[శ్రీ విడదల సాంబశివరావు రచించిన ‘సౌందర్యం దివ్యత్వాన్ని సంతరించుకున్న వేళ..!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
కాలగర్భంలో..
కలలన్నీ ఛిద్రమై పోయాయి!
నీ వియోగపు విరహాగ్నిలో
రగిలిపోయిన నా హృదయం..
నువ్వు మళ్ళీ వస్తావని
ఆకాశమంత ఆశతో ఎదురు చూస్తోంది!
నాకు దూరంగా ఏ సుదూర తీరాలను
ఏలుతున్నావో తెలియదు గానీ..
ఇక్కడ నిరంతరం నీ జ్ఞాపకాలే
నన్ను వెంటాడి వేధిస్తున్నాయి!
లక్షలాది మాటలను మూటకట్టుకున్న
రత్నాలాంటి నీ కళ్ళు వర్షించే
కావ్యరస ప్రవాహాలు..
నా మనసులో ప్రేమదాహాన్ని పెంచుతూ
నాలో జీవన కాంక్షను రెట్టింపు చేస్తున్నాయి!
నీ భావోద్వేగపు అంతరంగం
ఎవ్వరి ఊహకు అందని
మహోన్నత భావనా సముద్రం!
అది.. ఆణిముత్యాల్లాంటి
మహోద్వేగాల రత్నరాసుల
ప్రేమ కావ్యాలను దాచుకున్న
జీవ చైతన్యం నిండిన హృదయ సాగరం!
ఆ హృదయ సౌందర్యాన్ని
సొంతం చేసుకోవాలని
నాకు తెలియకుండానే
నా పాదాలు నిన్ను వెన్నంటి నడిచాయి!
కౌముదీ కాంతుల చల్లదనంతో
ప్రకృతి కాంత పరవశించిన చందాన..
నీ మోముపై ప్రసరించే దివ్యత్వం కాంతులు
నన్ను ఊహాతీతమైన మంత్రశక్తికి
బానిసను చేశాయి ఆ మహత్తర క్షణాలలో!
నిన్ను చూసిన మరుక్షణమే..
దైవంపై నమ్మకం
నా మనసు మందిరంలో
తొలిసారిగా నిక్షిప్తమైపోయింది!
దైవత్వం మానవాకారం దాల్చి
దివ్యత్వాన్ని సంతరించుకొని..
అపురూప సౌందర్య రాశిలా
నా కోసమే భువిపై అవతరించిందని..
నాలోని ప్రేమికుడు విశ్వసించాడు!
శ్రీ విడదల సాంబశివరావు గారు 22 జనవరి 1952 న గుంటూరు జిల్లా, చిలకలూరిపేట పురపాలక సంఘం పరిధిలో ఉన్న పురుషోత్తమపట్నం గ్రామంలో ఓ మధ్య తరగతి ‘రైతు’ కుటుంబంలో జన్మించారు. శ్రీమతి సీతమ్మ, రాములు వీరి తల్లిదండ్రులు. స్వగ్రామంలో ప్రాథమిక విద్య, చిలకలూరిపేటలో ప్రాథమికోన్నత విద్య, తెనాలిలో బి.ఎస్.సి. పూర్తి చేశారు.
బాల్యం నుంచి నటనపై అభిరుచి ఉంది. అనేక నాటికలలోనూ, నాటకాలలోనూ నటించి ప్రశంసలందుకొన్నారు. వివిధ సంస్థల నుండి పతకాలు పొందారు. రాష్ట్రస్థాయిలో ఉత్తమ నటుడిగా బహుమతులు పొందారు. వీరు రచించిన ‘పుణ్యభూమి నా దేశం’ (నాటకం), ‘తలారి తీర్పు’ (నాటిక) ప్రసిద్ధమయ్యాయి. టివి ధారావాహికల్లోనూ, కొన్ని సినిమాల్లోనూ ముఖ్య పాత్రలు పోషించారు.
సాంబశివరావు గారు వెయ్యికి పైగా కవితలు రాశారు. వాస్తవిక జీవితాలని చిత్రిస్తూ అనేక కథలు రాశారు. కవితలు, నాటకాలు, కథలు కలిపి 14 పుస్తకాలు ప్రచురించారు. పలు పత్రికలలో ఫీచర్లు నిర్వహిస్తున్నారు.
నాటకరంగలోనూ, రచన రంగంలోనూ ఉత్తమ పురస్కారాలు అందుకొన్నారు. నీహారిక పౌండేషన్ అనే సంస్థని స్థాపించి సమాజ సేవ చేస్తున్నారు.