ఆమెకెప్పుడో తెలుసు
ఇది ముళ్ళ కంచెల మధ్య జీవితమని
మేధస్సు కంటే శరీరానికే వెల ఉందని…
కామ ప్రసారిత దృశ్యాలతో
అది గాయాల గుట్టగా మారుతోందని…
లోపలి దుఃఖోద్వేగాలను
అలంకరణలు దాచలేవని…
ఒక మగవాడి చూపుల్లో
ఎందరో మగవాళ్ల కళ్ళు
బహుళమై బరితెగిస్తుంటాయని…
ఆమె కిప్పటికే బాగా తెలుసు!
చాలు… ఇక చాల్చాలు
ఈ వికృతావయవమాన భారత కథలు
ఇంక వినదల్చుకోలేదు.
నిఘా చూపులతో
నిట్టనిలువునా స్కాన్ చేస్తూ
జన సంచారారణ్యాలలో
మద మృగాళ్ళను వేటాడి పట్టటానికి
ఆమె శారీరక, మానసిక వేదనలను
అరికట్టి అదుపులో పెట్టటానికి
తన కోసం ఒక రక్షణ వలయం
విష్ణు చక్రంలా విస్తరిస్తోందనీ…
రోడ్డుపై, బస్సులో ఎక్కడయినా
బ్రహ్మజెముడు పుట్టల్ని పెకలించివేసే
పదునైన గునపాలు గెలుస్తున్నాయనీ…
ఎక్కడో… ఏ దేశంలోనో కాదు
మనల్ని నడిపించే నేల తల్లి సాక్షిగా
నరకుల పని పట్టిస్తున్నాయనీ…
అరచేతుల్లో మొలిపించుకున్న కామనేత్రాల
సుకుమార శరీరాలపై తడుములాటల్ని
ఖండించే ఖడ్గ రుద్రమలున్నారనీ…
ఆమె కిప్పుడిప్పుడే తెలుసోంది.
పువ్వులన్నీ పులులుగా మారటం
అడవులన్నీ అందమైన వనాలుగా రూపెత్తటం
విశృంఖల నీతి బాహ్యత
భయం చెరలో బందీ కావటం
స్త్రీ శక్తి బృందాల సంచాలనంగా
మనశ్శక్తి ప్రసారిత ఆశ్వాసనంగా
ఆమెకిప్పుడు బాగా తెలుస్తోంది.
ఆమెలాంటి అందరికీ
మరింత బాగా తెలిసి వస్తోంది.
(షీ టీమ్స్‌ని అభినందిస్తూ…)