[శ్రీ శంకర్ ప్రసాద్ రచించిన ‘సర్ప దోషం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
కనిపిస్తే చాలు కొట్టి చంపుతావు
చవితిన పుట్టకెళ్ళి పాలు పోస్తావు
దీపారాధన చేస్తావు ప్రసాదం పెడతావు
నేను కలలో కనిపిస్తే అదృష్టమంట
ఎదురుగా వస్తే గజగజ వణుకుతావంట
నా పండగలు పూజలు నోములు చేస్తావు
దుష్ట మానవులని నాతో పోలుస్తావు
నేను చేసిన నేరం నా దోషం ఏంటి మానవా
పాముగా పుట్టలో పుట్టడమే పాపమా
నాకు కోరల్లో విషం ఉంది
నీకు మాత్రం నిలువెల్లా ఉంది
నీ కర్మఫలం పొందుతూ
జాతకంలో సర్ప దోషమంటావు
నింద నా మీద వేస్తావు
ఓ మానవా ఈ దుష్ప్రచారం మానవా
నోరు లేని జీవిని నేను
రెండు నాలుకలు ఉన్నాయంటావు
ఒక్క నాలుకతోనే వెయ్యి అబధ్ధాలాడతావు
ఓ స్థిర బుధ్ధి లేని మనిషీ
నన్ను పూజించకు కనిపిస్తే చంపకు
సర్ప దోషం కాదిది మనిషి అమానుషం
భావుకుడు, కవి శంకరప్రసాద్. ఇప్పుడిప్పుడే తన కవితలతో, కథలతో సాహిత్య ప్రపంచంలోకి అడుగిడుతున్నాడు.
