[శ్రీపతి లలిత గారు రాసిన ‘సర్వేషు మాతా!’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
హైదరాబాద్‌లో అదొక పెద్ద పెళ్ళిహాల్, సిటీలో పెద్ద కాంట్రాక్టర్ రాధాకృష్ణ కొడుకు పెళ్లి.
పెళ్లి ముహూర్తం సాయంత్రం కానీ, ఉదయం అబ్బాయి స్నాతకం జరుగుతోంది, దానితో అంతా హడావిడిగానే ఉన్నారు.
కుర్చీల్లో కొంతమంది మగవాళ్ళు కూర్చుని, పాత కబుర్లన్నీ నెమరేసుకుంటున్నారు.
ఆడవాళ్లు తయారవుతూ, మధ్య, మధ్యలో తొంగిచూస్తూ, వీళ్ళని కూడా తయారవమని హెచ్చరిస్తున్నారు.
పెళ్ళికొడుకు పెదతల్లి మైథిలి, బయటికి వచ్చి అక్కడే ఉన్న ఒకాయన్ని పిలిచి, “బావమరిదిని రమ్మని చెప్పండి, కాశీయాత్ర మొదలవుతుంది” అని చెప్తూ, అక్కడే కూర్చుని, ఈ తంతుతో ఏమాత్రం సంబంధం లేనట్టు, భయంగా దిక్కులు చూస్తున్న ఒక అరవైఏళ్ళ పైనే ఉన్న ఆయన దగ్గరికి వెళ్ళింది.
మైథిలిని చూస్తూనే, ఆయన మొహం వెలిగింది, తల్లినుంచి తప్పిపోయిన పిల్లవాడు, తల్లిని చూడగానే సంబరపడ్డట్టుగా, చప్పట్లు కొడుతూ నవ్వాడు.
ఆయన చెంప నిమురుతూ “రఘు! ఆకలి వేస్తోందా! బాత్రూంకి వెళ్లాలా?” పసివాడిని అడిగినట్టు అడిగింది. “ఊహూ, ఇంటికెళ్దాం” అన్నాడు ఆయన చంటిపిల్లాడిలాగా.
“వెళ్ళిపోదాం, మరి మీకిష్టమైన పులిహోర, బూరెలు రెడీ అవుతున్నాయి, అవి తిని వెళదాం” అంటుండగానే, ఎనభైయేళ్ల మైథిలి మామగారు, జగన్నాథం వచ్చి “నువ్వెళ్ళమ్మా! నేనుంటాలే వాడి దగ్గర” అంటూ రఘు దగ్గరికి కుర్చీ లాక్కున్నాడు.
“అవసరం అయితే పిలవండి మామయ్యా!” అంటూ మైథిలి వెళ్తుంటే, రఘు భయంగా చూస్తూ, మైథిలి చీర పట్టుకుని “నువ్వు వెళ్లొద్దు” అన్నాడు,
“నాన్నే కదా! భయం ఎందుకు? నేను ఇప్పుడే వస్తా!” అంటూ “జాగ్రత్త మామయ్యా !” అని తిరిగి, తిరిగి చూస్తూ వెళ్ళింది.
జగన్నాథం, రఘు దగ్గరకి జరుగుతుంటే, భయంగా దూరం, దూరంగా జరుగుతున్నాడు రఘు.
ఇదంతా గమనిస్తున్న పెళ్లికూతురు బంధువు ఒకాయన, ఆత్రం ఆపుకోలేక “ఎవరండీ ఈయన? ఏమైయింది?” అడిగాడు.
“నా ఖర్మ నాయనా? ఏం చెప్పమంటారు? వీడు నా పెద్ద కొడుకు డాక్టర్ రఘురాం, పెద్ద న్యూరోసర్జన్, ఎటువంటి సమస్యలనయినా చిటికెలో పరిష్కరించేవాడు. ఇక్కడే పెద్ద ఆసుపత్రిలో పనిచేసేవాడు, దేశంలోనేకాదు, విదేశాలనుంచి కూడా, వాడి దగ్గరికి సలహాలకు ఎంతోమంది వచ్చేవాళ్ళు. వాడికి ఇద్దరు కొడుకులు, వాళ్ళు కూడా పెద్ద డాక్టర్లు. మా రెండో అబ్బాయి రాధాకృష్ణ కూడా ఇక్కడే ఉండడంతో, నేనూ, నా భార్యా, ఇద్దరి దగ్గరా తిరుగుతుండేవాళ్ళం. కానీ, ఎక్కువ రఘు దగ్గరే ఉండేవాళ్ళం. నా కోడలు మైథిలి నిజంగా సీతమ్మవారు, మమ్మల్ని ఆమె తల్లి, తండ్రి కంటే ఎక్కువగా చూసుకుంటుంది.
పొద్దున్న లేచిననుంచి రాత్రి పడుకునేదాకా, రఘుకి, ఏమి కావాలన్నా తనే చూసుకునేది, వాడికి ఏం కావాలో, వాడికంటే ఆమెకే బాగా తెలుసు.
అంతా బావుంటే, మనం దేవుడిని తలుచుకోమనుకున్నాడేమో, నాలుగేళ్ల క్రితం ఆ రోజు..”
చెప్తున్న జగన్నాథం, ఒక్కసారి ఆ రోజు జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయాడు.
***
ఆ రోజు ఇప్పుడే జరిగినట్లుగా బాగా గుర్తుంది.
మాములు రోజుల్లాగానే, ఉదయం ఎనిమిది గంటలకల్లా టిఫిన్ చేసి ఆసుపత్రి కి వెళ్ళిపోయాడు రఘురాం. ఆ రోజున ముఖ్యమైన సర్జరీ ఉంది అని, తను వచ్చేసరికి బాగా ఆలస్యం అవచ్చు అని చెప్పి వెళ్ళాడు.
రఘు వెళ్ళగానే, మైథిలి, అత్తా, మామలతో పాటు టిఫిన్ తినడానికి కూర్చుంది.
“అత్తయ్యా! దసరా పండగ దగ్గరకి వస్తోంది, అందరికీ బట్టలు కొనాలి, వెళ్లి కొనుక్కొద్దామా” అడిగింది అత్తగారిని.
“ఈ ట్రాఫిక్ లో నేను రాలేను మైథిలీ! పైగా ఇంతమందికి బట్టలు కొనడమంటే చాలా సమయం పట్టేస్తుంది, అంత సేపు నేను కూర్చోలేను, నువ్వు వెళ్లి తెచ్చేయి” అన్న అత్తగారితో
“సరే! రఘుకి ఎలాగయినా లేట్ అవుతుంది అన్నాడు కదా, డ్రైవర్ ని ఫోన్ చేసి రమ్మంటాను” అని డ్రైవర్‌కి ఫోన్ చేసింది.
“అమ్మా! సార్‌కి ఇవాళ చాలా లేట్ అవుతుంది, ఇంటికి క్యాబ్‌లో వెళతాను అన్నారు. మీ పని అయిపోయాక, నేను కూడా ఇంటికి వెళ్లిపోతాను” అన్నాడు డ్రైవర్.
మైథిలి షాపింగ్ అయ్యి, ఇంటికి వచ్చేసరికి దాదాపు అయిదు అయింది, రఘు వచ్చే ఉంటాడు అనుకుంటే, ఇంకా రాలేదు అన్నారు అత్తగారు.
ఆరు గంటల టైములో రఘుకి ఫోన్ చేసింది.
రఘు ఫోన్ ఎత్తలేదు, అది మామూలే మైథిలికి, వెంటనే ఆయన సెక్రటరీ సుజాతకి ఫోన్ చేసింది.
“సార్ ఇప్పుడే క్యాబ్‌లో బయలుదేరారు మేడం, బహుశ సిగ్నల్ లేదో, ఫోన్ సైలెంట్లో పెట్టారో” అంది ఆమె.
సరే, బయలుదేరితే గంటలో ఇంటికి వస్తాడు, అని గబగబా డిన్నర్ కోసం వంట మొదలుపెట్టింది మైథిలి.
మరో పావుగంటకి ఫోన్ మోగితే, చూస్తే రఘు ఫోన్ నుంచే, “రఘు! మీకు ఇష్టమైన పూరి, కూర చేస్తున్నా! ఇంకా ఎంత సేపట్లో వస్తారు?” అడిగిన ఆమెకి కొత్త గొంతు వినిపించింది
“మేడం! ఈ ఫోన్‌కి, మీ నుంచి ఆఖరిసారిగా కాల్ వచ్చింది, హాస్పిటల్ ముందే ఒక క్యాబ్‌ని, లారీ అదుపుతప్పి కొట్టేసింది. క్యాబ్ డ్రైవర్ దెబ్బలతో బయటపడ్డాడు కానీ, వెనక కూర్చున్న ఆయనకి తలకి బాగా సీరియస్ దెబ్బలు తగిలాయి.. అవతల చెప్తుండగానే “ఆయన ఆ హాస్పిటల్లో డాక్టర్, ఆయనని అక్కడికే తీసుకెళ్లండి” అరిచింది మైథిలి.
“ఇప్పటికే తీసుకెళ్ళాం, మీరు కూడా రండి” అంటుండగానే సుజాత నుంచి ఫోన్ వచ్చింది.
“మేడం! డాక్టర్ గారికి చాలా సీరియస్‌గా ఉంది, మీ కోసం కార్ పంపాను వెంటనే రండి” అంది.
ఫోన్లు మోగడం, మైథిలి గట్టిగా మాట్లాడడం, విన్న జగన్నాథం వాళ్ళు పరిగెత్తుకు వచ్చారు.
“మామయ్యా! రఘుకి ఆక్సిడెంట్ అయింది, నేను ఆసుపత్రికి వెళ్తున్నాను” బయట కారు శబ్దం వినగానే పరిగెత్తింది మైథిలి. కొన్ని యుగాల తరవాత ఆసుపత్రికి చేరినట్టు అనిపించింది ఆమెకి.
లోపలికి వెళ్తూనే, సుజాత ఎదురుగా వచ్చింది “డాక్టర్ గారి తలకి బాగా దెబ్బ తగిలింది, థియేటర్ లోకి ఇప్పుడే తీసుకుని వెళ్లారు, రండి” అంటూ తీసికెళ్ళింది. రఘు అక్కడే ఉన్న స్ట్రెచర్ మీద ఉన్నాడు, కాళ్ళు, చేతుల మీద చిన్న దెబ్బలు ఉన్నా తల మీద రక్తం కనిపిస్తోంది.
“లారీ గుద్దాక, కార్ రెండు పల్టీలు కొట్టింది, ముందు డ్రైవర్ బెల్ట్ పెట్టుకున్నాడు కానీ, వెనక కూర్చున్న ఈయన, బెల్ట్ పెట్టుకోక పోవడంతో, దెబ్బ తీవ్రత ఎక్కువ అయింది” పోలీస్ డ్రెస్ వేసుకున్న అతను చెప్పాడు.
ఇంతలో రఘు అసిస్టెంట్ వచ్చాడు, “మెదడులో రక్తం గడ్డకట్టింది, సర్జరీ చేసి తీస్తాము, కండీషన్ సీరియస్ గానే ఉందండీ, మా ప్రయత్నం మేము చేస్తాము” అన్నాడు అతను.
అనేందుకు ఏమిలేక, సరే అన్నట్టు తల ఊపింది మైథిలి.
ఆపరేషన్‌కి తీసుకెళ్లేలోగా రాధాకృష్ణ దంపతులు, జగన్నాథం దంపతులు కూడా వచ్చారు. రఘు కొడుకులకి ఫోన్ చేసి విషయం చెప్పానని, వాళ్ళు బయలుదేరుతున్నారని చెప్పాడు రాధాకృష్ణ.
మైథిలి మాత్రం, అలా ప్రాణం లేని శిలలా కూర్చుని ఉండిపోయింది. ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఆకాశ హర్మ్యం, ఒక భూకంపం దాడికి కూలినట్టు, పంచభక్షాలు వడ్డించిన విస్తట్లో ఎవరో నీళ్లు పోసినట్టు..
ఇంత చక్కటి సంసారం, ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్న డాక్టర్, ఎందరికో ప్రాణం పోసినవాడు, అనుకూలవతి అయిన ఇల్లాలు, తండ్రి అంటే ప్రాణం పెట్టే కొడుకులు, కొడుకుని చూసి పొంగిపోయే తల్లి, తండ్రులు..
ఎందుకు? ..ఎందుకు ఇలా అయింది?
ఆపరేషన్ ముందు, సర్జన్ తనని పక్కకి పిలిచి మాట్లాడినవి గుర్తుకొచ్చాయి మైథిలికి.
“మైథిలి గారు! రఘు భార్యగా పరిచయమైన మీతో, ఒక పేషెంట్ భార్యగా ఇలా చెప్పాల్సి వస్తుందని, ఎప్పుడూ అనుకోలేదు. మెదడులో రక్తస్రావం అవుతోంది, అది వెంటనే ఆపకపోతే, ఒక్కో అవయవం దెబ్బ తింటుంది, ప్రాణాలకి కూడా ప్రమాదం. మా ప్రయత్నం, మేము పూర్తిగా చేస్తాము. అతని ప్రాణం కాపాడినా, ఏదైనా అవయవం సరిగ్గా పనిచెయ్యక పోవచ్చు, జ్ఞాపకశక్తి పోవచ్చు, అసలు పరిస్థితి ఏమిటీ అనేది ఆపరేషన్ తరవాతే చెప్పగలం” అన్నాడు.
దాదాపు నాలుగైదు గంటల తరవాత, ఆపరేషన్ అయిందని చెప్పారు. నలభయ్ ఎనిమిది గంటలు గడిస్తే కాని, ఏమీ చెప్పలేము అన్నారు. మైథిలి, కొడుకులు, రాధాకృష్ణ దాదాపు ఆసుపత్రిలోనే గడుపుతున్నారు.
ఇంట్లో పెద్దవాళ్ళు, వాళ్ళకి తోచిన పూజలు చేస్తూ, చేయిస్తూ దేవుడిని వేడుకుంటున్నారు.
దాదాపు రెండు రోజుల తరవాత స్పృహ వచ్చింది రఘుకి.
“అమ్మా! తలనొప్పి” అంటూ కళ్ళు తెరిచిన అతనికి, ఎదురుగా మైథిలి కనిపించింది.
డాక్టర్‌కి చెప్పగానే పరిగెత్తుకు వచ్చాడు అతను.
“హలో డాక్టర్ రఘు! ఎలా ఉన్నారు?” అన్న తన తోటి డాక్టర్ని అయోమయంగా చూసాడు రఘు.
“నేను ఎక్కడ ఉన్నాను? మీరందరూ ఎవరు?” అని అడుగుతున్న రఘుని చూసి గుండె జారిపోయింది మైథిలికి.
“కొంతమందికి ఇలా దెబ్బ తగిలాక, ముందు మతిమరపు వచ్చినా, కొన్ని రోజుల్లో అన్నీ మామూలు అవుతాయి, మీరు కంగారు పడకండి” అని చెప్పారు డాక్టర్లు.
ప్రాణానికి ప్రమాదం లేదని, ఏదైనా సరే చాలా జాగ్రత్తగా చూడాలని, బలవంతంగా గుర్తు చెయ్యద్దని, రకరకాల జాగ్రత్తలు చెప్పి ఇంటికి పంపారు. రఘుని చూడడానికి ప్రత్యేకంగా మనిషిని పెడదామంటే ఒప్పుకోలేదు మైథిలి. ఒక్క మైథిలితో ఉన్నప్పుడే, రఘు కొద్దిగా ధైర్యంగా ఉంటున్నాడు, ఇంకెవరిని చూసినా భయంతో ముడుచుకుపోతున్నాడు.
మైథిలి ఎవరో, ఆమె పేరు ఏమిటో కూడా, గుర్తు రాలేదు రఘుకి.
“అమ్మా!” అంటాడు అంతే. రఘు పిల్లలు ఇద్దరూ, తల్లితండ్రుల్ని తమతో తీసుకెళ్తామన్నారు, కానీ, అందుకు ఒప్పుకోలేదు మైథిలి.
ఇక్కడి వాతావరణంలో ఉంటే, ఎప్పటికైనా అతనికి అన్నీ గుర్తు వస్తాయేమోనని అని ఆమె ఆశ, ఇది జరిగి మూడు సంవత్సరాలయినా రఘు విషయంలో పెద్ద తేడా రాలేదు.”
***
నిట్టూర్చి, మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు జగన్నాథం.
“వాడికి ఒక్క మైథిలి తెలుసు, అది కూడా, భార్యగా కాదు. ఆమె పేరు కూడా గుర్తులేదు కానీ ఆమె ఒక్కదానితోనే సంతోషంగా ఉంటాడు. కనీసం, నన్ను, వాళ్ళ అమ్మని కూడా గుర్తుపట్టడు, మా క్షోభ ఎవరికి చెప్తాం బాబూ! పాపం, ఆ అమ్మాయి మైథిలి, ఎక్కడికి వెళ్లకుండా పసివాడిని సాకినట్టు సాకుతోంది, అరవై ఏళ్ళ తన భర్తని.
ఇప్పుడు వాడు ఒక నాలుగేళ్ళ పిల్లాడితో సమానం. ఉదయం స్నానం నుంచి అన్నీ మైథిలి చెయ్యాల్సిందే, మేము ఎవరు చేసినా కుదరదు. మా రాధాకృష్ణ, తప్పనిసరిగా రమ్మన్నందుకు వచ్చింది కానీ, పెళ్ళికి ఉండదు. ఆ శబ్దాలకి రఘు తట్టుకోలేడు, భయపడతాడు.
“నా పిల్లలు, మనవలు పెద్దయ్యాక, నాకు తోచదని, దేముడు ఈయన్ని పసివాడిగా మార్చాడు మామయ్యా!” అంటుంది నా కోడలు, జగన్నాథం చెప్తుంటే, జాలివేసింది వింటున్న ఆయనకి.
తల తిప్పి చూస్తే, మైధిలి పక్కన కూర్చుని ప్లేటులో ఉన్న పులిహోర కొంచెం, కొంచెం, రఘు నోట్లో పెడుతుంటే, సంతోషపడుతూ తింటున్నాడు అతను.
మన పెద్దలు చెప్పిన నీతిశాస్త్రంలో భార్య గురించి చెప్తూ – కార్యేషు దాసీ, కరణేషు మంత్రీ.. భోజ్యేషు మాతా – అంటారు కానీ, అన్ని విషయాల్లోనూ, తల్లిలా ఉన్న భార్యని ఏమంటారు? ‘సర్వేషు మాతా!’ అనాలా? భర్తకి ప్రేమగా తినిపిస్తున్న ఆ తల్లిని చూస్తే జగన్మాతలా అనిపించి చేతులెత్తి నమస్కారం చేసారు ఆయన.