Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సశేషమయిన కథ!!!!

[కస్తూరి మురళీకృష్ణ రచించిన ‘సశేషమయిన కథ!!!!’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

Disclaimer:

This is a work of fiction. Unless otherwise indicated, all the names, characters, businesses, places, events and incidents in this story are either the product of the author’s imagination or used in a fictitious manner. Any resemblance to actual persons, living or dead, or actual events is purely coincidental.

ఈ కథ పూర్తిగా కల్పితం, ఎటువంటి నిజ వ్యక్తులు లేదా సంఘటనలతో సంబంధం లేదు. ఏవైనా సారూప్యతలు యాదృచ్ఛికం మాత్రమే. కథలో ఉపయోగించిన పేర్లు, ప్రదేశాలు, సంఘటనలు అన్నీ ఊహాజనితమైనవే, నిజ జీవితంలో ఎవరితోనూ సంబంధం లేదు. ఒకవేళ ఎవరితోనైనా సారూప్యత ఉంటే, అది కేవలం యాదృచ్ఛికం మాత్రమే. 

“ఏమన్నా కావాలా దేవేందర్?”

దేవేందర్  నా చుట్టూ తచ్చాడటం చూసి అడిగాను.

దేవేందర్  నేను ఒక ప్రభుత్వ ఆఫీసులో వేర్వేరు సెక్షన్ లలో పనిచేస్తున్నాము.

దేవేందర్  చాలా అమాయకుడు. ఎంత అమాయకుడంటే, నోట్లో వేలు పెడితే కొరకలేనివాడే కాదు, “అసలు నోట్లో వేలెందుకు పెట్టాలి?” అని ప్రశ్నించేంత అమాయకుడు. అంతే కాదు, నోరు, వేలు, కొరకటం వంటి విషయాల గురించి ఏదేదో మాట్లాడతాడు. అందుకని ఆఫీసులో అందరూ అతడిని ఆట పట్టిస్తారు. ఏడ్పిస్తారు. నిజానికి, అందరూ తనని చూసి ఎందుకు నవ్వుతారో, ఎందుకని ఏడ్పిస్తారో అతడికి అర్థం కాదు. వాళ్ళెంత ఏడ్పిస్తూన్నా, తాను చెప్పేది చెప్తాడు. మాట్లాడేది మాట్లాడేస్తాడు.

అతడికి పని అస్సలు రాదు అనేకన్నా అర్థం కాదు అనటం సబబు. ఏం చెప్పినా, ఎలా చెప్పినా అర్థం కాదు. ఒకోసారి మాత్రం చాలా తెలివిగా మాట్లాడతాడు.

అతడితో నాకు పరిచయం కూడా ఒక మరపురాని సందర్భంలోనే అయ్యింది.

నేను వేరే బ్రాంచ్ నుంచి ట్రాన్స్‌ఫర్  అయి, ఈ బ్రాంచ్‌కి వచ్చాను.

వచ్చి, రిపోర్ట్ చేసి బయటకు వచ్చి ఊపిరి పీల్చుకునేలోగా మళ్ళీ ఆఫీసర్ నుంచి పిలుపు వచ్చింది.

నిజానికి నాకు ఆఫీసర్ని కలవటంతోటే ఆయనకూ నాకూ పడదని అర్థమైపోయింది. నన్ను చూడగానే ముఖం చిట్లించాడు. నేను ఆ రోజు రిపోర్ట్ చేస్తున్నాని, నాతో పాటూ వచ్చిన అడ్మిన్ అధికారి చెప్పాడు.

“ఏం పంతులూ, నువ్వేవో రాస్తావట కదా?” వ్యంగ్యం పొంగిపొర్లింది.

నేను మౌనంగా వున్నాను.

“చూడూ, నువ్వెంత గొప్ప రైటర్ అయినా, బయట నీకెంత పేరున్నా, నువ్వు నా సబార్డినేట్ గుర్తుంచుకో.. తోక వూపితే తోక కోసేస్తా. నాకు పనికావాలి. రాతలు కోతలు బందుచేయ్.. చూస్తా నువ్వెలా రాస్తావో? నా దగ్గర్ అలాంటి పిచ్చి వేషాలు కుదరవు. నువ్వు రాయటం మానేసేట్టు చేస్తా. అయాం పీహెచ్ ఓడీ యూనో”

నేనేమీ మాట్లాడలేదు. నేను నిలబడే వున్నాను. ఆయన సెల్ చూస్తున్నాడు. అడ్మిన్ వైపు చూసి “వెళ్దాం” అన్నట్టు సౌంజ్ఞ చేశాను. “తొందరవద్దు” అన్నట్టు సూచన చేశాడు.

కాస్సేపటి మౌనం తరువాత “ఇక వెళ్ళు. సీట్లో వుండాలి. ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెంటనే రావాలి. సీటొదిలి తిరిగితే ఊరుకోను. నాలాంటి ఆఫీసర్‌ని నువ్వు ఇంతవరకూ చూసివుండవు.” అన్నాడు కఠినంగా.

నేను మౌనంగా బయటకు నడిచాను. కానీ, ఇక్కడ ఉన్నన్నాళ్ళు నాకు కష్ట కాలమే అని అర్థమయింది.

అందుకే బయటకు రాగానే ఆయన పిలిస్తే, మెదడు బ్లాంక్ చేసుకుని లోపలకు వెళ్ళాను.

గదిలో ఆఫీసర్ టేబుల్ ముందు ఒక పొడుగాటి వ్యక్తి నిర్భావంగా నుంచుని వున్నాడు. నల్లగా వున్నాడు.

“ఓయ్ పంతులూ  ఇదిగో, ఈ స్టేట్‌మెంట్ ఒక్కసారి సరిచూడు. నా పని కాదనకు. నేనేం చెప్తే అదే నీ పని.  ఎన్నిసార్లు చెప్పినా అర్థమయ్యి చావటం లేదు దొరగారికి” అని కొన్ని కాగితాల దొంతి నా వైపు విసిరేశాడు ఆఫీసర్.

నేను అవి తీసుకునేలోగా “నువ్వాగు” అన్నాడు ఆఫీసర్.  ఆ వ్యక్తి వైపు తిరిగి “ఇవి తీసుకువెళ్ళు. పని చేయకున్నా కనీసం, పని చేసేవాళ్ళకి గౌరవం ఇవ్వటం నేర్చుకో. ఉట్టిగా జీతం తీసుకుంటే సరిపోదు” అన్నాడు.

ఆ వ్యక్తి నిర్భావంగా నా చేతుల్లోంచి పేపర్లు తీసుకున్నాడు. “రండి” అని బయటకు దారి తీశాడు.

మేము గది వదలి వస్తూంటే, వెనుకనుంచి మాకు వినబడేట్టే అన్నాడు ఆఫీసర్, “ఎలాంటేలాంటి వాళ్ళు ఉద్యోగాలకు వస్తారో. గాడిదలతో పనులు చేయించలేక ఛస్తున్నాను.”

నేను అతని వైపు చూశాను. అతనేమీ వినబడనట్టు బయటకు దారి తీశాడు. నేను అనుసరించాను.

“అలా మాట్లాడతాడేమిటి ఆఫీసరు?” అడిగాను బయటకు రాగానే.

“ఎవరెవరి బాధలు వాళ్ళవి. వాళ్ళకీ ప్రెషర్లుంటాయి” అన్నాడు.

నేను అతని స్టేట్‌మెంట్లు తీసుకుని పరిశీలించాను. దరిద్రంగా వున్నాయి.

“మీ సూపరింటెండెంట్ రాలేదా?” అడిగాను.

“నేనే సూపరింటెండెంట్. నా పేరు దేవేందర్. నా అసిస్టెంట్ రావటం లేదు. ఉంటే అన్నీ అతడే చూసుకునేవాడు” చెప్పాడు.

నాకేమనాలో తోచలేదు.

“ఫైళ్ళెక్కడున్నాయి?” అడిగాను. చూపించాడు.

నాకు కావాల్సిన సమాచారాన్ని నేనే వెతుక్కుని  పని పూర్తి చేశాను. ఆ సెక్షన్ సూపరింటెండెంట్‌గా అతని సంతకాలు తీసుకున్నాను.

స్టేట్‌మెంట్లు చూసి సంతృప్తిగా నిట్టూర్చాడు ఆఫీసర్. “పంతులుకి పని వచ్చినట్టే వుంది.” అన్నాడు. దేవేందర్ దిక్కు చూస్తూ “లక్షలు లక్షలు జీతాలు కావాలి. పని మాత్రం అవసరంలేదు. అంతా ఫ్రీగా కావాలి”  అన్నాడు ఆఫీసర్.

దేవేందర్  ఒక వెర్రి నవ్వు నవ్వాడు.

“ఆయన అలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూంటే మీరు ఎలా ఊరుకుంటున్నారు?” బయటకు రాగానే ఆవేశంగా అడిగాను.

వెర్రి నవ్వు నవ్వాడు. ఏదేదో మాట్లాడేడు. నాకు ఒక్క ముక్క అర్థం కాలేదు.

“అన్నా, ఇప్పుడు రాజుంటాడు. రాజుకు సైన్యం వుంటుంది. మంత్రి వుంటాడు. రాజు పనులు చెప్తే, మంత్రికి కోపం రాదా?” ఇలా తలా తోకా లేకుండా అయిదు నిముషాలు ఏదో మాట్లాడేడు.

ఆ తరువాత అతడు కనబడితే నవ్వి పక్కకు తప్పుకునేవాడిని. అతడు మాత్రం, ముఖమంతా నోరు చేసుకుని “అన్నా.. నీ సహాయం మరచిపోలేనన్నా.. నువ్వొక్కడివే నాకు ఫ్రెండువి” అనేవాడు. మరో మాటకు ఆస్కారం ఇవ్వకుండా నేను తప్పుకునేవాడిని.

ఒకరోజు ఒక కొలీగు ప్రసాదుతో  ఉబుసుపోక కబుర్లు చెప్తూ దేవేందర్‌తో ఆఫీసర్ వ్యవహరించిన తీరు చెప్పాను.

“దేవేందర్ అమాయకుడు. అతడి ఐక్యూ తక్కువ. ఉట్టి పనికిరాని వాడు. అలాంటి వాళ్ళని షూట్ చేయాలి.  కానీ, ఏం చేస్తాం. కోటాలో ఉద్యోగం వచ్చింది. పరీక్షలో తక్కువ మార్కులొస్తే ప్రమోషన్. మేమిద్దరమూ ఒకటే బాచ్. నేను అతని కన్నా నాలుగేళ్ళ ముందు ప్రమోషన్ పరీక్ష పాసయ్యాను. కానీ, పాసవుతూనే అతనికి ప్రమోషన్ వచ్చింది. నాకు అదే ప్రమోషన్ వచ్చేందుకు అతనికి వచ్చిన తరువాత ఇంకా  ఐదేళ్ళు పట్టింది. ముందు పాసయినా చార్జ్ నా కన్నా ముందు తీసుకున్నందుకు అతను  క్యాడర్‌లో నాకు సీనియర్” నవ్వుతూ చెప్పాడు ప్రసాద్.

“మరి రిజర్వేషన్ వున్నవాడయితే ఆఫీసర్ అలా మాట్లాడితే కేస్ పెట్టొచ్చుకదా?” ఆశ్చర్యంగా అడిగేను.

“ఆఫీసర్ పేరేంటి?”

“విజయ్” పేరు చెప్తూంటేనే నాకు ఆలోచనవచ్చింది. దేవేందర్ కు  రిజర్వేషన్ వుంటే, విజయ్ కు ఎందుకుండదు?

నాకు అర్థమయిందని గ్రహించిన ప్రసాద్ నవ్వాడు. “ఇద్దరూ రిజర్వ్‌డే. ఎవరి మీద ఎవరు  ఏమని కేస్ పెడతారు?”

“కానీ?” ఏమనాలో తోచలేదు.

“వీళ్ళు ఒకప్పుడు   రాజులు. తురకల దాడి నుంచి తప్పించుకుని అడవుల్లోకి పారిపోయారు. కాలక్రమేణా, వీరు ఆటవికులయిపోయారు. ఇప్పుడు ఎస్టీలయ్యారు. కానీ, అప్పటి రాచరికం గుర్తుగా పేరు మిగిలింది.” ఇంకా ఏదో చెప్పబోయాడు కానీ, ఇంకో కొలీగ్ వచ్చి పలకరించటంతో మాట మారిపోయింది.

తరువాత నేను గమనించిందేమిటంటే, ప్రసాద్‌కు అందరన్నా ఒక చులకన భావన వుంది. అంతా తనకే తెలుసన్న అహంకారం వుంది. ప్రతి ఒక్కరినీ విమర్శిస్తాడు. అందరినీ దూషిస్తాడు. ఎవ్వరికీ ఏమీ రాదంటాడు. అందరూ పనికిరానివారంటాడు.  అతనికీ వ్యవస్థ అంటేనే ద్వేషం. క్రోధం. కానీ, ఈ వ్యవస్థలో బ్రతకక తప్పదు. చేపకు నీరు ఎంతగా ఇష్టం లేకపోయినా నీరు వదలి బ్రతకలేదు కదా!

అయితే, నాకు ఎందుకో దేవేందర్ అంటే ఇష్టం ఏర్పడింది. ఆఫీసులో రాజకీయాలు అతనికి తెలియవు. ఎవ్వరి గురించి కూడా ఒక్క మాట చెడ్డగా మాట్లాడడు. అందరితో మర్యాదగా మాట్లాడతాడు. కానీ, అందరూ అతడిని చులకన చేస్తున్నా ఏమీ పట్టించుకోడు.

అందుకే, దేవేందర్ ఎప్పుడు పలకరించినా నేను అభిమానంగా మాట్లాడటం ప్రారంభించాను. అతడేదైనా సమస్య అడిగితే దాని పరిష్కారం సూచించేవాడిని. వీలయితే చేసి పెట్టేవాడిని. అందుకే, దేవేందర్  నా చుట్టూ మొహమాటంగా తచ్చాడటంతో విషయం అడిగాను.

మొహమాటంగా దగ్గరకు వచ్చి గుసగుసగా చెప్పాడు.

“నీతో కొంచెం ప్రైవేట్‌గా మాట్లాడాలన్నా.”

వయసుతో సంబంధం లేకుండా అందరినీ “అన్నా” అంటాడు.

“ఒక్క నిముషం” చేస్తున్న పని పూర్తిచేసి లేచాను. అప్పటివరకూ కాలుగాలిన పిల్లిలా అటూఇటూ తిరుగుతూనే వున్నాడు.

ఇద్దరం కాంటీన్‌లో కూచున్నాము.

నా చేతిలో కొన్ని కాగితాలు పెట్టాడు.

తీసి చూశాను. చూడగానే అర్థమయింది. అది క్రమశిక్షణ చర్య తీసుకునే ముందు వివరణ అడిగే నేరారోపణ పత్రం. ప్రశ్నార్థకంగా అతని వైపు చూశాను. అతని  కళ్ళల్లో నీళ్ళు కనిపించాయి.

దృష్టిని కాగితాల వైపు మళ్ళించాను.

వారం క్రితం  ఆఫీసర్ గదిలో  ప్రసాద్‌ని దేవేందర్ కొట్టాడట. ఆఫీసు సమయంలో ఆఫీస్ స్టాఫ్‌పై చేయి చేసుకున్నందుకు అతనిపై కఠిన చర్య ఎందుకు తీసుకోకూడదో వివరించమని అడిగే చార్జ్ షీట్ అది.

“ప్రసాద్‌ని కొట్టావా, అదీ ఆఫీసర్ సమక్షంలో?” ప్రశ్నించాను.

“అన్నా జరిగిందేంటంటే..” అంటూ ఒక అరగంట చెప్పాడు. అతి కష్టం మీద అతను  చెప్పిన దాన్లోంచి విషయాన్ని అర్థం చేసుకోవాలని ప్రయత్నించాను. అతను అంతా చెప్పిన తరువాత నాకు అర్థమయింది చెప్పాను.

“నువ్వు స్టేట్‌మెంటులు సరిగ్గా ఇవ్వలేదని ప్రసాద్ ఆఫీసర్‌కి ఫిర్యాదు చేశాడు. ఆఫీసర్ నిన్ను  గదిలోకి పిలిచాడు. అతడి ముందు ప్రసాద్ నిన్ను బూతులు తిట్టాడు. అవమానకరంగా మాట్లాడాడు. నిన్ను కొట్టటానికి మీదమీదకు వస్తే నువ్వు వెనక్కు నెట్టావు. నువ్వు తనని కొట్టావనీ, దానికి ఆఫీసర్ సాక్షి అనీ ప్రసాద్ నీ మీద కంప్లయింట్ ఇచ్చాడు. అంతేనా?”

తల ఊపాడు.

“డ్యూటీలో ఉన్న ప్రభుత్వోద్యోగిని కొట్టటం నేరం. పైగా ఆఫీసర్ గదిలో, ఆఫీసర్ ముందు కొట్టటం..” ఏమనాలో తెలియలేదు. దేవేందర్‌ని చూస్తే జాలిగా అనిపించింది.

“అన్నా రెండు నెలలలో నా రిటైర్మెంట్ ఉందన్నా.. రిటైర్మెంట్ బెనిఫిట్లు రాకుండా ఆపేస్తామంటున్నారు అన్నా” దాదాపుగా ఏడుస్తున్నట్టు చెప్పాడు.

“కానీ, ప్రసాద్ మంచివాడేనే అతనెందుకంత అగ్రెసివ్‌గా ప్రవర్తించాడో” నాలో నేను ఆలోచిస్తున్నట్టు పైకి అన్నాను.

“అన్నా.. ప్రసాద్ మంచివాడే కానీ, నన్నెప్పుడూ పనికిరాడు, పనికిరాడు, అని అందరిముందూ తిడుతూంటాడన్నా.. నేనూ అతనూ సమానమైన  ర్యాంక్ లోనే వున్నా, నేను సీనియర్ అయినా, నన్ను తిడతాడన్నా.. ఆ రోజు తాగి వున్నాడన్నా..”

“ప్రసాద్ తాగుతాడా? తాగి ఆఫీసుకి వస్తాడా?”

“రోజు తాగుతాడన్నా.. ఎవ్వరినీ లెక్కచేయడన్నా.. నన్నయితే తిడుతూనే వుంటాడన్నా.. ఆ రోజు బూతులు తిట్టాడన్నా.. మీదమీదకు వచ్చాడన్నా.. నేను దూరం తోశానన్నా.. కానీ, కొట్టానంటున్నాడన్నా..”

“మన లేబర్ ఆర్గనైజేషన్లను కలిసి విషయం చెప్పావా?”

“చెప్పానన్నా.. వాళ్ళేమీ చేయలేమంటున్నారన్నా”

“మీకు ఎస్సీ ఎస్టీ సంస్థ వుంటుంది కదా?”

“ఆఫీసర్ వున్నాడు కదన్నా.. ఈయననే కాదు, పై ఆఫీసర్లు కూడా సహాయం చేయమన్నారన్నా”

నాకేమనాలో తోచలేదు.

“అన్నా, చార్జ్‌షీట్‌కి సమాధానం ఏదో ఒకటి రాసియ్యన్నా. నువ్వయితే మంచిగా రాస్తావన్నా.. ఈ ఆఫీసులో నాకు గౌరవమిచ్చేది నువ్వే అన్నా.. నువ్వే రాసియ్యాలన్నా..” ఏదేదో అంటున్నాడు. అన్నదే అంటున్నాడు. అతనెంత ఒత్తిడిలో వున్నాడో అర్థమయింది.

మళ్ళీ చార్జ్‌షీట్ చదివేను.

“మీ రిటైర్మెంట్ బెనెఫిట్లు ఆపేస్తానని ఎవరు చెప్పారు?”

ఎందుకో ఇదంతా చూస్తూంటే, దేవేందర్‌ను ఒక పద్ధతి ప్రకారం ఒత్తిడికి గురిచేసి, ఏడ్పిస్తున్నట్టనిపిస్తున్నది. ఎందుకంటే, ఆఫీసర్లంతా దేవేందర్  వర్గానికి చెందినవారే. వారు దేవేందర్‌కి మద్దతునివ్వాలి. ప్రసాద్ అగ్రవర్ణానికి చెందినవాడు. తాగి వున్నాడు. తీసుకుంటే అతనిపై ఏక్షన్ తీసుకోవాలి. పైగా, ఆఫీసర్ ముందే అతడు, దేవేందర్‌ని  బూతులు తిట్టాడు. అవమానించాడు. దేవేందర్ ఏమీ అనడు. ఏమీ అనలేడు. కాబట్టి ఆఫీసర్ ఎట్టి పరిస్థితులలో దేవేందర్‌నే సమర్థించాలి. ఇందుకు భిన్నంగా దేవేందర్‌నే బెదిరిస్తున్నారంటే, నాకు తెలియనిది, అర్థం కానిది ఏదో తిరకాసు దీన్లో వుండి వుండాలి.. ఎంత ఆలోచించినా నాకు బోధపడటంలేదు. చివరికి దేవేందర్‌నే  అడిగేను.

“నిజానికి చార్జ్‌షీట్ నీకు కాదు, ప్రసాద్‌కి ఇవ్వాలి. నీకు ఇచ్చారంటే, ఇదేదో కావాలని నిన్ను ఇబ్బంది పెట్టాలని చేస్తున్న కుట్రలాగా వుంది” అన్నాను.

చాలాసేపు మౌనంగా ఉన్న తరువాత మెల్లిగా చెప్పాడు. అతను గంటసేపు చెప్పినదంతా వింటే నాకు అర్థమయింది చెప్పాను.

“ఆఫీసర్ నిన్ను మతం మారమని అడిగేడు. నువ్వు ఒప్పుకోలేదు. మతం మారితే ప్రమోషన్ పరీక్ష కూడా పాస్ చేయిస్తానన్నాడు. నువ్వు ప్రలోభానికి లొంగలేదు. నీకు ప్రమోషన్ రాలేదు. ఇప్పుడు కూడా, మతం మారకపోతే, రిటైర్మెంట్ బెనిఫిట్లు రాకుండా, పెన్షన్ రాకుండా చేస్తానని బెదిరించాడు. నువ్వు లొంగలేదు. ఆ తరువాత ఈ సంఘటన జరిగింది. అంతేనా?”

“అంతే. నేను మతం మారనన్నా.. ఇప్పుడే కాదన్నా, చస్తావా, మతం మారతావా అన్నప్పుడు మా పూర్వీకులు  చచ్చారు కానీ, మతం మారలేదన్నా. అన్నీ, వదలుకుని అడవులకు పారిపోయారుకానీ, ధర్మం వదలలేదన్నా.. ఇప్పుడు ప్రమోషన్ కోసమో, రిటైర్మెంట్ బెనిఫిట్ కోసమో ధర్మం వదలుతానా అన్నా?” అడిగాడు.

“నిన్ను మతం మారిస్తే మన ఆఫీసర్లకేమొస్తుంది?” ప్రశ్నించాను.

“మన ఆఫీసర్లందరూ, మతం మారినవాళ్ళే అన్నా.. నేను మారకపోవటం వారికి అవమానంగా వుంది.”

నాకు ఆశ్చర్యం అనిపించింది. నేనెప్పుడూ ఎవరిదే కులము, ఏ మతమూ పట్టించుకోలేదు. కానీ, పట్టించుకోవాలేమో అనిపిస్తున్నది ఇదంతా చూస్తూంటే.  మతం మారటం అంటే, భారతీయ ధర్మానికి శిక్ష విధించినట్టు. మతం మారటం మరో జన్మ ఎత్తినట్టు.  అంటే, మతం మారితే కులం పోవాలి. మతం మారినా కులం వుండేట్టయితే, ఇక మతం మారటంలో అర్థం లేదు. కానీ, మతం మారినా, కులం వదలటం లేదు, కులం ఆధారంగా లభించే సౌకర్యాలనూ వదలటం లేదు. దీనికి తోడు, ఆ కులం ద్వారా లభించే సౌకర్యం ఆధారంగా లభించిన అధికారాన్ని ఆధారం చేసుకుని ఇతరులను బెదిరించి మతం మార్చటం మరీ ఘోరం.

మతం మారటం అన్నది విశ్వాసంతో  స్వచ్ఛందంగా జరగాలి. బెదిరింపులతో కాదు.

“మరొక్కసారి అడుగుతున్నాను, నీ మీద ఈ కేస్ పెట్టటం వెనుక మత మార్పిడే ప్రధాన లక్ష్యమా?” నిర్మొహమాటంగా అడిగాను.

“నిజం అన్నా.. ప్రమోషన్ ఆశతో మతం మారి ప్రమోషన్ పొందారన్నా, మన ప్రమీల లేదూ, ఆమెకు మతం మారితేనే ప్రమోషన్ వచ్చిందన్నా..” అంటూ ఇంకా ఏదో చెప్పబోతూంటే నేను ఆపేను.

“నేను వివరణ రాస్తాను. అయితే ఒకటి కాదు, రెండు.”

అర్థం కానట్టు చూశాడు. మౌనంగా వుండమని సౌంజ్ఞ చేశాను.

చకచకా అక్కడే, కాగితాలు అడిగి తీసుకుని రాయటం ఆరంభించాను. నేను రాస్తున్నంతసేపూ, ఏదేదో మాట్లాడుతూనే వున్నాడు.

రాయటం పూర్తయిన తరువాత, పిన్నులు కొట్టి రెండు వివరణలు ఇచ్చాను.

“ముందు సంతకం పెట్టి ఇది ఇయ్యి. ఇది చదివి నిన్ను పిలుస్తారు. ఎవరు రాసిచ్చారని అడుగుతారు. నా పేరు చెప్పు. ఇది వద్దు, వేరే రాసియ్యమంటారు, కేస్ క్లోస్ చేస్తామంటారు. అప్పుడు ఇది ఇయ్యి.” అంటూ రెండు నంబర్లు వేసి ఇచ్చాను.

“టైపు కొట్టించి సంతకం పెట్టి ఇయ్యి” చెప్పాను.

“థాంక్సన్నా.. థాంక్సన్నా..” అని ఏదో చెప్తోంటే నేను వారించి సీటుకి వచ్చేశాను.

కొన్నాళ్ళ తరువాత నేను అన్నీ సర్దుకుని బయలుదేరబోతూంటే, స్వీట్ బాక్స్ పట్టుకుని వచ్చాడు దేవేందర్. ముఖం నవ్వుతో వెలిగిపోతోంది.

“అన్నా.. కేసు మాఫీ అయిపోయిందన్నా. ఇక నేను హాపీగా రిటయిరవుతానన్నా.” అంటూ దాదాపుగా నన్ను కౌగలించుకున్నంత పనిచేశాడు.

“ఏమయింది?” అడిగాను.

“ఆరోజు నువ్వు చెప్పినట్టే చేశానన్నా.. కొన్ని రోజుల తరువాత పిలిచి  ఎవరు రాసిచ్చారని అడిగారు. నీ పేరు చెప్పానన్నా.. మళ్ళీ నిన్న పిలిచారన్నా.. ఇదొద్దు ఇంకొకటిమ్మన్నారన్నా. ఇచ్చానన్నా.. ఇందాకే లెటరిచ్చారు. వివరణ సంతృప్తికరంగా వుంది కేసు క్లోజన్నారన్నా.. థాంక్సన్నా.. థాంక్సన్నా..”

ఇంకా ఏదో చెప్పబోతూంటే నేను అడ్డుపడ్డాను. “నేను వెళ్ళాలి” అన్నాను.

“సరే అన్నా.. కానీ, నీకు నిజంగా మీడియా వాళ్లందరూ తెలుసా అన్నా.. మతం మారమని వేధిస్తున్నారని మీడియాకు చెప్తానని నేను బెదిరించినట్టు రాసావట కదన్నా. అందుకే, అది వద్దని ఇంకోకటి అడిగేరటన్నా..”

నేను నవ్వాను. ఏమీ మాట్లాడలేదు.

నేను దేవేందర్‌కి  చెప్పని విషయం ఒకటుంది.

దేవేందర్  రావటానికి గంట ముందే నాకు ట్రాన్స్‌ఫర్  ఆర్డర్ వచ్చింది. నన్ను మరో బ్రాంచికి బదిలీ చేశారు. ట్రాన్స్‌ఫర్  ఆర్డర్‌తో పాటూ రిలీవింగ్ ఆర్డర్ కూడా ఇచ్చారు. తెల్లారే వేరే వూళ్ళో వేరే బ్రాంచిలో చేరాలి..

ఆఫీసు వదలి బయటకు వచ్చాను కానీ, నా మనసులో ఒకటే ఆలోచన మెదలుతోంది.. ఇది నాకు తెలిసిన ఒక సంఘటన.. కానీ, ఇలాంటివింకా ఎన్ని సంఘటనలున్నాయో? అన్నీ ఇలాగే ముగియవు కదా!!! దీనికి పరిష్కారం ఏమిటి?

ప్రస్తుతానికిది  సమాధానం లేని సశేషమయిన కథ..

(మతం మారితే కులం పోతుందన్న కోర్ట్ తీర్పుకు ఈ కథ అంకితం)

Exit mobile version