[శ్రీ సి.హెచ్. ప్రతాప్ గారి ‘సత్సంప్రదాయాల ఆచరణయే శ్రేష్ఠం’ అనే రచనని అందిస్తున్నాము.]
భగవద్గీత 1వ అధ్యాయం (అర్జున విషాదయోగం), 43వ శ్లోకం:
దోషైరేతైః కులఘ్నానాం వర్ణసంకరకారకైః।
ఉత్సాద్యన్తే జాతిధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః॥
తమ వంశాచారములను నాశనం చేసి, అనైతిక చర్యల ద్వారా దుష్ట సంతానమును పొందే వారి పాప కర్మల వలన వారి జాతి, వంశ, కుల ధర్మాలు శాశ్వతంగా నశించిపోతాయి అని అర్జునుడు శ్రీకృష్ణుడితో చెబుతున్నాడు.
ప్రపంచంలో అత్యుత్తమమైన వైవాహిక, కుటుంబ వ్యవస్థ భారతదేశంలోనే వుంది. అటువంటి కుటుంబ వ్యవస్థ, నైతికంగా ఉపనయన (బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ వర్ణాలవారికి మాత్రమే ఉపనయన సంస్కారం నిర్దేశించబడింది), వివాహాది సంస్కారాల తర్వాత సంతానాన్ని పొందాలని వేల సంవత్సరాల క్రితమే మన ధర్మాలు బోధించాయి.
కుటుంబ సంప్రదాయాన్ని నాశనం చేసేవారి దుష్కార్యాల కారణంగా, అన్ని రకాల ఆధ్యాత్మిక సంప్రదాయాలు నిర్మూలించబడతాయి. కుటుంబం యొక్క గొప్పతనం నాశనం చేయబడుతుంది. కుటుంబ సంప్రదాయాల విధ్వంసానికి కారణమైన వారు అనుభవించే దుస్థితిని అర్జునుడు పై శ్లోకంలో వివరించాడు.
ఈ దుష్కార్యాల కారణంగా, పవిత్ర ఋషులు మరియు ఆధ్యాత్మిక గురువులు నమ్మకంగా బోధించిన వేద గ్రంథాలలో సూచించబడిన ముఖ్యమైన విధులన్నీ వదిలివేయబడతాయి. అందువలన వారు, వారి పితృదేవతలతో పాటు తర్వాత ఏడుతరాల వారు శాశ్వతంగా నరకంలోకి త్రోసివేయబడతారని గరుడపురాణంలో కూడా స్పష్టంగా వుంది.
భారతీయ సత్సంప్రదాయాలను ఆచరిస్తూ, నైతిక నియమావళిని అనుసరించడం మన జీవితాన్ని శ్రేష్ఠంగా మారుస్తుంది. పెద్దల పట్ల గౌరవం, సత్యవంతమైన జీవన విధానం, సహనం, సహాయం, సమాజ హితం కోసం జీవించడం భారతీయ సంప్రదాయాల్లో భాగం. ఈ విలువలు మన వ్యక్తిత్వాన్ని పరిపూర్ణంగా తీర్చిదిద్దతాయి. నైతిక జీవితం మనకు ఆత్మసంతృప్తిని, శాంతిని అందిస్తుంది. సంప్రదాయాలు మానవ సంబంధాలను బలంగా ఉంచుతాయి. దైనందిన జీవితంలో వీటిని పాటించడం వలన మనం ఇతరులకు ఆదర్శంగా నిలుస్తాము. నైతిక నియమాలు మన ఆలోచనలు, ప్రవర్తనను సరిదిద్దుతాయి. దేశాభివృద్ధికి కూడా ఇవి ఉపకరిస్తాయి. ఈ విధంగా, సంప్రదాయాల ఆధారంగా నైతికంగా జీవించడం అత్యుత్తమ మార్గం.
నైతిక ప్రవర్తన వలనే మంచి సంతానం లభిస్తుంది. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆదర్శంగా నిలవాలి. మంచి మాటలు, సత్యం, అహింస, వినయము వంటి విలువలను చిన్నప్పటి నుంచే నేర్పించాలి. మతపరమైన కథలు, నీతికథల ద్వారా సద్గుణాలపై అవగాహన కల్పించాలి. చిన్నపిల్లల ముందు అసభ్యంగా మాట్లాడకూడదు. మంచి పరిసరాలు, మంచి స్నేహితులు కూడా పిల్లల ప్రవర్తనను ప్రభావితం చేస్తాయి. నైతిక విలువలు కలిగిన పిల్లలు భవిష్యత్లో మంచి పౌరులుగా తీర్చిదిద్దబడతారు. సమాజానికి మేలు చేస్తారు. చిన్ననాటి నుంచే వారు సత్య నిష్ఠ, విధినిష్ఠా గలవారిగా ఎదుగుతారు. అందుకే, నైతిక ప్రవర్తనను అలవర్చడం ప్రతి తల్లి, తండ్రి కర్తవ్యం.