Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సెప్పు!

‘మదను మోహను మాలివ్య’ మన దేశాన్ని అజాదు జేసుటానికని అంగిరేజోని తోటి కొట్లాడిన పెద్ద పెద్దోళ్ళళ్ళ ఒగ పెద్దోడు, పెద్ద వకీలు. అంగీరోజోడు మన దేశపు రీతి రివాజులని మాపగీట్టి, అని రీతి రివాజులని మన దేశంల పింపి మెరుపిచ్చాలనుకుంటన్న ఏళ్ళల, మాలివ్య, గా అంగిరోజోని ఆలోసలన  పారుల్లకు అడ్డం కట్ట ఎయ్యాల్ననుకున్నాడు. గదీనికని, మన రీతి రివాజులని యింకింత బలిమి జెయ్యాల్నన్న మనసుతోటి మనదేశంల, గదీ కాశీల ఒగ పెద్ద ‘బడి’ని  గట్టిచ్చాలననుకున్నడు. పెద్ద బడి అంటే, ఎంత పెద్ద బడి అంటె, పాత కాలంల మన దేశంల వున్న నలంద, తక్షశిల అసుంటి బడిని, అంగిరేజుని దేశం ఇంగిలండుల వున్న  ‘కేంబ్రిడిజి’ బడులసుంటి, దనియల్నే పెద్దయి, పేరు వడ్డ గసుంటి బడిని  గట్టాలననుకున్నడు.  మరి గంత పెద్ద బడి గట్టిచ్చటానికి సిన్న పైసనే అవుసురమా? బగ్గ  పైసగావాల్నాయె. గింత పెద్ద ఆలోసనున్న మాలివ్యనేమో మరి గంత పెద్ద సిరి మంతుడేమో కాదాయే. గందుకని బడి కట్టిచ్చుటానికి పైసల గురించి సందలు (చందాలు) జమజెయ్య వట్టిండు. సిన్న సిన్నోళ్ళయిచ్చే సిల్లర పైసలతోటి ఏమైతది. గందుకని పెద్ద పెద్దోళ్ళ దగ్గరికి పొయ్యి సందలు అడుగవట్టిండు. గా పెద్ద  పెద్దళ్ళు అంటె కాశి నవాబు అసుంటోళ్ళ అమోద్దెనవాబు అసుంటోళ్ళు గిసుంటి పెద్ద, సిన్న నవాబుల నుంచే గాకుంట, టాట, బిర్ల అసుంటి పెద్ద పెద్ద సిరిమంతుల నుంచి గూడా సందలు జమజెయ్యవట్టిండు. గిన్ని సందలు వసూలు జేసిన గూడ గా ‘బడి’ కయ్యే కర్సులు గోడలు గూడా లేసెటట్టు లెవ్వు!

ఇగేం జెయ్యాలే? మొదలు యిడి సెయ్యలనా? అహఁ ఎట్లనన్న జేసి అనుకున్న పనిని పూరగనే జేసి సూపాలె.. గప్పుడే తను గీ బూమి మీద పుట్టి, సచ్చిండు అన్నదానికి గుర్తు. పుట్టింనందుకు గాను గీ పనిని సేసే సావాలె. బతికి నంతలగీ పని జెయ్యాలె. జీవుడున్నంతలో భావజ్ఞుడవ  వలె అన్నాడు తత్వం జెప్పినోడు. గతిని గోరుచుండు ఘనయోగి యిలలోన అన్నాడు. గందుకనే తను గీ పని జెయ్యాల్ననుకుంటున్నడు. గని, ఎట్ల? గిప్పటి దాన్కి వసూలైన పైసలు – స్వాతి మెరుమదేమి సఫలగును?  అన్నట్టుగనున్నది.. గీ పని కడతిరాలంటె శ్రావణం మబ్బులు అసుంటియి కావాలె.. కార్యమేమో పెద్దదాయె. జమైన పైసేమో సిన్నగాయె.. ఏనుగు పడియిన్న ఎత్తునా మసకంబు అన్నట్లుగ గంత పెద్ద పనికి గీ జమైన పైసలు సాల్తయా?.. ఎట్లా?.. చెలగు దివ్వె లేక చీకటి పోవునా? నిక్కి చాసి నపుడె నిర్ఘాంతమబ్బురా.. అని ఆలోసనల్ల మునిగిండు. ఆకశంబు శూన్య మందు శబ్ధము పుట్టె అన్నట్టుగ ఏం లేదు అనుకుంటన్న జాగలనుంచి ఒగ తొవ్వ కనిపించ్చింది..పరమయోగి జాడ భక్తుండెరుంగురా.. అన్నట్టుగ మాలివ్యకు ‘నిజాం నవాబు’ ఆలోసన్లకచ్చిండు. నిజాం నవాబు అంటె అట్టోడేనా? పెద్ద సిరిమంతుడు. గీ దునియాకంతల గూడ అందరికన్న సిరిమంతుడు. గీ దునియ వున్న నాబులని, సిరిమంతుల నందరిని గూడ కొనగలిగినంతటి సిరిమంతుడు. గంతటి సిరి మంతుని సెయ్యివడ్డదా, యిగ తన కార్జెం ఒడ్డెక్కినట్టే. తను గింత మంచి పని జేస్తున్నందుకు నవాబు తనను మెప్పుకోలు జేసి పైసలిచ్చి ‘మేనల’ ఎక్కిచ్చి సాగనంపుతాడు!..  గంతే.. నిజమహాత్ము గూడి నిజమాడవలయిరా.. గుంట పట్టు చెలమకుల ముర్ధరించురా.. అచ్చెలను నీరు జల్లన విచ్చల మీడి నూరుచుండు.. గీ పని నిజాం నవాబుతోటే కడతేరుతది.. కడుమ ఎంత మంది అయినా గూడ సాలరు.. దుర్యోధన సామురాట్టు అంతటోడు! కడుమోళ్ళతోటి అయితదా? తడుక నడ్డు పెట్ట తలుపుతోసరియోనె? కడుమ ఎంత మంది సిరిమంతులైనా తడుకలే. నిజాం నవాబు ఒక్కడే తలుపు!

నిజాం నవాబు మూలంగ యిగతన పంట సేలికచ్చి నట్టే అనుకున్నాడు – వరుదలు, ముంపులు గిట్ట ఏం లేకుంటనే.. ఆలోసన అచ్చుడే అల్సెం లేదు, జెప్పజెప్పన బయిలెల్లి ఐదిరాబాదుకు సేరుకోనే సేరుకున్నాడు. సెరుకొని నిజాం నవాబును గల్సి అర్జీయియ్యనే యిచ్చిండు.. యిచ్చి నిజాం నవాబు సాబును అయన సురత్తనాన్ని, సూతారి తానాన్ని, పురుసాత్తనాన్ని, సిరిమంతనాన్ని పొగిడిండు..

“..ఏడాదిలో ఎన్ని ఋతువులున్నను, వేడుక జేసేది వసంత మొక్కటె!  అన్నట్టుగ గీ దునియల ఎంత మంది నవాబులున్నారో  గాళ్ళందరిల గూడ నువ్వే ఎక్కొనివి.. ఆళ్ళకిరిటాల మీద నువ్వే మణిక్యానివి. మిరాజ్జెం పువ్వుపిందెలట్లు భువనముల్ నిండెరా అన్నట్టుగ సిరితోటి నిండి వున్నది. ఎంత వారినైన ఎత్తున పడగొట్టు అన్నంతటిది మీ రాజిరికం. ఉదక ఘటము నందు నుపరి సూర్యునివోలే గీ దునియల నవాబులందరిల నువ్వే సూడరాకుంచ మెరుస్తన్నవు నిన్ను గింతంతనన్నసూడాల్నంటె గూడ కండ్లకు సెయ్యి అడ్డం పెట్టుకునేడే మీ పెద్దరికం మీ జాగీర్దార్ల అందరి యిండ్లళ్ళ పటములందు, గోడప్రతిమలందు మీరే. మీ బేగం సాహిబిన్‌ల మద్వతులా మది దోచిన రాగీ.. భోగులు.. రాగులు.. రాజుపాలిటికి వెరాజయోగంబులు.

గసుంటి మీరు మాకు గారవించి దప్పిక తీర్చు కాలమేఘమా అన్నసుంటోనివి!.. చెడనీక బ్రతికించు సిద్దమంత్రమా అన్నసుంటోనివి!..  గసుంటి మీరు మాకు గీ కార్జంల అసరైతే  పెండ్లిజేయునంత పెద్దఫలంబురా అన్నదానికంటె గూడ ఎంతో పెద్ద పలితం.. గీ బూమ్మీద మీ పేరు పిడీలు, పిడీలు నిలవడ్తది, వుంది పోతది.. భూతలమున రాము రీలి.. జన్మముల్ స్థిరమని జలనిధుల్ గట్టరా అన్నట్టగా మీరు ఎన్నెన్నో సెరువుల్ని తవ్వించిండ్రు.. గట్లనే గీ పుణ్ణెకార్జానికి గూడ ఆసరగండ్రి, సెయ్యెయ్యిండ్రి.. అన్నాడు.

గప్పటికే నిజాం నవాబు గూడ గీ మాలిన్య గట్టిస్తననుకుంటన్న గంతకన్న పెద్ద బడినే కట్టింయ్యాలననుకుటన్నాడు.. గిప్పుడు గీ మాలివ్యకు తను ఆసిరైతే, గా ఆసరతోటి గీనగా బడిని ఆల్సెంగాకుంట కట్టుతే యుగ గీన పేరే  ఎలుగుతంటది నడిమింటి సూర్యుని వారం గాతరువాత తను గంతకన్న పెద్దది గట్టినాగూడ యిగతన ఎలుగులేం కనిపించయి ఎవ్వరికి గూడ ఎతికి ఎతికి సూత్తామన్నాగూడ పగటి పూట సెంద్రుని వారం..

నిజాం నవాబు గిట్ల ఆలోసిచ్చి గీ పెండ్లి అనుకున్న ఏళ్ళకు జరుగద్దు!  తత్వాలు పడే ఏళ్ళ ఎనుక వడాలే.. గట్లగావాల్నంటె పెండ్లి గుండ్రాయిని, పొలు గర్రని కనిపియ్యకుంట ఓరకు జరపాలె.. దెవులాడుకుంట సస్తరు, ఏడ్సుకుంట సస్తరు. సావనియ్యి సాలెగాడు మిడుక్కుంట! సిల్లికొత్త అసర గాను అనుకున్నడు. గని గీ అసలు ముచ్చటను ముందుటెయ్య లేదు. లోపలిమాటను బెటవెట్ట లేదు. ఒడలగుణము వేరే యోజ వేరే అన్నట్టుగ యింకోమాట ఒప్పవట్టిండు..

ఏంటదేంటిది నువ్వు అంగిరేజోని రీతిరివాజులు ఎదుగ కుంట గదేశంల, హిందువుల గురించి బడి గడ్తవా. గీ రోజు అంగిరేజోని ఎదుగులని తరుగు జెయ్యాలన్ననుకునెటోనివి రేపనంగ మా తురుక రాజుల ఎదుగుల గూడ వుప్పెయ్యవాయిగ  పప్పువుడుకకుంట అంగిరేజోనికే నువ్వు సూటి వెడ్తావా? అంగిరేజోడు అంటె ఎవ్వడనుకుంటన్నవు? రాముడు! నేనేమో సుగ్రీవుణ్ణి, రామునికి కుడిబుజాన్ని! ఎడమ భుజాన్ని గూడ నేనే విభీషముని వారం! గసుంటి మా ముందటనే నువ్వు గిసువంటి కూతలు గూస్తవా సిలుక వారం! నేనంటే ఏమనుకొని వచ్చానవు? నేను సొక్కం ముసల్మానునని నీకు తెలువాదా? నేను ఇస్లామును సంకనేసుకుంట, మీ హిందుమతాన్ని బొక్కబోర్ల వడనూకుత! నేను తురకాన్ని చెపిస్త, మీమంది బాసల్ని తుక్కతుక్కు శెపిస్త.. గట్లని నీకు తేలువదా? తెల్సుకొందే నా ముందటికి అచ్చినావా? ఊహుం. గింత బగ్గ జదివినోనికి గయన్ని తెల్వకనే వుంటయా? తెల్సేవుంటవు. తెల్సే తెగిచ్చిన సువంటి మొండోనివే. నీ కెంత హిమ్మతు.. ముర్ఖనకును బుద్ది ముందుగా పుట్టును అన్నట్టుగ నువ్వు గసుంటి మూర్కుపోనివి. నేను త్రోయనేర్చుకుక్క దొంతులు పెట్టునా అన్నసువంటోన్ని మీ మతాన్ని బాసలని తోస్త, మామతాన్ని, బాసను పేఏస్త తెల్సా! నేను నా రాజ బసని గాక మీ బానిస బాసలని సైసుతనా..?

అని నవాబు అంటాంటే, మాలివ్య యిని చెప్పునంతయి విని మెప్పుగా బలుకు మా అన్నట్టుగ-

ఏమన్నరు! గిక్కడి మంది మతం బాంచె మంతం, గిక్కడి మంది బాస బాంచోళ్ళ బాస, గిక్కడి మంది అంత బాంచోల్లా?.. గీ నాడు మీరు గీసిరి తోటి గూకోని తూగుటుయ్యాలల వూగుతున్నరంటె గా వుయ్యాలెకు గట్టిన తాళ్ళెవ్వరు?

గీ మతం, గీ బాసల, గీ మంది గాదా? గా సిరితోటి నువ్వు బోగిస్తన్నవు అంటె గా బోగపు మంచానికి కోళ్ళు గీ మతపు, గీ బాసల, గీ మంది గాదా?  నువ్వు గింతకు ఎదిగిన మూలపుగా పునాది రాళ్ళను, గామందినే గింత తిమ్సికారంగ మాట్లాడుతవా? సవతి తల్లి జూడ సాకులు నెరపును అన్నట్టుగ నువ్వు గిక్కడి మందిని – నీ సిరిని పెంచిన దాదుల్ని సమితి తల్లి వారం జూస్తవా? తల్లి రొమ్మునే తంతవా? చెఱకు వెన్నుబుట్టి చెరచదా తీపెల్లె అన్నరు. ఎదుగుకు మూలమోళ్ళనే తన్నుటానికి జూస్తె నువ్వే బోర్లపడ్తవు. గీ యింగితం తెల్సిన ‘అగ్బరు’ సుల్తాను ఎదిగిండు, గది తెలువని ఔరంగజేబు సుల్తాను తరిగిండు. ఏ తొవ్వ పట్టాల్నో జూసుకో… దాని రక్షణంబెవాని రక్షణ యగున్ అన్నరు… నిన్ను కాపాడుతున్నది గీ మందే. గదీనికి బదులుగా నువ్వు గాళ్ళను, గాళ్ళ మతాన్ని, గాళ్ళ బాసల్ని కాపాడుట నీ ధర్మం. పురుష యత్నమనుచు పొంగుట ఏలరా అన్నారు. నీ గీ సిరి అంతగూడ నీ సెమటలు మూలంగ ఎదిగింది అనుకునేవు గిట్ట… నీ జాగీర్దార్ల మూలంగనే ఎదిగింది అనుకునేవు గిట్ట! జాగీర్దార్లు అంత గూడ గండభేరుండాలు… అందర్ని టెలికిస్తున్నది, అందరికి బువ్వ పెడ్తున్నది గీ మందే అని మరువకుండ్రి. నవాబులు, జాగీర్దార్లు పెంచుకుంటున్న నెత్తురు గీ మంది సెమటలు తాగే అన్న సంగతి మరువకుండ్రి…. ‘పాలు తమకిచ్చునే ఎచ్చటైన లేగల కుడువగనీనిచో – కెరలి గోవులు తన్నును గాక…’ అన్నరు. గా మందిని సుకపెడ్తెనే నీకు  బలిమి…. గంతేగని జాగీర్దార్లను జూసుక ముర్సుడు గాదు…  తొడగియాలు నమ్మి తొత్తును గొన్నట్లు – కుక్క బొక్క నమ్మి కూటిని విడువదా అన్నట్టుగ నువ్వు జాగీర్దార్లను నమ్ముకోని నీ మందిని దూరం గొడ్తన్నవు – అంగిరేజోని వారం – ‘కారున్‍వాలీసు’ గదా జమీందారీ పద్ధతుల్ని మొదలు వెట్టినట్టుగ… నూనె లేక దివ్వె నువ్వుల మండునా?

గీ మంది సెముటలు లేకుంట మీ సిరి నిలుస్తదా? నీ గీ రాజరికాన్ని, సిరిని మోస్తన్న బోయల మీదనే వూంచుతావా? గసుంటి ఆలోసనల్ని మానుక. మేం జేస్తున్న గీ పనికి ఆసరగా…” అన్నడు మాలివ్య.

మాలివ్య గిట్ల మాట్లాడగనే నవాబుకు మస్తు కోపమొచ్చింది. మంట పుట్టింది. నవాబు అన్నడు –

“ఏమంటున్నవు! నువ్వు సోయిల వుండే మాత్లాడుతున్నావా? లేకుంటే ‘నల్లగల్లు’ తాగొచ్చిన రిమ్మల గిట్ట ఏం తెలువకుంట, ఎక్కోతక్కులు మర్సిపోయి మాట్లాడుతున్నావా?” అని.

నవాబుకు మెప్పుకోల్ల మాటలే తెల్సుగని, గీ ఎదురిచ్చే మాటలు తెలుసా? కదకా మ్రింగు వాదు గరళంబు మ్రింగునా? మాలివ్య మాటలు నవాబుకు దురుకువెట్టినై. గదీం తోటి యింకింత కోపానికొచ్చి నవాబు “బుద్ధవానికేల పో కుప్పిగంతులు అన్నారు… నా ముందట ఏ లెక్కక్కు రాని మనిషివి  నన్నే తిమ్సికారం జేస్తవా? నేనేంటిదో, మా వంశమేంటిదో తెల్సా నీకు?” అన్నడు.

“తెల్సు, తెల్సు మొగల్ బాదుషని ఎనుకకెల్లి పొడ్సిన సంగతి తెల్సు… మన గడ్డ మీది నవాబులంతా గూడా అంగిరేజోన్ని ఎదిరిచ్చి పాగాలు యిస్తుంటే మీరేమో, గా అంగిరేజోనికి సలాములు గొడ్తు, సంకల కెక్కిచ్చుకున్న సంగతి తెల్సు… నిరుడు మొన్నటేడు నిన్న మొన్న, దగ్ధులైన వారు తమకంటె తక్కువా అన్నట్టుగా – ఒకనాడు గా అంగిరేజోడు – ఆ అంగిరేజోన్ని మోస్తున్న నువ్వు గూడ కూలవడ్తరు. గీ దేశ ‘బత్తులు’, గీ పజల బత్తులు గెలుస్తారు, ద్రోవులు సస్తరు…” అన్నడు  మాలివ్య. గీ మాటలతోటి నవాబుకు అరికాలి మంటలు నెత్తికెక్కినై. ఇగ కోపం బిగవట్టలేక, నిజాం నవాబు తన ఎడమ కాలు ‘సెప్పు’ను మాలివ్య మొకానికేసి వుతికిండు! వుతికి “హిందువులకు బడి గట్టటానికి నీ అసుంటోనికి సంద యియ్యాల్నారా నేను! ఇగో, యిచ్చిన, తీసుకో! నీ బడికి నా సంద యిగ గిదే” అన్నడు. నిజాం నవాబు దర్బారుల మాలివ్యకు గింతపని జరిగింది… ఏ యుగమందున ఏ యిల్లాలు ఎరుగదు తల్లీ ఈ అవమానం! కురు రాజు సబల దౌపదికి జరిగినంతటి అవుమానం… నవాబు అన్నడు –

“నువ్వు గింతాగింత కూసినందుకు – గా కొంగ, మీద రెట్ట ఏసినందుకుగాను దుర్వాసుడు కొంగను బస్మం జేసినట్టుగ నేను నిన్ను బస్మం సెయ్యజాల్తను. గని బతికి పొయ్యినవు – గా దర్మవ్యాదుని పెండ్లాం వారం! ఎందుకో తెల్సా? దర్మవ్యాధుని పెండ్లాం పతివర్త అయితే, నువ్వేమో నా జాగీరు భాంచెవు కానందుకు! నిన్ను వురి దియ్యకపోయినా, నా జైళ్ళ పెట్ట జాల్త నిన్ను. గని, పుకట్ల నా గటుక బువ్వ ఒడ్సిపోతది, కర్సయితది, నిన్ను సాదుటానకి ఎర్తమైతది. నిన్ను నా ఎడుమకాలు సెప్పుతోటి మొకం మీద గొట్టి గదాన్నే నీ బడికి సందగ యిచ్చిన… – గీ యిచ్చిన ‘సందకములం’ సాలా? యిగ పో – గా సందను వట్తుకొని జెల్ది పో… మొనగాని పిట్తనని మోరెత్తి సూస్తావా? కూతలు కూస్తవా?” అని – ‘మరుగ కాగిన తైలము నీటిబొట్టుపై బడునెడ, నా క్షణం బెగసి భగ్గున మండకయున్నే?’… దాత యోర్చినట్లు అధముడొర్వగలేదు… అనుకున్నామని జరగవు అన్నీ!…

మాలివ్యకు అంతటి అవుమానం… గిట్లని  – వెల్లేది తెల్సుంటే అసలొచ్చి వుండవు! కొండంత అడియాస… గంతనే గాదు – గింతటి అవుమానం… హృదయంలోన పరితాపం… ఆసలు తీరని ఆవేశములో, ఆశయాలలో ఆవేడనలో… నమ్మినవారే పొమ్మన్నారే – వుత్తగ గాదు – సెప్పుతోటి గొట్టి – గప్పుడు మాలివ్యల – పెరిగింది ఏదో మరో లోకం. జీవలింగ పుజ జేసెడి వాడికి శిలల రూపమందు చింత ఏల? యోగపురుషుడేల యెడల పాటించును?

కష్టసుఖముము లనేవి కలిగిన తలకు… అది పిలుపో, మేలుకొలుపో! కత్తిని విసిరే వానిని ఆ కత్తితోనే గెలవాలన్ని!… నవాబును మగువలు కొలువగ దరిజేరగ మతిమాయుట యతులకు న్యాయమా? తన ఈతలు నేర్చిన యోగము చేదిరుగక యున్ననేమి జేయును? ధర్మరాజు గూడా ఓర్వలేదా, మానావమానములను… కౌటిల్యునికి నందుని సబల జరుగలేదా గింతతి అవుమానం… కౌటిల్యుడు కుచ్చిన ముల్లును కాల్చుక తాగిండు… తను గూడ తనను కొట్టిన సెప్పును గట్లనే యిడ్సిపోడు… కొట్టిన ఎడమకాలి సెప్పును కుడిసేతులకు తీసుకున్నదు! గులేబకావళి పువ్వును వారం బద్రంగ పట్టుకున్నడు… ఏమి రోగం కుదురిచ్చాలననో!… నవాబూ! నీ ఎడమకాలు సెప్పు – గిదే – నీ పదనోకుర నిస్వణమా అన్నట్టుగ – గీ దీన్నే నా  బడికి వాణీ వీణా నాదమా అన్నట్టుగ జేస్త!… బుద్ధికి నశక్యమగు పని యిద్ధాత్రింగాన గలదె? ఇదె గెలిచెద నా బుద్ధి బలంబున. సింహము  నుద్ధతి యణిగించి… బుద్ధి తెల్సియున్న భువనముల్ దాల్పదా? నాలో ఏదో నవ భావనగా మెల్లిగ వీణ మ్రోగింది! పర్వత వనవాసి పరిణామ వర్తన కూపవాసి కెట్టు గుర్తు పడును? ఎక్కువెట్తి మదిని ఏకాంతమున జేర్చి మొక్కు వాడె వరము దక్కువాడు… బాట తెల్సినపుడె బ్రహ్మంబునందును… ఏక చిత్తముతోడ ఎరుకిచ్చి చూడరా… పెద్ద లుసురుమన్న పెనుమంట లెగయవా?… మొదలు చూసి చూసి తుద జూడకుండెనా చూపు తప్పి వాని సుఖము జెడును… కంటిపాపలోనె కారణంబు… కాలి సెప్పు కారణం గనె! జంత్ర తంత్ర మహిమ జాతవేదుడెరుంగు… చూపులోని కుంచి చూడంఘ వలయురా… కూలబడిన నరుదు కుదురుట అరుదయా… తా తెగించువాడె దండియౌ భువిలోన… నేర్పెరుండు వాడె నెరజాణ యిలలోన… నిలువ నేర్చిన బిడ్డ నేలబడడు!… చింతపండు రాగి చిలుమూడగొట్టిన యట్టులుండు యోగి గట్టివాడు!… ఇపుడేమన్నా ఒప్పునులే యిక ఎవరేమన్నా తప్పదులే… ప్రాత పిడుకలు పేర్చి పుటముంచి చూడరా! కొత్త ఎత్తులు చిత్తు జేసి… మదగజంబును బట్టి మావటి కట్టడా!…

గిట్ట గిట్ట ఎంతంతగనో ఆలోసిచ్చి మాలివ్య గా సెప్పును సేతుల వట్టుక ‘బేగమ్ బజారు’కు పొయ్యిండు! గీ సెప్పునే నవాబు తనకు సందగ యిచ్చెనాయె! గిదీన్ని తను హర్రాసుకు వెడ్తడు! గణికి లొప్పియున్న గవ్వలు జెల్లవా? గిది నవాబు కాలు సెప్పాయె… మంది ఎగవడి పాడ్తారు!… మస్తు పైసలకు పాడ్తారు… తనను అవుమానం చేసిన సెప్పే తనకు లెక్కలేనంత పైసను జమేస్తది!… ఇంద్రజాలికుండు ఎందులో జిక్కురా!…

ఒంటికాలు సెప్పును హర్రాసుకు పెట్టి మొత్తుకోవట్టిండు… “మంచి సమయం – మించిన దొరకదు… గిది మాములి హర్రాసు గాదు – నిజాం నవాబు కాలు సెప్పు అర్రాసు! గులాబినై నీ జడలో వెలగానే ఆనడు అన్నసువంటింది!”

మాలివ్య మొత్తుకొంటాంటే “ఏంటిది గిది?” అని అడిగిండ్రు. మాలివ్య జెప్పిండు “గిది నిజాం నవాబు ఎడమకాలు సెప్పు” అని! “అర్రాసుకు వెట్టిన… మామూలి వస్తువు గాదు. నిజాం కాలు సెప్పు… గి దీనికి ‘కలవా – విలువలు సెలవీయ!’ ఎంతటి యిలువైన వస్తువ… ఎవరిని ముందుగ వరియించునోయని తొందరలో మలిపోవుగద అన్నట్టుగ – మీ మతి పోకముందే జెప్పన ఎక్కో దరకు పాడి దక్కిచ్చుకోండ్రి. లేకుంటే ఆశ అడియాసనే – దక్కలేదు గద అని దుఖపడ్తరు! వింతగాదు నా చెంత యున్నది వెండి వెన్నెల జాబిలి! అందుకో జాలనీ ఆనందమే నీవు – గని, మీకు అందివస్తంది. పాడుండ్రి – అందరికన్న ఎక్కో పాడినోల్లకు అందుతది – అందరానిది…” అన్నడు. గుమిగూడి మంది సిత్రంగా జూస్తన్నరు – జిలుగు వెలుగుల శిల్పాన్ని – చిరుగు పాతల కరువు బ్రతుకులోల్లు!

ఒగరి కొతరు జెప్పుకుంటండ్రు “గిది మన నిజాం నవాబు ఎడమకాలు సెప్పట! ఎంత మంచిగున్నది! నీ కాలి మువ్వల రవళి అన్నట్టుగ! ఈ బ్రతుకే మనకిక చెరి సగము అన్నట్టుగ మన నవాబు కుడిక్జాలు సెప్పు తను వెట్తుక, ఎడమకాలు సెప్పు గీన కిచ్చిండంట… ఎంత మంచి గున్నది!…” అని.

“పాడుండ్రి, పాడుండ్రి… కోట్ల విలువ జేసేటోడు, నవాబు తొడిగిన కాలు సెప్పు – ఎన్ని కోట్లకు పాడుతరో పాడుండ్రి!” మాలివ్య/

“కోట్లకా? గీ సెప్పును కోట్లకా! ఏంటిది పాత కోట్లకు బదలా? గవి గూడ మాకు లెవ్వు… మా అత్తగారు పెండప్పుడు గూడ ఒగ కోటు కట్నం పెట్టే గలి లేనోళ్ళే – యిగ మాకెక్కడ వుంటయి? – పిందె గోసి జూడ బీజంబు గల్గునా?” అన్నరు.

“కోట్లు గాకపోతే లక్షలు…” మాలివ్య.

“లక్షలా?… గీ సెప్పుకు లక్షలా? ఎవని దగ్గెరున్నయని?” మంది.

“లక్షలు గాకపోతే వేలు…” మాలివ్య.

“వేలు గాకపోతే?…” మంది.

“నూర్లు…” మాలివ్య.

“నూర్లే అన్నవు గాని యిగ గంత కన్న తక్వ లేదా సర్కారు పాట?” మంది.

“గీ హర్రాసుల సర్కారు పాట ఏం లేదు. ఎంత కన్న పాడచ్చు”… మాలివ్య.

“ఎంత కన్న గూడా పాడచ్చునా?” లేని కాలమునకు లేను మనము నొండు…

“ఆఁ, ఎంత కన్నా గూడా పాడచ్చు” మాలివ్య.

“అయితె నా పాట ‘ఏకారా!'” అన్నడు ఒగడు.

“ఏంటిది! నీ పాట ఏకారానా?”

“గంతే. లేకుంటే ఒక్క సెప్పుకు ఏకారా కన్న ఎక్కోపెట్టుడా? ఇంకో సెప్పు గూడ తే. దొవ్వారాకు పాడుతం!” ఎందుకో చేరువై దూరమౌతావులే!…

ఉదకంబు లేకున్న వేరెట్లు దిగునయా!

“ఇంకో సెప్పు దొరుకది. ఒక్కటే సెప్పు… అయినా గూడా గిది – ఒక్క సెప్పా, రెండు సెప్పులా అన్న ముచ్చట గాదు గీడ…. గిది నవాబు సెప్పు. గ దీనికి విలువ…” మాలివ్య.

“నవాబు సెప్పు అన్నరు గావట్టి గదీనికి గంతే విలువ. ‘ఏకారా’ కన్నా ఎక్కో లేదు… గాడ ‘హరేక్ మాల్ సాడే తీనానకే!’ ” మంది.

“మీరు మస్తుగ కంజూసోళ్ళ వారం వున్నరు…” మాలివ్య.

“మీరు మమ్ముల్ని కంజూసోల్లు అంటున్నారు గని గీ నిజాం నవాబు ఎంత కంజూసోడో మీకు తెలుసా?…” మంది.

“ఏంటిది నిజాం నవాబు కంజూసోడా?…” మాలివ్య.

“కంజూసోడా ఏంటిది, నవాబై వున్నోడు గని, గింతటి కంజూసోడు గీ దునియాలోనే వుండడు. …. గింజ ఏరుక కడుక్కోని తింటడు! మేక ‘కూర’ గాకపోతే, ‘తోలైతే’ తోలేసై అంటడు. పేరు ధర్మరాజు పెను వేపవిత్తయ్యా!”

“నువద్దేనా?”

“అవద్దమనుకుంటున్నావా? నేను అవద్దం ఆడుతె, యింకెవల్నన్న అడుగుండ్రి తెలుస్తది… తనయుని జననంబు తల్లి తానెరుగదా!?…

“ఎట్ల కంజూసోడో సెప్పు”

“ఒక్కడేంటాది… బేతాళుని కథల వారం ఒడువకుంట జెప్పవచ్చు గని, సాత్రం పూర్తిగ ఒగటికి, రొండు సంగతులు జెప్పుత యిగ యిను…. ఒక పారి మా నవాబు ఎప్పుడు గూడ ఏం కొనక ఒకపారి ఐదు రూపాలు పెట్టి సొక్కుం నెయ్యి గొన్నదు. గది గూడా తిని వీడువగొట్తుకునుటానికి గాదు. అట్టి వాసన జూసుకుంట ముర్సుటానికే… గంత గుమగుమల వాసనల నెయ్యిని ‘బేగం’ గిట్ట పసిగడ్తె – రొయ్యల వాస బట్టిన పిల్లివారం ఎవ్వరు జూడకుంట గుటుక్కుమని గిట్టు అంటదని, బేగం కండ్ల వడకుంట, ముక్కు కానకుంట ఓరకు వెట్టుకోని నవాబు ఒక్కడే వాసన జూసుకుంట మురువవట్టె – కామధేనువు వారం, ఎంత వాసన జూసినా తరుగదనుకోని సంబురపడవట్టిండు – ఐదు రూపాలు పోతే పాయెగని ఎంతకు తరుగని బాయి. వాసన పీలుస్తాంటే, గాలి వూరుతాంటాది… గుమ గుమ…. గట్ల గట్ల వాసన జూసుకుంట రోజులు ఎల్లదీస్తాంటే, గా తరువాత తరువాత గా నెయ్యి వాసనను జూసుకుంట మూతి ఎట్లనో వెట్టవట్టిండు. ఎందుకంటే గా నెయ్యి మురుగు వాసన వట్టింది. గప్పుడనుకున్నడు – ‘కొన్నడు గాని నాలి రుసి జూసి సచ్చింది గాదాయె- పేగు అరిగిచ్చుక సచ్చింది గాక పాయె – గిప్పుడు ముక్కు గూడ మురికి సూడ లేకుంట అయిపాయె… పారేసుటానికె పనికి రావట్టె… గని ఐదు రూపాలకు కొనె… పుకట్ల పారేసుడా? మనసొప్పుత లేదాయె…’. గందుకని నవాబు తను అంటే బగ్గ బమలున్న ఒగ నౌకరిగాన్ని పిల్చి వున్నదంత ఆనికి మూడోకంట్ల పడకుంట జెప్పి పారేయకుంట ఎంతకైతే గంతకు దాన్ని అమ్ముక రమ్మన్నాడు. జీతగాడు గా నెయ్యి గురిగి వాసన జూసి – “ఎట్ల దేవుడా!” అనుకుంటండంగ, నవాబు జీతగాని ఆలోసల్ని జదివి “అరేయ్! నీ లోపట నన్ను తిడుతున్నవారా బే! గీ నెయ్యి గురిగిని నువ్వు అచ్చినకాడికి అమ్ముకు రాక పొయ్యినవనుకో – గా నెయ్యి, నువ్వూ యిగ యిద్దరూ అటే – నీ నౌకరీ పీకేస్తా సుమీ!” అన్నడు… గదీంతోటి జీతగాడు మురుగు నెయ్యి గురిగిని బద్రంగ, గరుడుడు గదా అమృతం కుండని పట్టుకోని పోతున్నట్టుగ, గీడు బజార్లెంబడివడి పోవట్టె – “నెయ్యి దీసుకోండ్రి నెయ్యి, సొక్కం నెయ్యి దీసుకోండ్రి, సొక్కం నెయ్యి! అగ్గువల తీసుకోండ్రి అగ్గువల…” అనుకుంట పోతాంటే గా పక్క నుంచి పొయ్యెటోళ్ళు ముక్కుల మీద కొంగులు అడ్డం వెట్టుక గీన్ని తిట్టుకుంట ఆళ్ళు దూరం దూరం పోవట్టిండ్రు – “గా సచ్చి కుళ్ళిన ఎలుకని వట్టుక నెయ్యి అంటావురొ” అని!

గీనికి మస్తు కోపమచ్చింది మంది మీద. గని, పేదోని కోపం పెదివికి సేటు అనుకోని నోరు తెరువకుంట పడి వున్నడు. లేని దానివలెనె దీన వాక్యములాడు… ఎవరేమి అన్ననేమి ఎగతాళి జేయనేమి? కాళ్ళు లెని పక్షి కాట్టాడబోదురా!… మోత చేటే గాని మోక్షంబు లేదురా! అన్నట్టుగా ఎందుకంటే గీ నెయ్యిని అమ్ముకరావుట్ల నవాబు గోన్ని మాటలు జెప్పి పంపిచ్చిండు. “అరేయ్ లంజ కొడుక! గీ నెయ్యిని అమ్ముక రాకుంటే  నీ నౌకరి దీస్త” అన్నడు. గందుగని నవాబు పేరు మీద రువాబు జేసుటానికి లేదు. తిట్టి తిట్టక మునుపె కొట్టనే రాదయా అన్నడు తత్త్వం జెప్పినోడు. కొట్టేదుంటే ఆళ్ళు తిట్టినంకనే కొట్టుమన్నడు. గని, గిప్పుడు మట్టుకు మంది తనను కొట్టిగా గూడా తను ఆళ్ళను తిట్టలేడు…. గీ మురుగు నెయ్యిని పట్టుకపోతాంటే, మంది తనను పుచ్చిన కుక్కను దూరం గొట్టినట్టుగ కొడ్తన్నారు. కొనుడు ఎవడు కొంటడు గని, కొట్టకుంటె జాలు, అమ్ముడేం అమ్ముతడు గని, తన్నులు తప్పించుకుంటె జాలు…. గదీంతోటి నౌకరుకు బేజారొచ్చి… ఏం గుళా యిచ్చుకున్నదో ఏమో గని, గ నెయ్యి గురిగిని ఎవ్వరు మెసులని జాగాల పారేసి  నవాబు దగ్గెర కచ్చి తన జేబు నుంచి ‘పది రూపాలు’ దీసి నవాబుకిచ్చిండు. నవాబు గది జూసి, “ఏంటిదిరా గీ పది రూపాలు” అని అడిగిండు కండ్లు మిలమిల మెరుస్తుంటే!. “ఏంటిదేంటిది – పది రూపాల నోటు – గా నెయ్యి అమ్మి తెచ్చిన!” అన్నడు నౌకరోడు. “ఏంటిది? గా నెయ్యి అమ్ముతె పది రూపాలు అచ్చినయరా?! సొక్కం నెయ్యే ఐదు రూపాలైతే మురిగిన నెయ్యిని పది రూపాలకు ఎట్ల అమ్మినవురా? నువ్వు అమ్మినా గూడ గా కొన్న తెలివిలేనోడు ఎవడురా?” అన్నడు నవాబు. “మన మంది తెలివి తక్కోళ్ళు అయిన మూలంగ గాదు, నా తెలివి ఎక్కో అయిన మూలంగ బోర్లెయ్యగలిగిన. గది గుర్తుంచుకో…” అన్నడు నౌకరోడు. గదీనికి నవాబు మస్తుగ యిదై పొయ్యి “గా ‘సీకిరెట్టు’ ఏంటిదో గింతంత నాకు గూడా సెప్పవారా బిడ్డ” అన్నడు. నవాబు గాన్ని బుదరకిచ్చుకుంట… గని నౌకరు అన్నడు – “పిల్లి, పులికి అన్ని విద్దెలు సెప్పింది, నేర్పింగి గని, సెట్టునెక్కుడు నేర్పలేదట… గది గూడ నేర్పుతే యిగ పులి, పిల్లిని ఖాతరు జేస్తదా? గా ‘సీకిరెట్టు’ నేను జెప్ప! గంతేగాదు… మురుగు నెయ్యిని, పారేసే నెయ్యిని పైసకైతే పైసకాయె అమ్ముకరమ్మంటివి. అమ్ముక రాకపోతే నౌకరీ పీకేస్తనంటివి. గా పైసకు పోని నెయ్యిని నేను పది రూపాలకు అమ్ముకస్తిని. మరి గిప్పుడేం జేస్తవు?” అడిగిండు నౌకరోడు. “పారేసే నెయ్యిని పది రూపాలకు అమ్ముక రాగలిగిన గీ లంజ కొడుకు తెలివి మామూలి తెలివి గాదు. గింత కొంపలు ముంచే తెలివి గలోడు తనకెప్పటికి అవుసురమే” అనుకొని నవాబు ఆని జీతాన్ని డబుల్ జేసిండు. ఆని ‘గిరేడు’ని డబుల్ జేసిండు…

అగో గసుంటోడు మా నవాబు అంటే! గంతటి కంజూసోడు… బేతాళుని కథల వారం యింకో కథ – మా నవాబు ఎప్పుడు గూడ సిగిరేట్లు కొనుక్క తాగడు, అడుక్క తాగుతడు. గది గూడ అంగిరేజోని అసుంటోళ్ళ దగ్గెర. గా అడక్క తాగె సిగిరేట్లను గూడ ఒక్కపారే పురాగా ఒక్క సిగిరేటును తాగడు. పొద్దుగాల సలిది తిని, సాయి తాగినంక నాలుగు బుక్కలు తాగుతడు. నాలుగు బుక్కలైనంక గా సిగిరేట్ను మలిపి దిగూట్లె దాసుకోని, పగటీలి బువ్వ దిని ఒగ కునుకు దీసేముందు మళ్ళ నాలుగు బుక్కలు తాగుతడు. మలిపి, మళ్ళ రాత్తిరి బువ్వుఅ దిన్నంక ఆయింత కొరుకును ఒడగొడ్తడు. అగో గంత కంజూసోడు. మా అసుంటోళ్ళు ఏం లేక బీడి కొరుకుని సెవుల వెట్టుక మళ్ళ మళ్ళ తాగుతె, నవాబేమో గంత వుండి గూడ గంత కంజూసితనం జేస్తడు… పేడ దినెడు పురుగు బెల్లమేమెరుగును! పుండు ముసరునీగ పూవుపై వ్రాలునా! పొట్టు దినెడి, లండి బువ్వలు పెట్టునా! గసుంతోని సెప్పును పైసకు గూడ పాడ యిలువ గాదు. గని, ఏకారేకు పాడుతున్నమంటే గందుకు ఒగ కారుణమున్నది” అన్నడు.

“ఏంటిది గా కారుణం?” అడిగిండు మాలివ్య.

“మా నవాబు ఎంత కంజూసోడు అయినా గూడ, ఎంత ‘కొంచెపోడు’ అయినా గూడ గిన్నన్ని మంచి బుద్దులు గూడ వున్నయనిపిస్తది.” మంది.

“ఏంటిది గా మంచి బుద్దులు?” మాలివ్య.

“ఏంటిదంటే… ఒగపారి ఒగ తెల్లోడు మా నవాబుని తిమ్సికారం జెయ్యాల్ననుకోని “ఏంటిది నవాబు – నీ దేశం! ఎక్కడ తిరిగి చూసినా నీ రాజ్జెంతట గూడ ఆదిలా’బ్యాడ్’, నిజామా’బ్యాడ్’, హెద్రా’బ్యాడ్’, సికింద్రా’బ్యాడ్’… ఎక్కడ జూసినా బ్యాడ్, బ్యాడ్, బ్యాడ్… నీ రాజ్జెంలనే గాదు, మీ దేశమంతటిల గూడ…. అహమ్మదా’బ్యాడ్’… అంతట గూడ బ్యాడ్, బ్యాడ్… వెరీ వెరీ బ్యాడ్ మీ రాజ్జెం, మీ దేశం” అన్నడు గా తెల్లోడు నవాబుతోటి. గా తిమ్సికారానికి సమాదనంగ గప్పుడు నవాబు అన్నడు – “నువద్దే – మా రాజ్జెంల, మా దేశంల ఎక్కడ జూసినా ‘బ్యాడే’. గని మీ దేశాంల ఎక్కడ జూసినా ‘లండ్’, ‘లండ్’, ‘లండ్లే!’. ‘ఇంగ్‍లండ్’, ‘పోలండ్’, ‘ఐర్‌లండ్’,… మీ దేశం నిండా ‘లండ్’లే!” అన్నడు. గదీంతోటి గా తెల్లోని మొకమంత నల్లవడ్డది… గట్ల ఎదురు దెబ్బలు గొట్టుట్ల గూడ మా నవాబు మొగోడు. గసుంటి బుద్దులు గోన్ని వున్నందున గాయినకు, గాయిన సెప్పుకు ‘ఏకారా’

యిలువ పెడ్తున్నం” అన్నడు. హస్యమాడు వాడు అన్ని కూతలు గూయు అన్నట్టుగా మంది అంత గుడ నవాబు గురించి తలో తిమ్సికారపు మాటలనుకుంట నవ్వుకో వట్టిండ్రు. కొండ లోపల జేరిన గండడుగునే? అనవట్టిండ్రు.

గీ ముచ్చెట ఏగులోల్ల మూలంగ నవాబు సెవుల వడ్డది. నవాబు గీ ముచ్చెటను వజీరు తోటి ఆలోసిచ్చె.

వజీరన్నడు “మీరు గాయినను సెప్పుతోటి యిసిరి పొరపాటు జేసిండ్రు నవాబ్ సాబ్ – ఎంత గాదన్ని గూడ ఆయన మస్తుగ సదువుకున్నోడు గద. మన మౌల్వీ అసుంటోడు గద. గసుంటి మనిషిని సెప్పుతోటి కొట్టస్తదా? గీ సంగతులన్నీ గూడ ఆయిన రేపు అక్బార్ల కిస్తడు. గీ సంగతులన్ని గూడ దునియ దునియల తెల్సిపోతై. మీ కంజూసితనం గురించి లోకులు నవ్వుకుంటరు… గట్ల గాకుంట వుండాల్నంటే గా మనిషిని మస్తు ఖుషామత్ జేసి పంపించాలె. కామమెచ్చు గాని కొదుకెచ్చు నాయెనా అన్నడు తత్త్వం జెప్పినోడు.  మీ యిజ్జతు పోకుంట వుండుదు ఎక్కోగని, ఆయినను ఖుషామత్ జేసుడు ఎక్కోనా?”

“నువ్వద్దే. సెప్పుతోటి గొట్టుకు గలతే… గిప్పుడు ఏం జెయ్యాలె మరి?” నవాబు.

“ఏం లేదు. ఆయినను రప్పిచ్చి, మాఫ్ జెయ్యిమని అడుగండ్రి. గా మీద ఆయినకు ఏమన్న సంద యియ్యిండ్రి. గప్పుడు గీ ఖయామత్ తప్పిపోతది.” వజీరు.

“మరి గట్లనే జేస్తాం.. అమీన్ బచ్చేగానికి సెప్పి ఆయినను తోలుక రమ్మనండ్రి” నవాబు. మెరుము నురుము లేక మేఘంబు కురియునా? చలువకు వచ్చి మేఘడొక పట్టున తావండ్ల రాల్చినన్ శిలలంబడి శీఘ్రమే శీతల నీరము గాదె!….

అమీను పొయ్యి మాలివ్యను తోలుకచ్చిండు. నవాబు అన్నడు “మాలివ్య సాబ్! నేను పెద్ద పొరుపాతు పని జేసిన. పాపం పని జేసిన… ‘కాని పనులు’ జేయ ఘనులాస పడుదురా? నేను గసుంటి ‘కాని పని’ జేసిన. గందుకు నన్ను మీరు మాఫ్ జెయ్యాలె… గీ కాని పని జేసిన దానికి ‘పిటస్’గ ఒగ ‘మస్తు’ అయిన పని జెయ్యాలె. గందుకని మీకు సంద యియ్యాలె. గది గూడ అట్టట్టి సంద గాదు… మీరు దేశదేశాలు దిరిగి గిప్పటిదాన్క ఎంత సంద జమజేసిండ్రు?” అడిగిండు నవాబు మాలివ్యని.

“గిప్పటి దాన్క నేను జమ జేసిన చందలన్ని గల్పి ఇరువై ఐదు లక్షలు సాబ్!” అన్నడు మాలివ్య.

“ఆఁ… ఇరువై ఐదు లక్షల రూపాలా!… సరే నేను గూడ సంద యిస్తా. గా సంద గూడ నువ్వు దేశ దేశాలు తిరిగి గిప్పటిదాన్క జమచేసిన సంద అంతకు సమానంగా, దేశ దేశాల నవాబులందరు గల్సి యిచ్చిన సందకు సమానంగ్ నేను ఒక్కడ్నే యిస్త. గంతే గాదు – గ దీని మీద యింకింత ఎక్కోనే – ఐదు రూపాలు! ఏసుకో, రాసుకొ నా సంద పైసలు – ‘ఇరువై ఐదు లక్షల ఐదు రూపాలు!’ అన్నడు నవాబు.

నవాబు గన్ని రూపాల సంద అనెటప్పటికి మాలివ్య మనసుల నిండి వున్న అవుమానమంత గూడా ఆవిరైపొయ్యింది. మాలివ్య మనసు నిండ ఆనందం. యిగ తను అనుకున్న పని జరిగినట్లే…

శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే… ధర తగ్గుట హెచ్చుకొఱకే!

గిప్పుడు గూడ నవాబు జేసిన గంత పెద్ద ధైర్నంల గాయిన గింతంత పుట్టుక తోటి వచ్చిన కంజూసితనం గూడ సూపకుంట పోలేదు!

ఇరువై ఐదు లక్షల మీద వెయ్యి నూట పదార్లో, నూట పదార్లో, వట్టి పదార్లో అని అన్లేదు – ఐదు రూపాలే అన్నడు! అయిన గూడ, గంతటి కంజూసితనంల గింతటి దాన దర్మగుణం – మత్తేభము దోమ కుత్తుక జొచ్చెన్… అనుకోలేదని ఆగవు కొన్ని…

దేశ దేశ నవాబులు, సిరిమంతులు అందరు గల్సి యిచ్చిన సందలు ఒగ ఎత్తుగ, నిజాం నవాబు ఒక్కదు యిచ్చిన సంగ ఒగ ఎత్తుగ – అంతగలిపి మాలివ్య దునియల్నే పేరు కచ్చేటంతటి పెద్ద బడి గట్టించ్చిండు. గా బడే – గిప్పటి గీ ‘బనారసు హిందు విశ్వవిద్యాలయం!’ ఆకాశంల బృహస్పతి వారం మనదేశంల గీ బడి… వెలయు వనములోన్ మలయ వంబున్నట్లు… గా మామిడి మొక్క నాటిన మాలివ్య – పరము కొఱకు యోగి పాటించు దేహంబు అన్నట్టుగ… గదీనికి ఆసరైన నిజాం నవాబు గూడ… సచ్చి గూడ  బతికే వున్నడు…

నవాబుకు గింతటి దానం జేసే దర్మగుణం వుంటదని ఎవ్వరు గూడ అనుకోనే లేదు. నవాబు ‘మేక-మెడ సన్ను’ అసుంటోడు. మంది ఆసపడి మా అస్తరు గని – మేక మెడను బట్టి మెడ చన్ను గుడిచిన ఆకలేల మాను ఆశగాక అన్నట్టుగనే! తగరు వెంట నక్క తగిలిన చందంబు… గొడ్డుటావు పాలు పితికిన చేపునా?…. లోభి దాతగాడు లోకంబు లోపల అన్నరు… గని, గిప్పుడు గా మెడ సన్నే సేపింది, తగరు వెంట తగిలిన నక్కకు… ఆసపడ్డయి రాలిపడ్దయి. గొడ్డుటావు కుండెడు పాలిచ్చింది… గా లోభే – దాత, పెద్ద దాత అయ్యిండు…. గది నవాబు కంజోరు గాదు… మాలివ్య జోరు… మన అపోజిషనోళ్ళది బలం గాదు – గది, అదికారపోల్ల బలహీనతే. గక్కడ అధికారపోల్ల బలహీనతే అపోజీషనోల్ల బలం అయితే గిక్కడ మాలివ్య బలమే నిజాం నవాబుకు బలమైంది – కరణంబులు బలమెల్ల కాపు బలిమి.

బడిని గట్టిచ్చుట్ల… గా బలాల తోటి నిల్చిన ఆళ్ళ పేర్లు సూర్యుడు గల దాక, శశి గల దాక, తారలు గల దాక ధర గల దాక… కెరలుచునుండు అన్నట్టుగ…

(సమాప్తం)

Exit mobile version