Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సప్త కావ్య సమాలోచనము – సభావిశేషాలు – నివేదిక

తేదీ 12 ఏప్రిల్ 25 న వరంగల్ లోని పి.ఆర్. రెడ్డి భవన్ సమావేశ మందిరంలో ‘సహృదయ’ సాహిత్య సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో, ఆచార్య అనుమాండ్ల భూమయ్యగారి ఏడు పద్య కావ్యాలను ఆవిష్కరించి, వాటిని ‘సప్త కావ్య సమాలోచనము’ అను పేర ఏడుగురు పండిత విమర్శకులతో సమీక్ష చేయించినారు. సభకు డా. గిరిజామనోహర్ గారు అధ్యక్షత వహించారు.

ఉదయపు సమావేశంలో ‘అజోవిభొ కందాళం ఫౌండేషన్’ అధ్యక్షులు ఆచార్య అప్పాజోస్యుల సత్యనారాయణ గారు ప్రారంభోపన్యాసం చేశారు.

‘జ్వలిత కౌసల్య’ కావ్యాన్ని శ్రీమతి ధూళిపాళ అరుణ, ‘త్రిజట’ కావ్యాన్ని శ్రీ సుధామ, ‘కబంధ మోక్షము’ కావ్యాన్ని డా. గండ్ర లక్ష్మణరావు, ‘సీతాన్వేషణము’ కావ్యాన్ని శ్రీ పాణ్యం దత్తశర్మగారలు సమీక్షిస్తూ ప్రసంగాలు చేశారు.

రెండవ సమావేశం భోజన విరామం తర్వాత జరిగింది. దానికి ప్రారంభకులుగా ప్రముఖ సాహితీవేత్త శ్రీ విహారిగారు వ్యవహరించారు. ‘ప్రవర నిర్వేదము’ అను కావ్యాన్ని ఆచార్య తాడేపల్లి పతంజలి, ‘పారిజాతాపహరణము’ కావ్యాన్ని శ్రీ గిరిజామనోహరబాబు, ‘మకరహృదయము’ అను కావ్యాన్ని శ్రీ గంధం బసవశంకరరావు గారలు సమీక్షించారు. ఎందరో సాహితీవేత్తలు, సాహిత్యాభిమానులు సభకు హజరైనారు.

‘సీతాన్వేషణము’ ను సమీక్షిస్తూ, పాణ్యం దత్తశర్మగారు “ఈ కావ్యంలో శ్రీరాముని ఆత్మశోధన కూడ ఉంది” అని అన్నారు. తేటగీతులలో, తేట తెనుగులో, వేమన వలె, బద్దెన వలె, అనుమాండ్ల వారి కవితాఝరి సాగిందన్నారు. శ్రీరాముని భార్యావియోగ పరితాపము, లంకలో సీతమ్మవారి వ్యథ, కరుణరసాప్లావితములై, ‘ఏకం రసో కరుణ ఏవ’ అన్న భవభూతి మహాకవి సూక్తిని నిజం చేశాయని దత్తశర్మ కొనియాడారు. వాల్మీకిని ఒక క్రొత్త కోణంలో ఆవిష్కరించడంలో కవి కృతకృత్యులైనారన్నారు.

సమీక్షలు చేసిన కవిపండితులందరికీ, సెల్లా, శాలువ, పుస్తకాలు, నగదుతో ఘనంగా సత్కారం జరిగింది. ప్రతీకాత్మక కవిత్వానికి ఈ ఏడు పద్యకావ్యాలూ తొడవులుగా అమరాయన్నది నిర్వివాదము.

Exit mobile version