుట్టూ ఉన్న పరిస్థితుల్లో మార్పు వచ్చి, ఆమె విలువలు తలక్రిందులవడం చేత, కాలాన్ని తిడుతోంది, మనుషులను తిట్టలేక.”

ఆమె గోపాల రావును మొదటి నుండీ అప్రయోజకుడని అంటూనే ఉంది. ఈనాడు బుచ్చి, అతని భార్య ఆమెను హీనంగా చూస్తున్నారు. ఆమె కొడుకును తిట్టదు. కాలం చెడిపోయిందంటుంది! మొదటినుంచి బుచ్చి, డబ్బుకే గాని మనిషికి విలువ ఇవ్వలేదు. ఆ విషయం సుబ్బమ్మ గారికి తెలియదా?

ఏకాదశి ఉపవాసం చేసి, ద్వాదశి నాడు స్నానం చేయనీకుండా రెండో కోడలు పంపు బిగించేస్తుంది. తను ఆ యింట్లో ఉండలేనంటూ పెద్ద కొడుకు యింటికి వచ్చేస్తుంది. వార్ధక్యంలో, తిండి లేక క్షీణించిన తల్లిని ఆదరించాడు. ఎవ్వరినీ తప్పు పట్టలేదు.

ఇక్కడకు వచ్చిన తల్లిని ఆదరించడం ఒక ఎత్తైతే, ఎవరినీ తప్పుపట్టకపోవడం మరో ఎత్తు. తమ్ముడినీ మరదలనీ విమర్శించ లేదు. దానికి చాలా పరిపక్వత కావాలి. “నీకు మొదటి నుంచీ వాడంటేనే ఇష్టం లే” అని ఆమెను దెప్పిపొడవలేదు. స్థితప్రజ్ఞత అంటే అదీ! తర్వాత తల్లి ఎలాంటిదైనా, జన్మనిచ్చింది తనకు. ఆమె పట్ల తన బాధ్యతను నిర్వర్తించాలనే ధర్మాచరణ!

తల్లి తన నగలను దాచుకుంది. కోడలికి అవి కావాలి. గొడవకు అసలు కారణం అదని అతనికి తెలుసు. సుబ్బమ్మగారి మీద వారి ద్వేషం ఎంత వరకు వెళ్లిందంటే, ఆమె అన్నం తింటుంటే విస్తట్లో గుప్పెడు బూడిద పోశారని తెలిసినపుడు మనం నిశ్చేష్టుల మవుతాము. ఇంత శాడిజమా? అదీ కన్నతల్లి పట్ల! విలన్లు మన కుటుంబాలలో కూడా ఉంటారటానికి ఇంతకంటే నిదర్శనమేముంది? తల్లి తన నగలను తమకు ఇవ్వకుండా దాచిపెట్టుకుంటుందన్న అక్కసు అంతా ఆ పాశవిక చర్యలో మనకు కనబడుతుంది. Stooping (దిగజారడం) కు పరాకాష్ఠ ఇది!

ఆమె రెండేళ్లుగా వసారాలో సొంతంగా వండుకుంటూంది. పెద్ద కొడుకు దగ్గరికి రావటానికి మొహం చెల్లలేదు.

సుబ్బమ్మగారి దీనస్థితికి మన మనస్సులు ద్రవీభూతమవుతాయి. ఆమె చెడ్డదే కావచ్చు. మనిషి కదా! ఆమె దగ్గర ముప్ఫై కాసుల బంగారం ఉన్నట్టు పార్వతి చెబితేగాని గోపాల రావుకు తెలియదు. కనీసం స్వరాజ్యానికైనా ఏమైనా ఇస్తుందేమోనని, ఇవ్వాలని పార్వతి ఆశ. ఆ నగలు తమ్ముడికిచ్చేస్తే సరి, వాడు సిగ్గుపడి అమ్మను చూస్తాదని అతని సూచన. అమ్మ తనకు బరువు కాదు.

బుచ్చికి, గోపాల రావుకీ ఉన్న తేడా ఇక్కడ మనకు అవగతమవుతుంది. తల్లి నగల మీద కించిత్తు కూడా ఆశ లేదతనికి. పైగా తనను అంత లోకువగా చూసిన తల్లిని ఆదరిస్తున్నాడు.

“తల్లిదండ్రుల యందు దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి?” అన్నాడు వేమన. అలాంటివాటిని చెదలతో పోల్చాడాయన. బుచ్చి అలాంటివాడు. మంచి గంధం లాంటి మనస్సు గోపాల రావుది. అతని వ్యక్తిత్వాన్ని మాలతీ చందూర్ గారు ఆవిష్కరించే కొద్దీ మనకు అతని పట్ల ఆరాధనా భావం పెరుగుతూపోతుంది.

Carlyle (కార్లయిల్) మహేశయుడు అన్నట్లు అతడు, “A bundle of virtues”.

ఆ నగలు ఆమె దగ్గర ఉన్నాయి కాబట్టే మరిది ఎప్పుడో ఒకసారి ఆమెను ఆదరించక మానడని పార్వతి వాదన.

(సశేషం)

Exit mobile version