Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సత్యాన్వేషణ-29

ఇది ఆత్మాన్వేషణ. ఇది సత్యాన్వేషణ. సత్యాన్వేషణ పథానికి మార్గదర్శనం చేసే గురువు అన్వేషణ. సంధ్య యల్లాప్రగడ స్వీయానుభవ కథనం.

క్కడ ప్రతి చోట గంటలు కట్టి వున్నాయి. గ్రిల్లుకీ, స్తంభాలకు అణువణువూ వదలకుండా కట్టారు భక్తులు. చూడటానికి మాత్రము చాలా బావున్నాయి ఆ గంటలు. నా వద్ద వున్న అరటిపండు కోతికి ఇచ్చేసి నేను బయటకు వచ్చేశాను. వెనకకు వచ్చి కారులో తిరిగి రుషీకేష్ వచ్చేశాను.

కారు డ్రైవరు మధ్యలో భోంచేద్దామన్నాడు కానీ నాకు తినాలని లేదు. పిట్ స్టాపుకు ఆగటానికి కుదరలేదు. ఎక్కడా కూడా దారిలో స్త్రీలు వాడగలిగే రెస్టురూములు వున్న హోటళ్ళు లేవు. ఇండియాలో ఇదో చికాకు. స్త్రీలు అందునా సోలో ప్రయాణికులకు ఇబ్బందుల చిట్టా చిన్నది కాదు కదా. అందులో ఇటువంటి చిన్న విషయాలకు అసలు ధ్యాస వుండదు రోడ్డు నిర్మించేటప్పుడు. మధ్యమధ్య రెస్టు ఏరియాలు కూడా వుంటే అమెరికాలో లాగా మన టూరిజం రెట్టింపు అవటము గ్యారెంటీ.  నేను రుషికేష్ రావటానికి అందుకే త్వరపడ్డాను.

ధారాదేవి శక్తివంతమైన దేవత యని అక్కడి స్థానికులే కాదు నేను నమ్ముతాను. తిరిగి అటు వెడితే గంట కడుతానులే అనుకున్నా, నేను మరు సంవత్సరమే మళ్ళీ ఆ దారిన ప్రయాణించానంటే కేవలము అమ్మవారి కృప కారణమై వుంటుంది. కేదారునాథ్ నేను మావారు కలసి వెడుతూ అమ్మవారి దర్శనము చేసుకొని, అక్కడ అమ్మవారికి గంట సమర్పించి, ఒక గంటను ప్రసాదముగా తెచ్చాను. కొన్ని విషయాలు తరువాత చూస్తే చాలా విచిత్రముగా అనిపించక మానవు. అలా నన్ను ఆ ధారాదేవి తల్లి తిరిగి తిరిగి దర్శనానికి పిలుస్తున్నట్లుగా వుంది చూడబోతే.

***

రుషీకేషులో  మళ్ళీ నా మాములు రోటిన్‌ గంగా స్నానము, జపముతో నాలుగు రోజులు వున్నాను. మఠములో మరో కొత్త యాత్రికుడు వచ్చాడు. ఆయన చూడటానికి యాబై వయస్సులో వుండవచ్చు. రెండో రోజుకు మా అర్చకస్వామి నాతో “ఆయన మోజీను చూడటానికి వచ్చారు. ప్రతి ఏడు వస్తారు” అన్నాడు.

“మోజీ అంటే?” అర్థము కాక అడిగాను.

అతను నవ్వి వెళ్ళిపోయాడు. మరురోజు ఆ ఢిల్లీ ఆసామి నన్ను వదలలేదు.

“మీరు ఎక్కడ్నుంచి వచ్చారు?” అడిగాడు.  నా రెడీమేడ్‌ సమాధానము హైద్రాబాదు.

ఆయన “మోజీ గురించి విన్నారా? ఆయన ఎలుండి వస్తున్నారు. మీరు తప్పక దర్శించుకోవాలి వారిని” చెప్పాడాయన.

“నేను వుండటములేదండి. వెళ్ళిపోతున్నా. అరుణాచలము వెళ్ళాలి” అన్నాను.

ఆయన అలర్టులోకి వచ్చి “మీరు అరుణాచలము వెళ్ళనక్కల్లేదు. మోజీ రమణుల శిష్యులు. అంటే వారు రమణులే. ఇక మళ్ళీ అరుణాచలమెందుకు?” అన్నాడు భక్తి ఉద్రేకాలతో.

“అవునా. కానీ నేను చెన్నై వెళ్ళి మావారిని కలవాలి. ఇద్దరము కలసి అరుణాచలము వెళ్ళటానికి ప్లాను రెడీ చేసుకున్నాము. కాబట్టి ప్లాను మార్చుకోవటానికి లేదండి. చాలా సారీ” నిజంగా అవకాశము కోల్పయినందుకు దిగులు పడుతూ చెప్పాను.

ఆయన వదిలిపెట్టలేదు.

“పాపాజీ తెలుసా. పాపాజీ రమణుల ప్రత్యక్ష శిష్యులు. వారే మోజీకు గురువులు. మీరు గురువు గురించి చూస్తుంటే మోజీ మీకు సమాధానము” అన్నాడాయన. నేను కళ్ళు విప్పుకు వింటున్నానని మోజీ గురించి చెప్పటము మొదలెట్టారు.

మోజీ అన్న గురువు కరేబియనుకు చెందినవారు. ఆయన లండన్‌లో వుంటూ, అక్కడ మ్యూజియముకు వచ్చే యాత్రికుల బొమ్మలు గీసేవారు. అలా జీవించే సమయములో ఆయనకు చాలా మనసులో మథనముండేదిట. మైకల్ అన్న మిత్రుని కలిసి తన కోసము ప్రార్థన చెయ్యమని అడుగుతాడు మోజీ. అప్పుడు ఆయన పేరు టినో.

మిత్రుడు “ఎప్పుడో ఎందుకు ఇప్పుడే చేద్దాం ప్రార్థన” అని ప్రార్థిస్తారు ఇద్దరూ.

ఆ నాడు మోజీ గారి మనసులో మార్పు వచ్చింది. గాఢమైన ప్రశాంతత కలిగింది. ఆ ప్రశాంతత చెదిరిపోలేదు. తనలో తను చూసుకుంటున్నారు. బయట విషయాలు మీద ఆసక్తి తగ్గింది.

ఒకరోజు బజారులో వెడుతుంటే ఒక పుస్తకము ఆయన దృష్టికి వస్తుంది. అది రమణుల చిత్రము. ఆ పుస్తకము ‘who am I’.  మరో పుస్తకము ‘Gospels of Ramakrishna’. ఆయనకు రామకృష్ణుల బోధనలు బాగా నచ్చాయి. దక్షణేశ్వర్ వెళ్ళాలని భావన కలుగుతుంది. ఢిల్లీ వచ్చి కొద్ది రోజులు వుంటారు. అటు తరువాత రుషికేషు వెడుతారు. ముగ్గురు వ్యక్తులు నడుచుకు పోతూ ఆయనకు పాపాజీ గురించి చెప్పి వారిని చూడటానికి రమ్మంటారు. పాపాజీ లక్నోలో వుంటారు. మోజీ గారు వారణాసి వెళ్ళి వారం రోజులుండి అక్కడ్నుంచి ఏదో శక్తి లాగినట్లుగా లక్నో వెడతారు. పాపాజీ ఆయన పడుతున్న మథనకు సమాధానము చెబుతారు. అదే “నీవు ఎవరో తెలుసుకో” అన్న రమణులదే.

అటుపై మోజీ లండను తిరిగి వెడతారు. ఆయన అగరుబత్తులు అమ్ముతూ చాలా సమయము ధ్యానము చేస్తూ అంతర్ముఖముగా వుంటూ వుంటారు. మిత్రులు కొందరు ఆయనకు తమ సమస్యలు చెబుతూ వుంటారు. ఆయన తోచిన సమాధానము చెప్పేవారు. అలా ఆయన సత్సంగులు మొదలవుతాయి.  ఆయన చిన్ని అపార్టుమెంటుకు అలా చాలా మంది వస్తూ వుండేవారుట. ఆయన తోచిన సమాధానము చెబితే వారికి అవి కుదరటము మొదలయ్యింది. అలా ఆయనను అనుసరించేవారు, పూజించేవారు వున్నారు. శిష్యులు వున్నారు. ప్రతి యేడు ఆయన పోర్చుగీసు, లండను, రుషీకేషు మద్యన తిరుగుతూ వుంటారు. ఆయన వచ్చే ముందు వీరిలాంటి వారు వచ్చి ఆయన సన్నిధిలో గడుపుతారు.

ఈ సంగతులన్నీ ఆయన నాకు వివరించి, నేను ఎందుకు మోజీ గారిని కలవాలో వివరించి నా ప్రయాణము మానుకోమని బలవంతపెట్టారు. నాకు వెళ్ళి ఆయనను కలవాలని వున్నా, మా ప్లాను ప్రకారము మావారు చెన్నై వచ్చేటప్పటికి నేనూ చెన్నై చేరుకోవాలి. అక్కడ్నుంచి ఇద్దరము కలసి తిరువన్నామలై వెళ్ళాలి. శ్రీవారు కేవలము రెండు వారాలకు సొంత పని మీద వస్తున్నారు. కాబట్టి నాకు ఇక వుండటము కుదరదు. “రమణులు ఎందుకు? లైవ్ గురు మీకు మోజీ ఇక్కడుంటే” అని ఢిల్లీ మిత్రుడు అనటము నన్ను కంగారు పెట్టింది. కానీ నేను చెయ్యగలిగినది లేదు.

తరువాత అర్చకస్వామి వచ్చి “ఏం మంటారాయన?” అన్నాడు.

“వుండి మోజీని కలవమంటున్నారు” అని చెప్పాను. “ఆయన అందరికీ అదే చెబుతాడు” అన్నాడు పట్టించుకోవద్దన్నట్లుగా.

నాకు మళ్ళీ నేనేదో కోల్పొతున్నాననిపించింది. నా సపోర్టు సిస్టము వుందిగా, శ్రీవారు ఆయనకి చెప్పాను.

“ఎంత వరకూ వచ్చింది నీ క్వెస్టు” అన్నారు. నేను ఏమీ మాట్లాడలేదు. “ఎక్కడో కాదమ్మాయి. నీ మనస్సులో వెతుక్కో” నవ్వుతూ చెప్పారు.

“తెలుసు మిత్రమా! కాని దానికీ ఒక గురువుండాలి”  నొక్కివక్కాణించాను.

“చెన్నై వచ్చేసేయి. కలిసి రమణుల వద్దకు వెళ్ళి వెతుకుదాము” అంటూ ఫోను ముగించారు. నా కన్‌ప్యూషన్ పోయింది. గంగమ్మకు మరొక్కసారి అర్చనచేసి, అర్చుకస్వాముల వద్ద సెలవుతీసుకొని, నేను తిరిగి వెనక్కు  ప్రయాణమైనాను.

నా తదుపరి మజిలి అరుణాచలము!!

“అరుణాద్రిదరీవాసం కరుణామయవిగ్రహం।
తరుణాదిత్యసంకాశం రమణం గురుమాశ్రయే॥”
~
“అరుణాచల శివ, అరుణాచల శివ
అరుణాచలశివ, అరుణశివం!!”

***

చలించే మనసులను అచలము చేయు ఆవాసము,
అనిర్వచన సంవేశమునకు సాకారము
ఇంద్రియములని నిరోధించు పంకారము,
సాధకులకు సాధ్యమగు విధానము తెలుపు సన్నిధానము –
అరుణాచలము.
హిమ పర్వతముల తరువాత అంత పవిత్రమైన ప్రదేశము-
శివుడు అగ్నిలింగమై వెలసిన ఆలయము-
పురాణాలలో ముక్తకంఠముతో కీర్తించిన ఈ పురము –
ఒక గుప్త క్షేత్రం.

(సశేషం)

Exit mobile version