Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

శాంతి

[‘శాంతి’ అనే శీర్షికతో ఐదు పద్య కవితలను అందిస్తున్నారు శ్రీ ఇప్పగుంట సూర్యనారాయణ మూర్తి.]


~
1)
శాంతి ప్రపంచ మానవుల సత్వముగాచెడి యోగమై మనః
శాంతిని పెంచి పంచెడి విశారద, జీవన గమ్యమున్నవి
శ్రాంతము వెంబడించు నొక సాటి మహత్తర పుణ్యమూర్తియై
శాంతనవుండు పోలికను సంవిధగూర్చు మహామనీషియై

2)
శాంతి ప్రపంచ మానవుల సఖ్యత భద్రత కొమ్ముకాచి సం
క్రాంతిని దివ్యదీధితుల కానుకనిచ్చెడి మంత్రయోగ వి
క్రాంతులకాలవాలమగు, కౌశల ధర్మనిబద్ధ సూత్రమై
భ్రాంతికి తావులేని నవభారత జీవన గమ్యమౌగదే

3)
మనసునుతట్టి జీవికను మాన్యత ధన్యవికాస రూపమై
తనరుగసాగు జీవనది, ధార్మిక ధోరణి నుత్సహించు, సొం
పొనరెడి పద్యపాదముల పుణ్యవిపంచిగ నిన్నుగాచి పా
వనమగు, శాంతి వాక్య పరిపాలన జేయగ నుద్యమించెడిన్

4)
చెల్మి నిరంతరమ్ము విరజిమ్మెడి మానస శాంతి రూపమై
కల్మషమేమి లేని రసకారక వాగ్ఝరి నాకుపంచుచో
వ్రేల్మిడి వైచినంత నవవేదిక నీడను రాగదీప్తితో
పల్మరునంకితమ్మిడగ పద్యకవిత్వ వినోది నయ్యెదన్

5)
శాంతి ప్రసన్న భాషణము,సఖ్యత ముఖ్య విశుద్ధ భావమౌ
కాంతి సహస్ర దీధితుల గమ్యము జేర్చును, మానసంబునన్
దాంతిని పెంచిపంచు మహదాశయ భాగ్య విశేష మూర్తియౌ
భ్రాంతి సమీపమందునను పాదము మోపదు, నన్ను గాచుతన్

Exit mobile version