Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసల స్థాపనకై అవతరించె శ్రీ సత్యసాయి!

[23 నవంబరు శ్రీ సత్యసాయి బాబావారి జయంతి సందర్భంగా ఈ రచనని అందిస్తున్నారు విడదల సాంబశివరావు.]

“సత్య ధర్మ ప్రేమ శాంతులు లేకున్న
విద్యలన్నియు నేర్చిన విలువ సున్న
సత్య ధర్మ ప్రేమ శాంతులు లేకున్న
దానధర్మాల సార్థకత సున్న
సత్య ధర్మ ప్రేమ శాంతులు లేకున్న
బహుళ సత్కార్య లాభంబు సున్న
సత్య ధర్మ ప్రేమ శాంతులు లేకున్న
పదవుల నేలిన ఫలము సున్న
మన సనాతన ధర్మ హర్మ్యంబు నిలుప
గుణము లియ్యవి నాల్గు పునాదులప్ప
ఇంత కన్నను వేరెద్ది యెఱుక పరతు
సాధు సద్గుణగణ్యులౌ సభ్యులార!!”

ఇవి కలియుగావతారులైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి అమృత వాక్కులు. ఈనాడు విశ్వమానవ జాతి మొత్తము పాశ్చాత్య సంస్కృతి జాడ్యంతో లెక్కకు మించిన బాధలకు గురియై అలమటిస్తోంది. మరీ ముఖ్యంగా భారతదేశంలో జనులు, ‘సంస్కృతి’ అంటే అసలైన అర్థం తెలియక – మతం, దివ్యత్వం మొదలైన ప్రాపంచిక విషయాల ప్రాముఖ్యం అవగాహన గాక, దయనీయమైన స్థితిలో వున్నారు. నేటి మానవ జాతిలో ఉత్తమ శీలం లోపించింది. ఈ ఆధునిక కాల ప్రవాహపు తాకిడికి – సనాతన ధర్మం పూర్తిగా అడగంటి పోయింది. ప్రస్తుతం మానవులు ఒక సంధి కాలంలో ఉన్నారు. ధర్మగ్లాని ఏర్పడి మానవులు పలు రకాల మానసిక, శారీరక రుగ్మతలతో అలమటిస్తున్నారు. అందుకే ఈ యుగంలో మానవ జాతిలోని దివ్యత్వాన్ని మేల్కోలిపి – ధర్మతేజాన్ని పునరుద్ధరించడానికి భగవంతుడు ‘శ్రీ సత్యసాయి బాబా’ వారి రూపంలో ‘పుట్టపర్తి’ గ్రామంలో జన్మించారు.

భగవాన్ బాబావారు తమ అవతార లక్ష్యాన్ని ప్రజలకు ఈ విధంగా సుస్పష్టం చేశారు. “సర్వమానవ కోటికి మూలాధారమైన ఆత్మను గూర్చిన జ్ఞానమే నేడు విస్మృతమైనది. అదే ఈనాటి అశాంతికిని, విప్లవమునకును, అవినీతికిని ముఖ్య కారణము. నిద్రాముద్రితమైయున్న ప్రజానీకమును మేలు కొలిపి ఈ సందేశము నందించుటకే నా ఈ ఆగమనము! ఇతర దేశములందును ఉత్తమాశయాసక్తి ఉడిగిపోయినది. మానవునితో గల దైవత్వము నందు విశ్వాసము పూర్తిగా పోయినది. ఇవి యన్నియు సవరింపబడవలె! అందుకే నేను వచ్చితిని!”

సాక్షాత్తూ పరమేశ్వరుడే మానవాళిని ఉద్దరించడం కోసం, మానవరూపం ధరించి, మానవ జాతి నడుమ నడయాడటం.. కలియుగంలో ఓ అద్భుతమే కదా!

‘సనాతన ధర్మం’ కేవలం భారతదేశానికి సంబంధించినది మాత్రమేనని చాలామంది అపోహ పడుతున్నారు. కానీ, ఈ ‘సనాతన ధర్మం’ విశ్వమానవాళిలో సంబంధించినదని భావించి.. శిథిలమైపోయిన ఆ భవనమును పునరుద్ధరించి పునర్నిర్మాణం చేయడానికి భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారు ‘సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస’ అనే స్తంభాలను నిలపటం తమ అవతార ప్రయోజనంగా ప్రకటించారు. దీనికి ఓ ఉదాహరణగా బాబావారి ‘సర్వధర్మ చిహ్నం’ను పేర్కొనవచ్చు. ఈ చిహ్నం ప్రపంచ మతధర్మాలలో సమైక్యంగా వెలుగొందే ప్రేమ స్వరూపాన్ని విశ్వజనీనంగా వ్యాఖ్యానిస్తున్నది! ఈ ఆధునిక అణుయుగంలో మానవతా సంస్కృతి పునరుజ్జీవనానికి బాబావారి ప్రబోధం ప్రణవమంత్రమై అలరారుతోంది.

“ఉన్నది ఒకే మతం – అది ప్రేమ మతం.
ఉన్నది ఒకే కులం – అది మానవత్వం
ఉన్నది ఒకే భాష – అది హృదయ భాష
ఉన్నది ఒకే దైవం – ఆయన సర్వాంతర్యామి”

అని బాబావారు ప్రకటించి, తన ‘సర్వాంతర్యామి’ తత్వమును చాటుకున్నారు! అందువలననే.. ప్రపంచంలోని వివిధ దేశాల నుండి వచ్చిన క్రైస్తవులు ప్రశాంతి నిలయంలో, ప్రసన్నవదనంతో దర్శనమిచ్చే శ్రీ సత్యసాయి బాబా వారి దివ్యమూర్తిని ఏసుక్రీస్తు యొక్క ప్రతిరూపంగా భావించి ఆరాధించి ఆనంద తరంగాలలో ఓలలాడతున్నారు. అలాగే, అరబ్ దేశాలనుండి వచ్చే ముస్లిం భక్తులు బాబా వారిలో ‘అల్లా’ను చూస్తూ ప్రశాంతతను పొందుతున్నారు. అదే విధంగా – పారశీకులు, వారి ఆరాధ్య దైవమైన ‘జోరాస్టర్’ను దర్శించి తన్మయత్వంలో మునిగి తేలుతున్నారు!

“అల్లా యంచు మహమ్మదీయులు
జెహోవా యంచు సత్క్రైస్తవుల్
పుల్లాబ్జాక్షుడటంచు వైష్ణవులు
శంభుండంచు శైవుల సదా
ఉల్లాసంబున గొల్వ నెల్లరను
నాయుర్భోగభాగ్యాది సం
పల్లాభంబు లొసంగి ప్రోచు
పరమాత్ముండొక్కడే చూడుడీ!”

ఇది, భగవాన్ బాబావారు తరచు తన ప్రబోధనలతో ప్రవచించే నిత్య సత్యమైన ప్రబోధం! ఈ ప్రబోధం ఒక ధర్మ సమన్వయాన్ని సాధిస్తున్నది. ఒక శాంతి మంత్రాన్ని పఠిస్తున్నది. ఒక ప్రేమతత్వాన్ని అనుభవిస్తున్నది. హింసామార్గాన్ని వీడి ప్రశాంత జీవనం లోని మాధుర్యాన్ని రుచి చూసి మానవ జీవితాన్ని సుసంపన్నం చేసుకోవలసిందిగా పలుమార్లు తమ దివ్యబోధనలతో ఉద్బోధించారు భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారు! విశ్వవ్యాపితంగా మానవ జాతిలో అకారణ కలహాలు ప్రారంభమై, మతకలహాలుగా రూపాంతరం చెంది.. దేశాల నడుమ యుద్ధవాతావరణం నెలకొని, అది కాస్తా మారణహోమమై అమాయక ప్రజలను బలి తీసుకుంటున్నది, భగవాన్ బాబా వారు విశ్వశాంతిని కాంక్షిస్తూ, అహింసకు పెద్దపీట వేస్తూ, మతమౌఢ్యాన్ని నిర్మూలించే దిశగా పలుమార్లు జ్ఞాన బోధ చేశారు.

“మతమంటే మానవుణ్ణి భగవంతునితో బంధించేది. వివిధ మతాలను స్థాపించి, వ్యాపింపజేసిన వారిలో ప్రేమ, జ్ఞానం నిండిపొంగారాయి. ఆ మతము లను స్థాపించిన ప్రవక్తల లక్ష్యం ఒక్కటే, వారు మంచిని చేయడానికీ, మంచిని చూడ టానికీ, మంచిగా ఉండటానికీ ప్రయత్నించారు. మతాలు బోధించే వివిధ తాత్విక సిద్ధాంతాలను గ్రుడ్డిగా నమ్మి వల్లించటం కంటే.. వాటిని జీవితంలో ఆచరించటం ముఖ్యం! తాము ప్రవచించే విషయాలను ఆచరణాత్మకం చేయనివారికి.. ఇతరులకు బోధించే అర్హత ఎక్కడిది!? ఏ మతానికి చెందిన వారైనా.. వారి స్వీయ మతధర్మాలను మొదట పరిపూర్ణంగా నమ్మి – తమ తమ జీవితాలతో తప్పక ఆచరించాలి. సాటి మానవుడు ఏ మతం వాడైనా, అతనిని ప్రేమ తత్వంతో ఆదరించాలి. పరమత సహనం పాటించి, సర్వమానవ సౌభ్రాతృత్వం కాంక్షించి ఆచరించిన యెడల – ప్రపంచంలో మతకల్లోలాలు, మారణహోమానికి తావే వుండదు!”

సర్వమతాలను సమానంగా గౌరవించి.. వాటిలో అంతస్సూత్రంగా వున్న ఏకత్వాన్ని, గొప్పదనాన్ని విపులంగా చెప్పి, నొక్కి వక్కాణించేది ‘సాయి మతం!’ అదే.. ‘సాయి అభిమతం’ కూడా!!! మానవులందరినీ సోదరభావంతో ప్రేమించడం.. మానవ జాతికి తండ్రిగా సృష్టికర్తయైన ‘భగవంతుణ్ణి’ సంభావించటం – విశ్వమానవ ధర్మాలను స్వార్థరహిత ‘ప్రేమతత్వం’ ద్వారా సాధించటం శ్రీ సత్యసాయి అవతార ప్రబోధం!

‘నా జీవితమే నా సందేశం’ అని తాను చెప్పింది ఆచరించి చూపించారు భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారు.

స్వామి ప్రబోధనలను ఆచరణాత్మకం చేసిన మానవులు సుసంపన్నమైన జీవన గమ్యంలో స్థిరపడగలరని చెప్పుటలో ఎలాంటి సంశయమూ లేదు!

Exit mobile version