[శ్రీమతి మాలతీ చందూర్ గారి ‘హృదయనేత్రి’ నవలపై శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన సిద్ధాంత గ్రంథాన్ని ధారావాహికగా అందిస్తున్నాము.]
కాని గోపాలరావు దృక్పథం వేరు. అది విశాలమైంది. ‘నా’ అన్నదానికి అతీతమైంది. అందుకే అతడు ఎవరికీ అర్థం కాడు. “ఈ విషయంలో అతని ఆలోచనలు ఆధ్యాత్మిక కోణంలో సాగాయి. ఈ సందర్భంలో ‘వసుధైక కుటుంబకమ్’ అన్న భావనకు, స్వార్థ సంకుచిత భావనకు తేడాను రచయిత్రి అద్భుతంగా విశదీకరించారు.
‘సర్వే స్వార్థం సమాహతే’ అంటుంది శాస్త్రం. ‘ఆత్మవత్ సర్వభూతాని’ అని కూడా అంటుంది. గోపాలరావుది రెండో మార్గం. అతని భార్యది, కుటుంబసభ్యులది మొదటి మార్గం.
“నా యిల్లు – నాకు స్వంత యిల్లు కావాలి” – పార్వతి.
“నా కుటుంబం నా వాళ్ళు” – బుచ్చి.
“నా ఊరు, నా కులం – నా నియోజకవర్గం” – నందయ్య.
నా దేశం.. నా దేశ స్వాతంత్య్రం” – గోపాలరావు (పుట 130).
“ప్రతి మనిషికి కావలసింది – ఆరడుగులు మాత్రమే. బూడిద అయినా, భూస్థాపితం ఐనా.”
‘నా పోరాటంలో కూడా స్వయంచింతన అహం లేవా?’ అనుకుంటాడు.
భార్య మీద జాలి కలుగుతుంది.
ఈ నిస్వార్థ దేశ ప్రయోజనాలను సాధించడంలో కూడా దృక్పథాల్లో వైరుధ్యాలుంటాయి. ఉదాహరణకు భాషాప్రయుక్త రాష్ట్రాలంటే గోపాల రావుకు గిట్టదు. వ్యక్తిగతంగా పొట్టి శ్రీరాములు గారంటే గౌరవమే గాని, ఆయన గమ్యంతో అతడు ఏకీభవించడు. భాషాప్రయుక్త రాష్ట్రాలు మన దేశాన్ని బలహీనపరుస్తాయని అతని బలమైన నమ్మకం. ఈ విషయంలో తన ఎడిటర్ గారితో కూడ అతడు తీవ్రంగా వాదిస్తాడు.
“వ్యక్తుల స్వార్థంతో కరడుగట్టుకుపోయిన మన దేశం ప్రాంతాల వారీగా, భాషలవారీగా చీల్చినపుడు, జల్లెడలా అయిపోతుంది” అంటాడు (పుట 131).
“ఉద్యమాలు నిర్వహించే ముందే, ఆ వ్యక్తికి అసాధారణమైన ప్రజ్ఞ, భవిష్యత్తులోకి చూడగలిగిన సునిశిత దృష్టి, రాజకీయ పరిజ్ఞానం, పదునైన శక్తి వంటి మేధ – ఇన్ని ఉండాలి. ఆత్మత్యాగం ఒకటే కాదు!”
రాను రాను ఒకే భాష మాట్లాడీ రాష్ట్రాలు కూడా విడిపోవాలనే ఉద్యమాలు వచ్చాయి. వాటిని సాధించడం కోసం ‘ఆత్మత్యాగాన్ని’ ఒక ఆయుధంగా వాడుకున్నారు నాయకులు. ప్రాంతీయతత్త్వం వికృతరూపం దాల్చి, సమాఖ్య స్ఫూర్తికే తూట్లు పొడిచే దుస్థితి దాపురించింది. కేంద్ర రాష్ట్రాల మధ్య సయోధ్య రాను రాను తగ్గిపోయి, ఘర్షణగా రూపుదిద్దుకుంటుంది. గోపాల రావు ఆలోచనల ద్వారా రచయిత్రి ఈ catastrophe ను ముందుగానీ predict చేశారు. “భవిష్యత్తులోకి చూడగలిగిన సున్నిత దృష్టి ఉద్యమాలు నిర్వహించే వారికుండాలి” అనడం ఆమె దార్శనికతకు నిదర్శనం.
ఆంధ్ర రాజధాని ఎక్కడ ఉండాలని, ప్రజాభిప్రాయం సేకరించటానికి ‘కమిషన్’ పర్యటించినపుడు, ప్రతి రైలు స్టేషన్లో ప్రజలు ‘మా ఊరంటే మాఊర’ని పోటీలు పడ్డారు. వినతులు అందించారు. ఆ వార్తలు దినపత్రికలు వేయడం దండగ అని గోపాల రావు అభిప్రాయం.
“మద్రాసులో కూచొని ఆంధ్ర రాజధాని నిర్ణయించబోతున్నారు. మీరు మీ కుటుంబాలతో ఈ ఊరు వదిలి వెళ్లిపోతారా?” అనడుగుతాడు తీవ్రంగా.
భాషాప్రయుక్త రాష్ట్రాల వల్ల ఉద్యోగావకాశాలు, విద్యావకాశాలు, రాష్ట్రాభివృద్ధి బాగుంటాయనేది కూడా అతడు ఒప్పుకోడు. ‘తమిళులు మనకు అన్యాయం చేస్తున్నారని ఆంధ్రులూ, ఆంధ్రులు తమకు అన్యాయం చేస్తున్నారని తెలంగాణావారు, ఇలా ఉద్యమాలు చేస్తూపోతే దీనికి అంతెక్కడిది? వనరుల ఎక్స్‌ప్లాయిటేషన్ అనేది భాషతో సంబంధం లేనిది. మనిషి స్వార్థానికి సంబంధించింది. ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పాటయినా, మళ్లీ అంతర్గతంగా విభేదాలు రానే వస్తాయి, భాషలతో సంబంధం లేకుండా. వేలు లక్షల కుటుంబాలు అన్ని ప్రాంతాలలో పేదరికంతో కుములుతున్నాయి. ఖద్దరు టోపీ తన గౌరవాన్ని కోల్పోయి, అవినీతికి చిహ్నంగా మిగిలింది..’ ఇలా ఉంటాయి గోపాల రావు భావాలు. ఇలా స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా, తన భావజాలంతో ఇతరుల భావజాలం ఏ మాత్రం పొంతన లేకుండా ఉండటం చూస్తూ, సంఘర్షితుడు అవుతున్నాడో ఆదర్శవాది. కుహనా ఆదర్శవాదులకు అతని వైఖరి చిరాకు తెప్పిస్తుంది.
ఈ సందర్భంలో ఇటీవల నేను చదివిన ఒక చక్కని కథను స్మరించుకోవడం ఉచితంగా ఉంటుంది. శ్రీమతి ‘మధుపత్ర శైలజ ఉప్పులూరి’ అనే రచయిత్రి ఉన్నారు. ఆమె ఒక గృహిణి. ఆమె ‘మధువనం’ అన్న తన కథల సంపుటిని ప్రచురించారు. దానికి ‘ముందుమాట’ నేనే వ్రాశాను. ఆవిష్కరణ సభలో పుస్తకాన్ని నేనే విశ్లేషించాను. ఆ సభకు సర్వశ్రీ విహరి, సింహప్రసాద్, సిహెచ్ శివరామప్రసాద్ (వాణిశ్రీ), బుద్ధవరపు కామేశ్వరరావు, శ్రీమతి శీలా సుభద్రాదేవి గారలు హాజరైనారు. అందరూ సాహితీ సృష్టలే, లబ్ధప్రతిష్ఠులే. అందరి ఉపన్యాసాల్లో (నాతో సహా) ఒక కథను ప్రత్యేకంగా ప్రస్తావించారు.
ఆ కథ పేరు ‘స్నేహానికన్న మిన్న’. ‘మేధావుల వలస’ (exodus) ని ఇతివృత్తంగా తీసుకొని రచయిత్రి శైలజ ఆ కథని అద్భుతంగా మలిచారు. క్లుప్తంగా ఇదీ కథ.
ఆంధ్ర, తెలంగాణకు చెందిన రెండు కుటుంబాలు కామారెడ్డిలో సఖ్యంగా ఉంటాయి. నరేంద్ర గారిది గుడివాడ. యాదగిరి గారిది కామారెడ్డి. నరేంద్ర కామారెడ్డిలో బ్యాంక్ ఆఫీసరుగా పని చేసినపుడు యాదగిరి వాళ్లంట్లో అద్దెకు ఉండేవాడు.
సంక్రాంతికి అందరూ గుడివాడకు వెళ్లేవారు. ఇక్కడ కామారెడ్డిలో బతుకమ్మ ఆటలు, బోనాల సంబరాలను నరేంద్ర పిల్లలు ఎంజాయ్ చేసేవారు. నరేంద్ర, కొడుకు సూర్య. యాదగిరి కొడుకు చందు. సూర్య రెసిడెన్షియల్ కార్పొరేట్ కాలేజీలో ఇంటర్లో చేరితే, రైతు కొడుకైన చందు, ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చేరతాడు. సూర్య తన స్టడీ మెటీరియల్‌ను చందుకిచ్చేవాడు. ఇద్దరూ ఇంజనీరింగ్ చదవాలి. ఎం.సెట్ రాయాలి.
ఈలోగా ‘ప్రత్యేక తెలంగాణ’ ఉద్యమం వస్తుంది. చందు దానిపట్ల ఆకర్షితుడవుతాడు. ఉద్యమ నాయకుల ప్రసంగాలు అతన్ని ఆంధ్రోళ్ళను ద్వేషించేలా చేస్తాయి. నరేంద్ర కుటుంబంతో మాట్లాడడం మానేశాడు. నరేంద్ర వైపువారు ఏ ఫంక్షన్ చేసుకొన్నా వీళ్లను పిలుస్తారు. కాని సూర్య వెళ్లడం మానేశాడు. అది తప్పని తండ్రి మందలించినా లెక్కచేయడు.
రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికలలో, సమైక్య రాష్ట్రాన్ని సమర్థించిన పార్టీలు ఓడిపోయాయి. ఉద్యమ నాయకులు సంతోషించారు.
నరేంద్రగారికి ఏలూరుకు ట్రాన్స్ఫరైంది. నాలుగేళ్ళు గడిచాయి. సూర్య యు.ఎస్.లో ఎం.ఎస్ చేస్తున్నాడు. చందు ఉద్యమంలో తిరుగుతూ కెరీర్‌ను నిర్లక్ష్యం చేశాడు. సరైన ఉద్యోగం రాలేదు. తమ ఉద్యోగాలన్నీ ఆంధ్రోళ్ళే దోచుకున్నారనేవాడు.
చివరకు నరేంద్ర గారి సాయంతో చందుకు ఒక కంపెనీలో ఉద్యోగం వస్తుంది. అదంతా తన ఘనతే అనుకుంటున్నాడు చందు. అసలు ఆ ఉద్యోగం వచ్చింది సూర్య వల్లే. ఒక సంవత్సరం తర్వాత ఆ ప్రాజెక్ట్ పని మీద చందు అమెరికాకు వెళ్లే అవకాశం వస్తుంది. ఇదంతా, చందుకి ఉన్న ఆంధ్రా వ్యతిరేకత కారణంగా, అతనికి చెప్పవద్దని కోరారు నరేంద్ర, సూర్య.
కంపెనీ వారు అమెరికాలో చందుకు ‘వసతి’ ఏర్పాటు చేశారు. రెండు బెడ్రూముల ప్లాట్ అది. ఒక బెడ్ రూంలో ఇద్దరు బెంగాలీలుంటారు. తన రూం మేట్ ‘సూర్య’ అని తెలిసి చందు ఆశ్చర్యపోతాడు. తామిద్దరు చిన్నపుడు తీయించుకున్న ఫోటోను సూర్య తన టేబుల్ మీద ఉంచుకున్నాడు. అక్కడ సూర్య డైరీ ఉంటుంది. దానిలో అతడు చందుతో తన అనుబంధాన్నిరాసుకున్నాడు. చందు అమెరికాకు వస్తున్నాడని చాలా సంతోషంతో ఉన్నాడు. సూర్యను తప్పుగా అర్థం చేసుకున్నందుకు చందు పశ్చాత్తాపపడ్డాడు. కాని, గిల్టీ ఫీలింగ్‌తో అతన్ని ‘అవాయిడ్’ చేస్తున్నాడు.
ఒక వీకెండ్, కంపెనీ వారు అరేంజ్ చేసిన ‘టీమ్ అవుటింగ్’కు వెళతారు ఇద్దరూ. అదొక ‘ఇండియన్ ఫుడ్ కోర్ట్’.
ఒక ఆగంతకుడు చేతిలో రివాల్వర్‌తో చొరబడి అందరినీ బెదిరించసాగాడు. “ఇండియన్స్ కాని వారంతా బయటికి వెళ్లండి” అని అరుస్తాడు. అందరికంటే వెనుక ఉన్న చందుకు మాస్క్ వేసి తన వెంట రమ్మన్నాడు. ఎవరో రహస్యంగా పోలీసులకు మెసేజ్ చేస్తారు. పోలీసులొచ్చి ఆ అగంతకుడిని అదుపులోకి తీసుకుంటారు. వాడు “బ్లడీ ఇండియన్స్, గో బ్యాక్ టు యువర్ కంట్రీ!” అని కేకలు వేస్తూ వెళతాడు.
తనను కాపాడింది, పోలీసుకు మెసేజ్ పెట్టింది సూర్యే అని తెలిసి విస్తుబోతాడు చందు.
‘ఇతర దేశాల నుంచి, ముఖ్యంగా ఇండియా నుంచి వచ్చిన మనలాంటివారు, వారి ఉపాధి అవకాశాలను దోచుకంటున్నారని ఇలా దాడులు చేస్తున్నారు. నేను కూడా నా ప్రాంతంలో అలాగే ద్వేషం పెంచుకున్నాను కదా!’ అనుకుని సూర్యను క్షమించమని అడుగుతాడు చందు.
అదీ కథ! దీనికి ‘అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ, హ్యూస్టన్, అమెరికా’ వారు నిర్వహించిన అంతర్జాతీయ స్థాయి కథల పోటీలో ద్వితీయ బహుమతి వచ్చింది. అమెరికా నుండి వెలువడే మాలిక అనే సాహిత్య పత్రిక జూలై 2019 సంచికలో ప్రచురింపబడింది ఈ కథ.
ఎక్కడ బ్రతుకు తెరువుకు అవకాశం ఉంటుందో అక్కడికి ప్రజలు వలస వెళతారు. అది లోక సహజం. శ్రమజీవులకైనా బుద్ధిజీవులకైనా ఇది వర్తిస్తుంది. ఆంధ్రావాళ్ళు తెలంగాణావారి ఉద్యోగావకాశాలను కొల్లగొడుతున్నారని చందు అనుకుంటే, ఇండియన్స్ తమ ఉపాధిని దెబ్బతీస్తున్నారని అమెరికాలోని జాత్యహంకారులు ఏకంగా వారి మీదే దాడులు చేస్తున్నారు. ఎవరూ ఎవరినీ దోచుకోరు. శ్రమ, తెలివి ఎక్కడ అవసరమో, ఎక్కడ సులభంగా, చౌకగా లభ్యం అవుతాయో, అక్కడికి ప్రజలు వెళతారు. ఈ సున్నితమై వివాదాసాృస్పదమైన విషయాన్ని, హైదరాబాదులో ఉండే ఒక సామాన్య గృహిణి చక్కని కథగా రాసి, బహుమతి పొందడం చిన్న విషయం కాదు.
ఇలాంటి కథలు రాయడానికి ధైర్యం కావాలి. శ్రీమతి శైలజకు ఆ ధైర్యం ఉంది. బహుమతి ఇచ్చిన నిర్వాహకులూ అభినందనీయులే.
సరిగ్గా ఇదే విషయాన్ని గోపాలరావు ద్వారా శ్రీమతి మాలతీ చందూర్ ఆవిష్కరించారు. జాతీయవాదాన్ని ప్రాంతీయవాదం డామినేట్ చేయకూడదని ఆమె ఆశించారు. బీహరీలు మహరాష్ట్రలో, హైదరాబాద్‌లో శ్రమజీవులుగా వేల సంఖ్యలో బ్రతుకుతుంటారు. అన్ని నగరాల్లో మార్వాడీల స్వీట్ షాపులుంటాయి. పంజాబీ ఆటోమొబైల్ స్పేర్ పార్టుల షాపులుంటాయి. మలబార్ టీ స్టాల్లు ఉంటాయి. దేశమంతటా ఉడిపి హోటళ్ళు, కామత్‌లు ఉంటాయి. చాలా దేశాల్లో శరవణభవన్ లుంటాయి.
అందరూ తమ తమ ప్రాంతాలకే పరిమితమై ‘Sons of the soil’ థియరీ ప్రకారం బ్రతకాలంటే సాధ్యమయ్యే పనేనా? ఎవరు ఎక్కడైనా బ్రతికే హక్కు రాజ్యాంగాలే కల్పించాయి. సంకుచిత దృక్పథం జాతిని నిర్వీర్యం చేస్తుంది.
‘విద్వాన్ సర్వత్ర పూజ్యతే!’ అంటుంది శాస్త్రం. ఇక్కడ ‘విద్వాన్’ అంటే మెరిట్ గలవాడు అని అర్థం తీసుకుంటే సరి.
‘ఉద్యోగినం న దూర భూమిః’ అన్నాడు హితోపదేశకర్త. ప్రయత్నపరుడైన వానికి దూర దేశమనిది ఉండదు. గోపాల రావు మాలతీ చందూర్ భావాలకు Spokesman. నవలలోని Protagonist గా అతని ద్వారా, ఆమె విశ్వజనీనమైన ఎన్నో విషయాలను నిష్పక్షపాతంగా, నిర్ణయంగా వ్యక్తీకరించగల మేధావి. అవి ఏదో theoretical గా, statements లా కాకుండా, సజీవమైన పాత్రల సంభాషణల్లో పొందుపరచి, వాటికి credibility ని, authenticity ని కల్పిస్తుంది ఆ మహా రచయిత్రిt నిస్వార్థ ఉద్యమస్ఫూర్తికి పరాకాష్ట!:
రాజకీయ బాధితులకు అయిదేసి ఎకరాలు ఉచితంగా పంచి పెడుతున్నారు, ప్రభుత్వం వారు. స్వాతంత్య్ర సమరవీరులకు కృతజ్ఞతా పూర్వకంగా. ఈ సందర్భంలో మనుషుల స్వభావాన్ని రచయిత్రి చమత్కారంగా చిత్రీకరించారు.
“దీని గురించి గోపాల రావు కంటే బుచ్చి ఎక్కువ అక్కర చూపించాడు” అనడంలో అలాంటి ప్రయోజనాల పట్ల, నిజమైన బాధితులు ఎంత aloof గా ఉంటారో, అసలు బాధితులు కాని వారు ఎంత concern చూపిస్తారో మనకు తెలుస్తుంది. ఆ స్థలం బెజవాడ – గుంటారు మధ్య ఉంది. పంటపొలం. ముందు ముందు అది బంగారమవుతుందని బుచ్చికి తెలుసు.
“నా కెందుకురా? నేనేమయినా వ్యవసాయం చేస్తానా, పెడతానా?”
ఇది గోపాల రావు స్పందన. ‘నిష్కామకర్మ’ అని భగవానుడు గీతలో సెలవిచ్చిన దానికి ప్రత్యక్ష ఉదాహరణ గోపాల రావు. అతని లాంటి వారు, రాష్ట్ర, జాతీయ స్థాయిలో పేరు పొందకపోయినా అసంఖ్యాకులైన సామాన్య ఉద్యమకారుల్లో చాలామంది ఉంటారు.
పైగా నందయ్య పట్టాలు ఇప్పిస్తాడు!
‘Expecting no return’ అన్నది ఉత్తముల లక్షణం. అంటే ఫలితాన్ని, ప్రయోజనాన్ని ఆశించకుండా కర్తవ్యాన్ని నిర్వహించడం. దాన్ని సాధించడం ఆషామాషీ వ్యవహారం కాదు. ఈ utilitarian సమాజంలో ఏ పని చేసినా ‘నాకేం లాభం!’ అనే ఆలోచిస్తారు.
ఇక్కడ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి పద్యాన్ని స్మరించుకోందాం. ‘అవ్యాజమై’న ప్రేమను ప్రకృతి మానవాళికి ఎలా అందిస్తుందో ఆయన ఈ పద్యంలో చూపించారు.
‘సౌరభములేల చిమ్ము బుష్పవ్రజంబు?
చంద్రికలనేల వెదజల్లు జందమామ?
ఏల సలిలంబు పాఱు? గాడ్పేల విసురు?
ఏల నాహృదయంబు ప్రేమించు నిన్ను?’
– ఊర్వశి, కృష్ణశాస్త్రి.
“పువ్వులు ఎందుకు సువాసనలిస్తాయో, చంద్రుడు వెన్నెలనెందుకు కురిపిస్తాడో. నీరు ఎందుకు పారుతుందో, గాలి ఎందుకు వీస్తుందో అందుకే నిన్ను నేను ప్రేమిస్తున్నాను.”
ఇందులో పై మూడు పాదాలు నిష్కామ కర్మకు సరిపోతాయి. ఈ నాల్గవ పాదంతో ఆయన ఉద్దేశించినది వేరు. మనం దానిని ‘దేశమాత’కు అన్వయించుకుంటే సరిపోతుంది.
ఐదెకరాల సుక్షేత్రమైన పాలం ఆయాచితంగా లభించే అవకాశం ఉంటే, ఎంత సులభంగా తృణీకరిస్తున్నాడు గోపాల రావు? శిఖరాయమాన వ్యక్తిత్వం అంటే అది! పైగా ఎంత casual గా చెబుతున్నాడో చూడండి.
“నాకిలాంటివి ఇష్టంలేదు. మాకేదో ముందు ముందు పొలాలు ఇవ్వబోతున్నామని జైలుకెళ్లామా? దేశం కోసం వెళ్లాము. మాకో చేతనైంది చేశాం.”
ఎంత నిర్మమత్వం?
భార్య నిష్ఠూరం చేస్తుంది. దేశసేవ చేసినందుకు ఫలితాన్ని ఆశించడం ఎలా ఉంటుందో భార్యకు చెబుతాడు.
“ఇదుగో పార్వతీ! తల్లికి అన్నం పెట్టడం, ఆలిని పోషించడం, వీటికి ఎవరయినా విలువగట్టి డబ్బు ఇస్తానంటే పుచ్చుకునేవాడు, చెయ్యి చాపేవాడు మనిషి కాదు. నా దృష్టిలో అధముడు’
“తల్లి వేరు పెళ్లాం వేరు దేశం వేరు” అంటుంది వితండవాదంలో ఆరితేరిన భార్య. వంద ఎకరాలున్న మినిస్టర్లు కూడా జైలుకెళ్లామని ఐదేసి ఎకరాలు పుచ్చుకోన్నారంటుంది. దానికి –
“తల్లి జన్మనిచ్చింది. ఈ గడ్డ నా జాతికి జన్మయిచ్చింది” అంటాడు
రాన్రాను ఆ పొలం సిటీ లిమిట్స్‌లో కలిసి, ఇండ్ల స్థలాలుగా మారితే, లక్షలు విలువ చేస్తుందని నందయ్య చెప్పాడంటాడు బుచ్చి. అతనికి నందయ్య మాట వేదవాక్యం!
నందయ్య ఒకప్పుడు తన సహపాఠి అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నానంటాడు గోపాల రావు. స్వరాజ్యం కోసమయినా.. అంటే, తన మనుమరాలి భవిష్యత్తు కోసం తాను సంపాదించగలనంటాడు.
హౌసింగ్ బోర్డులో అతనికి ఇల్లు అలాట్ అవుతుంది; LIG. మాంబళంలో గృహ ప్రవేశం కూడా ‘అతని పద్ధతి’ లోనే జరుగుతుంది. గాంధీగారి ఫోటో పట్టుకుని స్వరాజ్యం ముందు వెళుతుంది కొత్త యింట్లోకి. భార్య చేత ఆ ఫోటో ముందు దీపారాధన చేయిస్తాడు. అంతే!
జానకమ్మ గారి అనారోగ్యం, మనవరాలితో చీరాల ప్రయాణం:
చీరాల రైలు చక్రాల కదలికల ధ్వని ‘మనసూ మనిషి..’ అంటున్నట్లు అనిపించిందట అతనికి. ‘యద్భావం తద్భవతి’ అన్నట్లు, రైలు చేసే శబ్దాలు లయబద్ధంగా ఉంటూనే, మనం ఎలా అనుకుంటే అలా ధ్వనిస్తాయి.
అతని ఆలోచనలు పరిపరి విధాలుగా పరిభ్రమిస్తాయి.
“మనసుకీ మనిషికి మధ్య ఉన్న దూరం – ఎంత? దానిని ఎవరయినా కొలవగలరా? కళ్ల ఎదురుగా లేని మనిషిని త్వరగా మర్చిపోతాం. ‘అవుటాఫ్ సైట్ – అవుటాఫ్ మైండ్’ అంటారు. అది నిజం కాదు. తాను రాముడత్తయ్యను కళ్ళారా చూసి పాతికేళ్ళు దాటిపోయింది. అయినా రోజు జ్ఞాపకం వస్తూనే ఉంటుంది. ఆమె స్మృతి నిన్న మొన్న చూసినట్లు తాజాగా ఉంది తన మనసులో. కాని ఆ చీరాల ప్రభావం, చిన్నతనంలో అత్తయ్యతో గడిపిన ఆ రోజుల లోని ప్రభావం, తన జీవితం మీద తన ఆలోచనావిధానం పైన ఎంత గాఢంగా ముద్రింపబడి ఉందో ఎలా. చెప్పడం ఏ కొలతలతో ఆ ప్రభావాన్ని కొలవాలి?” (పుట 139).
వీటినీ Indelible Memories అంటారు. అంటే ఎన్నాళ్లకీ, ఎన్నేళ్లకీ చెక్కుచెదరని జ్ఞాపకాలు! వ్యక్తిత్యాలను ప్రభావితం చేస్తాయవి. జీవితాలను నిర్దేశిస్తాయి.
ఎదుటి ప్రయాణీకుడు స్వరాజ్యాన్ని చూసి ముచ్చటపడ్డాడు. ఇక్కడ రచయిత్రి అంటారు –
“సృష్టిలో బాల్యమంత మధురమయిన అందమైన దశ ఇంకేమీ ఉండదు కాబోలు!”
టాల్‌స్టాయ్ మహాశయుడు ఏకంగా “పిల్లలలో దేవుడు తనను తాను ఆవిష్కరించుకుంటాడు” అన్నాడు.
“God Manifests Himself in Children!”
కల్మషం లేని మనస్సులు వారివి! కల్మషం లేని మనస్సే దేవుడు! ఆయనతో గోపాల రావు మాట్లాడినపుడు మరో విషయం చర్చకు వస్తుంది.
(సశేషం)
శ్రీ పాణ్యం దత్తశర్మ 1957లో కర్నూలు జిల్లా వెల్దుర్తిలో పుట్టారు. తండ్రి శతావధాని శ్రీ ప్రాణ్యం లక్ష్మీనరసింహశాస్త్రి. తల్లి శ్రీమతి లక్ష్మీనరసమ్మ. టెంత్ వరకు వెల్దుర్తి హైస్కూలు. ఇంటర్, డిగ్రీ, ఎం.ఎ. (ఇంగ్లీషు), ఎం.ఎ. (సంస్కృతం), ఎంఫిల్, పిజిడిటియి (సీఫెల్), ప్రయివేటుగానే.
దత్తశర్మ ఇంటర్మీడియట్ విద్యాశాఖలో లెక్చరర్‌గా, ప్రిన్సిపాల్‌గా, రీడర్‌గా, ఉపకార్యదర్శిగా సేవలందించారు. కవి, రచయిత, విమర్శకులు, గాయకులు, కాలమిస్టుగా పేరు పొందారు. వీరివి ఇంతవరకు దాదాపు 50 కథలు వివిధ పత్రికలలో ప్రచురితమై వాటిలో కొన్ని బహుమతులు, పురస్కారాలు పొందాయి.
వీరు ‘చంపకాలోచనమ్’ అనే ఖండకావ్యాన్ని, ‘Garland of poems’ అన్న ఆంగ్ల కవితా సంకలనాన్ని, ‘దత్త కథాలహరి’ అన్న కథా సంపుటాన్ని ప్రచురించారు. వీరి నవల ‘సాఫల్యం’ సంచిక అంతర్జాల పత్రికలో 54 వారాలు సీరియల్‌గా ప్రచురితమై, పుస్తక రూపంలో ప్రచురింపబడి అశేష పాఠకాదరణ పొందింది. 584 పేజీల బృహన్నవల ఇది. ‘అడవి తల్లి ఒడిలో’ అనే పిల్లల సైంటిఫిక్ ఫిక్షన్ నవల సంచిక డాట్ కామ్‌లో సీరియల్‌గా ప్రచురించబడింది.
వీరికి ఎ.జి రంజని సంస్థ కవి సామ్రాట్ విశ్వనాథ పురస్కారాన్ని, ‘తెలంగాణ పాయిటిక్ ఫోరమ్’ వారు వీరికి ‘Poet of Profundity’ అన్న బిరుదును, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంవారు వీరి సిద్ధాంత గ్రంథానికి అవార్డును, సి.పి. బ్రౌన్ సమితి, బెంగుళూరు వారు వీరికి ‘NTR స్మారక శతకరత్న’ అవార్డును బహూకరించారు.
ఇద్దరు పిల్లలు. ప్రహ్లాద్, ప్రణవి. కోడలు ప్రత్యూష, అల్లుడు ఆశిష్. అర్ధాంగి హిరణ్మయి. సాహితీ వ్యాసంగంలో రచయితకు వెన్నుదన్నుగా ఉన్న గురుతుల్యులు, ప్రముఖ రచయిత వాణిశ్రీ గారు. వీరు – తమ సోదరి అవధానం లక్ష్మీదేవమ్మ గారు, మేనమామ శ్రీ కె. సీతారామశాస్త్రి గార్లకు ఋణగ్రస్థులు.