Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సత్యాన్వేషణ-53

ఇది ఆత్మాన్వేషణ. ఇది సత్యాన్వేషణ. సత్యాన్వేషణ పథానికి మార్గదర్శనం చేసే గురువు అన్వేషణ. సంధ్య యల్లాప్రగడ స్వీయానుభవ కథనం.

“ఆధ్యాత్మికత, ఆధి భౌతికత, ఆధి దైవికమని మూడు మానవ జీవితములో వుంటాయి. ‘నేను’, ‘నావారు’ అనుకొని కష్టాలు తెచ్చుకోవటము ఆధ్యాత్మికత. జబ్బులు, రోగాలు మన ప్రమేయము వుండదు. దైవికముగా వస్తాయి కాబట్టి అవి ఆధి దైవికము. మనకు వచ్చే అకాల దుఃఖకారణాలు ఆధి భౌతికత. అంటే యాక్సిడెంట్సు వంటివి” అన్నారు.

నేను మరింత తత్తరబిత్తరగా “మరి దైన చింతన ఆధ్యాత్మికత అంటారు” అన్నాను.

“అవును. నేను… నాది… నావారు వంటి ఆలోచనలలో దుఖ కారణాలు. ఆ నేను అన్నది తీసివేయ్యాలి. అహం స్ఫురణ అన్నది దుఃఖం. చితైకాగ్రత వుంటే ఆత్మతత్త్వం అర్థమవుతుంది. ఆ ‘నేను’ పోతే మిగిలేది అంతా ఒక్కటే అన్న భావన కలుగుతుంది. అలా సాధన చెయ్యాలి. అసలు దుఃఖాలన్నింటికీ కారణము ఈ ‘నేనే’గా. ఆ భావన సాధన చెయ్యమని చెబుతుంది ఆధ్యాత్మికత. “అఘటిత ఘటనా పటీయసీ” అని శంకరులు చెప్పారు కదమ్మా. అంటే మాయను మాయగా తెలుసుకోవాలి. ఏది లేదో అది నిజమనిపిస్తుంది. ఏది వున్నదో అది మాయగా వుంటుంది. అది తెలుసుకోవాలి.” అన్నారు.

మాయ గురించి వివరించమని ఆయనను కోరాను.

“జీవుడు, పరమాత్మ వేరు కాకపోయినా వేరు వేరన్న నమ్మకము కలిగిస్తుంది. అదే మాయ మనము చేసే ప్రతి పనిని తరచి చూసుకోవాలి. మనము ఏమి చేసినా మోక్షకాంక్షతో చెయ్యాలి”.

“మరి అది స్వార్థపు కోరిక కాదా?”

“కాదు. ఆత్మను తెలుసుకోవటమే మోక్షము. అంటే స్వస్వరూపము తెలుసుకునుటకు చేసే పనిలో స్వార్థము వుండదు” అంటూ వివరించారు.

మా ఇంటికి వచ్చిన తరువాత, కొంత విశ్రాంతి తరువాత, ఆయనకు నేను సౌందర్యలహరి శ్లోకాలు కొన్ని వినిపించా. “చాలా మధురముగా పాడుతున్నావమ్మా!” అన్నారు ఆపేక్షగా.

“సప్తశతి పాడుతావా?” అడిగారు…

“లేదండి” అన్నాను.

“అవునా. నీ కంఠములో ఆ సప్తశతి చక్కగా పలుకుతుంది” అన్నారు.

“నాకు ఉపదేశము లేదు” చెప్పాను.

మునుపు మాకు ప్రియమైన దేవి భక్తురాలయిన ఆంటీ చెబుతానంటే అంత సంస్కృతము నా చేతకాదని వదిలేశాను. అదే చెప్పాను వీరికి.

“నేను నేర్పుతానుగా…. నీకు రానిది లేదు..” అని ఆ ఏడాది నాచేత సప్తశతీ పారాయణము మొదలుపెట్టించారు.

మరో రోజు ప్రస్థాన త్రయము గురించి అడిగారు. తెలియదని దాని గురించి చెప్పారు.

ఉపనిషత్తుల వైభవము వివరించారు.

ఆ రోజు నేను వారిని “కర్మను ఆచరించటము ద్వారానా లేక కేవల జ్ఞానము వలన ఆత్మను తెలుసుకోగలమా?” అని అడిగాను.

“ఆకాశములో ఎగిరే పక్షికి రెండు రెక్కలుంటాయి. ఆ రెండు రెక్కల వలననే ఎగరగలదు. అలాగే కర్మలను ఆచరించటము ద్వారా చిత్తశుద్ధి కలిగి, జ్ఞానము ద్వారా అవిద్యా నివృత్తి జరుగుతుంది” అని చెప్పారు.

శంకరుల వారి ఏకశ్లోకిని వివరించారు. ఆ శ్లోకము ఇలా చెబుతుంది..

శంకరభగవత్పాదుల వారి ఏకశ్లోకి లో చెప్పినట్లుగా:

కిం జ్యోతి స్తవ భానునా నహన్ మే రాత్రౌ ప్రదీపాదికం
స్యాదేవం రవిదీపదర్శనవిధౌ కిం జ్యోతిరాఖ్యాహి మే
చక్షు స్తస్య నిమిలనాది సమయే కిం ధీర్దియో దర్శనే
కిం తత్రాహ మతో భవాన్ పరమకం జ్యోతి స్తదస్మి ప్రభో!!

~

ఇది గురుశిష్య సంభాషణ:

గురువు: నీవు ఎలా చూస్తున్నావు?

శిష్యుడు: సూర్యుని సహాయముతో

గురువు: మరి రాత్రి ఎలా చూడగలుగుతున్నావు?

శిష్యుడు : దీపపు సహాయముతో

గురువు: సరే, కాంతిని కన్నులు తెరువక పూర్వం ఎలా గ్రహిస్తున్నావు?

శిశ్యుడు: జ్ఞానముచే

గురువు: ఆ జ్ఞానము నీకున్నదని ఎలా తెలుసుకున్నావు?

శిశ్యుడు: నేనే (చైతన్యం) తెలుసుకున్నాను.

గురువు : అవును. నీలోని వెలుగే చైత్యనవంతమైన బ్రహ్మం!

శిష్యుడు : తెలుసుకున్నాను గురువుగారు.

నిత్యానిత్య వివేకము, ఏది శాశ్వతమో దానికై సాధకుల అన్వేషణ.

~

మరోక సారి నాతో “నీకు సాధనకు నాలుగు మెట్లు వున్నాయి. తెలుసుకుని ఆచరించు” అన్నారు.

శ్రీ దేవీదాసు గారు.

ఆనాడే నాకు సాధనా చతుష్టయము గురించి తెలిసింది..

జీవుడు తన యందు ఉన్న ఆత్మను కనిపెట్టి, మాయను ఛేదించి సత్యమును గ్రహించటం సాధకుని గమ్యం.

అద్దము మీద మకిలి చేరి ఉంటే రూపము అగుపడదు. అలాగే మాయ కప్పిన జీవునికి ఆత్మ దర్శనం కలగదు. ఈ మాయ జన్మ జన్మల కర్మముల ఫలం.

అద్దం శుభ్రం చేసుకుంటే కాని బొమ్మ అగుపడదు. కర్మలను కాల్చుకుంటే తప్ప, మాయ విడిపోతే తప్ప సత్యం ఎరుకపడదు.

మరి ఈ కర్మలను తొలగించి సత్యమును దర్శించుటకు జీవుడు చెయ్యవలసినది ఏమిటి?

దీనికి సాధకునికి ‘సాధనా చతుష్టయములు’ సహాయం చేస్తుంది. అవి సత్య దర్శనకు దోహదము చేస్తాయి.

1.నిత్యానిత్య వస్తు వివేకము:

అదే విచక్షణా జ్ఞానం.

నామరూపాత్మకమైన జగత్తుగా దీనిని గుర్తించటం.

ఈ ప్రపంచములో వున్నది సర్వం తాత్కాలికం. శాశ్వతమని దేనిని అనుకుంటామో అది మన అజ్ఞాన ఫలము. నిత్యమైన శాశ్వతమైనది ఏమిటో గ్రహించి, అది బ్రహ్మమని తెలుసుకొని ఆ బ్రహ్మము నందు లయమగుటకు అనుక్షణము సాధకుడు యత్నించవలెను.

2. ఇహముత్రఫలభోగ విరాగము:

ఈ లోకములో కానీ పరలోకములో కానీ వున్న సుఖాలను, సౌఖ్యాలను తృణీకరించి సత్యానికై ధృడనిశ్చయంతో వుండటము. ప్రపంచ విషయములపై వైరాగ్యముతో వుండటము.

3. శమదమాది సాధనా సంపత్తి:

అదే షట్ సంపత్తి అని కూడా అందురు.

దమము, శమము, తితీక్ష , ఉపరతి, శ్రద్ధ, సమాధానం.

ఇంద్రియాలు రెండు రకములు:

అంతరేంద్రియాలు, బాహేంద్రియాలు

శమము అంటే అంతఃకరణము నందు నిగ్రహం. అంతఃకరణములు అంటే – బుద్ధి, చిత్తము లేదా మనసు, అహంకారమును నిగ్రహించటం. ఇవి అంతఃకరణములు.

దమము అంటే – బాహ్య ఇంద్రియాలను కట్టడి చేసుకొని, అనగా, పంచేద్రియాలైన వాక్కు, శ్రవణం, దృశ్యం, వాసనా, రుచి యందు విరాగముతో ఉండటం దమము.

అంతరేంద్రియాలను కట్టడి చెయ్యటం, అనగా బాధలను ఓర్చుకోవటం తితీక్ష.

ఇంద్రియ నిగ్రహమే ఉపరతి.

గురువాక్యం నందు గురి కలిగి, నమ్మకం కలిగి ఉండటం శ్రద్ధ.

బ్రహ్మము నందు జ్ఞానమును నిలిపి ప్రవర్తించటం, ఆత్మనిశ్చయం పొంది సంశయ నివృత్తి కావించుకోవటము సమాధానం.

4.ముముక్షత్వము:

సదా మోక్షముకై ఆపేక్షను కలిగి వుండటము. ముక్తికై తీవ్రంగా తపించటము. స్వేచ్ఛకై, బంధాలనుంచి విడుదలకై ఎదురుచూపు ముముక్షుత్వం.

ప్రపంచపు విషయములు అశాశ్వతములన్న ఎరుకనే వివేకము. ఆ ఎరుక కలిగిన తరువాత విషయములపై ఆసక్తి నశిస్తుంది. అదే వైరాగ్యం.

“ఈ సాధనా చతుష్టయాలను సాధించిన వారికి ఋతుంభరా జ్ఞానము కలుగుతుంది” అన్నారు ఆయన. మరింత వివరించమంటే వివరాలు చెప్పే సమయము రాలేదని దాటవేశారు.

 (సశేషం)

Exit mobile version