Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సత్త్వగుణ సంపన్నత

[శ్రీ సి.హెచ్. ప్రతాప్ గారి ‘సత్త్వగుణ సంపన్నత’ అనే రచనని అందిస్తున్నాము.]

గవద్గీత 14వ అధ్యాయం లోని 11వ శ్లోకం

సర్వద్వారేషు దేహేయస్మిన్ప్రకాశ ఉపజాయతే।
జ్ఞానం యదా తదా విద్యాద్వివృద్ధం సత్త్వమిత్యుత॥

ఓ అర్జునా, ఎప్పుడైతే మానవ దేహం అంతా జ్ఞానంతో ప్రకాశమవుతుందో, అప్పుడు ఆ మానవునికి సత్త్వగుణం సంపూర్ణంగా అనుభవంలోకి వస్తుంది అని పై శ్లోకం భావం

మానవ జీవితంలో సత్త్వగుణం యొక్క ప్రాముఖ్యతను భగవంతుడు ఈ శ్లోకం ద్వారా వక్కాణించాడు. మానవ దేహానికి రెండు కళ్ళు, రెండు చెవులు, రెండు నాసికాంధ్రములు (ముక్కు పుటములు), ఒక నోరు, ఒక జననావయం మరియు ఒక గుహ్యేంద్రియం వున్నాయి.. అందుకే మానవ సరీరాన్ని నవ ద్వార పురే అంటే తొమ్మిది రంధ్రములు లేదా మార్గములు వున్న ఒక పురం (పట్టణం) అని యోగశాస్త్రం అభివర్ణిస్తుంది. ఈ తొమ్మిది ద్వారములలో ప్రతీ ఇంద్రియం సత్త్వగుణ లక్షణాలతో సంపన్నమైనప్పుడు మానవుడు సత్త్వగుణ సంపన్నుడు అవుతాడని, ఎట్టి ఆందోళనలు, ఆశాపాశాలు, కలతలు లేక శాశ్వతానందముతో అలరారుతూ, చివరకు భగవంతుని సంపుర్ణ కృపకు పాత్రుడవుతాడని భగవానుడు మానవాళికి తెలియజేసాడు. బాహ్య ఇంద్రియములు సత్త్వగుణ సంపన్నులైతే అంతఃకరణ కూడా సత్త్వగుణంతో సుసంపన్నం అవుతుంది. ఆద్యాత్మిక మార్గంలో ప్రయాణం సుగమం అవుతుందని ఈ శ్లోకం మనకు ఒక రాచమార్గాన్ని చూపిస్తోంది.

ప్రకృతి జనితములైన త్రిగుణాలు మానవుల జీవితాలను ఎంతో ప్రభావితం చేస్తాయి. శాస్త్రం ప్రకారం సత్త్వగుణం సద్గుణాల అభివృద్ధికి మరియు జ్ఞాన ప్రకాశానికి దారితీస్తుంది. రజోగుణం దురాశకు, ప్రాపంచిక విజయాల కోసం అపరిమితమైన కార్యకలాపాలకు మరియు మనస్సు యొక్క అశాంతికి దారితీస్తుంది. తమోగుణం బుద్ధి మాయకు, సోమరితనానికి, మత్తు మరియు హింస వైపు మొగ్గుకు దారితీస్తుంది. ఎప్పుడూ పరధ్యానంగా ఉంటాడు. పొరపాట్లు చేస్తుంటాడు. మూర్ఖంగా ప్రవర్తిస్తుంటాడు. వాడికి తెలియదు, ఒకరు చెబితే వినడు. ఇవీ తామసగుణ లక్షణములు. మానవులను అధమ పాతాళానికి దిగజార్చే తమో, రజోగుణాలను పుర్తిగా వదిలించుకొని సత్త్వగుణ సంపన్నులం కావాల్సిన ఆవశ్యకత ఎంతో వుంది.

మానవుల మనస్సు ఎప్పుడూ కూడా త్రిగుణాల మధ్య ఊగిసలాడుతూ వుంటుంది. ఒక్కొక్క క్షణంలో ఒక్కొక్క గుణం మనస్సును ప్రభావితం చేస్తూ వుంటుంది. మూడు గుణాల వల్ల మనస్సు ఊగిసలాడడం చాలా సహజం. అయితే, ఈ స్థితి చూసి మనం నిరాశ చెందకూడదు. ఈ విధమైన ఊగిసలాట ఎందుకు జరుగుతుందో అర్థం చేసుకుని, దాని నుండి పైకి ఎదగడానికి కృషి చేయాలి. సాధన అంటేనే మనస్సులోని మూడు గుణాల ప్రవాహంతో పోరాడటం. మరణించే సమయంలో ఎవరిలో అయితే సత్త్వగుణము ఎక్కువగా ఉంటుందో, ఆ దేహములో ఉన్న జీవాత్మ మరణించిన తరువాత, యోగులు, వేదవిదులు, జ్ఞానులు పొందే ఉత్తమములు, పరిశుద్ధములు అయిన లోకములు పొందుతుంది.కేవలం చనిపోయే ముందు సాత్వికంగా ఉంటే సరిపోదు. జీవితాంతం సత్త్వగుణ సంపన్నుడిగా ఉండాలి. అప్పుడే చనిపోయే ముందు కూడా సత్త్వగుణ సంపన్నుడిగా ఉంటాడు. అయితే ఈ స్థితిని పొందేందుకు జీవితంలో అనుక్షణం మనస్సును పరిశుద్ధంగా ఉంచుకోవడం, నిరంతరం భగవత్ చింతనలో మునిగి, సత్కర్మలే చేస్తూ వుండడం చాలా ముఖ్యం.

మానవులను నిరంతరం క్రుంగదీసే అరిషడ్వర్గాలను లోబరుచుకుంటూ సాత్వికతను పెంపొందించుకోవడం అవసరం. జీవితంలో నిష్కామ కర్మలు, కర్తృత్వ భావనలేని కర్మలు, పుణ్యకార్యములు, పరోపకారం చేస్తే అంత్యకాలంలో కూడా అటువంటి సాత్వికభావనలే కలుగుతాయి. మార్కండేయ మహర్షి ధర్మరాజుతో సత్త్వగుణ సంపన్నత గురించి ఒక ఘట్టంలో అద్భుతంగా చెప్పాడు. “ఓ ధర్మరాజా తొలుత ప్రథమ కల్పంలో భగవంతుడు అత్యంత నిర్మలమైన శరీరాలను సృష్టించాడు. ఆ ప్రకారం పుట్టిన మానవులు మహా సత్త్వగుణ సంపన్నులు. వారు నిత్యం సత్యమే పలికే వారు, అనుక్షణం సత్యవ్రతులై ఉన్నారు. జ్ఞాన సముపార్జన చేసారు మరియు ఎట్టి ఆందోళనలు లేక బహు స్వేచ్ఛగా జీవించారు. సాధనలో అధిక శ్రమ లేకుండా ఎక్కువ ఫలితాన్ని పొందారు. ధర్మం తప్పకుండా జీవించడం, సత్యనిష్టతయే వారు నిత్యం ఆచరించే వ్రతాలుగా వున్నాయి. వారికి కామం, క్రోధం, మదం, మత్సరం వంటి దుర్గుణాలు ఏ కోశానా లేవు. అధిక సంతానవంతులై వేల సంవత్సరాలు జీవించారు. కాలక్రమేణా వారిలో కామము, లోభము, మదము, మాత్సర్యము లాంటి దుర్గుణాలు ప్రవేశించాయి. అందుకే దేవతలు వారిని వదిలి వేసారు. మానవులలో బలం క్షీణించింది. ఇప్పుడు ఎన్ని ఐశ్వర్యాలు వున్నా కూడా అరిషడ్వర్గాలకు లోబడిపోయి దుర్భరమైన జీవితం గడుపుతున్నారు. సత్త్వగుణ సంపన్నత పెంపొందించుకుంటే మానవులే దేవతలవుతారనడానికి ఇంతకంటే ఉదాహరణ ఇంకేమి ఉంటుంది?”

Exit mobile version